రుషికొండ: టూరిజం పేరుతో బిల్డింగులు కట్టి సీఎం ఆఫీసుగా మార్చేస్తున్నారా, విమర్శలేంటి?

విశాఖపట్నం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి జరగాలంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 17 తేదీన ఏపీ అసెంబ్లీలో చెప్పారు.

“అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియరీ క్యాపిటల్ పెట్టొచ్చు. అన్ని వసతులు ఉన్న విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. మెట్రో రైల్ వేసి, రోడ్డు ట్రాఫిక్ స‌రి చేయ‌డానికి కొంత ఖ‌ర్చు చేస్తే స‌రిపోతుంది” అని సీఎం జగన్ అసెంబ్లీలో అన్నారు.

అక్కడితో విశాఖ పరిపాలన రాజధాని హడావిడి మొదలైంది. ఆ తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు కోర్టుకెక్కడం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వంటివి జరిగిపోయాయి.

కానీ, విశాఖయే పరిపాలన రాజధానంటూ మంత్రులు, వైసీపీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఈ విషయాన్ని తరచూ మాత్రం వార్తల్లో ఉంచుతూనే వచ్చారు.

ఇటీవల “నేను దసరా నుంచి విశాఖలో పాలన మొదలు పెడుతున్నా” అని జగన్ అన్నారు. తేదీ స్పష్టంగా ప్రకటించకపోయినా... అక్టోబర్ 23న సీఎం విశాఖ వస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖ వచ్చిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విశాఖలో అధికారులతో సమావేశమయ్యారు.

“రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలు, మౌలిక వసతులు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి” అని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఆధారిటీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో రుషికొండపైనే సీఎం కార్యాలయం, ఆయన నివాసం ఉంటాయని, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న నిర్మాణాలు అవేనని ఆయన చెప్పారు. అలాగే వారంలో రెండు రోజులు విశాఖలో సీఎం ఉంటారనే విషయం కూడా తమకు సమావేశంలో అర్థమైందని తెలిపారు.

విశాఖపట్నం

‘‘అదే ఆయన నివాసం’’

రుషికొండపై గత కొంతకాలంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఇవి సీఎం నివాసం, ఆయన కార్యలయం కోసమేనంటూ విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉంటే, అధికార పక్షం కాదంటూ చెప్పుకొచ్చింది.

ఈ నిర్మాణాలపై విపక్షాలు, స్వచ్చంద సంస్థలు కోర్టుల్లో కేసులు వేశాయి. కానీ అక్కడ నిర్మాణాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చెప్తూ, వాటిని కొనసాగిస్తూనే ఉంది.

“రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలకు పర్యాటక శాఖ నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకూ నిధులు వెచ్చించారు. సాధారణంగా పర్యాటక శాఖ నిర్మాణాల కోసం ఇన్ని వందల కోట్లు ఖర్చుపెట్టదు. అవి కచ్చితంగా సీఎంవో, ఆయన నివాసమే కోసమే. అందులో అనుమానమే లేదు. అక్కడ జరుగుతున్న పనులు, పాటిస్తున్న గోప్యత చూస్తే అర్థమవుతుంది అవి ఎందుకోసమో” అని విశాఖకు చెందిన పొలిటికల్ ఎనలిస్ట్ యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

అయితే అవి సీఎం కోసమే నిర్మిస్తున్నవని అంటూ గతంలో పలుమార్లు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా చెప్పుకొచ్చారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ప్రస్తుతానికి అవి పర్యాటక భవనాలేనని, పూర్తయ్యాక ప్రభుత్వం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చంటూ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర మంత్రులు, వైసీపీ నాయకులు వివిధ సందర్భాల్లో చెప్పారు.

విశాఖపట్నం

రుషికొండపై ఏం జరుగుతోంది?

దసరా నుంచి విశాఖలోనే పాలన అంటూ సీఎం ఇప్పటికే ప్రకటించగా...సీఎం రాక కోసం విశాఖలో జరుగుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకోవడం బట్టి సీఎంవో కార్యాలయం పూజ ముహూర్తం ఖరారు చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అంటున్నారు.

రుషికొండలో నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు విషయంలో అనేక అడ్డంకులు వస్తాయి. సీఎంవో ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి పర్యావరణ అనుమతులు లభించవు.

అయితే, దీనికో పరిష్కారం కనుగొన్నారు అధికారులు. సబ్ స్టేషన్‌ను కంటైనర్ మోడల్‌లో ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ కేబుల్‌తో కలుపుతున్నారు. రెండు నెలల కిందటే రూ. 7 కోట్లతో కంటైనర్ సబ్ స్టేషన్ పనులు ప్రారంభించారు.

“ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరాయి. ఈపీడీసీఎల్ రూ.14.73 కోట్లతో 10.5 కి.మీ. మేర అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేసి, ఈ కంటైనర్ సబ్ స్టేషన్‌కు కలుపుతున్నారు. ఇంకా రుషికొండపై పూర్తైన భవనాలకు రూ.19 కోట్లతో ఇంటీరియర్ పనులు, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం, పచ్చదనం కోసం పర్యాటక శాఖ రూ.12.50 కోట్లతో టెండర్లు పిలిచింది” అని రాజకీయ విశ్లేషకులు యుగంధర్ రెడ్డి తెలిపారు.

విశాఖపట్నం

‘‘పెరుగుతున్న విశాఖ స్థాయి...’’

ప్రస్తుతానికి విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ కార్యలయాల తరలింపు ఉండదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. సీఎంతో పాటు ఉండే అధికార యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని రుషికొండపై ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం జీవీఎంసీకి జాయింట్ కలెక్టర్ స్థాయి ఐఏఎస్ కమిషనర్‌గా ఉంటుండగా... త్వరలో కార్యదర్శి స్థాయి కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించబోతున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ పోలీసు కమిషనర్ పోస్టును అదనపు డీజీ హోదా అధికారికి కేటాయించారు.

“రుషికొండ సమీపంలో ఓ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం సీఎంవో భద్రత బృందం ఇటీవలే ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు సీఎంవో కార్యాలయం కోసమేనని అధికారులకు ఎప్పుడో తెలుసు. అందుకే జీ20 సదస్సులు జరిగినప్పుడే రుషికొండ సమీపంలో రాజధాని హంగులు కనిపించేలా బ్యూటీఫికేషన్ పనులు చేపట్టారు. సుమారు రూ.4 కోట్లతో రుషికొండ సమీపంలోని రోడ్డు విస్తరణ, పార్కింగ్ ఏర్పాట్లు, ఇంకా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు రూ. 16 కోట్లతో రహదారి పనులు చేస్తున్నారు. ఇవన్ని కూడా రుషికొండ సమీపంలోనే జరుగుతున్నాయి” అని యుగంధర్ రెడ్డి తెలిపారు.

ఇలా రుషికొండ చుట్టూ జరుగుతున్న పనులతో ప్రస్తుతం రుషికొండ, దాని సమీపంలో అంతా హడావుడి వాతావరణం నెలకొంది. అయితే సీఎం విశాఖ రావడం ఖాయమనే విషయం తెలుసు, కానీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు సీఎం కార్యలయం కోసమో, లేదా ఇంకేదైనా అనే విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారో తెలియడం లేదని యుగంధర్ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, విశాఖ: సాగర గర్భంలో అద్భుతమైన సహజ శిలా తోరణం

‘‘పొలిటికల్ హంగామా’’

విశాఖలో సీఎం జగన్ నివాసం, తన కార్యాలయం ఏర్పాటు అనేవి కేవలం పొలిటికల్ హంగామా అనే అనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ అన్నారు.

‘‘ఎందుకంటే విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో పాటు మూడు రాజధానుల అంశంపై కోర్టులో కేసులున్నాయి. అవి తేలకుండా ఇక్కడ నుంచి పాలన సాధ్యం కాదు’’ అని ఆయన చెప్పారు.

‘‘అయితే సీఎం జగన్ విశాఖలో తన క్యాంప్ కార్యాలయం పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే ఇక్కడ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని, పరిపాలన రాజధాని అని అంటున్నారు. మాటిచ్చాను, రాజధాని పెట్టాను, కానీ ప్రతిపక్షాలే విశాఖను రాజధాని కానివ్వడం లేదు అని అనడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తుంది’’ అని సత్యనారాయణ చెప్పారు.

విశాఖ పరిపాలన రాజధాని అనేది పొలిటికల్ గేమ్ లానే కనిపిస్తుందని యుగంధర్ రెడ్డి కూడా అన్నారు.

“విశాఖలో గవర్నర్ బంగ్లాతో సహా కొన్ని ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి గతంలో దాదాపు రూ. 2500 కోట్లు అప్పు తీసుకుంది ప్రభుత్వం. అలాగే నగరం నడిబొడ్డున లులు మాల్ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన భూములను తీసుకుని వాటిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చింది. ఇలా ప్రభుత్వానికి ఉన్న భూములను వదులుకుంటూ విశాఖని రాజధాని చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అంతే కాదు రుషికొండ, దాని సమీప ప్రాంతాలు తప్ప విశాఖలో ఇటీవల ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదీ కనిపించడం లేదు” అని యుగంధర్ రెడ్డి అన్నారు.

ఇవన్ని చూస్తుంటే విశాఖను శాశ్వతంగా పరిపాలన రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని, అందుకే నగర అభివృద్ధిపై కాకుండా విశాఖ వందనం వంటి కార్యక్రమాల ద్వారా ‘విశాఖ పరిపాలన రాజధాని’ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ఆయన అన్నారు.

విశాఖపట్నం

ఏమిటీ ఈ ‘విశాఖ వందనం’?

విశాఖ వందనం పేరుతో విశాఖపట్నంలో ఒక కార్యక్రమం ప్రారంభించారు. దసరా నుంచి సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తారని, ఆయన రాకను స్వాగతిస్తూ ‘నాన్‌ పొలిటికల్‌ జేఏసీ’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

విశాఖ వందనం కార్యక్రమం ద్వారా ఉదయాన్నే వాకర్స్, గ్రూప్స్, స్వచ్ఛంద సంస్థలు, దేవాలయాలు, అపార్ట్ మెంట్ అసోసియేషన్లు ఇలా అందర్ని కలుపుకుని సీఎం జగన్ రాకని స్వాగతిస్తూ నినాదాలు చేయడం, సీఎం రాకతో విశాఖ మరింత అభివృద్ధి జరుగుందనే ప్రచారం సాగిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ప్రచారం చేస్తున్నారు.

విశాఖ పరిపాలన రాజధాని చేయాలనే నిర్ణయం అభివృద్ధికి సూచిక అని వైసీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని, ఇప్పటికే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని, జగన్ రాకతో అవి మరింత పెరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

విశాఖపట్నం

వైసీపీ టార్గెట్ ఏమిటి?

విశాఖని పరిపాలన రాజధానిగా చేసి ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లపై గురి పెట్టింది వైసీపీ. ఇందులో 28 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లను 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది.

గత ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో బాగా లాభపడినప్పటికీ, ఇక్కడ ముఖ్యంగా బీసీలు, నగర, పట్టణాల్లో బలమైన ఓటు బ్యాంకు టీడీపీకి ఉంది. దానికి బ్రేక్ చేసేందుకు పరిపాలన రాజధాని ఉపయోగపడుతుందని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు.

దీనికి తగ్గట్టుగానే టీడీపీ కూడా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తోంది. “జగన్ విశాఖ రావడం అనేది విశాఖ ప్రజలకు దుర్వార్త. భవిష్యత్తులో న్యాయమే గెలుస్తుంది” అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

కోర్టుల్లో కేసులున్నప్పటికీ ఈ ప్రభుత్వం న్యాయ స్థానాలను సైతం పట్టించుకోకుండా విశాఖ రాజధాని అంటూ పదే పదే ప్రకటించడం ఎంత వరకు సబబని టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.

అయితే పరిపాలన రాజధాని తరలింపు విషయంలో న్యాయపరమైన చిక్కులున్నప్పటికీ సీఎం ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చుననే నిబంధన ఆధారంగా దసరా రోజున విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించనున్నారని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్ అంటున్నారు.

మూడు రాజధానుల విషయంలో సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆయన చెప్పారు.

అయితే పరిపాలన రాజధాని అంటున్న విశాఖకి సచివాలయం, మంత్రుల కార్యాలయాలు కూడా వస్తాయా? మంత్రులు కూడా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారా? లేక సీఎం ఒక్కరే విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడతారా? అన్న విషయంపై ఇటు అధికారులు, అటు వైసీపీ నాయకుల నుంచి స్పష్టమైన సమాధానం రావట్లేదు.

వీడియో క్యాప్షన్, ఉప్పల‌పాడు పక్షుల పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)