ఉసేన్ బోల్ట్: ఈ పరుగుల వీరుడి ఎకౌంట్ నుంచి రూ.100 కోట్లు మాయం, ఎవరు చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్ మాజీ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల డబ్బు మాయమయింది.
స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్)లో ఈ మోసం జరిగిందని, అందులో పెట్టిన దాదాపు రూ.100 కోట్లు కనిపించడం లేదంటూ బోల్ట్ తరఫు న్యాయవాది లింటన్ గోర్డాన్ ప్రకటించారు.
ఈ కేసు జమైకా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ (ఎఫ్ఎస్‌సీ)కి చేరుకుంది. దీంతో ఎస్ఎస్ఎల్‌పై విచారణ మొదలైంది.
36 ఏళ్ల రిటైర్డ్ స్ప్రింటర్ ఒక దశాబ్దానికి పైగా సదరు సంస్థలో పెట్టుబడి పెడుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని గోర్డాన్ హెచ్చరించారు.
"ఇది చాలా బాధ కలిగించింది. బోల్ట్ తన డబ్బును తిరిగి పొంది, ప్రశాంతంగా జీవించేలా చేస్తారని మేం ఆశిస్తున్నాం" అన్నారు.
ఎస్‌ఎస్‌ఎల్‌లో "ఆందోళన కలిగించే, దుర్మార్గమైన మోసం" జరిగిందని జమైకన్ ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ అన్నారు.
అధికారులు నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెడతారని ఆయన అన్నారు.
జమైకా గ్లీనర్ వార్తాపత్రికకు బోల్ట్ మేనేజర్ నుజెంట్ వాకర్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. బోల్ట్ తన ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్‌లో "తేడాలు" గుర్తించారని తెలిపారు.
న్యాయవాది గోర్డాన్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ కింగ్‌స్టన్ కేంద్రంగా పని చేసే ఎస్ఎస్ఎల్‌లో ఖాతా ఉందని, అందులోని బ్యాలెన్స్ రూ.9.7 లక్షలకు తగ్గిపోయిందని మాజీ బ్రోకర్ ఒకరు గతవారం సమాచారం అందించారని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోసంపై కంపెనీ వాదనేంటి?
మోసం ఆరోపణల గురించి తెలిసిందని, ఎస్ఎస్ఎల్ కంపెనీలో సెక్యూరిటీల తరలింపుపై సమీక్ష జరుగుతోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టంచేసింది.
అయితే ఈ కుట్ర వెనుక మాజీ ఉద్యోగి ఉండొచ్చని ఎస్ఎస్ఎల్ అనుమానిస్తోంది. ఈ విషయాన్ని అధికారులకు వెల్లడించినట్లు పేర్కొంది.
సెక్యూరిటీ డబ్బు బోల్ట్, ఆయన తల్లిదండ్రులకు పెన్షన్‌గా ఉపయోగపడుతోందని న్యాయవాది వివరించారు.
ఉసెన్ బోల్ట్ 11 ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్, 8 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. 2017లో ట్రాక్ అండ్ ఫీల్డ్ నుంచి బోల్ట్ రిటైర్ అయ్యాడు.
2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగులో బోల్ట్ ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.
100 మీటర్ల పరుగును 9.572 సెకన్లలో పూర్తి చేసిన రికార్డు అలాగే ఉంది.
ఇవి కూడా చదవండి
- అమెరికాలో అమ్మాయిలను అలరించే నైట్ క్లబ్లో ఇండియన్ స్ట్రిప్ కింగ్... ఈ క్లబ్ కథ ఓ హత్యతో ఎలా ముగిసింది?
- హత్యలుచేసి సమాధులు కట్టే ‘రూత్‌లెస్ గాడ్ ఫాదర్’
- మోదీపై బీబీసీ డాక్యుమెంటరీలో ఏం చెప్పారు, భారత విదేశాంగ శాఖ ఎలా స్పందించింది?
- ఆరోగ్యం: పళ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














