జేఎన్‌యూ విద్యార్థులతో దీపిక ఏం మాట్లాడారు? అక్కడ ఏం జరిగింది?

దీపికా జేఎన్‌యూ

ఫొటో సోర్స్, SM VIRAL POST

సినీ నటి దీపికా పదుకోణ్ మంగళవారం సాయంత్రం దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసనలు చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీపిక సుమారు ఏడున్నర గంటలకు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వెళ్లారు. అక్కడ గుమిగూడిన విద్యార్థుల మధ్య కాసేపు ఉన్నారు.

అక్కడనుంచి వెళ్లిపోయే ముందు ఆమె ఆదివారం జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ను కలిశారు.

దీపిక అక్కడ గుమిగూడిన విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె ఫొటోలు మాత్రం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి.

దీపికా జేఎన్‌యూ

ఫొటో సోర్స్, SM VIRAL POST

దీపిక జేఎన్‌యూ విద్యార్థుల దగ్గరకు వెళ్లడంపై ఆగ్రహించిన చాలామంది త్వరలో విడుదల కాబోతున్న ఆమె సినిమా ఛపాక్‌ను చూడకూడదని సోషల్ మీడియాలో రాస్తున్నారు.

కొంతమంది బీజేపీ నేతలు కూడా #BoycottChhapaakతో ఛపాక్‌ను బహిష్కరించాలని అపీల్ చేశారు.

కానీ, సోషల్ మీడియాలో దీపిక ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. బుధవారం ఉదయం #ISupportDeepika హ్యాష్ టాగ్ భారత్‌ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది.

దీపికా జేఎన్‌యూ

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

ఈ అంశంపై దీపిక ఏమన్నా అన్నారా?

మంగళవారం దీపిక తన సినిమా 'ఛపాక్' ప్రచారం కోసం దిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

అదే సమయంలో టీవీ న్యూస్ చానల్ ఆజ్‌ తక్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపిక.. "దేశంలో జరుగుతున్నది చూసి కష్టంగా ఉంది" అని అన్నారు.

"దేశంలో చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న బహిరంగ ప్రదర్శనలను మీరు చూస్తున్నారు. చాలా మంది సినీ తారలు దీనిపై స్పష్టంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు" అని దీపికను ప్రశ్నించారు.

సమాధానంగా దీపిక... "దీని గురించి నేను ఏం చెప్పాలో, అది రెండేళ్ల క్రితమే చెప్పేశాను. పద్మావత్ రిలీజైనప్పుడు నాకు ఏం అనిపిచిందో, అప్పుడే చెప్పాను. ఇప్పుడు కనిపిస్తున్నది చూసి నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధ ఎందుకంటే... దీన్ని చూసే ప్రజలకు ఇది మామూలే కదా అనిపించకూడదు, ఇది 'న్యూ నార్మల్‌' కాకూడదు. ఎవరు ఏదైనా చెప్పచ్చు, వాళ్లదేం పోతుంది? బాధ కూడా కలుగుతోంది. మన దేశం ఏ పునాదిపై నిర్మితమైందో, అది కచ్చితంగా ఇది కాదని నాకు అనిపిస్తోంది" అన్నారు.

దీపిక

ఫొటో సోర్స్, VIACOM18 MOTION PICTURES

రెండేళ్ల క్రితం ఏం జరిగింది?

2017 జనవరిలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై జైపూర్ (రాజస్థాన్) జయగఢ్ కోటలో కొందరు దాడి చేశారు.

దాడికి పాల్పడ్డవారు పద్మావత్ సెట్ ధ్వంసం చేశారు. భన్సాలీతోపాటు, ఆయన మొత్తం టీమ్‌ను కొట్టారు. రాజస్థాన్ కర్ణి సేన ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది.

ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపికా పదుకోణ్‌లు గాయపడలేదు. కానీ తమ డైరెక్టర్‌పై జరిగిన దాడిని బహిరంగంగా ఖండించారు.

దీపికా జేఎన్‌యూ

ఫొటో సోర్స్, TWITTER

"భన్సాలీపై జరిగిన దాడికి షాక్ అయ్యాను, నిరుత్సాహానికి కూడా గురయ్యాను. పద్మావత్ సినిమా గురించి ఎవరికి ఫిర్యాదులు ఉన్నాయో వారికి ఈ సినిమాలో ఎలాంటి వక్రీకరణలు లేవని నేను విశ్వాసం కలిగించాలనుకుంటున్నాను. ఎవరినీ నీచంగా చూపాలనేది మా ఉద్దేశం కాదు. మేం ఒక బలమైన, సాహసికురాలు అయిన మహిళ కథను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం" అని దీపిక ఆ సమయంలో ట్విటర్‌లో అన్నారు.

కానీ పద్మావత్‌కు వ్యతిరేకంగా కర్ణిసేన నిరసనలు కొనసాగించింది. పోస్టర్లు తగలబెట్టింది, సినిమాను విడుదల కానివ్వబోమని బెదిరించింది.

కానీ 2017 అక్టోబర్‌లో సూరత్‌లో రంగోలీ వేస్తున్న ఒక కళాకారుడిని కొట్టినప్పుడు దీపిక కోపం కట్టలుతెంచుకుంది.

పద్మావత్ సినిమా పోస్టర్లు వచ్చిన తర్వాత ఆ కళాకారుడు రంగోలీ వేయడం ప్రారంభించాడు. అప్పుడు విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కొందరు అతడిపై దాడి చేశారు.

దీపికా జేఎన్‌యూ

ఫొటో సోర్స్, TWITTER

2017 అక్టోబర్ 18న దీపిక ట్వీట్

"ఆర్టిస్ట్ కరణ్ అతడి ఆర్ట్-వర్క్‌పై జరిగిన దాడి వార్త విని మనసు ముక్కలైంది. ఇద భయానకం, అసహ్యం కూడా. వీళ్లెవరు? ఈ ఘటనలకు ఎవరు బాధ్యులు? ఇలా మనం ఎంతకాలం ఉండాలి? వీళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. మా భావప్రకటనహక్కుపై దాడి చేస్తున్నారు. అది కూడా మాటిమాటికీ. దీన్ని ఆపాలి. దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం అవసరం" అని దీపిక అన్నారు.

ఈ ట్వీట్‌ను ఆమె కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కూడా ట్యాగ్ చేశారు.

ఆ తర్వాత గుజరాత్ పోలీస్ ఐదుగురిని అరెస్ట్ చేసింది.

దీపికకు ఇది ఎంత రిస్క్?

దీపిక తన సినిమా రిలీజవడానికి ముందు ఇలాంటి వివాదంలోకి వచ్చి చాలా ధైర్యం చేసిందని సోషల్ మీడియాలో చాలామంది చెబుతున్నారు.

పెద్ద రాజకీయ అంశాల్లో మౌనంగా ఉండడం పట్ల సినీ కళాకారులపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత వివాదంపై కూడా పెద్ద తారలెవరూ ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

నిర్మాత అనురాగ్ కశ్యప్ తన ట్వీట్‌లో "దీపిక ఒక యాక్టర్‌గా మాత్రమే ఇలా ప్రమాదాలకు ఎదురెళ్లడం లేదు. ఆమె ఈ సినిమాకు నిర్మాత కూడా. అలాంటప్పుడు అది ఇంకా పెద్ద విషయం. కానీ ఆమె ధైర్యం చూపించారు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)