అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

ఫొటో సోర్స్, Kashif Siddiqui
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆమె వద్దని చెప్పారు. ఆయన ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదన్నారు.
ఆమెను వివాహం చేసుకుంటారు కాబట్టి, అది ఆయనకు సాధారణ విషయంలా అనిపించింది. "కానీ, వేదన కలిగించిన వారినే వివాహం చేసుకోవడం ఆ మహిళకు చాలా కష్టమైన విషయం. అది సాధారణ వివాహంలా ఉండదు" అని నిధి అన్నారు.
నిధి, సునీల్ (పేర్లు మార్చాం) 9 ఏళ్ల క్రితం ఒకరితో ఒకరు సంబంధంలో ఉండేవారు. వారిద్దరి మధ్య ఆ సమయంలో జరిగిన సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.
ఒక వేసవిలో ఆమె నలుపు తెలుపు గళ్ల చొక్కా వేసుకున్నారు. సునీల్‌తో కలిసి ఆయన అద్దెకుండే ఇంటికి వెళ్లారు.
ఆయన తనకు మత్తు ఇచ్చి తనపై అత్యాచారం చేసినట్లు నిధి తాను నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Kashif Siddiqui
ఈ చర్యను వీడియో తీసిన ఆయన, తనను పెళ్లి చేసుకోకపోతే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడం విన్నారు.
నిధి అడిగిన ప్రతి ప్రశ్నకు "నేను నిన్ను మోసం చేయలేదు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను కదా" అని సునీల్ ఒకే ఒక్క సమాధానం చెప్పేవారు.
ఆమె వివాహానికి అవుననీ చెప్పలేదు, కాదనీ చెప్పలేదు. ఆమె ఈ అత్యాచారం జరిగినట్లు ఎప్పటికీ నిరూపించలేకపోవచ్చు. అత్యాచారానికి గురైన మహిళకు జీవించడం చాలా కష్టంగా ఉంటుంది.
నా అంగీకారం లేకుండా ఆయన తనతో సెక్స్ చేసారని నిధి అంటారు.
"ఆమె నా పై కేసులు వేశారు. కానీ, నేను ఆమెను వివాహం చేసుకున్నాను. మేమిప్పుడు సంతోషంగా ఉన్నాం" అని ఆయన అంటారు.
కానీ, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి, ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోకుండా ఉండుంటే, నిధి జీవితం మరోలా ఉండేది.

ఫొటో సోర్స్, KASHIF SIDDIQHI
2017లో నిధి, సునీల్‌కి వివాహం జరిగింది. అత్యాచారం కేసులో సునీల్ నిర్దోషి అని దిల్లీ కోర్టు 2018లో తీర్పు ఇచ్చింది.
తన ఆశలన్నీ ఛిద్రమైనట్లు అనిపించిందని ఆమె చెప్పారు.
"అదొక కష్ట కాలం. నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేది" అని ఆమె చెప్పారు.
అప్పుడే తన జీవితం ముగిసిందని ఆమె అనుకున్నారు. లాయర్ చెప్పిన మాట వినకుండా తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
ఆమె 2018లో కోర్టుకు వెళ్లినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
"నా వాదన వినిపించడానికి కోర్టుకు వెళ్లే సమయానికి నేను గర్భవతిని. నన్ను ఏ చెప్పమన్నారో అదే చెప్పాను. నా తరపున వాదించే న్యాయవాది ఆ రోజు కోర్టులో లేరు. నా ఆరోపణలను వెనక్కి తీసుకోమని నాకు చెప్పారు. నాకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో నేను నా కేసు వాపసు తీసుకోవాల్సి వచ్చింది. నాకు పెళ్లయ్యే సమయానికి, నేను సంతోషంగా లేను. కోర్టులో కేసు వాదనలు నడుస్తున్నంత సేపూ, సునీల్ నన్ను బెదిరిస్తూనే ఉండేవారు" అని నిధి చెప్పారు.
"నన్ను ఎవరూ ఏం చేయలేరు, అని నా భర్త నాతో అంటుండేవారు. ఆ మాటలతో నేను ఆశలు వదులుకున్నాను. ఆయన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని నన్ను ఎవరూ అడగలేదు" అన్నారు నిధి.
"ఇలా నాకే ఎందుకు జరిగింది, అని నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను" అని నిధి అంటారు.
2019లో నిధి ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

ఫొటో సోర్స్, KASHIF SIDDIQHI
నిధికి ఇప్పుడు 29 ఏళ్లు.
"సునీల్‌ని పెళ్లి చేసుకుని, ఆనందంగానే ఉన్నానని నాలో నేను అంగీకరిస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు నాకు ఎలాంటి భావాలూ లేవు. నా గౌరవాన్ని కోల్పోయాను. ఆత్మాభిమానం లేదు. కానీ, సరిపెట్టుకుంటూ వచ్చాను" అని చెప్పారు.
ఆ అత్యాచారం తాలూకూ జ్ఞాపకాలు ఆమెలో అలాగే ఉండిపోయాయి.
"ఆయన నన్ను తాకినప్పుడల్లా వేదన నన్ను చుట్టుముడుతుంది. ఆ వేదనతో నేను బతకలేకపోతున్నాను" అని ఆమె అన్నారు.
"ఆమె కేసును వాపసు తీసుకున్నారు. ఆమె బలవంతపు పెళ్లి, అత్యాచార ఆరోపణలతో ఆ కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె తన ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో నా క్లయింట్‌కి ఆ కేసు నుంచి విముక్తి లభించింది" అని సునీల్ తరుపు లాయర్ దీపక్ జఖర్ అన్నారు.

ఫొటో సోర్స్, KASHIF SIDDIQHI
ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అత్యాచార బాధితుల కోసం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి అత్యాచార బాధితులు తమపై అఘాయిత్యానికి పాల్పడిన వారినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనే అంశంపై పెద్ద చర్చకు దారి తీశాయి.
ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని, ఆమెను వివాహం చేసుకుంటారా అని ఆయన కోర్టులో అడిగారు.
"గతంలో చాలా కోర్టులు బాధితులను ఇలాగే ప్రశ్నించాయి. అయితే, అవి లిఖితపూర్వకంగా లేనప్పటికీ విచారణ చేపట్టిన కోర్టులకు అవి ప్రామాణికంగా మారే అవకాశం ఉంది. దీంతో, అవి మహిళలను బాధ పెట్టేవి అవుతాయి" అని ఉత్తర్ ప్రదేశ్ బాగ్పథ్ క్రిమినల్ లాయర్ వివేక్ చౌదరి అన్నారు.
ఇలా బాధితులు తమ పై అత్యాచారం చేసిన వారినే వివాహం చేసుకున్న కథలు లెక్కలేనన్ని ఉన్నాయి.
2005లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని చార్తావాల్ గ్రామంలో నూర్ ఇలాహి భార్య ఇమ్రానాకు ఏడు నెలల పాటు పవిత్రంగా ఉండి తనపై అత్యాచారం చేసిన మామగారినే వివాహం చేసుకోవాలని స్థానిక పంచాయతీ ఆదేశించింది. ఆమె ప్రస్తుత వివాహాన్ని పంచాయతీ రద్దు చేసింది.
అయితే, ఇమ్రానా దీనిపై కేసు నమోదు చేసి, పంచాయతీకి వ్యతిరేకంగా పోరాడతానని మీడియాకు చెప్పారు. తన భర్తతోనే కలిసి జీవిస్తానని ఆమె స్పష్టం చేసారు.

ఫొటో సోర్స్, Kashif Siddiqui
సాధారణంగా అత్యాచారం చేసిన వ్యక్తులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పెళ్లి అనే ఆయుధం వాడతారు.
దిల్లీలో శాంతి ముకుంద్ ఆసుపత్రిలో పని చేసే 23 ఏళ్ల నర్సు విషయంలో అదే జరిగింది.
ఆమెపై భురా అనే వార్డు బాయ్ అత్యాచారం చేశాడు. తర్వాత, ఆమె కుడి కనుగుడ్డు బయటకు వచ్చేయగా ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది.
ఈ సంఘటన సెప్టెంబరు 2003లో జరిగింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని , అందుకని నేనే ఆమెను పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేసిన వ్యక్తి తన తప్పును సమర్ధించుకున్నాడు.
కానీ, అలాంటి దరఖాస్తును కోర్టు ఆమోదించడం, అన్నిటి కంటే భయంకరమైన విషయమని ఆమె అతడి అభ్యర్ధనను తిరస్కరించారు.
ఆ తర్వాత భురాకు 2020లో జీవిత ఖైదు విధించారు.

ఫొటో సోర్స్, Gopal Shoonya
2020లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఒక వ్యక్తి బాధితురాలిని తనకు రాఖీకట్టమని వేడుకోవాలనే నిబంధనపై మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
గత ఏడాది జులైలో ఒడిశా హైకోర్టు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన వ్యక్తికి,, తర్వాత మేజర్ అయిన ఆమెను వివాహం చేసుకోవడంతో బెయిలు మంజూరు చేసింది.
"ధైర్యంగా చేసే అలాంటి ప్రతిపాదనలు దారుణమైనవి" అని జాగోరి మహిళా హక్కుల గ్రూప్ డైరెక్టర్ జయశ్రీ వెలంకార్ అన్నారు.
"వేధించిన వ్యక్తితో వివాహం ఏమిటి? ఎవరైనా ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కోవడానికి ప్రయత్నిస్తారా? ఆమెపై ఒత్తిడి తెస్తారా? ఇలాంటి పెళ్ళిళ్ళను పరిష్కారంగా భావిస్తారు. ప్రతి అబ్బాయికి పెళ్లి చేసుకునే అమ్మాయి కన్య అయి ఉండాలి. వేళ్లూనుకుపోయిన ఇలాంటి భావాలను మనం పరిశీలించాలి" అని అన్నారు.
మహిళలకు అలాంటి సలహాలు ఇవ్వడానికి న్యాయపరమైన సమ్మతి లేదని ఆమె అంటారు. "లైంగిక దాడి జరిగిందా లేదా తెలుసుకుని, శిక్షించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయా, లేదో తెలుసుకోవడమే జడ్జి పాత్ర" అంటున్నారు.
"ఈ పెళ్లి విషయం ఎక్కడ నుంచి వస్తోంది? దీనికి చట్టబద్ధత ఉందా? చాలా కేసుల్లో అత్యాచారం చేసిన వ్యక్తులు బాధితులకు తెలిసినవారే అయ్యుంటారు. వారికి అత్యాచారం చేయడానికి లైసెన్సు ఇచ్చి, తర్వాత వారిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారా?" అన్నారు.
కోర్టులు మ్యారేజ్ బ్యూరోలు కానక్కరలేదు. ఒక మహిళను మీరు పసికందులా చూస్తున్నారు. మహిళలను ఎప్పటికీ, ఏమీ తెలియని పసిపాపల్లా చూడటం పితృస్వామ్య హక్కుల్లో ఒకటి" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Kashif Siddiqui
భారతదేశంలో అత్యాచార నేరానికి మరణ శిక్ష విధించే పోక్సో చట్టం సహా ఇతర కఠినమైన చట్టాలు ఉన్నాయి.
కానీ, కేసు విచారణలో ఉండగానే జరిగే ఇలాంటి సర్దుబాట్ల వల్ల, కొన్ని సార్లు కేసులు వెనక్కి తీసుకోవడం వల్ల శిక్ష పడే రేటు కేవలం 27 శాతం మాత్రమే ఉంటోంది.
దిల్లీకి చెందిన క్రిమినల్ న్యాయవాది ష్రే షరావత్ కనీసం 60 అత్యాచార కేసుల్లో బాధితురాలు, నిందితులు రెండు వైపులా వాదించారు.
చాలా కేసుల్లో నిందితులు భాదితులను వివాహం చేసుకుని తర్వాత వదిలేశారని ఆయన చెప్పారు.
భారతదేశంలో అత్యాచార కేసుల్లో బాధితురాలిని పెళ్లి చేసుకుంటామని చేసే ప్రమాణాలు వివాదాస్పదం అయ్యాయని ఆయన అంటారు.
"ఒక మహిళ కోర్టులో అత్యాచార కేసు నమోదు చేసినప్పుడు, దానిని కోర్టులో నిరూపించడం చాలా కష్టం. ఇలాంటి పెళ్లిళ్లు నిలబడవు. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి కేసు నుంచి తప్పించుకోడానికి అలా చెప్పి, పెళ్లి చేసుకున్న వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Gopal Shoonya
2015లో ఆయన ఒక అత్యాచార బాధితురాలి కేసును వాదించారు.
"గీత (పేరు మార్చాం) నేను మళ్లీ కోర్టుకు వెళ్ళలేదు, చాలా అవమానకరంగా అనిపించింది" అని చెప్పారు.
డిసెంబరు 2014లో ఆమె మ్యాట్రిమోనియల్ వెబ్‌సైటులో ఒక వ్యక్తిని కలిశారు. ఆమెకు అప్పుడు 30 ఏళ్లు.
పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి అతడు ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమె కేసు పెట్టడంతో, నిందితుడు వివాహం చేసుకుంటానని కోర్టులో చెప్పాడు.
దాంతో బాధితురాలు తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. కానీ, ఆయనకు అంతకు ముందే పెళ్లైంది. కొన్ని నెలల తర్వాత ఆయన ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
"నా పెళ్ళికి చట్టబద్ధత లేదు. నేనిప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకున్నాను. కానీ, అత్యాచారానికి గురైన మహిళలు తమ గళం వినిపించాలని కోరుకుంటున్నాను" అని గీత అన్నారు.

ఫొటో సోర్స్, Kashif Siddiqui
భారతదేశంలో రెండు రకాల అత్యాచార కేసులు ఉంటాయి. ఒకటి బలవంతంగా చేసే లైంగిక దాడి , రెండోది పెళ్లి చేసుకుంటామనే ఆశ పెట్టి పాల్గొనే లైంగిక కలయిక.
"అందుకే, అత్యాచార కేసుల్లో శిక్షలు పడే శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఒక మహిళ కోర్టుకు వెళ్లడం కష్టం" అని షెకావత్ అంటారు.
"ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆ మహిళ ఆధారాలను సేకరించే పరిస్థితిలో ఉండదు. పరిశోధనా సంస్థలు కూడా సరిగ్గా పని చేయవు" అని ఆయన చెప్పారు.
అత్యాచార కేసుల్లో చాలా వరకు అవివాహిత లైంగిక సంబంధాల్లో ఉన్న మైనర్ బాలికల విషయంలో వాళ్ళ తల్లి తండ్రులు వేసే దొంగ కేసులు ఉంటాయని ఆయన చెప్పారు. కొన్నిటిలో పెళ్లి చేసుకుంటామని లైంగిక సంబంధాలు పెట్టుకునే వారు ఉంటారని షెరావత్ చెప్పారు.
"అయితే, నిందితులకు పెళ్లి చేసుకోమని కోర్టులు, పోలీసులు ఇచ్చిన సలహాలు లిఖిత పూర్వకంగా ఉండవు. అలా జరిగిన వివాహాలను కోర్టు పర్యవేక్షించదు. కేసులు కొట్టివేయడంతో మహిళలు తమ బాధలు తామే పడాలి" అని ఆయన అన్నారు.
"నిధి తన బిడ్డతో ఆనందంగా ఉన్నట్లు చెప్పారు.
"నేను ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయన అంతా బాగానే ఉంది అనేట్లుగా చూపేందుకు ప్రయత్నించారు కానీ, అలా అయితే లేదు. అలా, ఎందుకు చేశారా అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూ ఉంటాను. కొన్ని రోజుల పాటు మా మధ్య బంధం ఉండటం వల్ల ఆయన అలా ప్రవర్తించి ఉండవచ్చు. తిరిగి నేనున్న పరిస్థితిలోకి వెళ్లాలని నేను అనుకోవడం లేదు" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








