సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సి.వెంకటేశ్
    • హోదా, క్రీడా విశ్లేషకుడు

ముప్పయ్యేళ్ల క్రితం అమ్మతో కలిసి ఆరేళ్ళ సానియా మీర్జా, హైదరాబాద్‌లోని నిజాం క్లబ్ కెళ్ళింది.

అక్కడ టెన్నిస్ ఆడాలని ముచ్చట పడింది. కానీ కోచ్ మాత్రం నువ్వు టెన్నిస్ రాకెట్ అంత కూడా లేవు, కుదరదన్నాడు. ఎందుకు కుదరదు అని అప్పుడే పోట్లాటకు దిగింది చిన్నారి సానియా. అప్పటినుంచి గత ముప్పయ్యేళ్లుగా ఆమె పోరాడుతూనే ఉంది.

అయితే ఆ పోరాటాలు టెన్నిస్ కోర్టుకే పరిమితం కాలేదు. కోర్టు బయట ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరింత పెద్దవి.

నున్నటి రోడ్డు మీద ప్రయాణం చేయడం చాలా సులువు. కానీ కొండల్ని తొలిచి మనమే బాట వేసుకుని ముందుకు సాగడం మహా కష్టం. సానియా మీర్జా అలాంటి పాత్ బ్రేకింగ్ చేయాల్సి వచ్చింది.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

సానియాకు ముందు మహిళల టెన్నిస్‌లో మన దేశానికి చెప్పుకోడానికి ఏమీ లేదు. కనీసం 100 లోపు ర్యాంక్ సాధించిన వారు కూడా ఆమెకు ముందు ఎవరూ లేరు. మన దగ్గర సరైన సదుపాయాలు కూడా లేవు. అయినా సానియా, సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ ర్యాంక్ వరకు ఎగబాకగలిగింది. డబుల్స్‌లో ఏకంగా నంబర్ వన్ అయింది.

ఆమె సాంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి పొట్టి దుస్తులు వేసుకుని ఆడడంపై మత పెద్దలు అభ్యంతరం లేవనెత్తారు. ఫత్వాలు జారీ అయినాయి. మొత్తం మీద కొందరు లిబరల్ పుణ్యమాని ఆమె ఆట కొనసాగింది. అలా సానియా ఒకటి కాదు రెండు కొండలు తొలిచి తన విజయ పథం నిర్మించుకోవాల్సి వచ్చింది.

తన కెరీర్ మొత్తంలో ఎన్నో వివాదాలు సానియాను చుట్టుముడుతూనే ఉన్నాయి. 'పెళ్ళికి ముందు సెక్స్' గురించి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయం, యాడ్ షూటింగ్ టైంలో మక్కా మసీదులో అడుగు పెట్టిందన్న ఆరోపణలు దుమారం రేపాయి.

తన మతం వారి నుంచే కాదు, 'జాతీయ వాదుల' నుంచి కూడా సానియాకు సమస్యలెదురైనాయి. వారు ఆమె దేశభక్తిని శంకించారు... జాతీయ పతకానికి అవమానం చేసిందన్నారు... మన హైదరాబాద్ ముద్దు బిడ్డగా చూడటం మానేసి 'పాకిస్తాన్ వారి కోడలు' అన్న ముద్ర వేశారు.

వెరసి ఆమె ప్రతి కదలికను రెండు వర్గాలు భూతద్దంతో స్క్రూటినీ చేస్తూ వచ్చాయి.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Getty Images

ఇక మీడియా స్క్రూటినీ మరీ తీక్షణం. సానియా పెళ్లి సందర్భంగా ఆమె ఇంటి చుట్టూ టీవీ కెమెరాలు కొన్ని రోజుల పాటు తిష్ట వేసి కూర్చున్నాయి. టెన్నిస్ ప్లేయర్ అయినప్పటికీ మీడియా మీద బౌన్సర్లు వేయడంలో సానియా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

"ఏంటి సానియా, సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నావా? రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టు లేదు, తల్లి అయ్యేదెప్పుడు, సెటిలయ్యేది ఎప్పుడు" అని ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో సీనియర్ టీవీ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ ఆమెను అడిగి కంగు తిన్నాడు.

"అదేంటి, నేను సెటిలవ్వలేదని అనుకుంటున్నరా, బిడ్డల్ని కనడం మానేసి వాల్డ్ నంబర్ వన్ అయ్యే ప్రయత్నం చేయడం మీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఆడవాళ్లు సెటిలవ్వడం అంటే పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనడం మాత్రమేనా" అని ఆ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది సానియా.

రాజదీప్ నాలుక కరుచుకుని ఆమెకు క్షమాపణ చెప్పాడు.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Sania Mirza/Facebook

మరో సందర్భంలో ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కూడా సానియా గట్టి జవాబే చెప్పింది.

"పెళ్లయ్యాక కూడా టెన్నిస్ కొనసాగించగలగడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా" అని అడిగితే, "నా భర్త కూడా క్రీడాకారుడే, అతను ఎలా తన కెరీర్ కొనసాగిస్తున్నాడో నేను కూడా అంతే. అయినా పెళ్ళయాక ఆడవాళ్లు మాత్రం ఎందుకు తమ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలి" అని ఎదురు ప్రశ్న వేసింది సానియా.

సింగిల్స్ ఆడిన రోజుల్లో సానియా మీర్జా పవర్ఫుల్ ఫోర్ హ్యాండ్ షాట్లకు తిరుగుండేది కాదు. కానీ మణికట్టు గాయం, ఆమె సింగిల్స్‌కు దూరమయ్యేలా చేసింది. అయినా డబుల్స్, మిక్సెడ్ డబుల్స్‌లో సత్తా చాటింది.

పెళ్లయ్యాక మాత్రమే కాదు తల్లి అయిన తర్వాత కూడా టెన్నిస్ ఆడుతూ టైటిల్స్ గెలుస్తూనే ఉంది. ముప్పైఆరేళ్ల వయసులో ఇప్పుడిక శరీరం సహకరించక ఆమె రిటైర్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కొని కూడా ఆటలో కొనసాగింది గనుకనే తన జీవిత కథకు, ఏటికి ఎదురీత అన్నట్టుగా "ఏస్ ఎగైన్స్ట్ ఆడ్స్" అన్న టైటిల్ పెట్టుకుంది సానియా.

సానియా మీర్జా

ఫొటో సోర్స్, Sania Mirza/Facebook

సైనా, సింధు మాదిరిగా ఒలింపిక్ పతకాలు గాని, వాల్డ్ టైటిల్స్ గాని సానియా గెలవలేదు అని పెదవి విరిచే వారు ఉంటారు. అయితే బాడ్మింటన్ ప్రధానంగా ఆసియా ఖండం క్రీడ. కానీ టెన్నిస్ విశ్వవ్యాప్తమైన క్రీడ కావడమే కాక ఇందులో అమెరికా, యూరోప్ దేశాలు చాలా ముందంజలో ఉన్నాయి.

సానియా ముందు కానీ తర్వాత కానీ ఆమె సాధించిన విజయాలలో పదో వంతు కూడా మన దేశం నుంచి టెన్నిస్‌లో మరే అమ్మాయి సాధించలేదు. జూనియర్ వింబుల్డన్ టైటిల్ గెలవడంతో పాటు, డబ్ల్యుటిఏ టైటిల్ గెలిచిన ఏకైక భారతీయ మహిళా సానియానే.

మొత్తం ఆరు గ్రాండ్ స్లాం టైటిల్స్ (డబుల్స్, మిక్సెడ్ డబుల్స్) ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆసియాడ్, కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె మనకు పతకాలు సాధించిపెట్టింది. ఎలా చూసినా కూడా మన మహిళల టెన్నిస్ ముఖచిత్రం, చివరి పేజీ కూడా ఇప్పటికీ సానియా మీర్జానే.

ఆమెను స్ఫూర్తిగా తీసుకుని వేలాదిమంది ఆడపిల్లలు బుజ్జి బుజ్జి టెన్నిస్ రాకెట్లు పట్టుకుని కోచింగ్ సెంటర్ల వైపు పరుగెడుతున్నారు. ఇప్పటి సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే భవిష్యత్తు వింబుల్డన్ మహిళా చాంపియన్లు లోడింగ్...!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)