సుప్రీంకోర్టు: బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటేనే బెయిలు.. లేదంటే జైలే - అత్యాచారం నిందితుడి విషయంలో వ్యాఖ్య

బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా అని సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI

ఫొటో క్యాప్షన్, బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా అని సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది.

సుప్రీంకోర్టులో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటే బెయిల్‌ దొరుకుతుందని, లేదంటే జైలుకెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

మహారాష్ట్ర ఎలక్ట్రిక్‌ ప్రొడక్షన్‌ కంపెనీలో టెక్నీషియన్‌గా పని చేస్తున్న మోహిత్ సుభాష్‌ చవాన్‌ పెళ్లి చేసుకుంటానంటూ తన వెంటపడ్డారని, అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మైనర్‌ విద్యార్ధిని ఆయనపై కేసు పెట్టారు.

పోక్సో చట్టం కింద చవాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి సెషన్స్‌కోర్టు బెయిల్‌ ఇవ్వగా బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్ దాన్ని తోసిపుచ్చింది.

దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలివ్వాలంటూ నిందితుడు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

“బాధితురాలిని వివాహం చేసుకుంటానంటే మేం సహాయం చేయగలం. లేదంటే నీ ఉద్యోగం పోతుంది, జైలుకెళ్లాల్సి ఉంటుంది” అని విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే పిటిషనర్‌ తరఫు న్యాయవాదితో అన్నారు.

పెళ్లి చేసుకుంటానని వెంటపడి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, పెళ్లి చేసుకుంటానని వెంటపడి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు

అత్యాచారం చేసేటప్పుడు గుర్తుకు రాలేదా ?

దీనిపై నిందితుడి నిర్ణయం కనుక్కుని చెబుతామని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

“ఒక మైనర్‌ అమ్మాయిని అత్యాచారం చేసే ముందు ఇవన్నీ ఆలోచించాల్సింది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం మీకు అప్పుడు గుర్తుకు రాలేదా” అని న్యాయమూర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉద్దేశించి ప్రశ్నించారు.

“పెళ్లి చేసుకొమ్మని మేం బలవంతం చేయడం లేదు. మీకు ఇష్టమైతే చెప్పమంటున్నాం. లేదంటే పెళ్లి చేసుకోవాల్సిందిగా మేం ఒత్తిడి చేశామని మీరు అనొచ్చు” అన్నారు న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది.

అత్యాచారం ఆరోపణలతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె తల్లి తనను కోరారని, కానీ ఆమె అప్పుడు అంగీకరించలేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. తాను ఇప్పటికే పెళ్లి చేసుకున్నందున ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోలేనని నిందితుడు కోర్టుకు తెలిపారు.

తాను ప్రభుత్వ ఉద్యోగినని, అరెస్టు చేస్తే తన ఉద్యోగం పోతుందని నిందితుడు కోర్టుకు తెలిపారు. తనపై ఇంకా అభియోగాలు కూడా మోపలేదని నిందితుడు కోర్టుకు తెలిపారని ఎన్డీటీవీ తెలిపింది.

నిందితుడి వాదన విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నాలుగు వారాలపాటు అరెస్టు నుంచి మినహాయింపునిచ్చింది. ఈలోగా రెగ్యులర్‌ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)