హార్వే వైన్‌స్టీన్: 'నాపై ఉన్న రేప్ కేసును కొట్టేయండి'

ఫొటో సోర్స్, APF/ GETTY IMAGES
తనపై ఉన్న అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులను కొట్టివేయాలంటూ హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ కోర్టును ఆశ్రయించారు.
వైన్‌స్టీన్ తనపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు చేసిన ఓ మహిళకు, వైన్‌స్టీన్‌కు మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణల తీరు పరిశీలిస్తే.. ఆమెతో వైన్‌స్టీన్ బలవంతంగా సెక్సు చేసినట్టు అనిపించడంలేదని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
2017లో హార్వే వైన్‌స్టీన్‌పై పలువురు మహిళలు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేశారు.
2013 మార్చి 18న న్యూయార్క్ సిటీ హోటల్‌లో వైన్‌స్టీన్ తనను నిర్బంధించి 'బలవంతంగా సెక్సు' చేశారంటూ ఓ అజ్ఞాత మహిళ ఆరోపించారు.
అయితే.. ఆ తర్వాత కూడా నాలుగేళ్లపాటు ఆ ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణలు నడిచాయని వైన్‌స్టీన్ తరఫు న్యాయవాదులు అంటున్నారు.
వారు చెబుతున్న దాని ప్రకారం.. "త్వరలోనే మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను" అంటూ 2013 ఏప్రిల్ 11న ఆ మహిళ వైన్‌స్టీన్‌కి మెయిల్ పంపారు. "మీరు నా కోసం చేస్తున్నవన్నీ ఎంతో ప్రశంసనీయం" అంటూ మరుసటి రోజు మరో మెయిల్ పంపారు. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎల్లప్పుడూ ప్రేమిస్తాను" అంటూ 2017 ఫిబ్రవరి 8న ఆమె ఇంకో మెయిల్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"రేప్ జరిగినట్టు చెబుతున్న ఆ తేదీ తర్వాత ఆమె నుంచి వైన్‌స్టీన్‌కు డజన్ల కొద్దీ ఈమెయిళ్లు వచ్చాయి. నాలుగేళ్ల పాటు ఆమె వైన్‌స్టీన్‌కి అమితానందం, ప్రశంసలు, ఉత్సుకత వ్యక్తం చేస్తూ మెయిళ్లు పంపారు. ఈ సంభాషణలు వారి మధ్య ఉన్న సహజమైన సాన్నిహిత్యాన్ని సూచిస్తున్నాయి" అని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించిన అభ్యర్థన పత్రాల్లో వైన్‌స్టీన్ తరఫు న్యాయవాదులు వివరించారు.
"అలా అని.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రిలేషన్‌లో రేప్‌లు జరగవని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ.. ఈ కేసులో వైన్‌స్టీన్‌ను అపరాధిగా తేల్చిన ధర్మాసనానికి ప్రాసిక్యూటర్లు ఈ ఈమెయిళ్లను చూపించాల్సింది" అని ఆ న్యాయవాదులు అన్నారు.
2013 ఏప్రిల్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు వైన్‌స్టీన్‌కి, ఆ అజ్ఞాత ఫిర్యాదుదారుకు మధ్య జరిగిన దాదాపు 400 ఈమెయిల్ సంభాషణలలోని అంశాలను కోర్టుకు సమర్పించారు.
దీనిపై ఆ అజ్ఞాత మహిళ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరెవరు లైంగిక ఆరోపణలు చేశారు?
#MeToo ఉద్యమంలో భాగంగా 2017లో అనేక మంది హాలీవుడ్ నటీమణులు బయటకు వచ్చి వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీతో పాటు, రోస్ మెక్‌గోవాన్ లాంటివారు కూడా ఉన్నారు.
1996లో ఎమ్మా సినిమాలో ప్రధాన పాత్రధారి అవకాశం ఇచ్చిన తర్వాత, వైన్‌స్టీన్ అతని హోటల్ గదికి తనను పిలిచాడని అమెరికన్ నటి గ్వెనెత్ పాల్‌ట్రో న్యూయార్క్ టైమ్స్‌కి చెప్పారు.
1990ల్లో లండన్‌లోని ఒక హోటల్ గదిలో తనను కింద పడేసి అసభ్యంగా ప్రవర్తించాడని, తాను పెనుగులాడి పాకుతూ తప్పించుకోగలిగానని మరో నటి ఉమా తుర్మాన్ ఆరోపించారు. అయితే, ఆమె చెప్తున్న మాటలు ‘అవాస్తవం’ అని వైన్‌స్టీన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
1998లో 'ప్లేయింగ్ బై హార్ట్' విడుదల సందర్భంగా వైన్‌స్టీన్ ఒక హోటల్ గదిలో తనతో శృంగారానికి ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్‌తో ఏంజెలినా జోలి చెప్పారు.
ఆసియా అర్జెంటో, కారా డెలవీన్, హెథర్ గ్రాహమ్, జో బ్రోక్, లూసియా స్టోలర్, మీరా సార్వినో, లూయిసెట్ గైస్ కూడా హార్వేపై ఆరోపణలు చేసిన వారి జాబితాలో ఉన్నారు.
అయితే.. పరస్పర అంగీకారం లేకుండా తాను ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదని వైన్‌స్టీన్ చెబుతూ వచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








