CAA: ముస్లిం అమ్మాయిల హిజాబ్ ఓ జెండాలా మారింది, దీని అర్థమేంటి

- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
నీ నుదుటన ఆ హిజాబ్ బాగుంది, కానీ దాన్ని నువ్వు జెండాలా మార్చుంటే బాగుండేది - మజాజ్
ఎన్నో ఏళ్ల క్రితం లఖ్‌నవూలో కవి మజాజ్ నర్గిస్ దత్‌ను కలిసిన తర్వాత ఈ కవిత రాశారు. అప్పుడు ఆయన బహుశా రాబోవు రోజుల్లో ఇది ఒక ప్రకటన అవుతుందని అనుకుని ఉండరు.
ఏ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మజాజ్ చదువుకున్నారో, అదే యూనివర్సిటీ ఇప్పుడు నిరసనలకు ప్రతీకగా మారింది.
నిజానికి ఇక్కడ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీనికి స్కార్ఫ్ కట్టుకున్న మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఈ చట్టంలో మూడు పొరుగు దేశాల నుంచి భారత్ వచ్చే వారికి పౌరసత్వం ఇచ్చే నిబంధన ఉంది. కానీ ఆ జాబితా నుంచి ముస్లింలను మినహాయించారు.
మజాజ్ రాసిన వాక్యాలను వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో మహిళలు పాడుతున్నారు. ప్రత్యేకత ఏంటంటే, హెచ్చరికలు, ఫైరింగ్, టియర్ గ్యాస్, చర్యలు ఉన్నప్పటికీ, ఈ మహిళలు వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. పోలీసుల క్రూరత్వాన్ని ఎదురొడ్డి నిలిచి సవాలు విసురుతున్న మహిళల నిరసన ప్రదర్శనలు.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా కేంద్రంగా నిర్మితమయ్యాయి.
భారత చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు నిరసనల్లో పాల్గొనడానికి రోడ్లమీదకు వచ్చారు. ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తూ, వ్యతిరేక గళం వినిపించడంలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

హిజాబ్, బురఖాలో గుర్తింపు రాజకీయాలపై పోరాటం
దిల్లీలో అల్ప ఆదాయ వర్గాలు, ముస్లిం మెజారిటీ షహీన్‌బాగ్ మహిళలు దీన్ని వ్యతిరేకించే కొత్త ముఖాలుగా ఆవిర్భవించారు. దిల్లీలో వణికించే చలిలో కూడా మహిళలు రాత్రింబవళ్లూ శాంతిపూర్వక నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కొత్త చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధం అని ఈ మహిళలు చెబుతున్నారు.
చలి, పోలీసుల క్రౌర్యం (ఇవి మిగతా ప్రాంతాల్లో కూడా కనిపించాయి) ముప్పు ఉన్నప్పటికీ, ఈ మహిళలు నిరనస ప్రదర్శనల కాగడాలు వెలిగించినట్లు కనిపిస్తున్నారు. తమ హిజాబ్, బురఖాల్లో గుర్తింపు రాజకీయాలకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు.
జామియా మిలియా ఇస్లామియాలో దాడి జరిగిన రోజు రాత్రే ఇవి మొదలయ్యాయి. షహీన్‌బాగ్‌లో 10 మంది మహిళలు తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి నిరసన ప్రదర్శనల్లో కూర్చున్నారు.
అదే రాత్రి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని అబ్దుల్లా హాస్టల్లో విద్యార్థినులు తమను బంధించి ఉంచిన మూడు గదుల తాళాలు పగలగొట్టారు. మహిళా హాస్టల్ నుంచి బయటకు వెళ్లడానికి తమకు అనుమతి ఇవ్వకపోవడంతో, అక్కడే ధర్నాలో కూర్చున్నారు. పోలీసులు విద్యార్థులను దారుణంగా కొడుతున్నారని ఆరోపించారు.
తర్వాత రోజు డిసెంబర్ 16న ఉదయానికల్లా అలీగఢ్ యూనివర్సిటీ పాలనా యంత్రాంగం హాస్టల్ ఖాళీ చేయించింది. హాస్టల్ నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు కూడా పంపించివేసింది. ప్రత్యేక బస్సులు, రైలు కూడా ఏర్పాటు చేసింది.
అదే ఉదయం 20 ఏళ్ల ఆయేషా, 21 ఏళ్ల తుబా అలీగఢ్‌లోని దూధ్‌పూర్‌లో ఉన్న తమ ఇళ్ల నుంచి యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ వాళ్లిద్దరూ యునానీ మెడిసిన్ చేస్తున్నారు. ఇద్దరూ మౌలానా ఆజాద్ లైబ్రరీ మెట్లమీద కూర్చున్నారు.
వాళ్ల దగ్గర గత నిరసన ప్రదర్శనల ప్లకార్డులు ఉన్నాయి. తుబా చేతిలో సైలెంట్ ప్రొటెస్ట్ అంటే మౌన ప్రదర్శన, ఆయేషా చేతిలో నియంతృత్వం నశించాలి అనే ప్లకార్డులు ఉన్నాయి. ఇద్దరూ గంటల వరకూ నిరనస ప్రదర్శనలోనే కూర్చున్నారు.
ప్రొవోస్ట్ (సీనియర్ పరిపాలనాధికారి) వచ్చి తమను హెచ్చరించారని, కానీ ఇద్దరం తాము చట్టవిరుద్ధంగా ఏ పనీ చేయడం లేదని ఆయనతో అన్నట్లు వారు చెప్పారు. అలీగఢ్‌లో సెక్షన్ 144 అమలులో ఉంది. దాని ప్రకారం ఎక్కడా నలుగురు, అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు. కానీ అక్కడ ఉన్నది ఇద్దరే అమ్మాయిలు.
మేం నిరసనల నుంచి వెనక్కు తగ్గామని వేరే వారు అనుకోవాలని మేం అనుకోవడం లేదు, మేం శాంతియుతంగా ఉన్నాం. నిరసన ప్రదర్శనల్లో ఒక్క విద్యార్థి ఉన్నా చాలు, ఈ వ్యతిరేకత సజీవంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
హిజాబ్ ధరించి పోలీసులకు సవాలు విసురుతున్న మహిళలు
వీరిలో ఎక్కువమంది యువతులే. వీరు అసహనంతో ఉన్నారు. వారికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. శాతంగా కూడా ఉన్నారు. మహిళలు మాత్రమే వ్యతిరేక ప్రదర్శనలు చేయగలరని వారు చెబుతున్నారు. ఎందుకంటే ముస్లిం మహిళలతో ఎలా డీల్ చేయాలో ప్రభుత్వానికి తెలీదని అంటున్నారు. నాలుకలేనివారని, సుదీర్ఘ కాలం నుంచీ సమాజంలో బాధితులుగా గుర్తింపు పొందిన అదే ముస్లిం మహిళలు ఇవి చేస్తున్నారు.
2012లో నిర్భయ ఘటన సమయంలో మొదటిసారి చాలా మంది మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి నిరనస ప్రదర్శనలు చేశారు.
ముస్లిం మహిళల నిరసన ప్రదర్శనలు 2002లో గోద్రా అల్లర్ల సమయంలో కూడా జరిగాయని సామాజిక, మానవ హక్కుల కార్యకర్త షబ్నమ్ హాష్మీ చెప్పారు. అప్పుడు చాలా మంది మహిళలు నిరసనల కోసం ఇళ్ల నుంచి బయటికి వచ్చారు, వారిలో కొంతమంది ఇప్పుడు కూడా పోరాటం చేస్తున్నారు.
బురఖా, హిజాబ్‌లో వారు తమ గుర్తింపును కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. వారికి ఇప్పుడు ముస్లిం అని చెప్పుకోడానికి భయం, సిగ్గు లేదు. వీరిలో ఎక్కువ మంది హిజాబ్ తాము తమ ఇష్ట ప్రకారం ధరించామని, దానికీ మతానికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెబుతున్నారు.
హిజాబ్ ధరించిన మహిళలు దిల్లీ తీవ్ర చలితో వణికిపోతున్న సమయంలో పోలీసులకు సవాలు విసరడం ఫొటోల్లో కూడా కనిపిస్తోంది. పోలీసులు వేధించారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మహిళలు రాత్రింబవళ్లూ ప్లకార్డులతో నిరసనలు చేస్తూనే ఉన్నారు.

రిపోర్ట్
"ఇలా ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పేరుతో ఇంతమంది ముస్లిం మహిళలు ప్రదర్శనలకు రావడం నా జీవితంలో మొదటిసారి చూశాను. ఇది గట్టు తెగడం లాంటి విషయం. ఇది ఒక విధంగా 25 తరాల పోరాటాల సెలబ్రేషన్. ఇప్పుడు ఈ మహిళలకు సోషల్ మీడియా బలం తెలిసింది. పితృస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా ఇదో ప్రతిఘటన" అని షబ్నమ్ హాష్మీ అన్నారు.
డిసెంబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో జరిగిన ఒక ర్యాలీలో మహిళల గైర్హాజరీ కనిపించింది. కానీ రోడ్లపై భారీ సంఖ్యలో మహిళలు ఉన్నారు. వారంతా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇండిపెండెంట్ విమెన్స్ ఇనీషియేటివ్ అనే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్, జామియా మిలియా యూనివర్సిటీ ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలంపై ఒక రిపోర్ట్ సిద్ధం చేసింది. ఆ రిపోర్టును 'అన్అఫ్రైడ్-ద డే యంగ్ విమెన్ టుక్ ద బ్యాటిల్ టు ద స్ట్రీట్' అన్నారు.
"అక్కడ తమ సామాజిక, రాజకీయ బలంపై నమ్మకం ఉన్న మహిళలు ఉన్నారు. 2019 డిసెంబర్ 15న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై అన్నివైపుల నుంచీ అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం-2019, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ను వ్యతిరేకిస్తున్న విద్యార్థులను అణచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు వారికి మొత్తం భారతదేశంలోని మహిళలు, పురుషులు, యువత నుంచి మద్దతు లభిస్తోంది" అని ఈ రిపోర్టులో చెప్పారు.
జామియా మిలియా ఇస్లామియా తరఫున ఈ పోరాటంలో నిజం, న్యాయం, సమానత్వం అనే బలమైన గొంతులతో భారత యువతులు పాల్గొంటున్నారు. వీరి చిత్రాలు మన అంతరాత్మలను కదిలించేలా ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది వయసు 19 నుంచి 31 మధ్యలో ఉంది. కానీ వీరిలో కొంతమంది సామాన్య కుటుంబాలకు చెందిన గృహిణులు కూడా ఉన్నారు. వారు ఈ నిరసనలకు ప్రభావితమై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

ఫొటో సోర్స్, AFREEN FATIMA
తెలీని భవిష్యత్తు గురించి భయం
ఆఫ్రీన్ ఫాతిమా జేఎన్‌యూలో కౌన్సిలర్. 2018-19లో ఆమె అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విమెన్స్ కాలేజ్ ప్రెసిడెంటుగా ఉన్నారు. సమాజంలోని మహిళల అవగాహన వెనుక ట్రిపుల్ తలాక్, బాబ్రీ మసీదు తీర్పుల పాత్ర కూడా ఉందని ఆమె చెప్పారు. ఫోన్లో ఆమె గొంతు అలసిపోయినట్లు అనిపించింది. ఆమె చాలా భయపడిపోయి ఉన్నారు.
ఆమె ఆ సమయంలో ఎన్నో భరించారు. మానసికంగా, భావోద్వేగపరంగా కూడా. దానితోపాటూ మూడుసార్లు ఆమె పానిక్ అటాక్ కూడా ఎదుర్కొన్నారు. జామియాలో హింస చెలరేగిన రోజు రాత్రి ఆమె కాంపస్‌లో ఇరుక్కుపోయారు. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు ముప్పు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. కానీ ఆమె భయపడే యువతి కారు.
"ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ గెలిచినప్పుడు, నాకు నేరుగా ముప్పు ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆయన వరుసగా ద్వేషాన్ని వ్యాపింపజేసే ప్రసంగాలు ఇచ్చేవారు. ముస్లిం మహిళలు ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారికి శాచురేషన్ పాయింట్ వచ్చేసింది. భయం ఉన్నా మేం ఇళ్లనుంచి రాకుండా ఉండలేం, మేం ఆయనతో భయపడిపోయి ఉన్నాం. ఆయన్ను అలా ఆలోచంచనివ్వం" అని ఫాతిమా చెప్పారు.
21 ఏళ్ల ఫాతిమా తన ముందున్న తెలీని భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమల్లోకి రావడంతో సమాజంలోని మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేశారు.
ప్రభుత్వానికి ముస్లిం పురుషులతో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసు, కానీ వారు ముస్లిం మహిళల సవాలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే వారికి మమ్మల్ని డీల్ చేయడంలో అనుభవం లేదు. వాళ్లు మేం నిరసన ప్రదర్శనలు చేస్తామని ఎప్పుడూ అనుకునుండరు.
ఫాతిమా అలహాబాద్‌కు చెందినవారు. ఇక్కడ నిరసనలు చేస్తున్న వారిపట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించడం పతాకశీర్షికల్లో నిలిచింది. ఆమె తల్లి స్కూల్ చదువు మధ్యలోనే వదిలేశారు. కానీ ఆమె తన ముగ్గురు కూతుళ్లను బాగా చదివించారు. తమ కుటుంబంలో చదువుకున్న మొదటి యువతిని నేనేనని ఫాతిమా చెబుతారు.
"మా అమ్మ, నానమ్మ చదువుకోలేదు. కానీ అది ఒక యుద్ధం లాంటి పరిస్థితి అని మాకు తెలుసు. మేం సుదీర్ఘ కాలంగా మౌనంగానే ఉన్నాం" అన్నారు ఫాతిమా.
ఫాతిమాను ఆమె కుటుంబం ఎప్పుడూ హిజాబ్ వేసుకోమని చెప్పలేదు. ఫాతిమా 2019 వరకూ హిజాబ్ ధరించలేదు. తబ్రేజ్ అన్సారీ మాబ్ లించింగ్ ఘటన గురించి విన్నప్పుడు ఆమె మొదటిసారి దానిని వేసుకున్నారు.
ముస్లిం మహిళలు ఆలోచించలేరు లేదా వారికి ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చోటు ఉండదు అనేవి స్టీరియోటైప్ ఆలోచనలు. నేను ముస్లింలలో మహిళల ప్రాతినిధ్యానికి ఉదాహరణగా మారాలని అనుకుంటున్నా.

పౌరసత్వం అంశం ఎక్కువగా మహిళలకు సంబంధించినదే
మొహమ్మద్ సజ్జాద్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకులు.
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో నడుస్తున్న ఉద్యమాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారని ఆయన చెప్పారు.
ఈ ఉద్యమాల వెనుక మతపరమైన, సెక్యులర్, వామపక్ష, ఉదారవాద సంస్థలకు ఎలాంటి పాత్రా లేదని సజ్జాద్ అన్నారు.
"ముస్లిం మహిళలు పౌరసత్వ అంశంపై పోరాటం చేస్తున్నారు. ఆ పరంగా చూస్తే వారు మైనారిటీలు కాదు. వారు తమ గుర్తింపుతోపాటు బయటకు వచ్చారు. వారిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. స్పష్టంగా ముందుకొస్తున్నారు" అని ఆయన అన్నారు.
ఆధునిక విద్య, సోషల్ మీడియా అవగాహన కలిసి ముస్లిం మహిళల్లో రాజకీయపరంగా అవగాహన ఉన్న వర్గానికి జన్మనిచ్చాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 30 శాతానికి పైగా ముస్లిం యువతులు ఉన్నారు. పీజీ కోర్సులతో కలిపితే వారు 50 శాతానికి పైగా ఉంటారు.
అయినా, పౌరసత్వ అంశం ఎక్కువగా మహిళలకు సంబంధించినది. ఎందుకంటే పెళ్లైన తర్వాత తమ ఇంటిపేరు మార్చుకోవాల్సి ఉంటుంది, లేదా భర్త బయటివాడైతే పత్రాలు ఒక సమస్యగా మారతాయని వారికి అనిపిస్తోంది. ఆ కోణంలో చూస్తే, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రదర్శనల్లో మహిళల అంశం చాలా ముఖ్యమైనది.
మహిళలు ప్రభుత్వ నైతిక బలానికి సవాలు విసురుతున్నారు. పోలీసుల క్రూరత్వాన్ని అధిగమించే వ్యూహంలో ఇది కూడా ఒక భాగం.

నోటీసులు వచ్చినా భయపళ్లేదు
ఆయేషా, తుబా సరదా కోసం సిద్ధమైన సంతోషమైన అమ్మాయిలుగా భావించేవారు. కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని వీరిద్దరికీ విప్లవ యువతుల గుర్తింపు వచ్చేసింది. వీరిద్దరూ అది కాలం డిమాండ్ అంటారు.
బుధవారం ఉదయం తుబా నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. "హ్యాపీ న్యూ ఇయర్. నిరసన ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మేం బాబే సయ్యద్ గేటు దగ్గరకు మళ్లీ వచ్చేశాం. మేం ఎప్పటివరకూ వీలైతే, అప్పటివరకూ ఇక్కడే ఉంటాం..."
ఆమె ఇంటికి రెండు నోటీసులు పంపించారు. ధర్నాలో కూర్చు ని హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని దానిలో చెప్పారు. కానీ ఆ నోటీసులకు ఆమె భయపడలేదు. నిరసన ప్రదర్శనలు చేయాలనే ఆమె ఉద్దేశం కూడా మారలేదు.
ఒక ప్లకార్డులో చెప్పినట్టు...."ఇది సవాలు, ధిక్కరణ. చలి వణికిస్తున్నా, టియర్ గ్యాస్ ప్రయోగించినా, అరెస్టులు జరుగుతున్నా, పితృస్వామ్యం కొనసాగినా.."
ఇవి కూడా చదవండి.
- పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిల్లీ గల్లీలను ఆక్రమించిన మహిళలు
- CAAకు మద్దతు కోసం బీజేపీ మిస్డ్ కాల్ ప్రచారం... అదే నంబర్‌తో నకిలీ అకౌంట్లు
- పోర్న్ వీడియోలు తీసి 22 మంది అమ్మాయిల్ని మోసం చేసినందుకు 919 కోట్ల జరిమానా
- కాసిం సులేమానీ: ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
- 'రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం... ఇప్పుడు పిల్లా పెద్దా అంతా రోడ్డున పడ్డాం'
- ఇరాన్ అణుబాంబును ఎంత కాలంలో తయారు చేయగలదు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








