Caste Census: కులాల లెక్కలు వెల్లడించిన బిహార్... దేశవ్యాప్తంగా కులగణన చేస్తే రిజర్వేషన్ల వ్యవస్థే మారిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్ ప్రభుత్వం కులాలవారీ జనగణన వివరాలను సోమవారం విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాశంగా మారింది. దేశంలో ఇప్పటివరకు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీల విషయంలో పూర్తిగా కులం ప్రాతిపదికగా అములు చేస్తున్నారు. బీసీల విషయంలో క్రీమీలేయర్ పెట్టడం ద్వారా కులంతో పాటూ ఆర్థిక స్థితిని కూడా పరిగణనలోకి తీసుకున్నాంటున్నారు.
చరిత్రలో మొదటిసారి కులంతో సంబంధం లేకుండా పేదరికం ప్రాతిపదికగా అగ్ర కులాలుగా చెప్పే అన్ని కులాలకూ కలిపి ఎస్టీల కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్ కల్పించింది బీజేపీ ప్రభుత్వం.
దీన్నే ఈడబ్ల్యుఎస్( ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ అంటున్నారు. ఈడబ్ల్యుఎస్ గా పిలిచే ఈ అగ్రకుల రిజర్వేషన్ తెర మీదకు రావడంతో అసలు మొత్తం ఏ కులాల జనాభా ఎంతో తేల్చాలన్న డిమాండ్ మొదలైంది.
బిహార్ తాజా కుల జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 13 కోట్లు. ఇందులో ఇతర వెనుకబడిన కులాల వారు(ఓబీసీలు) 27.12 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాల వారు(ఈబీసీలు) 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగలవారు 1.68 శాతం ఉన్నారు.
జనాభాలో అగ్రవర్ణాలుగా చెప్పే వారి సంఖ్య 15.52 శాతంగా ఉంది. ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం కలుపుకొని బీసీలు 63.13 శాతం మంది ఉన్నారు.
దేశంలో అసలు ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు? అందులో డబ్బున్న వాళ్లు ఎందరు, పేదలు ఎందరు? అనేది లెక్కపెట్టాలని ప్రతిపక్షాలు కోరడం...అది సాధ్యం కాదని కేంద్రంలోని బీజేపీ చెప్పడం....ఇలా కొన్నేళ్లుగా నలుగుతున్న వ్యవహారంలో బిహార్ పరిణామం పెద్ద మలుపు.
ప్రతీ పదేళ్లకోసారి ఠంచనుగా జరిగిపోయే జనాభా లెక్కలు కూడా ఈసారి ఇంత ఆలస్యం కావడానికి అది కూడా ఒక కారణమని అంటున్నారు. 2021 లో జనాభా లెక్కలు కోవిడ్ కారణంగా ఆగిపోయాయి. కోవిడ్ తగ్గినా జనాభా లెక్కలు మాత్రం మొదలు కాలేదు.
ఈసారి జనాభా లెక్కలంటూ చేస్తే కులాల లెక్కలు తీయాలని పార్టీల డిమాండ్, కుదరందంటోన్న కేంద్రం పట్టుదలల మధ్య జనగణన కూడా ఆలస్యం అయింది.

అసలు కులం లెక్కలు ఎందుకు?
దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటూ, సంక్షేమ పథకాల అమల్లో కులానిది కీలక పాత్ర. స్వతంత్ర్యం వచ్చినప్పటి జనాభా ప్రకారమే ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఇక బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిల్లో రిజర్వేషన్లు ఇస్తే, బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారని ఆరోపణ.
మండల్ కమిషన్ అంచనా ప్రకారం దేశంలో బీసీలు 52 శాతం ఉంటే వారికి 27 శాతం రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువ ఉన్నప్పటికీ వారిపై ఏ సర్వే లేకుండానే నేరుగా ఎస్టీల కంటే ఎక్కువగా 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు.
మిగతా కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏళ్ల పాటూ అధ్యయనం చేసే ప్రభుత్వాలు, ఓసీ రిజర్వేషన్ విషయంలో ఏ అధ్యయనమూ లేకుండానే రిజర్వేషన్ ఇచ్చిందనే విమర్శ ఉంది.
అసలు ఏ కులం స్థితి ఏంటి? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో తెలిస్తే అప్పుడు దానికి తగ్గట్టు రిజర్వేషన్ల అంశంతో పాటూ సంక్షేమ పథకాల అమల్లోనూ మార్పు ఉంటుంది. దీని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము సరైన మార్గంలో ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
కులం లెక్కలు అసలు లేవా?
భారతదేశంలో మొదటిసారి బ్రిటిష్ కాలంలో 1931లో కులగణన జరిగింది. జనాభాలో ఏ కులం ఎందరు ఉన్నారనేది అప్పుడే పక్కాగా తేలింది. ఆ లెక్క ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కలుపుకుని ఉంటుంది. కానీ ఆ తరువాత ఏ ప్రభుత్వమూ కులాల వారీగా జనాభాను లెక్కపెట్టలేదు. 1941 జనాభా లెక్కల నుంచే ఈ కేటగిరీ తీసేశారు.
తమ కులానికి ఇన్ని లక్షల జనాభా ఉందంటూ ఆయా కులాల వారు గొప్ప చెప్పుకోవడం, లేదా వివిధ రాజకీయ పార్టీ తాము సొంతంగా తయారు చేసుకున్న అంచనాలు, ప్రభుత్వాలు కొన్ని పథకాలు అమలు చేసినప్పుడు, కొన్ని సర్వేలు సమాచార సేకరణ చేసినప్పుడు వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఇప్పటి వరకూ కులాల లెక్కలు సాగుతుండేవి.
ఆయా కులాల వారు తమ గురించి ఎక్కువ చెప్పుకున్నప్పటికీ, రాజకీయ పార్టీల దగ్గర ప్రభుత్వం దగ్గర దాదాపు 80-90 శాతం సరైన లెక్కలు ఉన్నాయి. అవి వారి ఎన్నికల కోసం సేకరించిన డాటా. కానీ అవేవీ అధికారికం కాదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఈ డాటా మొత్తం సేకరించి పెట్టుకుంది. కానీ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుకుంది. ఆంధ్రలో అధికారికంగా జరగకపోయినా, అప్పట్లో చంద్రబాబు కొంత, ఆ తరువాత జగన్ మరింత సమాచారాన్ని వివిధ రూపాల్లో ప్రజల నుంచి సేకరించి పెట్టుకున్నారు. కానీ అదీ రహస్యమే.
అధికారికంగా మాత్రం స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీల లెక్కలే వేస్తున్నారు తప్ప ఇతర కులాల లెక్కలు వేయడం లేదు. స్వతంత్ర్యం వచ్చాక మొదటిసారిగా 2011-2012 లో సామాజిక ఆర్థిక కుల గణనను చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ లెక్కలు మాత్రం ఇప్పటికీ బయటకు చెప్పలేదు.

ఫొటో సోర్స్, ANI
ఎవరు కావాలంటున్నారు? ఎవరు వద్దంటున్నారు?
2018 లో బీజేపీ హయాంలో రాజనాథ్ సింగ్ హోంమంత్రిగా ఉండగా కులగణన చేపడతాం అని చెప్పారు. 2021 జనాభా గణనతో సమానంగా కులగణన చేపడతాం అని ఆయన అన్నారు. కానీ ఈ మధ్య పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మాత్రం కులగణన చేపట్టడంలేదని స్పష్టం చేశారు.
ఉత్తర భారతంలో బీసీ కులాల ఆధిపత్యంలో నడిచే ప్రాంతీయ పార్టీ ఈ కులగణనకు బాగా పట్టుబడుతున్నాయి. సమాజ్ వాదీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు ఇందులో కీలకం. వాళ్లు బీజేపీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కులగణనకు అనుకూల నిర్ణయం తీసుకుంది. 2022 ఉదయపూర్ లో జరిగిన సమావేశంలో కులగణనకు అనుకూల నిర్ణయం తీసుకున్న ఆ పార్టీ, అవకాశం ఉన్నప్పుడల్లా కులగణన కోసం డిమాండ్ చేస్తూనే ఉంది.
అయితే బీజేపీ కులగణనకు అనుకూలంగా మాట్లాడినప్పటికీ ఆ పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కులగణన సాధ్యపడదంటూ సుప్రీంకోర్టుకు చెప్పింది. 2021 సెప్టెంబరులో కేంద్రం ఈ విషయం సుప్రీం కోర్టుకు చెప్పింది. అంతేకాదు కులగణన చేయడం చేయకపోవడం ప్రభుత్వాల ఇష్టమనీ, ఇందులో కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవనీ కేంద్రం కోర్టుకు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కులగణన కోసం బీసీలే ఎందుకు పట్టుపడుతున్నారు?
స్వతంత్రం వచ్చిన నాటికి బీసీలకు రిజర్వేషన్ లేదు. కేంద్ర స్థాయిలో 1980లో మండల్ కమిషన్ నివేదిక తరువాత వారికి రిజర్వేషన్ వచ్చింది. అప్పట్లో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న 3,743 కులాలను బీసీ కులాలుగా తేల్చింది. దేశ జనాభాలో దాదాపు 52 శాతం బీసీలుగా అప్పుడు తేలింది.
కానీ వారికి అందులో దాదాపు సగం అంటే, 27 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో దేశవ్యాప్తంగా 2,479 కులాలు ఉన్నాయి. కేంద్రం కాకుండా కేవలం రాష్ట్రాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకునే కులాలు మొత్తం 3,150 ఉన్నాయి.
అప్పట్లో బీసీల రిజర్వేషన్ ను బీజేపీ, దాని సైద్ధాంతిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పట్లో ‘‘మండల్ వర్సెస్ కమండల్’’ అంటూ దీనిని వర్ణించేవారు.
మండల్ కమిషన్ నుంచీ ఇప్పటి వరకూ బీసీ రిజర్వేషన్లపై ఎప్పుడూ ఏదో రచ్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో అంటే అసెంబ్లీ, పార్లమెంటుల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బీసీలకు లేదు. ఇది ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డిమాండ్. అసెంబ్లీ, పార్లమెంటుల్లో జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్న బీసీలకు ఇది చిరకాల స్వప్నం.
మరోవైపు స్థానిక సంస్థల్లో అంటే, మునిసిపాలిటీలు, పంచాయితీల్లో వారికి రిజర్వేషన్ ఉంది. కానీ తరచూ ఇది కోర్టులకెక్కుతూనే ఉంది. 2021లో కూడా ఇలా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ గొడవ ఒకటి మహారాష్ట్రలో వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2021 జనాభా లెక్కలతో పాటూ కులాల లెక్కలు కూడా తీయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
అంతేకాదు, 2011 లో చేసిన కులాల లెక్కలు విడుదల చేయాలని కూడా మహారాష్ట్ర కోరగా, కేంద్రం రెండింటికీ తిరస్కరించింది.
‘‘బీసీలు తమ జనాభాలో సగం వంతు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో ఓసీలకు తమ జనాభా కంటే రెట్టింపు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇదంతా ఏ గణాంకాలూ లేకుండానే జరిగిపోయింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు క్రీమీ లేయర్ ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాకుండా ఎప్పుడూ ఏదో ఒక కోర్టు కేసులు పడుతూనే ఉన్నాయి. ఇక చట్టసభల్లో రిజర్వేషన్ లేకపోవడంతో, నిజంగా బీసీ జనాభా ప్రాతినిధ్యం ఉండడం లేదు. అసలు బీసీల జనాభా ఎంత? వారికి దక్కాల్సింది ఎంత? దక్కుతున్నది ఎంత? అనేది తేలితే అంతా చక్కబడుతుంది. ఏ కులం ఎంత జనాభా ఉందో తేలితేనే ఇది సాధ్యం.’’ అని ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సంఘం అధ్యక్షులు గ్రంథి రవికుమార్ బీబీసీతో అన్నారు.

రాజకీయ సమస్య
సరిగ్గా ఈ రాజకీయ రిజర్వేషన్ పాయింట్ దగ్గరే బీసీల సమస్య ఆగింది. బీసీ జనాభా ఇంతా అని తేలితే, దానికి తగ్గట్టు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కోసం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ వస్తుంది కాబట్టి, దాన్ని నివారించడానికే ఈ జనగణన చేపట్టడం లేదని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
‘‘ఇప్పుడు ఓసీలకు కూడా పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఏ ప్రాతిపదిక కింద ఆ రిజర్వేషన్ ఇచ్చారు? అసలు వారి జనాభా పది శాతం ఉందా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శాస్త్రీయంగా ఏదైనా కమిషన్ నివేదిక ఉందా? ఏ ఆధారాల కింద సమాచారం ఇచ్చారంటే సమాధానం లేదు. అదే బీసీల విషయానికి వస్తే మాత్రం క్వాంటబుల్ అండ్ జస్టబుల్ డాటా కావాలంటారు. కానీ ఆ డేటా మాత్రం సేకరించరు. అందరికీ సమాన న్యాయం ఉండాలి కదా?’’అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరం కృష్ణమోహన రావు బీబీసీతో అన్నారు
‘‘75 ఏళ్ల దేశంలో ఇంకా సంచార జాతులు ఉండడం ప్రభుత్వాల ఫెయిల్యూర్ కాదా? ఇంకా బ్రిటీషోడు చెప్పిన నోటిఫైడ్, డీనోటిఫైడ్, సెమీ నోమాడిక్ అనే పేర్లెందుకు? వీరికి అభివృద్ధికీ ఎక్కడ గ్యాప్ ఉంది అనేది అధ్యయనం చేసి దాన్ని సరిదిద్దాలి కదా.... జనాభాలో పేదరికం తగ్గించాలన్నా ఇదే మార్గం. నేను కూడా ఈ విషయమై ప్రధానికి లేఖ రాశాను. గతంలో అనంతరాములు కమిషన్, వెంకటస్వామి కమిషన్, కుమార పిళ్ళై కమిషన్, సత్యనాథన్ కమిషన్, మండల్ కమిషన్, కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్...ఇలా ఇందరు కోరినా కులగణన ఎందుకు చేయడం లేదు? ఇది అన్ని కులాలకూ అవసరమే.’’ అని కృష్ణమోహనరావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కులాల లెక్కలు తీయడం అంత కష్టమా?
‘‘రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా జనాభా లెక్కలు నిర్వహించే అధికారం లేదు. కానీ వేరే పేరుతో చేయవచ్చు. స్వయంగా సుప్రీంకోర్టే ఈ లెక్కలు వేయమని అనేకసార్లు చెప్పింది. జనాభా లెక్కలతో పాటూ మరో రెండు కాలమ్స్ పెడితే తప్పేముంది. చాలా ఖర్చు కూడా తగ్గుతుంది.’’ అన్నారు వకుళాభరం కృష్ణమోహన రావు.
‘‘దేశంలో 1870లలోనే కులాలపై అధ్యయనం జరిగింది. రాజులు, బ్రిటిష్ కాలంలోనే కులాలు, వారి స్థితిగతులు అధ్యయనం చేసి పుస్తకాలు వేశారు. ఇప్పుడు చేయడానికి ఏంటి? తమిళనాడు, కర్ణాటకల్లో ఇప్పటికే ఆ సర్వేలు జరిగాయి. తెలంగాణలో బీసీల కుటుంబ అధ్యయనం చేయాలని జీవో ఇచ్చారు కానీ ఆచరణ కాలేదు. జనాభా లెక్కలతో కలిపి చేస్తే సులువు. కేవలం ఒక కులం కాకుండా అన్ని కులాలూ కలిపి తులనాత్మక అధ్యయనం జరగాలి. ఇప్పుడున్న టెక్నాలజీలో ఆయా రాష్ట్రాల బీసీ లేదా ఎస్సీ కమిషన్లకు బాధ్యత అప్పగించి చట్టాలు సవరిస్తే నెల రోజుల్లో సమగ్ర జనగణన వివరాలు వచ్చేస్తాయి. అయితే దీన్ని వ్యతిరేకించే వారికి వేరే స్వార్థాలు ఉన్నాయి. మనమేం చెప్పక్కర్లేదు.’’ అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు బీబీసీతో అన్నారు.
‘‘కేవలం కులాల లెక్కలు తీస్తే సరిపోదు. వారి కుటుంబ సమగ్ర పరిస్థితి బయటకు తీయాలి. అప్పుడే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వారికేం చేయాలి అనేది తేలుతుంది. ఉదాహరణకు 2014 తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణలో 11 బీసీ కులాల్లో కనీసం పదో తరగతి చదివిన వారు ఒక్కరు కూడా లేరు. ఇలాంటివన్నీ అప్పుడే బయటకు వస్తాయి.’’ అన్నారు రాములు.
అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతానికి తమకు ఆ ఉద్దేశం లేదన్నట్టు సుప్రీంకోర్టుకు చెప్పింది. ‘‘పరిపాలనా పరంగా అది సాధ్యపడదు. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ గణన తప్పదు. అలాగే 2011 నాటి కులాల లెక్కలు బయట పెట్టడం కుదరదు’’ అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది.’’
కొత్తవి సరే.. 2011-15 నాటి లెక్కలు ఎందుకు బయటకు రావడం లేదు..
2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులాల వారీ సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. అది పూర్తయ్యే సరికి 2015 అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ సర్వే ఫలితాలు బయటకు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. అక్షరాలా 4,900 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఆ అధ్యయనం మొత్తం తప్పుల తడకగా ఉండడమే అందుకు కారణం..

ఫొటో సోర్స్, SAM PANTHAKY
ఆ సర్వేలో తప్పులు, లోపాలకు కారణాలు
ఇది సంపూర్ణ అధ్యయనం కాదు. ఎందుకంటే అప్పటికే దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే అందులో కేవలం 90 కోట్ల జనాభా కులాల్నే లెక్కించారు.
2011 ముందు కుల సేకరణ యంత్రాంగం స్పష్టంగా లేదు. దీంతో లెక్కలు తీసుకునే వారు రకరకాల తప్పులు చేశారు. ముఖ్యంగా ఒకే కులం పేరు వేర్వేరు స్పెల్లింగులతో రాయడం వల్ల, ఒకే కులం అనేక కులాలుగా రికార్డు అయింది.
పేర్లన్నీ దగ్గర దగ్గరగా కనిపించే అనేక కులాలు ఉంటాయి. దీంతో ఏ జనభా ఏ కులానిదో తేల్చడం చాలా కష్టంగా మారిపోయింది. దీంతో ఆ రకరకాల స్పెల్లింగుల్లో ఉన్న కులాల పేర్లును కలపడం కానీ వేరు చేయడం కానీ అసంభవం అయిపోయింది.
ఉదాహరణకు మహారాష్ట్రలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 500 ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఉంటే, 2011 లో సామాజిక ఆర్ధిక సర్వే ప్రకారం 4 లక్షల 28 వేల కులాలు తేలాయి.
ఆ రాష్ట్ర జనాభా 10 కోట్లు అయితే అందులో కోటీ పదిలక్షల మంది తమకు కులమే లేదన్నారు. అద అసంభవమని అందరికీ తెలుసు. ఈ లెక్కలన్నీ ఎంత తప్పుల తడకలా ఉన్నాయంటే, 99 శాతం కులాల జనాభా వంది మంది కంటే ఎక్కువ లేరని ఆ డాటా లో వచ్చింది.
జాతీయ స్థాయిలో 1931 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,147 కులాలు ఉంటే, 2011 నాటి కులగణన ప్రకారం 46 లక్షల కులాలు ఉన్నాయి. దీంతో ఇదంతా తప్పుల మయంగా ఉందంటూ ఆ సమాచారం బయట పెట్టడానికి కేంద్రం అంగీకరించడం లేదు.
చాలా మంది కులం, ఉపకులం, ప్రాంతీల వారీగా మారిన కులం పేర్లు వేరుగా చెప్పడం, తమ కులంలో తమ శాఖే పెద్దదనేలా ఉప కులాల పేర్లు చెప్పడం, ఉత్తర భారతంలో ఇంటి పేర్లు, గోత్రం పేర్లను కూడా కులంగా చెప్పడం వంటివి కూడా ఈ సమస్యకు కారణాలు.
జనాభా లెక్కలు వేసే వాళ్లకు ఈ కులం పేర్ల మీద అంత అవగాహన లేకపోవడం మరో సమస్య. బీసీ కులాల సంఖ్యలో కూడా విపరీతమైన తేడాలున్నాయి.
మరోవైపు 2021 జనభా లెక్కల సంబంధించిన యంత్రాంగం అంతా సిద్ధం అయింది. ప్రభుత్వం ఊ అనడమే తరువాయి. ఇప్పుడు మళ్లీ కొత్తగా కులం ప్రశ్న చేరిస్తే ప్రక్రియం ఇంకాస్త ఆలస్యం అవుతుంది.
కానీ ఏ కులం ఎంత ఉన్నారు? ఏ స్థాయిలో ఉన్నారు తేల్చితే దేశం ఎదుర్కుంటోన్న చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది.
మరి పనిలో పనిగా కులం లెక్కిస్తారా? వదిలేస్తారా?
ఇవి కూడా చదవండి:
- మిలా: ‘‘సవతి తండ్రి కంటే ముందు నుంచే ఒక అంకుల్ ఏళ్లపాటు లైంగికంగా వేధించాడు’’
- హస్తప్రయోగ ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్నాయి... మహిళలు ఎలా ఫిర్యాదు చేయాలి?
- కామసూత్ర గ్రంథంలో లైంగిక భంగిమల గురించే రాశారా... అందులో ఇంకా ఏముంది?
- పాలియామరీ: ఆయనకు ఇద్దరు లైంగిక భాగస్వాములు, ఆమెకూ ఇద్దరు.. ఈ ముగ్గురూ కలిసే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















