నిర్భయ కేసు దోషుల ఉరితీత మహిళలకు ఇస్తున్న సందేశమేంటి?

- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరి శిక్ష అమలు చేశారు.
2012 డిసెంబర్‌లో 23 ఏళ్ల యువతిపై జరిగిన ఆ అత్యంత దారుణమైన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా పతాక శీర్షికల్లో నిలిచింది. దోషులను కఠినంగా శిక్షించాలంటూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
ఆ పరిణామాలతో అత్యాచార కేసుల్లో దోషులకు అత్యంత కఠినమైన శిక్షలు విధించేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై తీవ్రంగా పెరిగింది.
అప్పటి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ కేసులో దోషులకు మరణ శిక్ష పడాల్సిందేనని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ఆ దోషులకు మార్చి 20న ఉరి శిక్ష అమలు చేశారు.
ఆ పాశవిక నేరంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నా, దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా, దోషులు కోర్టుల్లో పదేపదే పిటిషన్లు వేయడంతో విచారణ పూర్తయ్యేందుకు ఏడేళ్లకు పైగా పట్టింది.
దోషులకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బాధితురాలి కుటుంబం స్వాగతించింది.

ఫొటో సోర్స్, Getty Images
తాజా వార్తతో బాధితురాలి తల్లి ఆశా దేవి మనసు కాస్త కుదుటపడవచ్చు. కానీ, ఈ ఉరి శిక్ష అమలుతో దేశంలో సురక్షితంగా ఉన్నామన్న భరోసా మహిళలకు వచ్చిందా? అంటే లేదనే చెప్పాలి.
ఎందుకంటే, 2012 డిసెంబర్ తర్వాత కూడా దేశంలో మహిళలపై నేరాలు చాలా పెరిగాయి. నిర్భయ తరహా ఘటనలు పతాక శీర్షికల్లో నిలిచాయి.
అధికారిక గణాంకాల ప్రకారం, ఏటా వేల సంఖ్యలో అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇటీవల ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2018లో పోలీసులు 33,977 అత్యాచార కేసులను నమోదు చేశారు. అంటే రోజూ సగటున 93 కేసులన్నమాట.
వాస్తవానికి ఈ గణాంకాలలో వెల్లడయ్యే కేసుల సంఖ్య తక్కువే ఉంటుంది. ఏటా కొన్ని వేల మంది బాధితులు అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదని ఉద్యమకారులు అంటున్నారు.

విషయం బయటపడితే తమ పరువు పోతుందనో, నలుగురిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో కొందరు బాధితులు ధైర్యంగా బయటకు రావడంలేదు.
అయినా, రోజూ అనేక భయంకరమైన ఘటనల గురించి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. బాధితుల్లో ఏడాది కూడా నిండని పసిపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అందరూ ఉంటున్నారు. పేద, ధనిక, కులం, మతం అన్న తేడా లేదు. గ్రామాలు, పట్టణాల్లో అంతటా నేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మహిళలకు ఎక్కడా భద్రత లేదని అనిపిస్తుంది.
ఇంట్లో, క్రీడా మైదానాల్లో, పాఠశాలల్లో, వీధుల్లో... అన్ని చోట్లా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
2019 నవంబర్‌లో హైదరాబాద్ శివారులో జరిగిన దిశ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది.
ఆ తర్వాత కొన్ని రోజులకే, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో తనపై అత్యాచారం జరిగిందంటూ సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న ఒక మహిళకు నిందుతులు నిప్పంటించారు. ఆమె 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మూడు రోజుల తరువాత ఆసుపత్రిలో మరణించారు.

అదే ఉన్నావ్ జిల్లాలోనే 2019 జూలైలో జరిగిన కారు ప్రమాదంలో అధికార పార్టీ శాసనసభ్యుడు నిందితుడిగా ఉన్న అత్యాచార కేసు బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ఇద్దరు దగ్గరి బంధువులు మరణించారు, ఆమె తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.
అంతకుముందు నెలల తరబడి పోలీసులు తన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టినందుకు తన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి వేధించారని కూడా బాధితురాలు అన్నారు.
తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెప్పడం, ఆ కేసు గురించి జాతీయ స్థాయి మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు.
డిసెంబర్‌లో ఆ ఎమ్మెల్యును దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది.

ఈ కేసులన్నీ అహంకారం, క్రూరత్వంతో కూడినవి. ఇవి మహిళల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
దోషులకు కఠినమైన శిక్షలు విధించి, వాటిని త్వరితగతిన అమలు చేస్తే ప్రజల్లో భయం పెరుగుతుందని, అప్పుడు అత్యాచారాలు తగ్గుతాయని కొందరు అంటున్నారు. కానీ, పితృస్వామ్య ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని నిపుణులు అంటున్నారు. మహిళలను తమ ఆస్తిగా చూసే భావనను దూరం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
భారత్‌ను మహిళలకు సురక్షితమైన దేశంగా మార్చడంలో కుటుంబం, విస్తృత సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు అందరూ బాధ్యత తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా చూడాలి. అప్పుడు మగ పిల్లలు చెడుదారి పట్టకుండా ఉంటారు.
ఈ ఏడాది ఆరంభంలో, మహిళలను గౌరవించడం పట్ల అబ్బాయిలకు అవగాహన కల్పిందుకు పాఠశాలల్లో లింగ సమానత్వ గురించి కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రభుత్వం తెలిపింది. చిన్న తనంలోనే ఈ విషయాలు బోధిస్తే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నది ఆలోచన.
ఇది ఖచ్చితంగా ఉపయోడపడుతుంది. కానీ, ఇలాంటి ముఖ్యమైన ఆలోచనలతో సమస్య ఏంటంటే, వాటిని అమలు చేయడానికి, ఫలితాలు కనిపించడానికి ఎక్కువ కాలం పడుతుంది.
అది జరిగేదాకా, దేశంలోని మహిళలు, బాలికల భద్రతకు ఎలా భరోసా కల్పిస్తారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత చట్టం ప్రకారం, దిల్లీ సామూహిక అత్యాచార బాధితురాలి పేరును బయటపెట్టకూడదు కాబట్టి పత్రికలు ఆమెను నిర్భయ అని పిలిచాయి. నిర్భయ అంటే 'భయపడని వ్యక్తి' అని అర్థం. కానీ, దేశంలో చాలా మంది మహిళలు 'నిర్భయం'గా లేరు.
చాలామంది "బయటికి వెళ్ళేటప్పుడు నిరాడంబరంగా దుస్తులు ధరిస్తాం. రాత్రి పొద్దుపోయే దాకా బయట ఉండము. ఇంటి తలుపులకు తాళం వేసి ఉంచుతాం. కిటికీలను మూసి ఉంచుతాం" అని చెబుతున్నారు.
ప్రయాణాల్లో మార్గం మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఎవరిని ఆశ్రయించాలన్నా భయం.
రెండేళ్ల క్రితం ఓ రోజు రాత్రి నేనొక్కదాన్నే కారులో ఇంటికి వెళ్తుంటే మధ్యలో టైరు పగిలిపోయింది. అయినా మధ్యలో ఎక్కడా ఆగలేదు. అలాగే, నాకు తెలిసిన మెకానిక్ ఉండే పెట్రోల్ బంకు దాకా వెళ్లాను.
అప్పటికి, నా కారు టైర్ ముక్కలు ముక్కలైంది. మరుసటి రోజు, కొత్త టైర్ కొనాల్సి వచ్చింది, కానీ ఆ రాత్రి నేను సురక్షితంగా బయటపడగలిగాను.
ఇవి కూడా చదవండి:
- ఉన్నావ్ రేప్ కేసు: 'ఒక్కొక్కరినీ చంపుకుంటూ వస్తామన్నారు' -బీబీసీతో బాధితురాలి సోదరి
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మేలెంత?
- పిల్లలపై అత్యాచారం: ఉరిశిక్షతో న్యాయం లభిస్తుందా?
- జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?
- దిశ అత్యాచారం, హత్య: ‘ఆడదానిగా కాదు.. సాటి మనిషిగా, కొలీగ్‌గా గుర్తించండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








