అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు చిత్రాల రికార్డులతో పబ్లిసిటీ వార్... కలెక్షన్ల ఫిగర్లకు బేస్ ఏంటి?

అల్లు అర్జున్, మహేశ్ బాబు

ఫొటో సోర్స్, geetha arts/ak entertainments

    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంక్రాంతికి తెలుగు నాట పందెం కోళ్లేమో గానీ, సినిమాలు మాత్రం గట్టిగానే తలపడ్డాయి.

ఒక్క రోజు తేడాతో రెండు 'పెద్ద' సినిమాలు విడుదలయ్యాయి. అవే 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు'.

మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. దర్శకుడు అనిల్ రావిపూడి.

Presentational grey line
News image
Presentational grey line

అల వైకుంఠపురములో సినిమాలో ప్రధాన పాత్రధారి అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో.. హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ రెండు చిత్రాల మధ్య విడుదల తేదీ విషయంలో మొదలైన పోటీ, కలెక్షన్ల లెక్కల్లోనూ కొనసాగుతోంది.

అల్లు అర్జున్

ఫొటో సోర్స్, Geetha Arts

బాహుబలి తర్వాత కలెక్షన్లలో రికార్డు తమదంటే తమదని 'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాల నిర్మాతలు పోటీపడి మరీ చెప్పుకున్నారు. ఎదుటిపక్షం చెప్పేవి కాకి లెక్కలని పరస్పరం పరోక్షంగా నిందించుకున్నారు కూడా.

సరిలేరు నీకెవ్వరూ నిర్మాతలు తమ చిత్రమే 'బ్లాక్ బస్టర్ కా బాప్' అని ప్రకటించుకుంటే, 'సంక్రాంతి విన్నర్' తమ సినిమానేని అల వైకుంఠపురములో నిర్మాతలు తేల్చేశారు.

వీరి పోటీ ఇంతటితో ఆగలేదు.

సరిలేరు నీకెవ్వరు

ఫొటో సోర్స్, AK Entertainments

తమవి 'రియల్' కలెక్షన్స్ అంటూ సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది.

దీనికి రియాక్షన్‌లా... 'మనం చేయనవి కూడా ఇంత స్ట్రాంగ్‌గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది సార్. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే' అంటూ సినిమాలో అల్లు అర్జున్ పలికే డైలాగ్‌తో ఓ ప్రోమోను విడుదల చేసింది గీతా ఆర్ట్స్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కొన్ని గంటల వ్యవధిలోనే, 'మీ కన్నింగ్‌నెస్‌కి, మీ మ్యానిపులేషన్‌కి, మీ క్రూయెల్టీకి... టేక్ ఏ బో' అంటూ మహేశ్ చెప్పే డైలాగ్‌తో ఏక్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రోమో బయటకు వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోటాపోటీ ఇంటర్వ్యూలు, సక్సెస్ సంబరాలు కూడా సాగాయి.

మహేశ్, అల్లు అర్జున్ అభిమానులు ట్విటర్‌‌లో ఒకరినొకరు తెగ ట్రోల్ చేసుకున్నారు.

ఎవరు చెప్పే లెక్కలు సరైనవో అర్థం కాక సగటు ప్రేక్షకులు తలలు గోక్కున్నారు.

ఇంతకీ టాలీవుడ్‌లో ఈ కలెక్షన్ల‌ను ఎవరు లెక్కిస్తారు? రికార్డుల కోసం నిర్మాతలు కలెక్షన్లను పెంచి చెబుతారా? అలా చేస్తే వారిపై చర్యలు ఉండవా?

సినీరంగానికి చెందినవారితో, ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది బీబీసీ.

సరిలేరు నీకెవ్వరు

ఫొటో సోర్స్, SLNTheFilm//twitter

‘పారదర్శకమే..’

కలెక్షన్లు లెక్కించే ప్రక్రియ పారదర్శకంగానే ఉంటుందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ విజయేందర్ రెడ్డి అంటున్నారు.

ఎగ్జిబిటర్, మిర్యాలగూడలో వేంకటేశ్వర థియేటర్‌ యజమాని అయిన విజయేందర్ కలెక్షన్లను లెక్కించే ప్రక్రియ గురించి ఆయన బీబీసీకి వివరించారు.

''ప్రతి థియేటర్‌లో సినిమా నిర్మాతల ఏజెంట్‌లు ఉంటారు. ప్రతి షోకి నెట్ కలెక్షన్, గ్రాస్ ఎంత అన్నది లెక్కగట్టి.. గంట, రెండు గంటల వ్యవధిలో వాళ్లు నిర్మాతలకు సమాచారాన్ని చేరవేస్తారు. ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల సమాచారమూ ఎలాగూ వారి దగ్గరకి వెళ్లిపోతుంది. ఇలా ప్రతి థియేటర్ నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకుని, ఏరియా వారీగా, మొత్తంగా ఎంత కలెక్షన్లు వచ్చాయన్నది నిర్మాతలు ప్రకటిస్తారు'' అని ఆయన వివరించారు.

ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగానే సాగుతుందని, కలెక్షన్లు ఎక్కువ చేసి చెప్పడం ఉండదని విజయేందర్ రెడ్డి అన్నారు.

''కలెక్షన్ లెక్కల్లో మార్పులు చేసి చూపించడం కుదరదు. ఎందుకంటే, పన్ను శాఖ అధికారులు ఆ లెక్కలన్నింటి గురించి ఆరా తీస్తారు. సవ్యంగా లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని అన్నారు.

వార్తా పత్రికల్లో ఇచ్చే ప్రకటనల్లో మాత్రం తమ సినిమా రికార్డులు కొట్టిందంటూ కొంచెం అతిగా ప్రచారం చేసుకోవడం సాధారణమేనని అని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఏ సినిమా పరిస్థితి ఏంటన్నది థియేటర్‌కు వెళ్లి చూస్తే మీకు అర్థమైపోతుంది. కలెక్షన్లు పెంచి చెప్పుకోవడం వల్ల లాభమేమీ ఉండదు'' అని విజయేందర్ రెడ్డి అన్నారు.

థియేటర్

ఫొటో సోర్స్, PrasadsMultiplx/twitter

‘పెంచి చెప్పడం ఉంది’

అభిమానుల ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో కలెక్షన్లను కొంచెం ఎక్కువ చేసి చూపించడం టాలీవుడ్‌లో జరుగుతున్న విషయమేనని అన్నారు నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్.

ఆయన హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి చిత్రాలను నిర్మించారు.

కలెక్షన్లను పెంచి చూపించే పద్ధతిపై కొబ్బరి మట్ట చిత్రం పోస్టర్ల ద్వారా సాయి రాజేశ్ వ్యంగ్య బాణాలు కూడా వేశారు.

''వసూళ్లను ఎక్కువ చేసి చూపించడం సులభమే. థియేటర్ల అద్దెలను తక్కువగా చూపిస్తూ గ్రాస్, షేర్‌లను ఎక్కువ చేసి చెబుతుంటారు. ఇదివరకు సినిమాల రికార్డులు కొంత స్వచ్ఛంగా ఉండేవి. చిరంజీవి, బాలకృష్ణల హవా నడిచిన రోజుల్లో పోటీ ఆరోగ్యకరంగా ఉండేది. వాళ్ల అభిమానులు పోటాపోటీగా ఉన్నా, కలెక్షన్లను మాత్రం ఉన్నవి ఉన్నట్లుగా బయటకు చెప్పేవారు'' అని సాయి రాజేశ్ చెప్పారు.

''మల్లీప్లెక్స్‌ల వరకూ కలెక్షన్లు పారదర్శకంగా ఉండొచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ల అమ్మకాలు మొత్తం ఆన్‌లైన్‌లో ఉండటం లేదు. వాటిలో కొన్ని టికెట్లనే బుక్ మై షో లాంటి వెబ్‌సైట్‌లలో విక్రయానికి పెడతారు'' అని అన్నారు.

ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలోనూ పారదర్శకత లోపించిందని ఈ మధ్య విమర్శలు వస్తున్నాయని సాయి రాజేశ్ అన్నారు.

యూట్యూబ్ లాంటి వేదికలపై సినిమాల టీజర్లు, ట్రయలర్లకు వచ్చే వ్యూస్ విషయంలో కూడా కొందరు మతలబు చేస్తుంటారని ఆయన చెప్పారు.

''యూట్యూబ్ రికార్డులు కూడా నకిలీవి ఉంటున్నాయి. రూ.75 వేలు పెడితే ఒక మిలియన్ వ్యూస్‌ను కొనుక్కోవచ్చు. ఒకప్పుడు దీని ధర రూ.3 లక్షల దాకా ఉండేది. కొన్ని సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి'' అని ఆయన వివరించారు.

థియేటర్

ఫొటో సోర్స్, Reuters

నిర్మాతలు చెప్పేదాంతో సంబంధం లేదు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమాలకు 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తోంది.

అలా అని, ఒక సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తే, నిర్మాతల నుంచి అందులో 18 శాతం పన్నుగా తీసుకోవడం ఉండదు.

అన్ని వస్తుసేవలకు వర్తించినట్లే.. థియేటర్లలో అమ్ముడయ్యే టికెట్లకు జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ అడిషనల్ కమిషనర్ (పాలసీ) లక్ష్మీ నారాయణ బీబీసీకి వివరించారు.

టికెట్ల అమ్మకాలపైనే జీఎస్‌టీ వసూళ్లు ఉంటాయని, కలెక్షన్ల గురించి నిర్మాతలు చేసే ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడం ఏమీ ఉండదని ఆయన బీబీసీతో చెప్పారు.

''ఒక థియేటర్‌ను తీసుకుంటే, అందులో ఒక్కో షోకు ఎన్ని టికెట్లు అమ్మారు అనేదే లెక్క. అమ్మిన టికెట్లపై థియేటర్లు 18 శాతం జీఎస్‌టీ కట్టాలి. షోలు, టికెట్ల అమ్మకాలు మాత్రమే లెక్కకువస్తాయి. ఏ సినిమా ఆడుతోందన్నదానితో సంబంధం లేదు. ఒక సినిమా మొత్తంగా ఎంత వసూలు చేసిందన్నది లెక్కించడం ఉండదు'' అని లక్ష్మీ నారాయణ వివరించారు.

''ఇదివరకు టికెట్ల అమ్మకాలపై వినోద పన్ను, సేవా పన్ను, ఇంకా స్థానిక సంస్థలు వేసే పన్నులు అంటూ చాలా వడ్డింపులు ఉండేవి. ఇవన్నీ పోయి, ఒకే పన్నుగా జీఎస్‌టీ వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే పన్ను శాతం అమలవుతుంది'' అని చెప్పారు.

''ఒక వేళ థియేటర్ అద్దెకు తీసుకుని నడిపిస్తున్నదైతే, అసలు యజమాని కట్టే పన్ను వేరుగా ఉంటుంది. అద్దెకు తీసుకున్నవారు తాము కట్టిన జీఎస్‌టీలో నుంచి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందొచ్చు'' అని వివరించారు.

నిర్మాతలు కలెక్షన్లు పెంచి చెప్పే విషయంలో తాము చర్యలు తీసుకునేదేమీ ఉండదని, అది ఆదాయపు పన్ను శాఖ పరిధిలోని అంశమని లక్ష్మీ నారాయణ అన్నారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)