ఐఎన్‌ఎస్ అర్ణాలా: ఈ షిప్ రాకతో భారత నౌకాదళం శక్తి ఏ స్థాయిలో పెరుగుతుంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్ మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అర్ణాలా నౌక భారత నౌకాదళంలో చేరింది.
విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో జూన్ 18న ఐఎన్ఎస్ అర్ణాలాను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఈ యుద్ధ నౌకకు సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకదళ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెందార్కర్ వివరించారు.
యాంటీ-సబ్‌మెరీన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) అంటే సముద్రాలలో శత్రు జలాంతర్గాములను ట్రాక్ చేసి, ధ్వంసం చేయడానికి రూపొందించిన నౌక అని, అతి తక్కువ లోతు ఉన్న సముద్ర జలాల్లో చురుగ్గా తిరుగుతూ...సముద్రపు లోతుల్లో దాగి ఉండే శత్రు జలాంతర్గాముల జాడ కనుగొనడం, వాటి దాడులను తిప్పికొట్టడం ఈ నౌక ప్రత్యేకత అని వారు వెల్లడించారు.
తీరరేఖ పొడవునా అర్ణాలా వంటి నౌకలు ఇప్పుడు అత్యవసరమని భారత్ భావిస్తోంది
డీజిల్ ఇంజిన్-వాటర్ జెట్ కాంబినేషన్‌పై ఆధారపడి నడిచే అతిపెద్ద భారతీయ యుద్ధ నౌక ఇదేనని ఇండియన్ నేవీ చెబుతోంది


‘బయ్యర్స్ నేవీ’ నుంచి ‘బిల్డర్స్ నేవీ’ దిశగా...
ఐఎన్ఎస్ అర్ణాలా నౌకను పూర్తిగా అంటే 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
భారత నౌకదళం స్వదేశీ పరిజ్ఞానంతో ఎదుగుతూ.. "Buyer's Navy" నుండి "Builders Navy" గా మారుతున్న తీరు ప్రసంశనీయం.
ఇప్పటి స్వదేశీ నౌకలలో స్టెల్త్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ సూట్స్, అడ్వాన్స్‌డ్ సెన్సర్ వంటి వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోగలుతున్నాం. ఇవి నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళం బలపడుతుందని చెప్పడానికి ఐఎన్ఎస్ అర్ణాలా తొలి అడుగుగా భావించవచ్చు.
ఐఎన్ఎస్ అర్ణాలా భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది, తూర్పు నౌకాదళంలోని విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందిస్తుంది.
అర్ణాలా క్లాస్ నౌకలలో ఇది తొలి నౌక. మరో 15 నౌకల తయారీ వివిధ దశల్లో ఉంది.

అర్ణాలా క్లాస్ అంటే ఏమిటి?
అర్ణాలా శ్రేణి నౌకలను భారతదేశంలోని రెండు ప్రధాన షిప్‌యార్డ్‌లకు చెందిన సంస్థలు నిర్మిస్తున్నాయి. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అనే సంస్థలు చెరో 8 నౌకలను నిర్మిస్తున్నాయి
ఐఎన్ఎస్ అర్ణాలాను కోల్‌కతాలో నిర్మించారు.
"ఆత్మ నిర్భర్ నినాదంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించాం. ఐఎన్ఎస్ అర్ణాలా నిశ్శబ్దంగా శత్రువు మీద దాడి చేయగలదు. దీని వేగం, నావిగేషన్ సిస్టమ్‌లను శత్రు దేశాలు పసిగట్టలేని టెక్నాలజీతో దీనిని రూపొందించాం" అని భారత నౌకాదళం తెలిపింది.
శత్రు దేశాల జలాంతర్గాములను, తక్కువ లోతున్న సముద్ర జలాల్లో కూడా గుర్తించేందుకు రూపొందించిన నౌకలను అర్ణాలా పేరుతో తయారు చేస్తున్నారు.
ఈ సదుపాయాలతో రూపొందించే నౌకలను ‘అర్ణాలా క్లాస్’ అని అంటారు.
ఇవి సముద్రంలో వేగంగా కదులుతూ శత్రు జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యంతో ఉంటాయి.
- పొడవు: సుమారు 77.6 మీటర్లు
- బరువు: 1490 టన్నులు
- సిబ్బంది సామర్థ్యం: 80–90 మంది నావికులు
- వేగం: సుమారు 25 నాటికల్ మైళ్లు
- రేంజ్: 1,800 నాటికల్ మైళ్లు (సుమారు 3,300 కి.మీ)
- సామర్థ్యాలు: టొర్పెడోలు, రాకెట్లు, ఆధునిక సోనార్‌లు, ఎలక్ట్రానిక్ డిటెక్షన్ వ్యవస్థలు
- లక్ష్యం: జలాంతర్గాములు, నీటిపై తేలియాడే మైన్స్, చిన్న యుద్ధ నౌకల ధ్వంసం

ఐఎన్ఎస్ అర్ణాలా చరిత్ర
ఐఎన్ఎస్ అర్ణాలా అనే పేరు భారత నౌకాదళ చరిత్రలో కొత్తది కాదు. మొదటగా 1972లో సోవియట్ రష్యా డిజైన్ ఆధారంగా తయారైన అర్ణాలా క్లాస్ పెట్రోల్ వెసల్ రూపంలో భారత నౌకాదళంలో ప్రవేశించింది.
27 ఏళ్ల పాటు సేవలందించిన అర్ణాలా 1999లో కొంత విరామం తీసుకుంది.
అర్ణాలా అనే పేరు మహారాష్ట్రలోని చారిత్రక అర్ణాలా కోట ఆధారంగా వచ్చింది. ఇది అరేబియా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతం. ఆ కోట వారసత్వానికి గుర్తుగా భారత నౌకాదళం ఈ నౌకకు అర్ణాలా అని పేరు పెట్టారు.
1999లో సేవల నుంచి విరామం పొందిన అర్ణాలాయే భారత నౌకదళంలో మళ్లీ ప్రవేశించింది. కానీ ఈసారి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో ASW-SWC తరగతికి చెందిన మొట్టమొదటి నౌకగా తూర్పు నౌకాదళంలో చేరింది.
అంటే ఇది ఐఎన్ఎస్ అర్ణాలాకు భారత నౌకాదళంలో సెకండ్ ఇన్నింగ్స్.
అప్పట్లో అర్ణాలా ఏ ఆపరేషన్స్ చేసిందంటే...
సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసిన అర్ణాలా, 1972లో జూన్ 29న అప్పటి నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ ఎస్ఎం నందా పర్యవేక్షణలో ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది.
ఇది అక్టోబర్ 31, 1972 నుంచి ముంబై చేరుకుని వెస్ట్రన్ ఫ్లీట్‌లో చేరింది. అర్ణాలా, ఆండ్రోత్, అంజాదీప్, అండమాన్, అమిని నౌకలతో కలిపి ఒక డివిజన్‌ను ఏర్పాటు చేశారు.
27 సంవత్సరాలు భారత నౌకదళంలో చేసిన సేవల్లో ఆపరేషన్ పవన్ (1987), ఆపరేషన్ మంథన్ (1988), ఆపరేషన్ పుస్తక్ (1991) ఆపరేషన్ తేయార్ (1995) వంటి ఆపరేషన్లలో ఇది పాల్గొంది. 1984, 1989లో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూలలో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

'ఆధునిక అర్ణాలా' టెక్నాలజీ ఇదే
అధునాతన సోనార్ టెక్నాలజీతో సిద్ధం చేసిన అర్ణాలా శత్రు దేశాల డ్రోన్లను అధునాతన రాడార్ల సహాయంతో పసిగడుతుంది.
టొర్పెడోలు, యాంటీ-సబ్ మెరీన్ రాకెట్ లాంచర్లు, శత్రు జలాంతర్గాములను నాశనం చేయగల మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి.
శత్రు దేశాల కమ్యూనికేషన్లను జామ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ దాడులను తిప్పికొట్టే టెక్నాలజీ దీని సొంతం. శత్రు జలాంతర్గాములను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రధానంగా ఉపరితలం నుంచి శత్రుదేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా దీనికి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించి, 30 ఎంఎం నేవల్ సర్ఫేస్ గన్‌ను ఉపయోగించేందుకు అనువుగా రూపొందించారు. ఇది కూడా స్వదేశీ సాంకేతికతతోనే తయారైంది.
వీటిని తీర ప్రాంతాల దగ్గర కూడా మోహరించి 370 కిలోమీటర్ల దూరం వరకూ రక్షించుకునే వెసులుబాటు ఉంది.

'బ్లూ వాటర్ నేవీ స్థాయికి మారే అవకాశం ఇది'
"ఇంతకు ముందు ఆధునిక నౌకల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు స్వదేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ, వెపన్ సిస్టమ్స్, సోనార్, వాటర్ జెట్ ప్రొపల్షన్ వంటి వ్యవస్థలు అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం" అని నౌకాదళ మాజీ ఉద్యోగి పిళ్లాస్వామి సుందరరావు బీబీసీతో చెప్పారు.
1961లో పోర్చుగల్ తో యుద్ధం, 1965, 1971లలో పాకిస్తాన్ లతో జరిగిన యుద్ధాలలో సుందరరావు పాల్గొన్నారు. షిప్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థలను నియంత్రించే సిగ్నల్ మ్యాన్‌గా ఆయన పని చేశారు.
పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అర్ణాలా వంటి అత్యధునిక నౌకలు భారత నౌకాదళంలో ప్రవేశించడం శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక చేసినట్లే భావించాలని సుందరావు అన్నారు.
ఐఎన్ఎస్ అర్ణాలాతో పాటు అటువంటి మరిన్ని ఆధునిక నౌకల నిర్మాణం ద్వారా, భారత నౌకాదళం తీర నౌకాదళం (Coastal Navy) స్థాయి నుంచి బ్లూవాటర్ నేవీ స్థాయికి చేరుతుందన్నారు.
ఒక దేశం దాని సమీప దేశాల తీరాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ జలాల్లో ఆపరేషన్స్ చేయగలిగే శక్తిని కలిగి ఉండే నేవీని బ్లూ వాటర్ నేవీ అంటారు.
అంటే అంతర్జాతీయ జలాల్లోకి ఒక దేశపు నేవీ ప్రయాణించడం అని చెప్పవచ్చు.
భారత్ చుట్టూ ఉన్న సముద్రాలతో పాటు అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలలోనూ కార్యకలాపాలు నిర్వహించగల శక్తి కలిగి ఉండటమే బ్లూ వాటర్ నేవీ సామర్ధ్యంగా చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














