దేవుడికే లక్షలు దానం చేస్తున్న బిచ్చగాడు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆలయాల ముందు బిచ్చమెత్తుకునే వారు చాలా చోట్ల ఉంటారు. కానీ బిచ్చమెత్తి ఆలయాలకు ఆదాయం సమకూరుస్తున్న యడ్ల యాదిరెడ్డి విజయవాడలో విశేష ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో యాదిరెడ్డి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఆ సమీపంలోని సాయిబాబా ఆలయం ముందు ఆయన కనిపిస్తారు. భక్తుల దగ్గర యాచన చేస్తూ ఉంటారు. గుడిలో పెట్టే అన్నదాన కార్యక్రమాల్లో తినడం, భక్తులు ఇచ్చిందే స్వీకరించడం ఆయనకి అలవాటు.
పెద్దగా ఖర్చులు లేకపోవడంతో భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ములో చాలా భాగం మిగులుతోందని యాదిరెడ్డి చెబుతున్నారు. దానినే ఆలయాల అవసరాలు తీర్చడానికి అందిస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు.

పుట్టింది నల్లగొండ జిల్లా...
యాదిరెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా చింతాబాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ రెండో తరగతి చదువుతూ బడి మానేశారు. బంధువుల ఇంట్లో సూటిపోటి మాటలు సహించలేక ఇంటి నుంచి పారిపోయారు.
1952లో విజయవాడ చేరుకున్న యాదిరెడ్డి మొదట్లో రైల్వే స్టేషన్‌లోనే ఉండేవాడినని బీబీసీతో చెప్పారు.
''రైల్వే స్టేషన్లో ఉంటూ, హోటళ్లలో పనిచేస్తూ గడిపాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఆంధ్రప్రభ పత్రికను వేసేవాడిని. అప్పుడే రోజూ పేపర్ చదవడం అలవాటు అయ్యింది. ఇప్పటికీ రోజూ పేపర్ చదవకుండా నాకు పూట గడవదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు రిక్షా నడిపేవాడిని. కానీ వయసు మీద పడడంతో కాళ్ల నొప్పులతో రిక్షా తొక్కలేని పరిస్థితి వచ్చింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయాల దగ్గర భిక్షాటన మొదలుపెట్టాను'' అని వివరించారు.

ఆలయాలకు దానం చేయడం ఎలా అలవాటైందంటే...
యాదిరెడ్డి పెళ్లి చేసుకోలేదు. ముత్యాలంపాడు సాయి ఆలయానికి సమీపంలోని ఓ ఇంట్లో ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు. ఒంటరిగా నివసిస్తున్నారు. ఉదయాన్నే లేచి భిక్షాటనకు బయలుదేరుతారు. దానికి ముందే మూడు పత్రికలు కొనుక్కుని మరీ చదవడం అలవాటు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాయిబాబా గుడి, రామాలయం వంటి చోట్ల యాచన సాగిస్తారు. ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నదానాల్లో భోజనం చేస్తూ కాలం గడుపుతారు.

ఈ క్రమంలో యాదిరెడ్డి ఒకసారి అనారోగ్యం పాలయ్యారు. అప్పటికే ఆయన దగ్గర భిక్షాటన ద్వారా పోగేసిన రూ. 1.20 లక్షలు ఉన్నాయి.
''అప్పట్లో నాకు ఆరోగ్యం బాగోలేదు. దాంతో ఇక నేను చేసేది ఏముందని భావించి నా దగ్గర ఉన్నదంతా సాయిబాబా ఆలయానికి ఇచ్చాను. అయితే ఆ తర్వాత మళ్లీ నాకు ఆరోగ్యం కుదుట పడింది. దాంతో మళ్లీ గుడికి వెళ్లడం, భక్తులు ఇచ్చింది స్వీకరించడం అలవాటుగా మారింది. కొన్నాళ్లకు పోగుపడిన డబ్బులు సాయిబాబా గుడికి గానీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి గానీ, అజిత్‌సింగ్ నగర్‌లోనే ఉన్న రామాలయానికి గానీ అందిస్తూ జీవనం గడుపుతున్నాను'' అని ఆయన వివరించారు.
ఇప్పటివరకూ తనకు వచ్చిన భిక్షంలో ఖర్చులు పోను మిగిలినదంతా మళ్లీ ఇచ్చేయడమే తప్ప తన దగ్గర దాచుకున్నది లేదని యాదిరెడ్డి చెప్పారు.

''యాదిరెడ్డికి ఇస్తే నేరుగా దేవుడికే ఇచ్చినట్టు భావిస్తాం''
యాదిరెడ్డి తన దగ్గర పోగుబడిన డబ్బును నిస్వార్థంగా మళ్లీ ఆలయాలకే ఇస్తుండడం అందరినీ ఆకట్టుకుంటోంది. దాంతో ఆయనకు ఇచ్చిన ప్రతి రూపాయి మళ్లీ సద్వినియోగం అవుతుందని భక్తులు భావిస్తున్నారు. ఆలయానికి వచ్చేవారు చాలా మంది హుండీలో వేయడం కన్నా యాదిరెడ్డికి ఇవ్వడం ద్వారానే నేరుగా దేవుడికి చెల్లించినట్టవుతుందని నమ్ముతున్నారు.

స్థానిక భక్తురాలు శైలజ బీబీసీతో మాట్లాడుతూ.. ''యాదిరెడ్డిని పాతికేళ్ల నుంచి చూస్తున్నాను. ఆయన మాకు బాబాలా కనిపిస్తారు. నిత్యం దేవుడి మందిరంలోనే గడుపుతారు. ఏమి ఇచ్చినా తీసుకుంటారు. మేము ఇచ్చినదంతా మళ్లీ ఆలయానికే అందిస్తారు'' అని చెప్పారు.

యాదిరెడ్డి ఏ ఆలయానికి ఎంత ఇచ్చారంటే..
ఆలయాలకు అందించిన విరాళాల గురించి తన దగ్గర పూర్తి వివరాలు లేవంటారు యాదిరెడ్డి. తనకు గుర్తున్నంత వరకూ చెప్పమంటే ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి:
- తొలుత సాయిబాబా మందిరానికి యాదిరెడ్డి రూ.1.20 లక్షలు అందించారు.
- మరోసారి అదే గుడిలో నిత్యాన్నదానానికి రూ. 1.08 లక్షలు అందించారు.
- దత్తాత్రేయుడి గుడిలో వెండి కవచం కోసం రూ. 50 వేలు ఇచ్చారు.
- సీతారాములకు రూ. లక్షన్నర రూపాయలతో కిరీటాలు, ఆభరణాలు కూడా చేయించారు
- కనకదుర్గ ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి రూ. 1.50 లక్షలు అందించారు.

''పది లక్షల రూపాయల వరకూ దానం చేశారు''
యాదిరెడ్డి పెద్ద మనసుతో అందిస్తున్న విరాళాలు స్ఫూర్తిదాయకమని సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రతినిధి పి.గౌతమ్‌రెడ్డి బీబీసీతో పేర్కొన్నారు.
''యాదిరెడ్డి ఇప్పటి వరకూ ఆలయాలకు ఇచ్చింది పది లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో విరాళాలు అందిస్తూ అందరిలోనూ సమాజానికి ఉపయోగపడే పనిచేయాలనే ఆలోచన కలిగిస్తున్నారు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్!
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- చనిపోయిన కూతుర్ని వర్చువల్ రియాలిటీతో 'కలుసుకున్న' అమ్మ
- "మా అమ్మను ఎందుకు చంపారు... ఎంతోకాలంగా వాళ్లను అడగాలనుకున్న ప్రశ్న ఇది"
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









