హార్వే వైన్‌స్టీన్: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో 23 ఏళ్ల జైలుశిక్ష విధించిన న్యూయార్క్ కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ దర్శకుడు హార్వే వైన్‌స్టీన్‌కు 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యూయార్క్ కోర్టు తీర్పునిచ్చింది.
గత నెల 25న న్యూయార్క్ కోర్టు 67ఏళ్ల వైన్‌స్టీన్‌ను దోషిగా తేల్చింది. ఇది #MeToo ఉద్యమ విజయంగా బాధిత మహిళలు భావిస్తున్నారు.
అయితే ఆయనపై ఉన్న ఫస్ట్ డిగ్రీ రేప్ లాంటి తీవ్ర నేరాలు రుజువుకాలేదు.


వైన్‌స్టీన్ కోర్టుకు వీల్ చైర్‌లో హాజరయ్యారు. ఆయన తరపు లాయర్లు తక్కువ శిక్ష విధించాలని కోర్టుకు విన్నవించారు.
కనీస శిక్ష 5 ఏళ్లు విధించినా అది ఆయనకు జీవితఖైదు లాంటిదేనని వారు వాదించారు.
ఇంకా, 2013లో లాస్ ఏంజెలిస్‌లో ఇద్దరు మహిళలను వేధించిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైన్‌స్టీన్ తమపై కొన్నేళ్ల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దాదాపు 80 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వీరిలో ప్రముఖ నటి ఏంజెలినా జోలీ, గ్వెనెత్ పాల్ట్రో, ఉమా తుర్మన్, సల్మా హయెక్ కూడా ఉన్నారు.
ఈ ఘటనలు తాము హాలీవుడ్‌లో ప్రవేశించిన మొదటి రోజుల్లో జరిగాయని జోలీ, పల్ట్రో అన్నారు.
ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి ఊపిరిపోశాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరెంతోమంది మహిళలు తమపై జరిగిన అనుచిత, అసభ్య ప్రవర్తనల వివరాలను ధైర్యంగా బయటపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 25న న్యూయార్క్ కోర్టులో ఏం జరిగింది?
ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న జ్యూరీ ఐదురోజుల చర్చల తర్వాత ఫిబ్రవరి 25న ఉదయం తమ తీర్పును వెల్లడించింది.
తనపై వచ్చిన అన్ని ఆరోపణలనూ ఇంతవరకూ తోసిపుచ్చుతూ వచ్చిన వైన్‌స్టీన్‌ను తన మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హలేయీపై 2006లో వేధింపులు, మాజీ నటి జెస్సికా మాన్‌పై 2013లో అత్యాచారం కేసుల్లో జ్యూరీ దోషిగా తేల్చింది. ఆయనను వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు.
కానీ, మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
తీర్పు అనంతరం వైన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు.
17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో మొదటి డిగ్రీ రేప్ అంటారు. అంటే ఈ నేరాల్లో బాధితురాలు 'అంగీకారం' తెలపగలిగే వయసులో ఉండరు.
తన పలుకుబడిని ఉపయోగించుకుని వైన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది.
అయితే, ఆరోపణలు చేసినవారితో జరిగిన సెక్స్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ 'సంబంధాన్ని' వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్ అని చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తనపై వైన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడ్డారని చెబుతున్న తేదీల తర్వాత కూడా ఆ మహిళలు ఆయనతో సంబంధాలు కొనసాగించారనే విషయాన్ని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం జరిగింది?
వైన్‌స్టీన్‌పై అత్యాచార ఆరోపణలు అక్టోబర్ 2017లో వెలుగుచూశాయి. దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘటనల గురించి న్యూయార్క్ టైమ్స్ తొలిసారిగా ప్రచురించింది.
దీంతో, వైన్‌స్టీన్, తాను ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ తనపై ఆరోపణలను ఖండించారు.
ఆ తర్వాత మరింతమంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను కంపెనీ బోర్డు నుంచి తొలగించారు.
2017లో నేర విచారణ ప్రారంభమైంది. కానీ మే 2018 వరకూ ఆయనపై అభియోగాలు నమోదు కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాతేం జరగొచ్చు?
పోరాటం ఇంకా పూర్తి కాలేదని వైన్‌స్టీన్‌ను దోషిగా తేల్చిన తర్వాత కోర్టు బయట ఉన్న మీడియాతో వైన్‌స్టీన్ లాయర్ రోటునో వ్యాఖ్యానించారు. హార్వే చాలా శక్తిమంతుడు, ఆయన కోసం మేం పోరాటం కొనసాగిస్తామని ఆయనకు కూడా తెలుసు అని ఆమె ఫిబ్రవరి 25న అన్నారు.
తీర్పుపై వైన్‌స్టీన్ అసంతృప్తికి లోనైనా మానసికంగా ధృడంగా ఉన్నారని ఆమె తెలిపారు.
ఈ తీర్పుపై తాము అపీల్ చేస్తామని ఆమె తెలిపారు.
వైన్‌స్టీన్‌పై ఉన్న లాస్ ఏంజెలిస్‌లో అత్యాచార ఆరోపణల కేసు, ఇతర కేసుల విచారణ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి.
- హార్వే వైన్‌స్టీన్: 'నాపై ఉన్న రేప్ కేసును కొట్టేయండి'
- ఏంజెలినా, లూసియా, కారా - ఒక్కొక్కరిది ఒక్కో కథ
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- ట్రంప్ భారత పర్యటనతో అమెరికా-ఇండియా ట్రేడ్ వార్ సమసిపోతుందా?
- భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు పోగొట్టుకున్నారు
- పంటలను నాశనం చేస్తున్న మిడతలతో ఆకలి తీర్చుకుంటున్న యుగాండా ప్రజలు
- దేవుడికే లక్షలు దానం చేస్తున్న బిచ్చగాడు
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









