వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వొడాఫోన్- ఐడియా ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మొత్తంలో సోమవారం రూ.2,500 కోట్లు, శుక్రవారం నాటికి 1,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఈ సంస్థ కోర్టుకు చెప్పింది.
కోర్టు తమకు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోకుండా ఉండాలని కూడా ఆ సంస్థ తన పిటిషన్‌లో కోరింది.
వొడాఫోన్- ఐడియా తరఫున అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వినిపించిన వాదనలను సోమవారం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
అంతకు ముందు, వొడాఫోన్ ఐడియాకు ఎలాంటి ఉపశమనాన్ని కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కంపెనీ చెల్లించే ఈ మొత్తం ప్రభుత్వ ఆదాయంలో అదనపు ఆదాయంగా నమోదు అవుతున్నప్పటికీ, దీనివల్ల దేశంలోని మొత్తం టెలికాం పరిశ్రమ భారీ షాక్‌కు గురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారీ టెలీకాం రంగం
భారత్‌ను ప్రపంచంలోని అతిపెద్ద టెలీకాం మార్కెట్లలో ఒకటిగా భావిస్తారు. కానీ, ఇక్కడి ప్రధాన పోటీదారుల్లో ఒకటైన వొడాఫోన్- ఐడియా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది.
టెలీకాం కంపెనీలు ప్రభుత్వానికి మొత్తం 13 బిలియన్ డాలర్లు చెల్లించాలి. దానికి సుప్రీంకోర్టు మార్చి 17 వరకూ గడువు ఇచ్చింది.
గడువులోపు డబ్బు చెల్లించకుంటే, మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని కోర్టు టెలీకాం కంపెనీలను ప్రశ్నించింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు టెలీకాం కంపెనీలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోని పెద్ద టెలీకాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్-ఐడియాను కోర్టు తీర్పు కష్టాల్లో కూరుకుపోయేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వొడాఫోన్ ఐడియా నష్టాలు
వొడాఫోన్ ఐడియా గత త్రైమాసికంలో 6,453 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఆ నష్టం రూ.4,998 కోట్లు ఉంది.
ప్రభుత్వం లేదా కోర్టు సాయం లభించకపోతే, తమ వ్యాపారాన్ని మూసివేయాల్సి ఉంటుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా అధికారికంగా వ్యాఖ్యానించడాన్ని బట్టి కూడా పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.
కాల్, డేటా రేట్లు పడిపోయి, అప్పుల భారం పెరుగుతున్న సమయంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడానికి గడువు ఇవ్వాలని కోరుతున్నాయి.
కోర్టు మార్చి 17 వరకూ గడువు ఇవ్వడం, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో భారత్‌లో వొడాఫోన్ వ్యాపారం అంతానికి ఇది ప్రారంభమా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
బ్రిటన్ కంపెనీ వొడాఫోన్ భారత టెలీకాం మార్కెట్‌లో అతిపెద్దది, అత్యంత పాత కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ భారత్‌లో తమ వ్యాపారం నిలిపివేస్తే, ఈ ప్రభావం అసాధారణంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సంస్థకు 30 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వొడాఫోన్ వేలమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది.
దీనితోపాటు ఈ కంపెనీకి తాళం వేయడం వల్ల మొత్తం టెలీకాం మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీకి తాళం పడితే...
వొడాఫోన్ ఐడియా భారత మార్కెట్‌లో తమ వ్యాపారానికి తెరదించాలని అనుకుంటే, తర్వాత టెలీకాం రంగంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఉంటాయి. అవి రిలయన్స్, ఎయిర్‌టెల్.
భారతీ ఎయిర్‌టెల్ పరిస్థితి కూడా అంత ఘనంగా ఏమీ లేదు. గత త్రైమాసికంలో ఆ సంస్థ 3 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదు చేసింది. అది కూడా ప్రభుత్వానికి సుమారు 5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది.
టెలీకాం మార్కెట్‌లో కొత్త ఆటగాడిగా అడుగుపెట్టిన రిలయన్స్ జియోకు ఇది ఫీల్‌గుడ్ లాంటి పరిస్థితి. టెలీకాం మార్కెట్‌లో మారుతున్న ఈ పరిస్థితికి కారణం జియోనే అని చాలామంది భావిస్తున్నారు.
మూడేళ్ల క్రితం జియో టెలీకాం మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే మొబైల్ ఇంటర్నెట్ రేట్లను భారీగా తగ్గించింది. దానితోపాటు భారత్‌ను ప్రపంచంలో అత్యంత చౌక ధరలకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న దేశంగా మార్చేసింది. ఆ దెబ్బతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ బిజినెస్ మోడల్ ఛిద్రమైంది.
తర్వాత రోజుల్లో ఈ రెండు కంపెనీలకు లక్షల మంది వినియోగదారులు దూరమయ్యారు. రెండు కంపెనీలకు కలిపి నష్టాలు 10 బిలియన్ డాలర్లకు పైనే ఉన్నాయి. ఇప్పుడు అవి మరో నెలలోపు ప్రభుత్వానికి భారీ మొత్తం చెల్లించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయోజనం ఎవరికి?
2019 నాటికి రిలయన్స్ జియో దగ్గర 35 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వొడాఫోన్ ఐడియాకు తాళాలు పడితే, దానివల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది జియోనే అని భావిస్తున్నారు.
2022 నాటికి జియో తన లాభాలను రెట్టింపు చేస్తుందని, అప్పటికి ఆ కంపెనీ వినియోగదారుల సంఖ్య కూడా 50 కోట్లకు చేరుకుంటుందని టెలీకాం మార్కెట్ నిపుణుల అంచనా.
కానీ, డబ్బు పట్ల సున్నితంగా వ్యవహరించే భారత వినియోగదారులకు ఇది ఎంత ప్రయోజనం?
ఇది అంత శుభవార్త కాదు. భారీ నష్టాల వల్లే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ రేట్లను పెంచాయి.
"ధరలను పెంచడం అనేది అంత తప్పేమీ కాదు. నిజానికి అది మంచిదే. ఎందుకంటే మార్కెట్‌లో పోటీ నిలిచి ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం అదే. భారత్‌లో టెలీకాం మార్కెట్‌ను కాపాడేందుకు, అది సుభిక్షంగా ఉండడానికి అలా జరగడం చాలా అవసరం" అని ఆర్థికవేత్త వివేక్ కౌల్ భావిస్తున్నారు.
కానీ, అలా జరిగితే దీనివల్ల భారత్‌లోని భారీ టెలీకాం మార్కెట్ వృద్ధిలో మందగమనం వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంకా వేచిచూడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పోరాటం దేనికోసం?
టెలీకాం కంపెనీలు, భారత ప్రభుత్వం మధ్య 'అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ' గురించి సుదీర్ఘంగా వివాదాలు నడుస్తున్నాయి.
మామూలుగా చెప్పుకోవాలంటే టెలీకాం కంపెనీలు ఎంత డబ్బు సంపాదిస్తాయో, అందులో ఒక భాగాన్ని అవి టెలీకాం విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది. దానినే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ లేదా ఏజీఆర్ అంటారు.
అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ నిర్వచనంపై ప్రభుత్వం, టెలీకాం కంపెనీల మధ్య 2005 నుంచే అభిప్రాయ బేధాలు ఉన్నాయి.
టెలీకాం బిజినెస్ వల్ల వచ్చే లాభాల నుంచే దానిని తీసుకోవాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం దానిని విస్తృత పరిధిలో చూస్తోంది.
టెలికాం బిజినెస్ కాకుండా, వాటి ఆస్తుల అమ్మకాలు, డిపాజిట్ల నుంచి లభించే వడ్డీ లాంటి మిగతా ఆదాయం కూడా ఇందులో లెక్కించాలని ప్రభుత్వం చెబుతోంది.
కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వ పక్షాన తీర్పు వినిపించింది. అంటే... టెలీకాం కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 12.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని అర్థం.

ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్‌టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- జైపూర్‌లో బాసిత్ ఖాన్ హత్యకు కారణమేంటి... కశ్మీరీలపై ద్వేషంతోనే కొట్టి చంపారా?
- జింకల వేటకు పెంపుడు చిరుతలు... క్రూర మృగాలనే మచ్చిక చేసుకున్న కొల్హాపూర్ వాసులు
- పెర్ఫ్యూమ్తో పెద్దపులి వేట: మనిషి రక్తం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు చివరి అస్త్రం
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- షహీన్‌బాగ్: ‘దిల్లీ కాలుష్యంలో ఆశల గాలి పీల్చాలంటే ఇక్కడకు రావాల్సిందే’ - అభిప్రాయం
- కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలను వదులుకుంటున్న యువకులు
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









