కోనసీమలో కలకలం రేపిన బ్లో అవుట్, మూడోరోజు అదుపు చేసిన ఓఎన్జీసీ

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
కోనసీమలో మరోసారి ఆయిల్ బావి నుంచి గ్యాస్ లీకై, కలకలం రేపిన బ్లో అవుట్ మూడోరోజు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి సమీపంలో బ్లో అవుట్ కావడంతో ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.
ప్రమాద సమాచారం అందుకుని నియంత్రణకు రంగంలో దిగిన యంత్రాంగం చేసిన ప్రయత్నాలు మొదటి రెండు రోజులు ఫలించ లేదు. ఓఎన్జీసీ నిపుణులు రంగంలో దిగినా ఫలితాలు రాలేదు.




ప్రమాదం ఎలా జరిగింది.. నిపుణులు ఏమంటున్నారు
1984లో అమలాపురం సమీపంలోని భీమనపల్లి పరిసరాల్లో 15.1 చదరపు కిలోమీటర్ల పరిధిలో డ్రిల్లింగ్ కోసం ఓఎన్జీసీకి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఉప్పూడి గ్రామ సమీపంలోని బావిలో తవ్వకాలు జరిపిన అనంతరం సహజవాయువు పీడనం తగ్గిందనే కారణంతో ఈ ప్రాంతంలో అనేక బావులతో పాటు ఉప్పూడి-1 బావి కూడా ప్రైవేటుపరం చేశారు.
కోల్‌కతాకి చెందిన పీఎఫ్‌హెచ్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దీన్ని అప్పగించారు. 2016లో పీఎఫ్‌హెచ్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కొద్దికాలం అక్కడ ఎక్కడ కార్యకలాపాలు సాగించలేదు. చివరకు గత ఏడాది జనవరిలో గ్యాస్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు కోరుతూ సదరు కంపెనీ కేంద్రానికి దరఖాస్తు చేసంది.
తగిన జాగ్రత్తలు పాటించకుండా తవ్వకాలకు సిద్ధపడ్డారని అమలాపురం ఎస్‌కేబీఆర్ కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణ కిషోర్ అభిప్రాయపడుతున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "గ్యాస్, ఆయిల్ తవ్వకాలకు ముందుగా అనేక ప్రమాణాలు పాటించాలి. ముందుగా బురదని వెల్‌లోకి పంపించాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వ్యవహరించారు. అదే ప్రమాదానికి కారణం. బావులు దక్కించుకున్న కంపెనీకి తగిన సిబ్బంది, నైపుణ్యం కూడా లేవు. అందరూ జాగ్రత్తలు పాటించాలి" అని ఆయన సూచించారు.

సోమవారంనాడు ఫలించని ప్రయత్నాలు
గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు ఓఎన్జీసీకి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది కూడా ఉన్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు.
"సోమవారం నాడు అనుసరించిన ప్లాన్ ఏ ఫలించలేదు. ఎగిసిపడుతున్న గ్యాస్‌ను పైపుల ద్వారా తరలించే నీటి ఒత్తిడి సాయంతో అదుపు చేయాలని చూశారు. కానీ పరిస్థితులు సహకరించలేదు. దాంతో ప్లాన్ బీ ముందుకు తెస్తున్నారు. మంగళవారం ఉదయం మడ్‌ని ప్రయోగిస్తారు. 40వేల లీటర్ల మడ్ రెడీగా ఉంది. మరో 40వేల లీటర్లు వస్తుంది. భూమిలో 40, 50 మీటర్ల లోతు నుంచి వస్తున్న గ్యాస్‌ను మడ్‌ని పంపించడం ద్వారా అదుపు చేయాలని చూస్తున్నాం. అనుకున్నట్టుగా జరిగితే రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది" అని విశ్వరూప్ సోమవారం రాత్రి ధీమా వ్యక్తం చేశారు.

స్థానికుల ఆందోళన
ఇప్పటి వరకూ ఓఎన్జీసీ వాళ్లే డ్రిల్లింగ్ చేస్తున్నారని అంతా అనుకున్నామని, ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ప్రైవేటు కంపెనీ పేరు చెప్పడం ఏంటని స్థానికుడు ఎస్.వీరేంద్ర ప్రశ్నిస్తున్నారు.
"చాలా భయంభయంగా గడుపుతున్నాం. ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్నాం. ఇప్పటికే చుట్టూ కొబ్బరితోటలు నాశనం అయిపోతున్నాయి. పంట పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మేం సాధారణ రైతులం.. చాలా నష్టపోతున్నాం. అయినా ఓఎన్జీసీ బావులను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి డ్రిల్లింగ్ చేయిస్తే మాకు రక్షణ ఎక్కడ? ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ వాళ్లు వెళ్లిపోయారు. ఊరి జనం అంతా ఏం కావాలి? ఇలాంటి వాటికి పరిష్కారం చూపించి, మాకు భద్రత కల్పించాలి" అని వీరేంద్ర కోరుతున్నారు.
ప్రమాదం తర్వాత ఉప్పుడితో పాటు సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్థానికులందరినీ ఇళ్ల నుంచి పునరావాస శిబిరానికి తరలించారు. చెయ్యేరు హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో 450 మందికి పునరావాసం ఏర్పాటు చేశారు. స్థానికులను సమీప ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.

ఆందోళన అవసరం లేదు
బ్లో అవుట్ సమాచారం అందగానే అప్రమత్తమై, రంగంలోకి దిగామని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్ కుమార్ వెల్లడించారు.
"నర్సాపురం, తాటిపాక, రాజమండ్రి యూనిట్ల నుంచి సిబ్బంది వచ్చారు. నీరు అందుబాటులో లేకపోవడంతో మొదట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ప్రైవేట్ సంస్థకు అప్పగించిన రిగ్గులో ప్రమాదం జరిగింది. అయినా ఓఎన్జీసీ బాధ్యతగా వ్యవహరిస్తోంది. సిబ్బంది, యంత్రాలను తరలించాం. మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో స్థానికులను తరలించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి.
- "నాకు కరోనావైరస్ సోకలేదు.. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి"- చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యువతి
- భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని పెంచుతోంది: చైనా
- కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?
- బడ్జెట్ 2020: నిర్మలా సీతారామన్ పద్దు సామాన్యుడి ప్రశ్నలకు బదులిచ్చిందా?
- BBC Indian Sportswoman of the Year-2019: నామినీలు వీరే; 'భారత మహిళ క్రీడారంగంలో కొత్త చరిత్ర లిఖిస్తోంది' -రూపా ఝా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









