కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ

    • రచయిత, విష్ణుప్రియ
    • హోదా, బీబీసీ తమిళ్
బీబీసీ షీ

‘‘మా అమ్మే నన్ను కర్రలతో కొట్టింది. అరికాలికి చురకలు అంటించింది. కూరగాయలు కోసే కత్తిపీటతో నన్ను చంపేయాలని మా నాన్న ప్రయత్నించారు.’’

తల్లిదండ్రుల చిత్రహింసల గురించి మాట్లాడేటప్పుడు కీర్తి* గజగజ వణికింది. వన్నియర్ కులానికి చెందిన ఆమె దళితుడైన సుందర్*ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమిళనాడులోని వెనుకబడిన వర్గాల్లో వన్నియార్‌ కులం కూడా ఒకటి.

కీర్తి ప్రేమ తమ కులానికి తలవంపులు తెచ్చేదిగా ఆమె కుటుంబం భావించింది. 2018లో దాదాపు ఆరు నెలలపాటు శారీరకంగా, భావోద్వేగంగా ఆమెను కుటుంబం వేధింపులకు గురిచేసింది.

సొంత తల్లిదండ్రులే ఇలాంటి వేధింపులకు గురిచేయడంతో కీర్తి చాలా కుంగిపోయారు. మరోవైపు తనను పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటికి సుందర్ వచ్చి అడగడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

‘‘మీరు న్యూస్ చానెల్స్ చూస్తుంటారా? అని ఆమె తండ్రి నన్ను అడిగారు. నడి రోడ్డు మీద లేదా రైలు పట్టాలపై రక్తం మడుగులో కనిపించాలని ఉందా? అని ప్రశ్నించారు’’అని సుందర్ వివరించారు.

(BBCShe ప్రాజెక్టులో భాగంగా ద న్యూస్ మినిట్‌తో కలిసి ఈ కథనం అందిస్తున్నాం. మహిళా పాఠకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రాజెక్టును బీబీసీ మొదలుపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి)

బీబీసీ షీ

సుందర్ వెళ్లిపోయిన తర్వాత, అతడు, అతడి తండ్రి కూర్చున్న కుర్చీలను బయట పారేయాలని భార్యకు కీర్తి తండ్రి సూచించారు. మరోవైపు వారు తీసుకొచ్చిన పళ్లు, స్వీట్లు, పువ్వులను చెత్తబుట్టలో పారేశారు.

ఆ వెంటనే ‘‘సూసైడ్ నోట్’’ రాయాలని కీర్తిపై ఆమె తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి చేశారు.

‘‘ఇది ఆ తర్వాత తమకు ఉపయోగపడుతుందని వారు భావించారు. ఇక తన ప్రాణాలు మిగలవని కీర్తి కూడా అనుకుంది. నన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ నరకం నుంచి బయట పడగలనని భావించింది’’ అని నాటి పరిస్థితిని సుందర్ గుర్తుచేసుకున్నారు.

వీరి ప్రాణాలకు పొంచివున్న ముప్పు నానాటికీ మరింత పెరిగింది.

బీబీసీ షీ

పరువు పేరుతో హత్యలు

2006లో లతాసింగ్ వర్సెస్ ఉత్తర్ ప్రదేశ్ కేసులో ‘‘కుల దురహంకార హత్య’’లను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ‘‘క్రూరమైన వ్యక్తులు చేసే దారుణమైన హత్యలివీ. ఇలాంటి సిగ్గుచేటు ఘటనలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు విధించాలి’’అని వ్యాఖ్యానించింది.

కులాంతర వివాహాలు చేసుకునే జంటలను బెదిరించినా లేదా వేధించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఆ తర్వాత, 17 ఏళ్లు గడిచినప్పటికీ.. బెదిరింపులు, దారుణ హింస ఇప్పటికీ కులాంతర వివాహాలు చేసుకునే జంటలను వెంటాడుతున్నాయి.

ప్రాణాలను కాపాడుకునేందుకు కలిసే ఉండాలని కీర్తి, సుందర్ నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకున్నాక, నేరుగా వీరు రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలానే విడివిడిగానే జీవించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఎవరికీ ఈ విషయాన్ని వీరు చెప్పలేదు.

కానీ, ఆ విషయం ఎలాగో బయటకు తెలిసింది.

‘‘మా నాన్న నన్ను ఇనుప రాడ్డుతో కొట్టారు. గంటల పాటు రక్తం కారుతూనే ఉంది’’అని కీర్తి నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

తన పూర్వీకుల ఆస్తులు వద్దని లేఖ రాయాలని ఆమెకు సూచించారు. ఆ పెళ్లి పెటాకులైనా మళ్లీ మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయొద్దని ఆమెకు తెగేసి చెప్పారు.

కేవలం చేతిలో రూ.100 పట్టుకొని కీర్తి ఇంటి నుంచి బయటకు వచ్చారు.

కీర్తి, సుందర్‌ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఎలాగోలా ఒక అడుగు ముందుకు వేశారు. ప్రాణాలతోనే అక్కడి నుంచి వీరు బయటపడగలిగారు.

కన్నగీ, మురుగేశన్, విమలాదేవి, శంకర్, ఇళవరసన్.. ఇలా తమిళనాడులో కుల దురహంకార హత్యలకు బాధితులుగా మారిన వారి జాబితా చాలా పెద్దదే.

కులాంతర వివాహాలు చేసుకున్న జంటల్లో ఎవరైనా దళిత వర్గానికి చెందిన వారుంటే, వారికి దాడులు, హింస ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.

బీబీసీ షీ

ఆత్మగౌరవ ఉద్యమ నేలపై కుల దురహంకారం..

తమిళనాడులో జనాభా ప్రకారం చూస్తే, ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

2015లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రాష్ట్ర జనాభాలో కేవలం మూడు శాతం మంది మాత్రమే తమ కులానికి బయట వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు.

జాతీయ స్థాయిలో ఇది పది శాతం కంటే ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనం ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) డైరెక్టర్, విద్యావేత్త కే శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు.

కులానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ ఉద్యమాన్ని చేపట్టిన చరిత్ర రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఇక్కడ కులాంతర వివాహాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.

కుల వివక్షను అరికట్టడమే లక్ష్యంగా కులాంతర వివాహాలను ఆత్మగౌరవ ఉద్యమం ప్రోత్సహించింది. కులాంతర వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు హిందూ వివాహాలు (తమిళనాడు సవరణ) చట్టం-1968ను కూడా రాష్ట్రం తీసుకొచ్చింది.

మరోవైపు శతాబ్దాల నాటి వైదిక సంప్రదాయాలను తోసిరాజని, ఇప్పటికీ తమిళనాడులో కొందరు ‘‘ఆత్మగౌరవ వివాహాలు (సెల్ఫ్ రెస్పెక్ట్ వెడ్డింగ్స్)’’ చేసుకుంటున్నారు.

ఇలాంటివేమీ కులాంతర వివాహాలు చేసుకునేవారిని హింస నుంచి కాపాడలేకపోతున్నాయి.

జంటలు అధికారికంగా తమ వివాహాన్ని రిజిస్టర్ చేయకపోవడం కూడా వారికి ముప్పు తెచ్చిపెడుతోందని కులాంతర వివాహాలను రిజిస్టర్ చేయడంలో సాయంచేసే అడ్వొకేట్ రమేశ్ అన్నారు.

కుటుంబ సభ్యుల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు వేరే నగరాలకు వెళ్లిపోతున్నాయి. మరికొందరు రహస్యంగా దేవాలయాల్లో పెళ్లి చేసుకుంటున్నారు.

‘‘కానీ, 'పెద్ద కులం' నుంచి వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పుడు.. పోలీసులు ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేస్తున్నారు. ఎందుకంటే ఆ పెళ్లిని వీరు రిజిస్టర్ చేయరు కాబట్టి’’ అని రమేశ్ వివరించారు.

రమేశ్
ఫొటో క్యాప్షన్, రమేశ్

కులాంతర వివాహాల కోసం వెబ్‌సైట్

కులాంతర వివాహాలను రిజిస్టర్ చేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే జంటలకు తమ తల్లిదండ్రులను తీసుకురావాలని అధికారులు అడుగుతుంటారని రమేశ్ చెప్పారు.

చట్ట ప్రకారం ఇలా తల్లిదండ్రులను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదు.

సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు వచ్చిన ప్రత్యుత్తరాలను దీనికి సాక్ష్యంగా రమేశ్ చూపించారు. తల్లిదండ్రుల అవసరంలేదని రిజిస్టర్ ఆఫీసుల్లోని అధికారులకు ఆయన అవగాహన కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

అయితే, కులాంతర వివాహాలను ప్రోత్సహించే దిశగా ఇది చిన్న అడుగు మాత్రమే. రమేశ్ ఇంకా చాలా చేయాలని భావిస్తున్నారు. భిన్న కులాలకు చెందిన జంటల కోసం ఆయన ఒక వెబ్‌సైట్ సిద్ధం చేయాలని భావించారు.

రెండు నెలల క్రితం ఆయన మాణితమ్ (మానవత్వం) పేరుతో ఒక మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు. దీనిలో దాదాపు వంద మంది తమ పేర్లను కూడా రిజిస్టర్ చేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, 88ఏళ్ల వయసులోను చలాకీగా పనిచేస్తూ స్పూర్తిగా నిలుస్తున్న బామ్మ

చిన్న చిన్న అడుగులు..

తమిళనాడు ప్రజలు ఎక్కువగా తమ కులాల్లోని వారినే పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతుంటారని దళిత రచయిత, ఉద్యమకర్త జయరాణి అన్నారు.

బయటి వ్యక్తులను పెళ్లి చేసుకోకుండా చూసేందుకు చాలా మంది అమ్మాయిలను ఇంట్లోని మావయ్య, బావలకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారని ఆమె తెలిపారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5) ప్రకారం, తమిళనాడులో 28 శాతం మంది మహిళలను రక్త సంబంధీకులకే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈ విషయంలో దేశంలోనే తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.

కుల దురహంకార నేరాలు, హత్యల్లో కేసులు నమోదు అవుతున్నవి చాలా తక్కువ. 2013 నుంచి ఇక్కడ కుల దురహంకార హత్యలు రెండు మాత్రమే నమోదయ్యాయి. ఆ రెండు కేసులూ 2017లో వచ్చాయి.

అయితే, 2020 నుంచి 2022 మధ్య రాష్ట్రంలో 18 కుల దురహంకార హత్యలు జరిగినట్లు దళిత హక్కుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ‘‘ఎవిడెన్స్’’ తెలిపింది.

వీడియో క్యాప్షన్, తిరుపతిలోని ఈ శిక్షణా సంస్థలో గడిచిన పన్నెండేళ్లుగా వేలాది మంది శిక్షణ పొందారు.

చాలా దూరం..

సురక్షితమైన ఆశ్రయం లేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి రక్షణ కొరవడటం వల్లే ఎక్కువ కుల దురహంకార హత్యలు చోటుచేసుకుంటున్నాయని తమిళనాడు అన్‌టచ్‌బిలిటీ ఎరాడికేషన్ ఫ్రంట్ (టీఎన్‌యూఈఎఫ్) జనరల్ సెక్రటరీ శామ్యూల్ రాజ్ చెప్పారు.

2016 ఏప్రిల్‌లో దళితుడైన దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం కేరళకు చెందిన విమలాదేవి హత్యకు గురికావడంతో ప్రతి జిల్లాలోనూ కులాంతర వివాహాలు చేసుకునే వారికి సాయం చేసే ప్రత్యేక విభాగాలు, 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లు, మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ ఫిర్యాదుల నమోదు సదుపాయాలు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది.

నాలుగు జిల్లాల్లోని హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించేందుకు మేం ప్రయత్నించాం. కానీ, మాకు ఎలాంటి స్పందనా రాలేదు.

కులాంతర వివాహాల కేసుల్లో పోలీసులది కూడా తప్పు ఉంటోందని హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

‘‘తల్లిదండ్రులు పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడు, బయటకు తెలియకుండా పంచాయతీల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అంతిమంగా జంటను విడదీస్తారు. సాధారణంగా ఆ యువతి కులం పెద్దదైతే, ఆమెను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించేస్తారు. అయితే, ఇక్కడే చాలా మంది యువతులు హత్యకు గురవుతున్నారు’’అని శామ్యూల్ రాజ్ చెప్పారు.

విమలాదేవి 2014లో చనిపోయారు. నేటికి దాదాపు దశాబ్దం పూర్తయింది. అయినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. హత్యకు గురైన తన భార్యకు న్యాయం జరుగుతుందని దిలీప్ కుమార్ భావిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో శిక్షలు తక్కువగా పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

‘‘సాధారణంగా హత్య కేసుల్లో బాధితుల కుటుంబాలు పోరాటం చేస్తుంటాయి. కానీ, కుల దురహంకార హత్యల్లో కుటుంబ సభ్యులే హంతకులు. దోషులుగా నిరూపితం అవ్వడం పక్కనపెడితే, అసలు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టడం కూడా ఇక్కడ చాలా కష్టం’’అని శామ్యూల్ అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘బిడ్డకు పాలిస్తూ హాకీ ప్రాక్టీస్ చేసి బంగారు పతకం సాధించా’

ఆశ

కీర్తి వయసు 25 ఏళ్లు. ఆర్థికంగా ఆమె స్వతంత్రంగా జీవిస్తున్నారు. సుందర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు, ఆమెకు ఇంకా నిర్ణయాలు తీసుకునే పరిణతి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు భావించారు.

పరువు ప్రతిష్ఠలు, పక్షపాతం లాంటివాటికి ఇక్కడ అపోహలు, తప్పుడు సమాచారం తోడయ్యాయి.

‘‘మా అమ్మ నా మనసు మార్చేందుకు చాలా ప్రయత్నించింది. దళితులు 'పెద్ద కులాల' అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలని రోజూ ప్రతిజ్ఞ చేస్తారని ఆమె నాతో అన్నారు. అసలు ఇలాంటి వింత మాటలు నేను ఎవరి దగ్గరా వినలేదు. అసలు ఇలా ఎలా ఆలోచిస్తారా? అనిపించింది’’ అని కీర్తి చెప్పారు.

ఇది చాలా కష్టమైన, సుదీర్ఘ, నిరంతర పోరాటం.

‘‘ద ఫ్రీడమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ అసోసియేషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ హానర్ యాక్ట్’’ పేరుతో 2022లో దళిత్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ నెట్‌వర్క్ కింద కులానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారులు ఒక ముసాయిదా సిద్ధం చేశారు.

కులం, పరువు పేరుతో వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు దీనిలో నిబంధనలు ఉన్నాయి. ఈ నేరాలకు కఠిన శిక్షలను కూడా దీనిలో ప్రతిపాదించారు. బాధితులకు పరిహారం కూడా ఇవ్వాలని సూచించారు.

కీర్తి నేడు రెండేళ్ల పాపకు తల్లి. నాలుగేళ్లలో రెండుసార్లు మాత్రమే తల్లి కీర్తితో మాట్లాడారు. అది కూడా పాప పుట్టిన తర్వాతే మాట్లాడారు.

కీర్తి తండ్రి ఇప్పటికీ కోపంతోనే ఉన్నారు. ఆ పెళ్లి తర్వాత ఆయన మళ్లీ కీర్తితో మాట్లాడలేదు.

‘‘ఏదో ఒక రోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటారు’’అని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

* కథనంలో వ్యక్తుల గుర్తింపును భద్రంగా ఉంచేందుకు వారి పేర్లు మార్చాం

(BBCShe సిరీస్ ప్రొడ్యూసర్- దివ్య ఆర్య, బీబీసీ)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)