మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

బ్రిజ్ భూషణ్

ఫొటో సోర్స్, ANI

మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీలోని కన్నాట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు శుక్రవారం రెండు ఎఫ్ఐఆర్‌లను దాఖలు చేశారు.

మహిళా రెజ్లర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన నరేంద్ర హుడా ఈ విషయాన్ని బీబీసీకి చెప్పారు.

‘‘అవును, దిల్లీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లను దాఖలు చేశారు. ఇక ఇప్పుడు నిందితునిపై సరైన విచారణ జరగనుంది.’’ అని నరేంద్ర హుడా బీబీసీతో అన్నారు.

మైనర్ బాధితురాలు చేసిన ఆరోపణలపై పోక్సో చట్టం కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఐపీసీ 354 వంటి ఇతర సెక్షన్ల కింద కూడా అభియోగాలు నమోదు చేశారు.

ఇతర మహిళలు చేసిన ఫిర్యాదు మీద కూడా సమగ్ర విచారణను జరిపించేందుకు వీలుగా ఐపీసీలోని అవే నేరాభియోగాలతో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన చెప్పారు.

వినేశ్ ఫోగట్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసుపై శుక్రవారం (ఏప్రిల్ 28న) సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా తాము బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని దిల్లీ పోలీసులు తెలిపారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

ఈ కేసులో మైనర్‌ బాధితురాలికి అవసరమైన భద్రతను ఏర్పాటు చేయాలని దిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఆ బాలికకు కల్పించే భద్రతా వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోరింది.

మే 4న తదుపరి విచారణ

ఏడుగురు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

కేసుపై తదుపరి విచారణను మే 4న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు ఇది అతిపెద్ద గెలుపని భావిస్తున్నారు.

అయితే, న్యాయం దక్కేవరకు తమ నిరసన కొనసాగుతుందని రెజ్లర్లు అంటున్నారు.

"సుప్రీంకోర్టు ఆదేశాలు మా విజయానికి మొదటి అడుగు, కానీ మా నిరసన కొనసాగుతుంది" అని సాక్షి మాలిక్ అన్నారు.

"బ్రిజ్ భూషణ్‌ను జైలుకు పంపేవరకు మా నిరసనలు కొనసాగుతాయని" బజరంగ్ పునియా అన్నారు.

"బ్రిజ్ భూషణ్ జైలులో ఉండాలి. ఆయన్ను అన్ని పదవుల నుంచి తొలగించాలి. లేదంటే ఆయన దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు" అని సాక్షి మాలిక్ అన్నారు.

భారత రెజ్లర్లు

ఫొటో సోర్స్, ANI

బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో క్రీడారంగంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది.

రెజ్లర్లకు పలువురు అథ్లెట్లు మద్దతు పలుకుతుండగా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత ఒలింపిక్ సంఘం కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది.

సమావేశం అనంతరం భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘రెజ్లర్లు వీధుల్లోకి రావడం క్రమశిక్షణా రాహిత్యమని, వారి చర్యలు దేశ ప్రతిష్టను దిగజార్చుతాయని’ అన్నారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

పీటీ ఉష వ్యాఖ్యలపై భారత అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా స్పందించారు. ఆమె నుంచి ఇలాంటి కఠిన స్పందనను ఊహించలేదని బజరంగ్ అన్నారు.

‘‘ఆమె స్వయంగా ఒక మహిళ. ఆమె మాటలు విన్నాక చాలా బాధగా అనిపించింది. మేం మూడు నెలలు ఎదురుచూశాం. ఆమె దగ్గరికి కూడా వెళ్లాం. కానీ, మాకు న్యాయం జరగలేదు. అందుకే మేం వీధుల్లోకి రావాల్సి వచ్చింది’’ అని అన్నారు.

బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తోన్న రెజ్లర్లలో ఒకరైన సాక్షి మలిక్ కూడా పీటీ ఉష వ్యాఖ్యలపై స్పందించారు.

‘‘ఒక మహిళా క్రీడాకారిణిగా ఉండి కూడా ఆమె ఇలా మాట్లాడుతున్నారు. ఇది వింటుంటే చాలా బాధగా ఉంది.మేం ఆమె నుంచే స్ఫూర్తి పొందాం. మేం ఎక్కడ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాం? శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేం ఇలా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి’’ అని సాక్షి మలిక్ వ్యాఖ్యానించారు.

మహిళా రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మలిక్‌లతో పాటు బజరంగ్ పునియా ఈ ఆందోళనలో కూర్చున్నారు. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వరుసగా ఆరో రోజు కూడా రెజ్లర్లు నిరసనలు చేశారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, @Neeraj_chopra1

ఫొటో క్యాప్షన్, నీరజ్ చోప్రా

రెజ్లర్లకు మద్దతుగా అథ్లెట్లు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు

తమకు న్యాయం చేయాలంటూ అథ్లెట్లు రోడ్ల మీదకు రావడం చూసి బాధ కలుగుతోందని ఒలింపిక్ చాంపియన్, భారత ప్రముఖ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘న్యాయం కోరుతూ మన అథ్లెట్స్ రోడ్లపైకి రావడం నన్నెంతో బాధిస్తోంది. మన గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారెంతో కష్టపడ్డారు. గర్వంగా తలెత్తుకునేలా చేశారు.

అథ్లెట్ అయినా, కాకపోయినా దేశంలో ప్రతీ ఒక్కరి సమగ్రతను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.

ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇది చాలా సున్నితమైన విషయం. పారదర్శకంగా, నిష్పాక్షికంగా దీనిపై విచారణ జరగాలి.

సంబంధిత అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే న్యాయం దక్కుతుంది’’ అని అథ్లెట్ నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సానియా మీర్జా కూడా..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా దీనిపై స్పందించారు. ఈ దేశ ప్రజలు నిరసనలు తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

"ఒక క్రీడాకారిణిగా , ముఖ్యంగా ఒక మహిళగా ఇది చూడడానికి చాలా బాధగా ఉంది. వారు మన దేశానికి అవార్డులు తెచ్చిపెట్టారు. మనందరం సంబరాలు చేసుకున్నాం. అది నిజమైతే, ఈ కష్టకాలంలో మనం వారికి తోడుగా నిలబడడం అవసరం. ఇది చాలా సున్నితమైన అంశం. వారు చేస్తున్నవి తీవ్రమైన ఆరోపణలు. ఎప్పటికైనా నిజం బయటపడుతుందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కపిల్ దేవ్, వీరేందర్ సెహ్వాగ్ మద్దతు

కపిల్ దేవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కపిల్ దేవ్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, దిగ్గజ క్రీడాకారుడు కపిల్ దేవ్ కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రెజ్లర్ల ఫొటోను షేర్ చేస్తూ, ‘‘వీరికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా? ’’ అంటూ ప్రశ్నించారు.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలను ట్యాగ్ చేశారు.

బుధవారం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ, ‘‘దేశం అంతా క్రికెట్‌ను ఆరాధిస్తుంది. కానీ, క్రికెటర్లు ఎవరూ మహిళా రెజ్లర్లు పోరాడుతున్న సమస్యపై కనీసం నోరు మెదపడం లేదు. మాకు అనుకూలంగా మాట్లాడమని నేను అనట్లేదు. కనీసం ఏది న్యాయమో? ఏది అన్యాయమో అయినా చెప్పాలి కదా. చాలా బాధగా ఉంది’’ అని అన్నారు.

అయితే, ఈరోజు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ రెజ్లర్లకు మద్దతుగా ట్వీట్ చేశారు.

"దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టి, మన జెండాను ఎత్తుకి ఎగురవేసి, మనందరికీ ఎంతో ఆనందాన్ని పంచిన మన ఛాంపియన్లు ఈరోజు రోడ్డుపైకి రావడం చాలా బాధాకరం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఆటగాళ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

కపిల్ దేవ్ ఇన్‌స్టా స్టోరీ స్క్రీన్ షాట్
ఫొటో క్యాప్షన్, కపిల్ దేవ్ ఇన్‌స్టా స్టోరీ స్క్రీన్ షాట్

‘‘దేశం ప్రతిష్ట ఎప్పుడు మసకబారుతుందంటే’’

పీటీ ఉష వ్యాఖ్యలపై శివసేన నేత, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు స్వేచ్ఛగా బయట తిరుగుతూ, బాధితులు న్యాయం కోసం పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు దేశం ప్రతిష్ట మసకబారుతుందంటూ పీటీ ఉషకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు.

‘‘ సారీ మేడమ్. ఆటగాళ్లు, దేశం ప్రతిష్టను దిగజార్చారని నిందలు వేయకూడదు. దేశానికి అవార్డులు, ప్రతిష్టలు తెచ్చేది క్రీడాకారులే’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

రెజ్లర్లు చేస్తోన్న నిరసనలకు వ్యతిరేకంగా పీటీ ఉష చేసిన వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటుగా ఉన్నాయని మహిళా రెజ్లర్ గీతా ఫొగాట్ అన్నారు.

‘‘తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, పీటీ ఉష గారు క్రీడాకారులే క్రమశిక్షణతో మెలగాల్సి ఉందన్నారు. ఒక మహిళగా, క్రీడాకారిణిగా మీ నుంచి మేం దీన్ని ఊహించలేదు. ఇది చాలా సిగ్గుచేటు’’ అని గీతా ఫొగాట్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు?

  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై భారత మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని సుప్రీంకోర్టు పోలీసులను మంగళవారం ప్రశ్నించింది.
  • దీనిపై పోలీసులు శుక్రవారం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
  • మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీం కోర్టు పేర్కొంది.
  • బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, యువతులను కూడా వదల్లేదని రెజ్లర్లు ఆరోపించారు.
  • సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ సహా ఏడుగురు అగ్రశ్రేణి రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. రెజ్లర్ల తరఫున సిబల్ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.
  • పిటిషన్ వేసిన ఏడుగురు మహిళా రెజ్లర్ల పేర్లను జ్యుడీషియల్ రికార్డులలో చేర్చరాదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. వారి ఐడెంటిటీని కాపాడేందుకు ఈ ఆదేశాలిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, ఇలాంటి నేరాలను విచారించనందుకు పోలీసులపై కూడా విచారణ జరపాలని కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు.

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదు చేసినప్పటికీ, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదుచేయలని సుప్రీంకోర్టు పోలీసులను ప్రశ్నించింది. రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసు శుక్రవారం నాడు విచారణకు రానుంది.

మూడు నెలల క్రితం, 2023 జనవరి 18న భారత్‌లోని ప్రముఖ రెజ్లర్లలో ఒకరైన వినేశ్ ఫోగట్ దిల్లీలో ధర్నాకు కూర్చున్నారు. ఈ ఘటన భారత్‌లోని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

వినేశ్‌తోపాటు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్‌లు కూడా ధర్నాలో పాల్గొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కు ప్రెసిడెంట్‌గా పనిచేసిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పది మందికిపైగా మహిళా రెజ్లర్లను వేధించారని వీరు ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్ భూషణ్ ఖండిస్తూ వచ్చారు. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణకు కేంద్ర యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఒక కమిటీ కూడా ఏర్పాటుచేసింది.

ఈ ఆరోపణలను భారత స్పోర్ట్స్‌లో ‘‘మీ టూ’’ ఉద్యమంగా కొందరు అభివర్ణిస్తున్నారు. అయితే, అసలు ఈ వేధింపుల గురించి వినేశ్ లేదా ఇతర రెజ్లర్లు ఇప్పటివరకు ఎందుకు పెదవి విప్పలేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

‘‘ఆమె ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు?’’అని చాలా మంది ప్రశ్నించారు. ఇప్పుడేకాదు, దేశంలో ఎక్కడ వేధింపుల కేసులు బయటకు వచ్చినా.. ఇప్పటివరకు వారు ఎందుకు పెదవి విప్పలేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

అయితే, వేధింపుల గురించి మాట్లాడటం అంత తేలిక కాదని సైకాలజిస్టులు, హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

మరోవైపు భారత్‌లోని స్పోర్ట్స్ వాతావరణంలో అమ్మాయిలు ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడటం మరింత కష్టమని వారు అంటున్నారు.

బ్రిజ్ భూషణ్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్

భారత్ స్పోర్ట్స్‌లో అలా..

భారత్‌లోని ప్రధాన స్పోర్ట్స్ ఫెడరేషన్లలో దాదాపు అన్నింటికీ పురుషులే నేతృత్వం వహిస్తున్నారనేది అందరికీ తెలిసిన వార్తే. వీరిలో చాలా మంది రాజకీయ నాయకులే ఉంటారు. కొందరు అధికారిక వర్గాల నుంచి వస్తారు. మరికొందరు వ్యాపారవేత్తలు ఉంటారు.

జాతీయ స్థాయిలో మాత్రమే కాదు. స్థానికంగానూ శక్తిమంతమైన నాయకులే స్పోర్ట్స్ సంస్థల్లో కీలకమైన పదవులు చేపడుతుంటారు.

‘‘నిందితుడు శక్తిమంతుడు అయ్యేటప్పుడు అతడిపై చర్యలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రారు’’అని ఒక వెయిట్ లిఫ్టర్ బీబీసీతో చెప్పారు. ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.

‘‘అలాంటి శక్తిమంతమైన నాయకులు మౌలిక సదుపాయాల ఏర్పాటులో సాయం చేయగలరు. స్పోర్ట్స్‌లో అనుకూలమైన వాతావరణాన్ని వారు సృష్టించగలరు కూడా. కానీ, కొందరు మాత్రం ఆ సంస్థకు వారు యజమాని అయితే, అథ్లెట్లకు కూడా తాము యజమానిగా ఫీల్ అవుతారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం అంత తేలికకాదు’’అని ఆమె చెప్పారు.

వారు చెప్పినట్లు నడుచుకోకపోతే, కొన్నిసార్లు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె అన్నారు. ‘‘జట్టులో నుంచి ఆ అథ్లెట్లను తొలగించడం లేదా మానసికంగా వారిని కుంగదీయడం లాంటివి చేస్తారు. అదే వెయిట్ లిఫ్టింగ్‌లో అయితే, ప్లేయర్లు పూర్తిగా స్పోర్ట్స్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఈ పవర్ పాలిటిక్స్ అనేవి కోచ్/మెంటర్, అథ్లెట్ల మధ్య కూడా ఉంటాయని కొందరు అథ్లెట్లు చెబుతున్నారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ‘‘2010 నుంచి 2020 మధ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 45 లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 29 ఫిర్యాదులు కోచ్‌లపైనే వచ్చాయి. అయితే, వీటి విషయంలో తీసుకున్న చర్యలు అంతంత మాత్రమే. కేవలం ఐదుగురు కోచ్‌ల జీతాలు తగ్గించారు. ఒకరిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరిని విధుల నుంచి తొలగించారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్‌లో మహిళల సంఖ్య పెరిగితే, మహిళా క్రీడాకారిణుల పరిస్థితి కాస్త మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, నేడు నైపుణ్యవంతులైన మహిళా కోచ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని వారు వివరిస్తున్నారు.

ఇదే విషయాన్ని ఇంటర్నేషనల్ జడ్జి అండ్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ కోచ్ వర్ష ఉపాధ్యాయ్ అన్నారు.

‘‘ట్రైనింగ్‌లో భాగంగా ప్లేయర్లను కోచ్‌లు ముట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్లేయర్, కోచ్‌ల మధ్య రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం’’అని వర్ష అన్నారు.

‘‘మీకు ఒకవేళ మగ కోచ్‌లు ఉన్నప్పటికీ, అక్కడ సాయం అందించేందుకు మహిళా అసిస్టెంట్లు ఉండాలి. కానీ, ఇలాంటి నిబంధనలను ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి?’’అని ఆమె ప్రశ్నించారు.

‘‘కాలం మారిందని కోచ్‌లు అర్థం చేసుకోవాలి. అసలు మేం చెప్పిందే వేదం అనే రోజులు పోయాయని వారు ముందు తెలుసుకోవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు.

లైంగిక వేధింపులు

ఆ కమిటీలు ఏమయ్యాయి?

ఒకవేళ స్పోర్ట్స్‌లోని మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడాలి అనుకుంటే, వారు ఎక్కడికి వెళ్లాలి? ఇక్కడ వారి ముందున్న మార్గాలు చాలా తక్కువ. ఒక్కోసారి అసలే ఉండవు.

నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ ఆఫ్ ఇండియా 2011 ప్రకారం.. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించే బాధ్యత స్పోర్ట్స్ ఫెడరేషన్‌లదే.

ఫిర్యాదుల కోసం మొదట ఇంటర్నల్ కంప్లైట్స్ (ఐసీ) కమిటీలను వీరు ఏర్పాటుచేయాలి. ఈ కమిటీకి మహిళలు నేతృత్వం వహించాలి. మరోవైపు మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులకు దీనిలో సభ్యత్వం కల్పించాలి. మొత్తంగా ఈ కమిటీలో మహిళల వాటా 50 శాతం కంటే ఎక్కువే ఉండాలి.

అయితే, చాలా ఫెడరేషన్లు ఇలాంటి కమిటీలను ఏర్పాటుచేయలేదు. కొన్ని ఫెడరేషన్‌లు మాత్రమే దీని గురించిన వివరాలను తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకే ఒక మహిళా సభ్యురాలు ఉన్నారు.

‘’50 శాతం మహిళలు ఉండేలా చూడటం తప్పనిసరి. కానీ, మన దేశంలో ఇలాంటి తప్పనిసరి నిబంధనల్లో ఎన్ని పాటిస్తున్నారు. కానీ, ఇప్పుడు నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది’’అని ఒక షూటింగ్ కోచ్ బీబీసీతో మాట్లాడారు.

ఈ అవగాహన స్పోర్ట్స్‌కు వెలుపల కూడా సానుకూల మార్పులకు దారితీస్తుందని ఆమె భావిస్తున్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

అర్జునా అవార్డు గ్రహీత, ఒలింపియన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరివాలాకు భారత్‌లో స్పోర్ట్స్ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.

తాజా లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అవును.. ఇలాంటివి జరుగుతున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు కోసం మేం చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వర్గాల అభిప్రాయాలను మేం పరిగణలోకి తీసుకుంటాం’’అని ఆయన చెప్పారు.

అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా మాజీ అథ్లెట్ అంజు బాబీ జార్జ్ నేతృత్వంలో సేఫ్‌గార్డింగ్ అథ్లెటిక్స్ ఫ్రమ్ హరాస్‌మెంట్ అండ్ అబ్యూస్ ఇన్ స్పోర్ట్స్‌ (ఎస్ఏహెచ్ఏఎస్) ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలోని సభ్యుల్లో మహిళల వాటా 50 శాతానికిపైనే ఉంది.

‘‘మహిళలు, పిల్లలను వేధింపుల నుంచి రక్షించడమే మా ప్రధాన కర్తవ్యం. అయితే, ఎవరైనా దురుద్దేశ పూర్వకంగా ఫిర్యాదులుచేస్తే, కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం’’అని ఆదిల్ చెప్పారు.

స్పోర్ట్స్‌కు సంబంధించిన సంస్థల్లో మరింత మంది మహిళలు ఉండాల్సిన అవసరముందని ఆదిల్ కూడా అభిప్రాయం వ్యక్తంచేశారు.

బ్రిజ్ భూషణ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిజ్ భూషణ్

తోడుగా ఉండాలి..

‘‘సోర్ట్స్‌లో ప్లేయర్‌లు తమను తాము మెరుగుపరచుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వారికి వారే ఒక సురక్షితమైన వాతావరణం ఏర్పరుచుకోవాలి కూడా. తోటి ప్లేయర్లతో మాట్లాడుతూ, వారికి అండగా నిలవాలి’’అని మాజీ ఒలింపిక్ షూటర్ బీబీసీతో చెప్పారు.

‘‘షూటింగ్‌లో పాల్గొనే నా స్నేహితులతో నేను తరచూ మాట్లాడుతుంటాను. వారు గేమ్‌లో నాకు ప్రత్యర్థులే కావొచ్చు. కానీ, తోటి ప్లేయర్లు కూడా. నాకు ఏదైనా కాస్త అసౌకర్యంగా అనిపిస్తే, నేను వారితో మాట్లాడుతుంటాను. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చినట్లుగా అనిపిస్తుంది’’అని ఆమె వివరించారు.

‘‘కానీ, నేడు ఆ నెట్‌వర్క్ తగ్గిపోతోంది. పోటీ పెరుగుతోంది. అలా కాకుండా ప్లేయర్ల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలి. అంతా కలిసి ముందుకు వస్తేనే, ఏదైనా చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుంది’’అని ఆమె అన్నారు.

‘‘నిజానికి చాలా స్పోర్ట్స్ విభాగాల్లో ఇలాంటి నెట్‌వర్కింగ్ కనిపించడం లేదు. దూకుడుగా ముందుకు వెళ్లడానికే ప్లేయర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి దూకుడుతత్వమే ఒక్కోసారి వేధింపులకు.. ఆ తర్వాత లైంగిక వేధింపులకు కారణం అవుతోంది’’అని ఆమె అన్నారు.

స్పోర్ట్స్

ఫొటో సోర్స్, ani

స్విట్జర్లాండ్‌కు చెందిన అథ్లెట్ హక్కుల కార్యకర్త పయోషిని మిత్ర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

‘‘లైంగిక వేధింపులు మాత్రమే కాదు.. స్పోర్ట్స్ సంస్థల్లోని కొందరు ప్రవర్తన చాలా ఆవేశపూరితంగా ఉంటోంది. వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియాల మాటలు విన్నప్పుడు నాకు అదే అనిపించింది’’అని మిత్ర అన్నారు.

‘‘స్పోర్ట్స్‌ సంస్థల్లో చిన్నపెద్ద అనే తేడా ఉంటుంది. ఇక్కడ పైస్థాయిలో ఉండేవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటారు. ఇప్పుడు ప్రముఖ అథ్లెట్లే వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది చాలా పెద్ద విషయం అని తెలుస్తోంది’’అని ఎన్‌డీటీవీతో మిత్ర చెప్పారు.

‘‘స్పోర్ట్స్‌లో మహిళలను మార్గనిర్దేశకులుగా చూస్తాం. కానీ, వారు కూడా మనుషులే, వారికి భావోద్వేగాలు ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి’’అని ఆమె అన్నారు.

2018లో అమెరికా జిమ్నాస్ట్ టీమ్ డాక్టర్ ల్యారీ నాసర్‌ 150 మందికిపైగా జిమ్నాస్ట్‌లను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి రుజువయ్యాయి కూడా. దీంతో ఆయనకు 175 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అమెరికా లాంటి దేశాల్లోనూ లైంగిక వేధింపులు ఉంటాయని ఈ ఘటనలు రుజువు చేశాయి.

అమెరికన్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ కూడా ఇలాంటి వేధింపులపై మాట్లాడేటప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో ఇదివరకు మీడియాతో చెప్పారు.

విపరీతమైన ఒత్తిడి వల్ల వేధింపులపై స్పోర్ట్స్‌లోని మహిళలు మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.

వీడియో క్యాప్షన్, ‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’

ఒత్తిడి ఎలా ఉంటుంది?

ఈ ప్రశ్నపై వర్ష మాట్లాడుతూ.. ‘‘చాలా మంది అమ్మాయిలు పేదరికం, లేదా మధ్య తరగతి కుటుంబాల నుంచి వస్తుంటారు. వారికి స్పోర్ట్స్ అనేది పేదరికం నుంచి బయటపడేసే ఒక మార్గం. దీనిలో వారికి ఉద్యోగాలు వస్తాయి. వారి జీవితాలు మారుతుంటాయి. కానీ, వేధింపులతో వారి జీవితాలే తలకిందులు అవుతున్నాయి’’అని ఆమె చెప్పారు.

‘‘జిల్లా స్థాయి నుంచే వారిలో ఒత్తిడి మొదలవుతుంది. తల్లిదండ్రులు వారు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటారు. ఎలాగైనా గెలవాలని వారు చెబుతారు. కొన్ని సార్లు వేధింపుల గురించి చెప్పినా వారు పట్టించుకోరు. ఇక్కడ కొన్ని హద్దులు ఉంటాయని, వాటిని ఎవరూ దాటకూడదని తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. కోచ్-ప్లేయర్ల మధ్య కూడా ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఉండాలి’’అని ఆమె వివరించారు.

ప్రస్తుతం ప్రముఖ రెజ్లర్లు దీని గురించి మాట్లాడటంతో, పరిస్థితులు మారే అవకాశముందని వర్ష ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

నేడు ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి పర్యావసానాలు ఉంటాయో ప్లేయర్లకు తెలుసు. ఆరోపణలపై నిరసన తెలుపుతున్నప్పుడు, వినేశ్ ఫోగట్ ఈ విషయంపై మాట్లాడారు.

‘‘ఈ వేధింపుల గురించి ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసిన తర్వాత నన్ను చంపేస్తామని కూడా బెదిరించారు. నేను ఈ రోజు బయటకువచ్చి మాట్లాడుతున్నాను. కానీ, రేపు నేను బతికుంటానో లేదో నాకు తెలియదు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, కుస్తీ ఫెడరేషన్ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)