దిల్లీ: గర్భంతో ఉన్న భార్యను తగులబెట్టాలని ప్రయత్నించాడు... ఇలాంటి నేరాలకు శిక్షలేంటి?

గృహ హింస

ఫొటో సోర్స్, SILVIA TURRA / EYEEM

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధాని దిల్లీలో ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తగలబెట్టేందుకు ప్రయత్నించిన భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

ఈ ఘటన దిల్లీలోని బవానా ప్రాంతంలో జరిగింది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

తన భర్త వీర్ ప్రతాప్ సింగ్ తనను తగలబెట్టడానికి ప్రయత్నించాడని ఖుష్బూ సింగ్ ఆరోపించారు.

ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆమె భర్తపై ఐపీసీ సెక్షన్లు 498 (ఏ), 307 (హత్య ప్రయత్నం) విధించారు. 

ఖుష్బూ సింగ్ పోలీసులకు, ఎస్‌డీఎంకు వాంగ్మూలం ఇచ్చారని దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ బీబీసీతో చెప్పారు. 

వరకట్నం కోసం తన భర్త తనను వేధించేవాడని, తాగి వచ్చి కొట్టేవాడని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.

ఏమిటీ ఈ కేసు?

స్వాతి మాలీవాల్ కేసు వివరాలు బీబీసీకి తెలిపారు.

“పెళ్లికి పెట్టిన నగలు తనకు ఇచ్చేయమని భర్త డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైనట్టు ఖుష్బూ సింగ్ చెప్పారు. తగవు పెరిగి పెద్దదవడంతో ఖుష్బూను కాల్చి చంపేందుకు ఆమె భర్త ప్రయత్నించాడు. ఈ కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లే విధించారు. దీనిపై దిల్లీ పోలీసులకు మేం నోటీసు ఇచ్చాం. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం" అని చెప్పారు. 

ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ, "మొదట ఖుష్బూ ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు తమ కూతుర్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని పదే పదే ఆరోపించారు. ఈ కేసులో ఎస్‌డీఎం, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ను నియమించింది. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాగ్మూలంలో తన భర్త తనను కాల్చి చంపడానికి ప్రయత్నించాడాని ఆమె ఆరోపించారు" అని తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భర్త పెళ్లి నగలు ఇచ్చేయమని డిమాండ్ చేశాడని, దాంతో ఇద్దరూ గొడవ పడ్డారని ఖుష్బూ చెప్పారు. తగువు పెద్దదవడంతో ఆమె భర్త ఆమెపై పెయింట్ థిన్నర్ పోసి నిప్పంటించాడు. జనం గుమికూడడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అందులో అతడి శరీరం కూడా కొద్దిగా కాలింది. కట్నం కోసం తమ బిడ్డను వేధిస్తున్నాడని ఆమె కుటుంబం ఆరోపించింది. కానీ, ఖుష్బూ ఈ విషయమై ఏమీ చెప్పలేదు.

ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖుష్బూ పరిస్థితి నిలకడగా ఉంది. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత వీర్ ప్రతాప్‌ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, 15-49 ఏళ్ల మధ్య వయసుగల ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక లేదా మానసిక హింసను అనుభవిస్తున్నారు. 

భర్త చేతిలో హింసకు గురవుతున్న మహిళల సంఖ్యపరంగా దక్షిణాసియాలో భారత్ నాల్గవ స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో, గృహహింసకు సంబంధించి, భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న చట్టాలేంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

 గృహ హింస

ఫొటో సోర్స్, PACIFIC PRESS/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చట్టం ఏం చెబుతోంది?

ఇంట్లో మహిళలు ఎదుర్కునే హింస నుంచి వారిని రక్షించేందుకు 'గృహ హింస నిరోధక చట్టం 2005' అమలులోకొచ్చింది.

ఈ చట్ట ప్రకారం, భార్య, తల్లి, సోదరి, కుమార్తె, లివ్-ఇన్ భాగస్వామి.. ఇలా ఎవరిపై హింసకు పాల్పడినా దాన్ని గృహ హింస కింద గుర్తిస్తారు.

మహిళల ఆరోగ్యం, భద్రత, జీవితం, ఆమె శరీర భాగాలు, మానసిక స్థితికి హాని తలపెడితే నేరం అవుతుంది. 

మహిళల పట్ల శారీరక, మానసిక, లైంగిక హింసలతో పాటు ఆర్థిక హింస కూడా నేరమే.

ఆర్థిక హింస అంటే ఇంటి ఖర్చులకు ఆమెకు డబ్బులు ఇవ్వకపోవడం, చట్టప్రకారం ఆమెకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా చేయడం, స్త్రీధనం, నగలు వంటివి ఆమె నుంచి లాక్కోవడం, ఆమె ఆదాయాన్ని లాక్కోవడం, అదనపు కట్నం కోసం వేధించడం, డబ్బులు ఇవ్వకుండా ఆమెను ఇంటి నుంచి గెంటివేయడం మొదలైనవి.

సెక్షన్ 498(ఏ)

భర్త లేదా అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం హింసిస్తే, అది భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 (ఏ) ప్రకారం నేరం. 

శారీరక, మానసిక వేధింపులు కూడా సెక్షన్ 498 (ఏ) కిందకు వస్తాయి.

మారిటల్ రేప్ లేదా పెళ్లి తరువాత భర్త బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడడాన్ని ప్రస్తుతం నేరంగా పరిగణించనప్పటికీ, ఈ సెక్షన్ ప్రకారం బలవంతపు లైంగిక సంపర్కాన్ని క్రూరత్వంగా పరిగణిస్తారు.

గృహ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక, మానసిక హింసకు గురవుతున్నారు

వరకట్న నిషేధ చట్టం, 1961

ఈ చట్టం వరకట్నాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. ఎవరైనా కట్నం ఇచ్చినా, తీసుకున్నా, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా డిమాండ్ చేసినా శిక్ష లేదా జరిమానా తప్పదు. 

ఈ చట్టం ఒక విధంగా 498 (ఏ) సెక్షన్‌కు విస్తృతరూపం.

498 (ఏ) పరిధిలోకి రాని వరకట్న కేసులు కూడా ఇందులోకి వస్తాయి. 

నేరం రుజువైతే కనీసం ఆరు నెలలు శిక్ష పడుతుంది. దానిని రెండేళ్లకు పెంచే నిబంధనలు కూడా ఉన్నాయి. 

పది వేల రూపాయల వరకు జరిమానా పడొచ్చు.

మహిళలు చట్ట సహాయం ఎలా తీసుకోవచ్చు?

మహిళలు గృహ హింస విషయంలో తమ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 

ఒకవేళ వాళ్లు నివసిస్తున్న ప్రాంతం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని చెబితే, అప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని అడగవచ్చు. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా రిజిస్టర్ చేయవచ్చు. అక్కడి నుంచి దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. 

పురుష అధికారులతో మాట్లాడాడనికి ఇబ్బందిగా ఉంటే, మహిళా అధికారితో మాట్లాడతానని చెప్పవచ్చు. 

పోలీసులు మీరిచ్చిన ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయవచ్చు లేదా, జిల్లా భద్రతా అధికారిని కలవడానికి సహాయపడగలరు. 

ఇది కాకుండా, నేరుగా మీ ప్రాంతంలోని మహిళా కోర్టు తలుపు తట్టవచ్చు. 

ఈ కోర్టులో సాధారణంగా మహిళా న్యాయమూర్తులు ఉంటారు. వరకట్నం, గృహ హింస కేసులు ఇక్కడకు వస్తాయి. 

ఇదీ కాకుంటే, మీ ఎఫ్‌ఐఆర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు లేదా జాతీయ మహిళా కమిషన్ వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.

గృహ హింస

ఫొటో సోర్స్, Getty Images

ఫిర్యాదు చేసిన తరువాత ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, కోర్టు మీకు ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ లేదా సెక్యూరిటీ ఆఫీసర్‌ని నియమిస్తుంది. 

ఆ అధికారి మీ ఇంటికి వచ్చి అన్ని వివరాలు సేకరించి, నివేదికను కోర్టుకు సమర్పిస్తారు.

కోర్టులో కేసు పోరాడే సామర్థ్యం మీకుంటే, అదే చేయవచ్చు. లేదంటే కోర్టు మీ కోసం ఒక న్యాయవాదిని నియమిస్తుంది. 

మీకు రక్షణ కల్పించమని కోర్టు ఆదేశించవచ్చు. రక్షణ ఉత్తర్వును ఎవరైనా ఉల్లంఘిస్తే, వారికి ఒక సంవత్సరం వరకు శిక్ష పడవచ్చు.

కోర్టు నుంచి ఎలాంటి సహాయం ఉంటుంది?

అన్ని మతాలు, కులాలకు చెందిన మహిళలకూ ఈ చట్టం వర్తిస్తుంది. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత, మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేస్తారని అనుమానం వస్తే, కోర్టు నుంచి రక్షణ కోరవచ్చు. 

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటారన్న భయం ఉంటే, కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు తనకు భరణం చెల్లించాలని డిమాండ్ చేయవచ్చు.

భర్తతో జాయింట్ బ్యాంక్ ఖాతా లేదా ఇద్దరి పేరు మీద ఆస్తి ఉంటే మీ భర్త దాన్ని అమ్మేస్తారన్న భయం ఉంటే, ఆ విషయంలో కూడా కోర్టు సహాయం తీసుకోవచ్చు.

లైంగిక హింస కేసుల్లో, కోర్టు తీర్పు వెలువడేవరకు భర్త మిమ్మల్ని తాకరాదని లేదా మీరు నివసించే ఇంట్లో ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించవచ్చు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే ఒక సంవత్సరం వరకు శిక్ష పడవచ్చు.

వీడియో క్యాప్షన్, ‘న్యాయం జరిగితే సరిపోదు, వివక్ష చూపే మగాళ్ల స్వభావం మార్చాలి’

ఇవి కూడా చదవండి: