ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఎందుకు ఏకం కావడం లేదు, సద్దాం హుస్సేన్‌ను ఉరి తీసినప్పుడు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1974 ఫిబ్రవరిలో ఇస్లామిక్ దేశాలకు చెందిన సంస్థ ఇస్లామిక్ సహకార సమాఖ్య (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ - ఓఐసీ) రెండో సదస్సు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది.
అప్పటి సౌదీ అరేబియా రాజు ఫైసల్ బిన్ అబ్దుల్- అజీజ్ అల్ సౌద్ ఆ సదస్సుకు హాజరయ్యారు.
నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో ఆ సదస్సులో ప్రసంగిస్తూ, "మాది పేద దేశం. వనరులు పరిమితంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి మా వద్ద డబ్బులు లేవు. ఆర్థికంగా సాయం చేసే శక్తి మాకు లేదు.
అయితే, ఇస్లాం కోసం ప్రతీ రక్తపు బొట్టును అర్పించేందుకు క్షణం కూడా అలోచించబోమని అల్లా సాక్షిగా హామీ ఇస్తున్నాను. ఇది కేవలం నోటి మాట కాదు. పాకిస్తాన్ ప్రజలు అల్లా సైనికులు. పాకిస్తాన్ సైనికులు కూడా అల్లా సైనికులే. భవిష్యత్‌లో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా పాకిస్తాన్ సాయం అందిస్తుంది" అని చెప్పారు.
ఇస్లాం కోసం రక్తం చిందిస్తామని జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రతిజ్ఞ చేస్తున్న సమయానికి ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రాలేదు.
సద్దాం హుస్సేన్ ఇరాన్‌పై దాడి చేయలేదు.
ఈజిప్ట్, జోర్డాన్, యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించలేదు.
యెమెన్‌పై సౌదీ అరేబియా దాడి చేయలేదు.
ఖతార్‌పై సౌదీ, బహ్రెయిన్, ఈజిప్ట్, యూఏఈ దిగ్బంధం విధించలేదు.
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. అయినప్పటికీ జుల్ఫీకర్ అలీ భుట్టో ఇస్లామిక్ దేశాల ఐక్యత గురించి ఆశతో ఉన్నారు.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని పాకిస్తాన్ మళ్లీ కోరుకుంటోంది.
పాకిస్తాన్ అణుబాంబు తయారు చేసినప్పటికీ, పశ్చిమ దేశాలు అనేక ఇస్లామిక్ దేశాలలో తాము చెప్పినట్లు వినే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి.
ఉదాహరణకు.. ఇరాక్, లిబియా, సిరియాల్లో పాశ్యాత్య దేశాలను వ్యతిరేకించే పాలకులు అధికారంలో లేరు.
ఇరాన్‌లో కూడా అదే జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్‌పై అమెరికన్ సేనలు దాడి చేసినప్పుడు పాకిస్తాన్ కూడా వాషింగ్టన్‌కు అండగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లిం దేశాల మధ్య విభేదాలు
ఇజ్రాయెల్ జూన్ 12 నుంచి ఇరాన్‌పై దాడులు చేస్తోంది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది.
ఈ రెండు దేశాల మధ్య ఘర్షణల ప్రభావం ఇప్పుడు పశ్చిమాసియా అంతటా కనిపిస్తోంది. అనేకమంది ఇది ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్నారు.
ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గత వారం పాక్ నేషనల్ అసెంబ్లీలో పిలుపునిచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో, ముస్లిం దేశాలన్నీ ఏకం కాగలవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ పదే పదే ముస్లిం దేశాల ఐక్యత గురించి ఎందుకు మాట్లాడుతోంది?
ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఐక్యంగా స్పందించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. అయితే, ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ముస్లిం దేశాలు పరస్పర సంఘర్షణలు, విబేధాల మధ్య చిక్కుకుని ఉన్నాయి.
సౌదీ అరేబియా - ఇరాన్ మధ్య శత్రుత్వం ఇంకా ముగియలేదు.
సున్నీ - షియా నుంచి, సౌదీలో రాచరికం - ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషన్ వరకూ ఈ వైరం కొనసాగుతోంది.
షియా మెజార్టీ ముస్లిం దేశం అజర్‌బైజాన్. అయినప్పటికీ, మరో షియా మెజార్టీ దేశం ఇరాన్‌తో దానికి విరోధం ఉంది. అలాగే, అజర్‌బైజాన్ ఇజ్రాయెల్‌కు సన్నిహిత దేశం.
ఇరాక్‌పై అమెరికా దాడి చేసి, సద్దాం హుస్సేన్‌ను ఉరి తీసినప్పుడు అమెరికాకు ఇరాన్ వ్యతిరేకం కాదు.
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం కొనసాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడంతో పాటు దానితో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఈజిప్ట్ నిర్ణయించింది. 1994లో జోర్డాన్ కూడా ఇజ్రాయెల్‌ను గుర్తించింది.
2020లో యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ కూడా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తుర్కియే ద్వంద్వ ప్రమాణాలు
ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లపై తుర్కియే విమర్శలు గుప్పించింది.
ఆ విమర్శలు చేసే నాటికి తుర్కియేకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఉన్నాయి. తుర్కియే- ఇజ్రాయెల్ మధ్య దౌత్య బంధం 1949 నుంచే ఉంది. ఇజ్రాయెల్‌ను గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియే.
2005లో ఎర్దోవాన్ ఒక వ్యాపారవేత్తల బృందంతో రెండురోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నాటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఏరియల్ షారోన్‌తో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం "ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్‌కే కాకుండా మొత్తం ప్రపంచానికే ముప్పు" అని అన్నారు.
ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ముస్లిం దేశాలన్నీ తమ మధ్య గొడవల్ని మర్చిపోయి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఏకం కాగలవా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
సౌదీ అరేబియాలో భారత మాజీ రాయబారి తల్మీజ్ అహ్మద్‌ను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన స్పందించారు.
"ప్రస్తుతం పాకిస్తాన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉంది. భారత్‌తో ఇటీవలి సంఘర్షణ వల్ల పాకిస్తాన్ చాలా నష్టపోయింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తన ప్రాధాన్యం తగ్గకుండా చూసుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్ తుర్కియే మధ్య బంధం బలపడింది.
పాక్ ఇరాన్‌తోనూ సంబంధాల్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తుర్కియే, పాకిస్తాన్, ఇరాన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. పాకిస్తాన్ మరోసారి ఆ బంధానికి ప్రాధాన్యం ఇస్తోందని" చెప్పారు.
"ఐక్యరాజ్య సమితి తీర్మానాలనే పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్‌కు కూడా పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ సమస్య ముస్లింలకు సంబంధించినది కాదు. ఇది రెండు దేశాల వ్యవహారం. ఇది పురాతన వైరానికి సంబంధించినది. దీనికి ఇస్లామిక్ రంగు పులమడం అర్థరహితం" అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా.. ఇస్లామిక్ సమస్యా?
తల్మీజ్ అహ్మద్ మాట్లాడుతూ, "ప్రతి అరబ్ దేశంలో అమెరికా సైన్యం ఉంది. మొత్తం గల్ఫ్‌లో 70 వేల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. వారికి అక్కడ అదనపు ప్రాదేశిక హక్కులు ఉన్నాయి. అంటే, వాళ్లున్న దేశంలో చట్టాలు వారికి వర్తించవు.
అమెరికాకు ఈ దేశాల్లో సైనిక స్థావరాలున్నాయి. వాటిని అమెరికానే నిర్వహిస్తుంది. ఈ విషయంలో ఏ అరబ్ దేశం కూడా అమెరికాను ఆపలేదు. అందుకే ఇజ్రాయెల్ డ్రోన్లు జోర్డాన్ మీదుగా వస్తాయి. ఈ డ్రోన్లను ఆపాల్సిన బాధ్యత జోర్డాన్‌ది. టెల్‌అవీవ్, తెహ్రాన్ మధ్య 2000 కిలోమీటర్లకుపైగా దూరం ఉంది. అయినప్పటికీ, డ్రోన్ ఫైట్ కొనసాగుతుంది" అని చెప్పారు.
ఇరాన్‌ను ఇరాక్‌తో పోల్చకూడదని ఆయన అన్నారు. ఎందుకంటే, ఇరాక్ మీద అమెరికా యుద్ధం చేసిందని, ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా ఇంకా జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
"1967కి ముందు ఇజ్రాయెల్, పాలస్తీనా అరబ్బుల సమస్య మాత్రమే. అయితే 1967లో అరబ్- ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచిన తర్వాత అది ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్యగా మిగిలింది. దీన్ని పరిష్కరించగలవారు ఎవరైనా ఉన్నారంటే అది ఇజ్రాయెల్ పాలస్తీనా మాత్రమేనని" తల్మీజ్ అహ్మద్ వివవరించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్లనే పాకిస్తాన్‌కు ప్రాధాన్యం పెరిగిందని భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సాయం చేయకూడదని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్ అమెరికా వైపు ఉంది. అదిప్పుడు ఇరాన్ వైపు వెళ్లడం అంత తేలిక కాదు.
వైట్‌హౌస్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు లంచ్ ఆఫర్ ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో ముడిపడి ఉంది.
ఈ లంచ్ వెనుక "ఇందులో రెండు అర్థాలు ఉండొచ్చు. ఇరాన్ మీద అమెరికా దాడికి దిగితే పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందని తెలుసుకునేందుకు ట్రంప్ ప్రయత్నం చేసి ఉండవచ్చు లేదా ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయించుకుని పాకిస్తాన్ సాయం కోరి ఉండవచ్చు" అని భారత మాజీ రాయబారి కేసీ సింగ్ 'ఎక్స్'లో రాశారు

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ దేశాల స్పందన అంతంతమాత్రమే..
'మేమిద్దరం ఒకటే అని మాటలు చెప్పడం వేరు, వాస్తవంలో అలా ఉండటం వేరు' అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ మొహమ్మద్ ముదస్సిర్ ఖమర్ చెప్పారు.
"సౌదీ అరేబియా- ఇరాన్ మధ్య శత్రుత్వానికి కారణం సున్నీ- షియా కాదు. భౌగోళిక రాజకీయ కారణాలు చాలా ముఖ్యం. ఖతార్‌లో అమెరికాకు వైమానిక స్థావరం ఉంది. ఈ వైమానిక స్థావరాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటే, దాన్ని ఎవరూ ఆపలేరు. ఖతార్ కూడా ఆపగలిగే పరిస్థితిలో లేదు. చైనా చొరవ తీసుకోవడంతో ఇరాన్, సౌదీ అరేబియా మధ్య దూరం కొంత తగ్గింది. అయితే, ఈ ప్రాంతంలో ఇరాన్ వల్ల ఏర్పడిన భయం మాత్రం తగ్గలేదు" అని ఆయన చెప్పారు.
గల్ఫ్‌లోని ముస్లిం దేశాలు అమెరికాకు వ్యూహాత్మక భాగస్వాములు. వారు అమెరికాను విశ్వసిస్తారు కానీ, ఇరాన్‌ను కాదు.
1979 తర్వాత, 2025 నాటికి ఇరాన్ స్థానం చాలా బలహీన పడిందని స్పష్టంగా తెలుస్తోంది.
అయినప్పటికీ, ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఇరాన్ బలమైన శక్తిగా ఉంది. సౌదీ అరేబియా ఇప్పటికి కూడా నేరుగా ఇరాన్‌తో పోరాడలేకపోతోంది.
2003 మార్చిలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
సద్దాం హుస్సేన్‌ను ఇరాన్ దూరం పెట్టింది. ఆయన్ని అమెరికా ఉరి తీసినప్పుడు కూడా ఇరాన్ నిరసన వ్యక్తం చేయలేదు.
"ఇరాన్ ఎప్పుడూ సద్దాం హుస్సేన్‌ను తమకు ముప్పుగానే భావించింది. అయితే, అతను ఇరాన్‌కు ముప్పుగా మారవచ్చని అమెరికా సద్దాంను ఉరి తీయలేదు. అమెరికాకు దాని కారణాలు దానికున్నాయి.
ఇరాక్‌లోని షియాలకు ఇరాన్ ఎప్పుడూ మద్దతిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ఏకాకిగా మారింది. ఇరాన్ ఇప్పుడు నేరుగా అమెరికాతో తలపడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. ఈ యుద్ధం ఈ ప్రాంత భవిష్యత్‌ను నిర్దేశించే అవకాశం ఉంది" అని మొహమ్మద్ అన్నారు.
"ఇస్లామిక్ దేశాల మధ్య విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ దేశాలు తమ మధ్య విభేదాలను ఇప్పటి వరకు అధిగమించలేకపోయాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, అరబ్ లీగ్ వంటి సంస్థలు కేవలం పేరుకే పరిమితం అయ్యాయి" అని ముదస్సిర్ ఖమర్ చెప్పారు.
2003లో అమెరికా ఇరాక్ మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఎర్దోవాన్ తుర్కియే ప్రధాన మంత్రి అయ్యారు.
ఎర్దోవాన్‌కు సద్దాం హుస్సేన్‌తో సన్నిహిత సంబంధాలు లేవు.
ఇరాక్ మీద దాడి కోసం అమెరికా తమ భూభాగం వాడుకునేందుకు అనుమతించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, ఎర్దోవాన్ ఉద్దేశం నెరవేరలేదు. ఆయన ప్రతిపాదనను తుర్కియే పార్లమెంట్ ఓడించింది. ఎర్దోవాన్ పార్టీకి పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉన్నప్పుడు ఇది జరిగింది. తుర్కియే పార్లమెంట్ నిర్ణయంపై నాటి బుష్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్లమెంట్ అంగీకరించకున్నప్పటికీ అమెరికా తమ వైమానిక ప్రాంతాన్ని వాడుకునేందుకు ఎర్దోవాన్ అనుమతి ఇచ్చారు.
ఒక వైపు ముస్లింల ఆత్మగౌరవం, ప్రయోజనాల గురించి ఉపన్యాసాలిచ్చే ఎర్దోవాన్ మరోవైపు ఇరాక్‌పై అమెరికా దాడిని సమర్థించారు.
ఈ రెండు విషయాలు పరస్పరం విరుద్దమైనవి.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ ఓడిపోతే ఏమవుతుంది?
ప్రస్తుతానికి వస్తే, కొన్ని నెలల క్రితం సిరియాలో ఇరాన్ అనుకూల ప్రభుత్వాన్ని తుర్కియే సాయంతో కూల్చివేశారు.
ఒక విధంగా చెప్పాలంటే సిరియాలో తుర్కియే చేతిలో ఇరాన్ ఓడిపోయింది.
ఎక్స్‌లో ఒక పోస్టులో ఎర్దోవాన్ ఇజ్రాయెల్ గురించి ఇలా రాశారు.
"పశ్చిమ దేశాల మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసింది. ఈ ప్రాంతంలో ప్రతీ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో ఆ దేశానికైనా తెలుస్తుందా?" అని అందులో రాశారు.
"భవిష్యత్తులో అది తన తప్పును గ్రహించే అవకాశం ఉంది. అయితే, అప్పటికి చాలా ఆలస్యం అవుతుందేమోనని భయపడుతున్నాం. పురాతన కాలంలో ఏ దేశానికీ సొంత సరిహద్దులు లేదా పరిపాలన లేదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. పాలస్తీనా ప్రజలపై, వారి భూభాగంపై ఇజ్రాయెల్ దాడి కేవలం కొన్ని లక్షల మందికి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్‌పై, ఆ దేశ ప్రజలపై దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌కు మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు. అది తుర్కియే దాకా వస్తే, దాని తీవ్రత మరింత పెరుగుతుంది" అని ఎర్దోవాన్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు.
"వాస్తవాలను అర్థం చేసుకోకుండా తీసుకునే ప్రతి నిర్ణయం ఈ ప్రాంత భవిష్యత్తుకు వినాశకరమైనది కావొచ్చు. ఇజ్రాయెల్ ఎంత క్రూరంగా వ్యవహరిస్తే, ఈ ప్రాంతంలో అంత ఎక్కువ రక్తం చిందుతుంది. ఈ దారుణాలకు అది ఏదో ఒకరోజు తీవ్రంగా పశ్చాత్తాపపడుతుంది" అని ఎర్డోవాన్ రాశారు.
పశ్చిమాసియా ప్రయోజనాల విషయంలో తుర్కియే, ఇరాన్ చాలాకాలంగా సంఘర్షణ పడుతున్నాయి. అలాగే, గల్ఫ్‌లోని ఇతర ఇస్లామిక్ దేశాల మధ్య వైరుధ్యాలు తీవ్రం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, మతం ఆధారంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం.. అది కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా అండ ఉన్నప్పుడు అలాంటి ప్రక్రియ చేపట్టడం దాదాపు అసాధ్యం.
ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే ఏమవుతుంది?
"ఈ యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ప్రభావం మరింత పెరుగుతుంది. సిరియా నుంచి బషర్ అల్ అసద్‌ను ఇప్పటికే బహిష్కరించారు. ఇరాన్ మద్దతిస్తున్న సాయుధ గ్రూపులు బలహీన పడ్డాయి. గాజా శిథిలాల దిబ్బగా మారింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఏది కావాలనుకుంటే అది చేస్తుంది. ఇరాన్ బలహీనపడితే పశ్చిమాసియాలో రష్యా ప్రభావం కూడా తగ్గుతుంది. చైనా చమురు అవసరాల కోసం గల్ఫ్‌లోని అమెరికా మిత్ర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది" అని ది హిందూ పత్రికలో ఇంటర్నేషనల్ ఎడిటర్ స్టాన్లీ జానీ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














