నేపాల్: విమానం కూలడానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది

విమానం

నేపాల్‌లో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలి పోయింది.

ప్రమాదం సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 68 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ సైన్యం తెలిపింది.

పోఖరాలో ల్యాండ్ అవుతున్న సమయంలో చివరి క్షణంలో విమానం తన దిశను మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. రన్‌వేకు 24.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానం తన దిశను మార్చుకుందని వెల్లడించారు.

విమానం నడుపుతన్న కెప్టెన్ కమల్ కేసీ గతంలో కూడా కాఠ్మాండూ నుంచి పోఖరాకు విమానం నడిపారు.

ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన పోఖరా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి టెస్ట్ ఫ్లైట్ కూడా ఆయనే చేశారు.

నేపాల్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK

ల్యాండ్ అవడానికి పైలెట్ అనుమతి అడిగారని, అంతవరకు ఎటువంటి ఇబ్బంది రాలేదని అధికారులు వెల్లడించారు.

విమానం ల్యాండ్ అవడానికి ‘అనుమతి’ లభించింది. రన్‌వేను విమానం సమీపిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లకు కూడా కనిపిస్తోంది. మరొక 10 లేదా 20 సెకండ్లలో విమానం దిగుతుందని వారు అనుకున్నారు.

‘ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవుతున్న తరుణంలో విమానం స్టాల్ అయినట్లు అనిపించింది. ఆ తరువాత అది కింద పడిపోయింది’ అని ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తెలిపారు.

విమానయానంలో స్టాల్ అంటే విమానం గాలిలో ఎగరలేకపోవడం అని అర్థం. కంట్రోల్ తప్పడమని చెప్పొచ్చు.

విమానం కూలిపోతున్న సమయంలో వీరు ఇంటి బయటనే ఉన్నారు

ఫొటో సోర్స్, KRISHNAMANI BARAL

ఫొటో క్యాప్షన్, విమానం కూలిపోతున్న సమయంలో వీరు ఇంటి బయటనే ఉన్నారు

పోఖరాలో ఆదివారం వాతావరణం బాగానే ఉందని విమానాశ్రయం ప్రతినిధి విష్ణు తెలిపారు.

పోఖరా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రెండు రన్ వేల మీద విమానాలు దిగుతున్నాయి. రన్ వే-30 మీద తూర్పు నుంచి విమానాలు దిగుతాయి. రన్ వే-12 మీద పడమర నుంచి వచ్చేది ల్యాండ్ అవుతాయి.

ముందు రన్ వే-30 మీద దిగాలని భావించి, ఆ తరువాత చివరి క్షణంలో రన్ వే-12కు మళ్లి నట్లు చెబుతున్నారు.

‘తొలుత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను పైలెట్ సంప్రదించినప్పుడు రన్ వే-30 మీద దిగడానికి అనుమతి ఇచ్చారు. కానీ 24.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు రన్ వే-12 మీద దిగేందుకు పైలెట్ అనుమతి కోరారు’ అని విష్ణు తెలిపారు. ఇక విచారణ తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు.

కమల గురుంగ్ ఇంట్లో పడిన విమాన శకలాలు
ఫొటో క్యాప్షన్, కమల గురుంగ్ ఇంట్లో పడిన విమాన శకలాలు, టీ కప్పులు

చూసిన వాళ్లు ఏమంటున్నారు?

పోఖరాలోని ఘరీపటన్ గ్రామస్తులు విమానం కూలడాన్ని చూశామని తెలిపారు.

కమల గురుంగ్ ఇంటి పరిసరాల్లో విమాన శకలాలు కొన్ని పడి ఉన్నాయి. ఆ సమయంలో పిల్లలు భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు.

‘విమానం కాలిపోవడాన్ని నా కళ్లతో చూశాను. పిల్లలు, నేను చాలా భయపడ్డాం’ అని 46 ఏళ్ల కమల గురుంగు బీబీసీతో అన్నారు.

ఉదయం 11.30 గంటల వరకు అంతా బాగానే ఉంది. ఆమె ఎండలో కూర్చొని ఉండగా పిల్లలు మేడ మీద ఉన్నారు. అంతలో పెద్దగా విమానం శబ్దం వినిపించింది.

‘పైకి చూశాను. విమానం దగ్గరగా దూసుకొని వస్తోంది. సేతి నది వైపునకు దూసుకొని పోయింది. అలా విమానం పడిపోవడాన్ని నేను ఎన్నడూ చూడలేదు. విమానం నుంచి మంటలు, నల్లని పొగలు వస్తున్నాయి.

కిటీకీల గాజు ముక్కలు, టీ కప్పులు వంటివి మా ఇంటి గుమ్మం దగ్గర్లో పడ్డాయి’ అని ఆమె అన్నారు.

విమానం చాలా తక్కువ ఎత్తులో వచ్చిందని, అది తమ ఇళ్ల మీద పడుతుందని భయపడ్డామని స్థానికులు తెలిపారు. విమానం కూలిన కాసేపటికి భద్రతా దళాలు వచ్చినట్లు వారు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)