విశాఖలో తొలి విద్యుత్ దీపం ఎప్పుడు వెలిగింది... దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖలో తొలి విద్యుత్ బల్బు 115 ఏళ్ళ కిందట వెలిగింది. మత్స్యకార పల్లె నుంచి మెట్రో నగరం స్థాయికి ఎదిగిన విశాఖలో గత శతాబ్ద కాలంగా విద్యుత్ వినియోగం క్రమక్రమంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ నగరం రోజువారీ విద్యుత్ అవసరాలకు 40 మెగావాట్లకు పైనే వినియోగిస్తోంది.
కిరోసిన్ దీపాలు, కాగడాలు, పొడవాటి లాంతర్లపైనే ఆధారపడిన ప్రజలకు విద్యుత్ వినియోగం అందుబాటులోకి రావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
పోర్టు కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి ఉత్పన్నమయ్యే మిగులు విద్యుత్‌ను గృహ అవసరాలకు ఇవ్వాలన్న ఆలోచన నుంచి మొదలైంది ఈ కథ..
దీని గురించి విశాఖలోని చరిత్రకారులు ఎడ్వర్డ్ పాల్ బీబీసీతో పంచుకున్నారు.
అప్పటి విషయాలు ఆయన మాటల్లోనే...

తొలి విద్యుత్ బల్బు వెలిగిందిలా..
14 మే 1908.. ఓవైపు సముద్ర తీరం, దానిని అనుకుని ఉన్న వైజాగపట్నం (విశాఖ పట్టణం). వన్ టౌన్ ఏరియాలో తీరం వైపుగా కొందరు, తీరం నుంచి ఊరిలోకి మరి కొందరు రాకపోకలు సాగిస్తున్న సమయం.
1847లో ప్రారంభించిన సెయింట్ అలోసియస్ ఆంగ్లో-ఇండియన్ పాఠశాలలో కోలాహల వాతావరణం నెలకొంది. కొవ్వొత్తులు, కాగడాల వెలుతురులో అక్కడ జరుగుతున్న వేడుకలో విద్యుత్ బల్బు వెలగడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. తొలి విద్యుత్ బల్బు వెలిగిన క్షణం అది.
సెయింట్ అలోసియస్ పాఠశాల పక్కనే ఆ పాఠశాలకు చెందిన ఇండస్ట్రీయల్ స్కూల్ ఉండేది. దీనిలోని వర్క్ షాపులలో రిపేరు పనులు జరుగుతూ ఉండేవి. ఆ పనుల కోసం మద్రాస్ నుంచి ఒక జనరేటర్‌ను తెప్పించుకున్నారు. అయితే దానితో ఏ రోజు విద్యుత్ బల్బు వెలిగించలేదు.
1908 మే 14వ తేదీన సెయింట్ ఆలోసియస్ పాఠశాలలోని అదనపు భవనం ప్రారంభిస్తున్న సమయంలో, ఆ వేడుకకు అదనపు హంగులు సమకూర్చేందుకు జనరేటర్ సహయంతో విద్యుత్ బల్బులను వరుసగా వెలిగించి, అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఆ సమయంలో ఈ విద్యుత్ బల్బులు పెద్ద చర్చనీయాంశం.
అప్పటికి విశాఖపట్నం మద్రాస్ రాష్ట్ర పరిధిలో ఉండేది. మద్రాసులో విద్యుత్ బల్బులను బ్రిటిషర్లు వినియోగించేవారు. కానీ, విశాఖలో మాత్రం 1908 వరకు విద్యుత్ బల్బ్ లేదు.
సెయింట్ అలోసియస్ స్కూల్ లో విద్యుత్ బల్బుల వినియోగం తర్వాత నాలుగేళ్లకు అంటే 1912లో విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్‌లో విద్యుత్ బల్బులు, ఫ్యాన్లు వచ్చాయి. ఆ రోజుల్లో వాల్తేరు క్లబ్ బ్రిటష్ ఆఫీసర్లకు ఆటవిడుపుగా ఉండేది. ఇక్కడికి కూడా సెయింట్ ఆలోసియస్ తరహాలోనే క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి రెండు జనరేటర్లు తెప్పించుకుని విద్యుత్ బల్బులు, ఫ్యాన్లను వినియోగించడం ప్రారంభించారు.

అక్కడి నుంచి మొదలు...
తొలుత సెయింట్ ఆలోసియస్ స్కూల్, ఆ తర్వాత వాల్తేరు క్లబ్‌లో విద్యుత్ వెలుగులు వచ్చిన తర్వాత, కొవ్వొత్తులు, పంకాలు (కర్ర సహాయంతో వస్త్రాలను ఊపడం ద్వారా గదంతా గాలి వచ్చేటట్లు చేసేవి) ఉండే సెయింట్ పాల్స్ చర్చిలో కూడా జనరేటర్ల సహాయంతో విద్యుత్ బల్బులు, ఫ్యాన్లను ఉపయోగించారు. ఇది జరిగింది 1915లో.
1923లో విద్యుత్ బల్బులు, ఫ్యాన్లతో పాటు ఆపరేషన్ థియేటర్లు, ఎలక్ట్రానిక్ వైద్య పరికరాల కోసం జనరేటర్ల సహాయంతో పవర్ ప్లాంట్ నిర్మించుకున్నది కింగ్ జార్జ్ ఆసుపత్రి.
ఆసుపత్రి అవసరాలనే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పవర్ జనరేటింగ్ ప్లాంట్‌ను నిర్మించారు. ఇలా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది.
కానీ, ఇవన్నీ పరిమిత అవసరాలకు తగినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేవి. సాధారణ ప్రజలకు విద్యుత్ అందుబాటులోకి రాలేదు. సంపన్నులు మాత్రమే జనరేటర్ల సహాయంతో విద్యుత్ బల్బులు, ఫ్యాన్లు వాడేవారు.

ఫొటో సోర్స్, EDWARDPAUL/VIZAG
పోర్టు రాకతో ప్రజలకు విద్యుత్ సరఫరా
1933లో విశాఖలో పోర్టు కార్యకలాపాలు ప్రారంభయ్యాయి.
పోర్టు అవసరాల కోసం ఒక విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించుకుంది. దీనిలో రెండు జనరేటర్లు, ఒక్కొక్కటి 300 కేవీ సామర్థ్యం ఉండేవి. పోర్టు నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ 24 గంటలూ పనిచేస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేది. తొలిరోజుల్లో పోర్టు కార్యకలాపాలు కేవలం పగటి పూటకే పరిమితమవడంతో, 24 గంటలూ ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారు అప్పటి పోర్టు అధికారులు.
ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పెద్దమొత్తంలో ప్రజావసరాలకు మున్సిపాలిటీ ద్వారా ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు. అదే సమయంలో లండన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి వచ్చిన డీఎన్ఎన్ రాజు అనే వ్యక్తి మద్రాస్ గవర్నమెంట్ తరపున ఆంధ్రా ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో పోర్టు, రైల్వేలకు నిర్మాణ పనుల కాంట్రాక్టులు చేస్తుండేవారు.
ఈయన 1933లోనే విశాఖపట్నానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం తరపున ఎలక్ట్రిసిటీ యాక్ట్-1910 ప్రకారం లైసెన్స్ పొందారు.
ఆ విద్యుత్ సరఫరా సంస్థకు వైజాగపటం ఎలక్రిక్ సప్లై కార్పొరేషన్ (VESCO) అని పేరు పెట్టారు. ప్రస్తుతం మనకున్న డిస్కంలైన APEDPCL, APSDCPL, APCDCPL తరహాలోనే ఈ వెస్కో కూడా పని చేసేది.
‘వెస్కో’ ద్వారా 1934 నుంచి పోర్టులో ఉత్పత్తవుతున్న అధిక విద్యుత్ ను విశాఖ ప్రజల అవసరాలకు ఇవ్వడం మొదలైంది. ఇలా 1934లో తొలిసారిగా విశాఖలోని సాధారణ ప్రజలకు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ లైన్లు, స్థంభాలను మున్సిపాలిటీ ఏర్పాటు చేయగా, వాటి ద్వారా ‘వెస్కో’ విద్యుత్ పంపిణీ చేసి దానికి తగిన ఛార్జీలను వసూలు చేసేది.
అయితే, పోర్టు పగటి వేళల్లో పని చేయడంతో, అక్కడ పగలు ఉత్పత్తయ్యే విద్యుత్ అంతా పోర్టు అవసరాలకు, రాత్రి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ప్రజల అవసరాలకు సరఫరా చేసేవారు.

పెరుగుతున్న డిమాండ్
పోర్టులో వాణిజ్యం పెరగడంతో విశాఖలో జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది.
పోర్టుకు అనుబంధంగా కొన్ని పరిశ్రమలు, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటై, విద్యుత్ అవసరాలు కూడా క్రమంగా పెరిగాయి.
పోర్టు తన విద్యుత్ అవసరాలను తీర్చుకోగా మిగతా విద్యుత్‌ను సాధారణ ప్రజలకు, పరిశ్రమలకు సరిపడా పంపిణీ చేయలేకపోయింది.
అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఇలా అయితే కష్టమని భావించి, 1938లో పోర్టు నిర్వహిస్తున్న పవర్ యూనిట్‌ను కొనుగోలు చేసింది. అదనంగా మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతోె ఉత్పత్తి మరింత పెరిగి, విశాఖతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలైన అనకాపల్లి వరకు విద్యుత్ సరఫరా జరిగేది.

లంబసింగిలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు
విశాఖ నగర విస్తరణ, భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసిన అప్పటి ప్రభుత్వం హైడ్రో పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ప్రణాళికను 1936లోనే రూపొందించింది.
ఇందుకోసం వారు ఎంచుకున్న ప్రాంతం ‘లంబసింగి’
ఏడాది పాటు ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసి, ఉత్పత్తి, పెట్టుబడిలను లెక్కలు వేయగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు ఫలితం ఇవ్వదన్న ఉద్దేశంతో, వెనక్కు తగ్గారు.
అలా పోర్టు నిర్వహణలో ఉన్న పవర్ ప్లాంట్‌ను మద్రాస్ ప్రభుత్వం కొనడం జరిగింది.

రంగంలోకి ‘బాహుబలి పవర్ ప్లాంట్’ మాచ్ ఖండ్
విశాఖతో విజయవాడలో కూడా మరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. ఈ రెండు ప్లాంట్లు నిరంతరం పని చేస్తున్నా కూడా విద్యుత్ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి.
దీంతో శాశ్వత పరిష్కరం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చూసింది. అప్పుడు ప్రభుత్వం దృష్టి మళ్లీ లంబసింగిపై పడింది. అయితే ఈసారి లంబసింగిలో కాకుండా ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న ’మాచ్‌ఖండ్’పై దృష్టి సారించింది.
అప్పటికే అంటే 1926లోనే ఒడిశాలోని జైపూర్ మహరాజ్ విక్రమ్ దేవ్ తన సంస్థానానికి, ఆ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికీ విద్యుత్ పంపిణీ చేసేందుకు విద్యుత్ ప్లాంట్ పెట్టాలని భావించి, ఆ బాధ్యతను బ్రిటిష్ ఇంజనీరు హెన్రీ హవార్డ్‌కు అప్పగించారు.
హవార్డ్ 1929లో డుడుమ వాటర్ ఫాల్స్ నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తూ సర్వే ప్రారంభించారు. అనేక సర్వేలు అనంతరం ఈ హైడ్రో పవర్ ప్లాంట్ పనులు 1946లో ప్రారంభమయ్యాయి.
భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన ప్రదేశంలో ఈ ప్లాంట్ నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది.
1955లో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం ప్రారంభమైంది.
1959లో మరో మూడు యూనిట్లు అదనంగా చేరాయి. మొత్తంగా 120 మెగావాట్ల సామర్థ్యంతో ఇది నిరంతరం పని చేస్తోంది.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి, జైపూర్ మహరాజుకి మధ్య జరిగిన ఒప్పందంలో రూ.20 కోట్లతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మించారు.
ఈ ప్లాంట్‌ను భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ విశాఖపట్నం నుంచి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి నేను(ఎడ్వర్డ్) కూడా హాజరయ్యాను. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. అలా మాచ్‌ఖండ్ హైడ్రో విద్యుత్ ప్లాంట్ నుంచి విశాఖతో పాటు రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలు చాలా వరకు ఈ ప్లాంటే తీర్చేది.

ఫొటో సోర్స్, EDWARDPAUL/VIZAG
వెస్కో మొదలు.. ముగింపు
మాచ్‌ఖండ్ జల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వరకు ‘వెస్కో’ ద్వారానే విశాఖకు విద్యుత్ పంపిణీ జరిగింది. 1952లో ‘వెస్కో’ను ఎలక్ట్రిసిటీ అండర్ టేకింగ్ అక్విజేషన్ యాక్ట్ ద్వారా మద్రాస్ ప్రభుత్వం తీసుకుని, విద్యుత్‌ను పంపిణీ చేయడం ప్రారంభించింది. అలా విశాఖలో సాధారణ ప్రజలకు విద్యుత్‌ను అందించిన వెస్కో సంస్థ సేవలు ముగిశాయి.
1966లో పోర్టు పవర్ ప్లాంట్‌ను కూడా మూసివేశారు.
“అలా మాచ్‌ఖండ్ రాకతో విద్యుత్ పంపిణీ, ఉత్పత్తిలో వచ్చిన మార్పులు..అనంతరం ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు విద్యుత్ తయారీ సంస్థలు వచ్చాయి” అని ఎడ్వర్డ్ పాల్ అన్నారు.
జీవీఎంసీ చెప్తున్న ప్రకారం.. ఇప్పుడు రాష్ట్రంలో వందశాతం ఎల్ఈడీ బల్బులతో విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక నగరం విశాఖనే. అంతేకాకుండా, నగర విద్యుత్ అవసరాల కోసం సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్న తొలి నగరమూ విశాఖపట్నమే.
ఇవి కూడా చదవండి..
- 'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
- ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే..
- వీరపాండ్య కట్టబొమ్మన్ తెలుగు వారా? శత్రువులు కూడా మెచ్చుకున్న ఆయన్ను ఎందుకు ఉరి తీశారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














