పోర్న్ వీడియోలు తీసి 22 మంది అమ్మాయిల్ని మోసం చేసినందుకు 919 కోట్ల జరిమానా

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్‌లో విస్తృతంగా పంపిణీ అయిన పోర్న్ వీడియోల్లో.. 22 మంది యువతులను వారికి తెలియకుండానే కనిపించేలా మోసం చేశారని.. వారికి 1.28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 919 కోట్లు) పరిహారం చెల్లించాలని ‘గర్ల్స్‌డుపోర్న్’ వెబ్‌సైట్‌ను ఆదేశిస్తూ అమెరికా జడ్జి ఒకరు తీర్పు చెప్పారు.
ఈ వెబ్‌సైట్ యజమానుల చేతుల్లో మోసపోయిన ఈ మోడళ్లలో కొంతమంది ఆత్మాహుతి చేసుకోవాలన్న ఆలోచనలతో కుంగిపోయారని ఆ జడ్జి పేర్కొన్నారు.
విదేశీ డీవీడీలు సేకరించే ఒక ప్రైవేటు సేకర్త కోసం ఆ వీడియోలు చిత్రీకరిస్తున్నామని ఆ యువతులకు నమ్మబలికారని 181 పేజీల తీర్పులో వివరించారు.
సదరు వీడియోలు చిత్రీకరించినపుడు ఆ యువతుల వయసు 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకూ ఉంది. ఆ వీడియోలు ఆన్‌లైన్‌లోకి రావని వారికి హామీ ఇచ్చారు.
కానీ ఆ వీడియోలను సబ్‌స్క్రిప్షన్లతో నడిచే ఈ అమెచ్యూర్ పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో క్లిప్‌లను కొన్ని ఉచిత పోర్న్ వెబ్‌సైట్లలో కూడా షేర్ చేశారు.
ఈ వెబ్‌సైట్ నుంచి ఆ వీడియోలను తీసివేయటంతో పాటు.. ఇతర సైట్ల నుంచి కూడా తొలగించేలా చర్యలు చేపట్టాలని గర్ల్స్‌డుపోర్న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ ప్రాట్ (36), వీడియోగ్రాఫర్ మాథ్యూ వోల్ఫ్ (37), పోర్న్ నటుడు రూబెన్ గార్సియా (31)లను.. శాన్ డియాగో సుపీరియర్ కోర్ట్ జడ్జి కెవిన్ ఎన్‌రైట్ ఆదేశించారు.
ఈ వెబ్‌సైట్.. తన వీడియోల్లోని మహిళలు ప్రొఫెషనల్ పోర్న్ స్టార్లు కాదని ప్రచారం చేస్తూ మార్కెట్ చేసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఒకసారి మాత్రమే'
కోర్టు పత్రాల ప్రకారం.. ఈ వెబ్‌సైట్‌లోని వీడియోలు.. వాటిలోని యువతుల మొదటి, ఏకైక పోర్న్ వీడియోలని.. వారు విద్యార్థులని, అదనపు ఆదాయం కోసం ఏకైక పోర్న్ వీడియోకు అంగీకరించారని ఆ వెబ్‌సైట్ చెప్పుకుంటోంది.
ఒక యువతికి సంబంధించిన పోర్న్ వీడియో ఒకటి మాత్రమే ఉంటుందనే విధానం వల్ల.. ఆ వెబ్‌సైట్‌లో కొత్త కంటెంట్ కోసం నిరంతరం కొత్త మోడళ్లు అవసరం.
కొత్త మోడళ్లను ఆకర్షించటం కోసం ఈ వెబ్‌సైట్ మోసపూరిత విధానాలు అవలంబించిందని.. కొత్తగా వచ్చే యువతులకు వారి ''వీడియోలను ఎన్నడూ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబోము.. అవి అమెరికాలో వెలుగులోకి రావు.. వారికి తెలిసిన వారు ఎవరూ వాటిని చూడరు'' అని బూటకపు హామీలు ఇవ్వటం అందులో ఒకటని కోర్టు తప్పుపట్టింది.
ఆ మోడళ్ల అసలు పేర్లను సదరు వీడియోల్లో వెల్లడించబోమని కూడా ఆ వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ మోడళ్లకు హామీ ఇచ్చారు.
అయితే.. ఆ మోడళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, వారిని గుర్తుపట్టగలిగే వివరాలను నిందులు మూడో వేదికల మీద షేర్ చేశారనేందుకు.. దానివల్ల ఈ మోడళ్లలో కొందరు, వారి కుటుంబాలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురయ్యారనేందుకు గల ఆధారాలను కోర్టు ఆలకించింది.

సంక్లిష్టమైన కాంట్రాక్టులు
కొత్త మోడళ్లను చేర్చుకోవటం కోసం ఈ వెబ్‌సైట్.. కొత్తగా మోడళ్లయ్యే అవకాశమున్న యువతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయటం జరగదని భరోసా ఇస్తూ మెసేజీలు పంపించేలా మాజీ మోడళ్లను ఒత్తిడి చేసింది.
వీడియో చిత్రీకరణ జరిగే రోజు.. మోడళ్లకు మద్యం కానీ, గంజాయి కానీ తాగించి.. ఎనిమిది పేజీల కాంట్రాక్టు మీద సంతకం చేయాలని చెప్తారు.
ఈ వెబ్‌సైట్ వెనుక ఉన్న వారి ఎత్తుగడల వల్ల ఆ వీడియోలు.. ఈ యువతుల స్నేహితులు, కుటుంబాలు అందరికీ తెలిశాయని జడ్జి పేర్కొన్నారు.
''ఫలితంగా కక్షిదారులు తీవ్ర విపరిణామాలు, విషాదకరమైన పర్యవసానాల బారిన పడాల్సి వచ్చింది. వీరు తీవ్ర వేధింపులు, భావోద్వేగపరమైన, మానసికమైన వేదనకు లోనయ్యారు. గౌరవానికి భంగం కలిగింది, ఉద్యోగాలు కోల్పోయారు. విద్యా, వృత్తి అవకాశాలు కోల్పోయారు. కుటుంబ, వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయి. వారి జీవితాలు గాడితప్పాయి. తలకిందులయ్యాయి. వారు తమ స్వీయ సమాజం నుంచి వెలికి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు చేశారు'' అని ఆయన పేర్కొన్నారు.
ఈ పోర్న్ వెబ్‌సైట్ బాధిత యువతులు 22 మందికి పరిహారంగా మొత్తం 1.28 కోట్ల డాలర్లు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. ఒక్కో యువతికి 3,00,000 డాలర్ల నుంచి 5,50,000 లక్షల డాలర్లు వరకూ లభిస్తాయి.
ఈ తీర్పు మీద అప్పీలు చేయటానికి ఇరు పక్షాలకూ 15 రోజుల సమయం ఇచ్చారు.

'నా గుండె విలపించింది'
ప్రతివాదుల మీద ఫెడరల్ కోర్టులో అక్టోబరులో నమోదైన క్రిమినల్ అభియోగాలు కూడా విచారణకు రానున్నాయి.
వారి మీద ఈ సివిల్ కేసులో నమోదు చేసిన అభియోగాలే క్రిమినల్ కేసులోనూ నమోదు చేశారు.
వోల్ఫ్, గార్సియాలు ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ప్రాట్ పరారీలో ఉన్నాడు. అతడు తన స్వదేశమైన న్యూజిలాండ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.
''నా క్లయింట్లైన యువతులు అందరికీ ప్రతివాదులు ఒకే తరహా అబద్ధాలు చెప్పారు. ఆ యువతుల్లో చాలా మందితో నేను మాట్లాడాను. వారి చేత ఆ పని చేయించేలా ఎలా ఒత్తిడి తెచ్చారు.. దానివల్ల వారి జీవితాల మీద చూపిన ప్రభావం చూసి నా గుండె విలపించింది'' అని యువతుల తరఫు న్యాయవాది ఎడ్ చాప్లిన్ పేర్కొన్నట్లు కోర్ట్‌హౌస్‌న్యూస్ చెప్పింది.
ఈ తీర్పు మీద వ్యాఖ్యానించటానికి గర్ల్స్‌డుపోర్న్ తరఫు న్యాయవాదులు తిరస్కరించినట్లు ఆ వార్తా వెబ్‌సైట్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో జరిగేది ఇదే.. వాంతులు ఎందుకొస్తాయి? హ్యాంగోవర్ దిగేదెలా?
- 2020 నాటికి నేనేమవుతాను? ప్రపంచం ఏమవుతుంది? అని 29 ఏళ్ల కిందట ఊహించిన బాలుడు
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








