Marital Rape: భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భర్తలు భావించడం వల్లే వైవాహిక అత్యాచారాలు పెరుగుతున్నాయా

మ్యారిటల్ రేప్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ, దిల్లీ

పితృస్వామ్య సంప్రదాయాలున్న భారత సమాజంలో పెళ్లిని పవిత్ర కార్యంగా భావిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి, తన భార్యను రేప్ చేయడం నేరం కాదు.

కానీ, ఇటీవల వైవాహిక అత్యాచారాలపై కోర్టులు వివాదాస్పద తీర్పులను ఇచ్చాయి. దీంతో వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాలంటూ మరోసారి సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.

''భార్యకు ఇష్టం లేనప్పటికీ భర్త బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనడం నేరం కాదంటూ'' గురువారం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌కే చంద్రవంశీ తీర్పు ఇచ్చారు.

భారత శిక్షాస్మృతి చట్టంలోని సెక్షన్ 375 ప్రకారం ఆయన ఈ విధమైన తీర్పునిచ్చారు.

'అసహజమైన సెక్స్''తో అత్యాచారానికి పాల్పడినట్లు ఒక మహిళ, తన భర్తపై ఆరోపణలు చేసింది.

భారతీయ చట్టం వైవాహిక అత్యాచారాన్ని గుర్తించనందున ఆ వ్యక్తి అసహజ సెక్స్ పద్ధతులు ప్రయత్నించినప్పటికీ ఆయన్ను నేరస్తుడిగా పరిగణించి తీవ్రమైన శిక్షలు విధించలేమని జడ్జి పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ తీర్పుపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ''న్యాయస్థానాలు ఇంకెప్పుడు మహిళల కోణం నుంచి సమస్యను పరిగణిస్తాయి?'' అని జెండర్ రీసెర్చర్ కోట నీలిమ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలామంది ఆమె ట్వీట్‌కు బదులిస్తూ పాతకాలపు అత్యాచార చట్టాలను కచ్చితంగా సవరించాలని డిమాండ్ చేశారు. మరికొందరు దీనికి వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

''వైవాహిక అత్యాచారం గురించి ఏ భార్య అయిన ఫిర్యాదు చేస్తుందా?'' అంటూ ఒకరు ఆశ్చర్యపోగా... ''ఆమె క్యారెక్టర్‌లో కచ్చితంగా ఏదో తప్పు ఉంది'' అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరైతే ''భార్యగా తన బాధ్యతలు అర్థం చేసుకోలేని వారే ఇలాంటి ఆరోపణలను చేస్తారు’’ అన్నారు.

సామాజిక మాధ్యమాల్లోనే కాదు న్యాయస్థానాల పరంగా కూడా ఈ వైవాహిక అత్యాచార అంశంపై భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి.

భార్య విడాకులు కోరేందుకు ఇది సరైన కారణమేనని కొన్ని వారాల కిందట కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.

''సెక్స్ విషయంలో భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త తనకు అన్నిటికీ అనుమతి ఉన్నట్లుగా వ్యవహరించి సంభోగిస్తే అది వైవాహిక అత్యాచారమే అవుతుంది. అలాంటి ప్రవర్తనకు శిక్ష విధించలేనప్పటికీ అది శారీరక, మానసిక క్రూరత్వం కిందకే వస్తుంది'' అని ఆగస్టు 6న వెలువరించిన తీర్పులో జస్టిస్ ఎ.ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఇడపగత్ పేర్కొన్నారు.

భార్య శరీరం తనదేనని భర్త భావించడమే ఈ వైవాహిక అత్యాచారానికి కారణమవుతోందని వారు అన్నారు. ఆధునిక సామాజిక న్యాయశాస్త్రంలో ఇలాంటి భావనకు చోటు లేదు అని స్పష్టం చేశారు.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో వివాహాన్ని పవిత్రంగా భావిస్తారు.

బ్రిటిష్ కాలానికి చెందిన, 1860 నుంచి భారత్‌లో ఉనికిలో ఉన్న ఐపీసీ సెక్షన్ 375లో సెక్స్‌ను రేప్‌గా పరిగణించపోవడంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ''మైనర్‌ కాని తన భార్యతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం'' కూడా అలాంటి మినహాయింపులలో ఒకటి.

లైంగిక చర్యకు భార్య సమ్మతి ఉండాలని వివాహ బంధం సూచిస్తుంది. భర్త కోరికలను భార్య తిరస్కరించరాదంటూ సమాజంలో పాతుకుపోయిన నమ్మకం ఉండడంతో వైవాహిక అత్యాచార అంశం సాధారణంగా మారిపోయింది.

కానీ చాలా ఏళ్లుగా, ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని సవాలు చేస్తున్నారు. 100కు పైగా దేశాలు వైవాహిక అత్యాచారాన్ని చట్టవిరుద్ధం చేశాయి. భార్య సమ్మతిని లెక్కలోకి తీసుకోవడం లేదంటూ 1991లో బ్రిటన్ కూడా దీన్ని చట్టవిరుద్ధంగా పరిగణించింది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, 36 దేశాల్లో ఇది కేవలం చట్టంగానే మిగిలిపోయింది. అందులో భారత్ కూడా ఉంది.

31 శాతం మంది వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు... తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

'' నా అభిప్రాయం ప్రకారం ఈ చట్టాన్ని తీసివేయాలి'' అని దిల్లీలోని వార్విక్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షి అన్నారు.

గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో భారత్ గత కొన్నేళ్లలో కాస్త పురోగతిని సాధించింది. కానీ ఈ వైవాహిక అత్యాచారానికి సంబంధించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది.

అత్యాచార చట్టాలను సవరించడానికి పలు మార్గదర్శకాలను రూపొందించిన న్యాయ నిపుణుల బృందంలో ప్రొఫెసర్ బక్షి కూడా ఒకరు. 1980లో ఏర్పాటైన ఈ కమిటీ తమ సూచనలు, సలహాలను ఎంపీల కమిటీకి నివేదించింది.

''వారు మేం సూచించిన అన్ని సలహాలను అంగీకరించారు. ఒక్క వైవాహిక అత్యాచారాన్ని చట్టవిరుద్ధం చేసే సూచనను తప్ప. అందుకు ఇది సరైన సమయం కాదు అని వారు మాతో అన్నారు'' అని బీబీసీతో బక్షి తెలిపారు.

ఆ తర్వాత కూడా దీన్ని నేరంగా ప్రభుత్వాలు గుర్తించాలంటూ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేకపోయాయి.

''వివాహంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి. ఒకరు, ఇంకొకరిపై ఆధిపత్యం చెలాయించే అధికారం ఉండకూడదు. భార్య నుంచి లైంగిక సేవలను భర్త డిమాండ్ చేయకూడదు'' అని బక్షి అన్నారు.

వివాహ చట్టాన్ని నేరపూరితంగా పరిగణించడం వల్ల వివాహ వ్యవస్థ అస్థిరంగా మారుతుందని ప్రభుత్వాలు ఏళ్లుగా వాదిస్తున్నాయి. ఇది పురుషులను హింసించడానికి మహిళలకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నాయి.

నేరపూరితమైన ఈ చట్టాన్ని కొట్టివేయాలంటూ ఎంతోమంది బాధిత భార్యలు, న్యాయవాదులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు.

ఈ చట్టాన్ని నేరంగా పరిగణించేందుకు భారత్ నిరాకరించడం పట్ల యునైటెడ్ నేషన్స్, హ్యుమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేశాయి.

పురాతనమైన ఈ చట్టానికి తాము లోబడాల్సి వస్తుందని, వివాహ అత్యాచారాన్ని నేరంగా పరిగణించే నూతన చట్టాన్ని తయారు చేయాల్సిందిగా చాలా మంది జడ్జిలు పార్లమెంట్‌ను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాహ అత్యాచారాన్ని నేరంగా పరిగణించని 36 దేశాల్లో భారత్ కూడా ఒకటి.

మహిళల హక్కులకు ఈ చట్టం స్పష్టమైన ఉల్లంఘన. పురుషులకు దీని వల్ల అసహజమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందుకే దీనికి వ్యతిరేకంగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోంది అని నీలిమ అన్నారు.

''1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్‌లో సగ భాగానికే అంటే కేవలం పురుషులకు మాత్రమే స్వేచ్ఛ లభించింది. మిగతా సగం, అంటే మహిళలకు ఇంకా స్వేచ్ఛ లభించాల్సి ఉంది. న్యాయవ్యవస్థపైనే మా ఆశలన్నీ ఉన్నాయి'' అని నీలిమ అన్నారు.

కొన్ని న్యాయస్థానాలు దీనికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రోత్సాహకరంగా ఉంది. కానీ ఇది చాలా చిన్న విజయమే అని నీలిమ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)