అమ్మాయిలతో డేటింగ్ అంటూ చీటింగ్... అందమైన ఫోటోలు చూసి లక్షలు పోగొట్టుకున్న విశాఖ యువకులు

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో 23 మంది మహిళా ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
పర్పుల్ ఫాంటసీ డేటింగ్ వెబ్‌సైట్ పేరుతో తన నుంచి రూ.18 లక్షలు మోసపూరితంగా కాజేశారని ఆరు నెలల కిందట ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి.
తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు ఆరు నెలల పాటు విచారణ చేసి కోల్‌కతా పోలీసుల సహకారంతో ఓ పెద్ద ముఠాని పట్టుకున్నారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం...
ఏమిటీ మోసం?
ఈ ముఠా తొలుత ఒక వెబ్‌సైట్ సృష్టిస్తుంది. అందమైన అమ్మాయిల ఫోటోలను అందులో ఉంచి ఆకర్షిస్తారు. వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయితే వారితో గడపొచ్చంటూ ఊరిస్తారు.
రిజిస్టర్ అయిన తర్వాత ఫోన్ చేసి తియ్యని మాటలతో ఆకట్టుకుని నెమ్మదిగా ముగ్గులో దించుతారు.
ఎంపిక చేసుకున్న యువతి కావాలంటే డబ్బులు డిపాజిట్ చేయాలని నిబంధన పెడతారు. ఆ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తారు. చివరకు జేబులు ఖాళీ అయిన తర్వాత కానీ తాము మోసపోయిన విషయాన్ని గుర్తించలేనంత రీతిలో ఈ వ్యవహారం గుట్టుగా సాగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫర్ల పేరుతో ముంచేస్తారు..
ఈ ఆన్‌లైన్ డేటింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికి వివిధ ఆఫర్ల పేరిట ఊరిస్తారు.
సిల్వర్ కార్డు, గోల్డెన్ కార్డు, ప్లాటినమ్ కార్డు వంటివి ఉంటాయి.
సిల్వర్ కార్డ్ ఖరీదు రూ.2 లక్షలు.. అది తీసుకున్నవారితో కోరుకున్న అమ్మాయిని పార్కులకు, సినిమాలకు పంపిస్తామని చెబుతారు. ఆ తర్వాత రూ.5లక్షలు చెల్లిస్తే గోల్డెన్ కార్డు. ఈ కార్డు ఉన్న వారితో అమ్మాయిలు అవుటింగ్‌కి కూడా వస్తారు. పబ్‌లకు వెళ్లడానికి తోడుగా వస్తారు. వాటి తర్వాత ప్లాటినమ్ కార్డు కావాలంటే రూ.10లక్షలు చెల్లించాలి. ఈ కార్డు ఉన్న వారితో అమ్మాయిలు శృంగారంలో కూడా పాల్గొంటారని చెబుతారు. అందుకు తగిన స్థలం కూడా కంపెనీ నిర్ణయిస్తుంది.

మోసం ఇలా..
మూడు, నాలుగు రకాల కార్డులు ఆఫర్ చేసిన తర్వాత సిద్ధపడిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారు. దేశంలో అన్ని చోట్లా తమకు నెట్‌వర్క్ ఉందని చెబుతూ ''మీరు కోరుకున్న చోట అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు'' అని చెబుతారు.
కానీ డబ్బులు చెల్లించిన వారికి డమ్మీకార్డులు పంపించి మోసం చేస్తున్నట్టు విశాఖ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇలా డబ్బులు చెల్లించి కార్డులు పొందినవారు ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వారు కోరుకున్న ప్రయోజనం లేకపోవడంతో తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమని పట్టుబడితే కంపెనీ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ అంటూ మెలిక పెడతారు.
ఇలానే మోసపోయిన బాధితుడు ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కొక్కరు లక్షల్లో పోగొట్టుకున్నారు
ఇలా మోసపోయిన వారి జాబితాలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే చాలామంది ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారని విశాఖ సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ తెలిపారు.
ఆరు నెలల కిందట ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. పర్పుల్ ఫాంటసీ డేటింగ్ వెబ్‌సైట్ పేరుతో తనకు మోసం జరిగిందని చెప్పారు. ఇంగ్లిష్, హిందీలో మాట్లాడుతూ ప్రీమియర్ కార్డు, గోల్డెన్ కార్డు ఆఫర్ చేసి విశాఖలో కూడా తమ నెట్‌వర్క్ ఉందని చెప్పడంతో రూ.18 లక్షల వరకూ చెల్లించినట్టు తెలిపాడు.
దాంతో విచారణ ప్రారంభించాం. విశాఖ నగరంలో మరికొందరు బాధితులు ఉన్నట్టు తెలిసింది. లక్షల్లో పోగొట్టకున్నట్టు ఆధారాలు లభించాయి అంటూ గోపీనాథ్ వివరించారు.

విశాఖ పోలీసుల ఆపరేషన్ సాగిందిలా..
తమకు అందిన ఫిర్యాదుతో ఆపరేషన్ ప్రారంభించిన విశాఖ పోలీసులు ఆరు నెలల పాటు విచారణ సాగించారు. వెబ్‌సైట్ గోడాడీలో డొమైన్ రిజిస్టర్ అయినట్టు గుర్తించారు.
ఈ ఏడాది మార్చిలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీ అడ్రస్, వాట్సాప్ డేటా, ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేశారు. సుమారు రెండు నెలల దర్యాప్తు తర్వాత కోల్‌కతాలోని ఈ వెబ్‌సైట్ కేంద్రాన్ని గుర్తించారు. పూర్తిగా సాఫ్ట్‌వేర్ కంపెనీ తరహాలో ఆఫీసులు నడుపుతూ ఈ-మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో తాము సేకరించిన సమాచారం ఆధారంగా కోల్‌కతా పోలీసుల సహకారంతో దాడులు చేపట్టారు. కానీ రెండు సార్లు ఈ ప్రయత్నాలు విఫలమయినట్టు విశాఖ పోలీసులు మీడియాకు తెలిపారు. మూడో ప్రయత్నంలో స్థానిక పోలీసులకు చివరి నిమిషంలో సమాచారం అందించి, రంగంలో దిగడం ద్వారా 26మందిని అరెస్ట్ చేయగలిగామని వివరించారు.

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కంపెనీ యాజమానుల ప్లాన్ ఇదే..
విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ తరహాలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే కంపెనీలు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నాయి.
ముఖ్యంగా ఫోన్లో మాట్లాడడానికి బేసిక్ మోడల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. తద్వారా ట్రాక్ చేయడానికి అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. ఒకవేళ వారికి అనుమానం వస్తే వెంటనే సిమ్‌తో పాటు ఫోన్ కూడా మార్చేస్తారు. అంతే కాకుండా పోలీసులు తమ ఆచూకీ కనిపెట్టారని తెలియగానే అడ్రస్ మార్చేస్తూ ఉంటారు. పదే పదే ఆఫీసులు మార్చడం ఇలాంటి కంపెనీలకు అలవాటు. ఆఫీసు అవసరాల రీత్యా అలాంటి మార్పులు చేస్తున్నట్టు సిబ్బందికి చెబుతారు. ఒకే కంపెనీకి పలు బ్రాంచిలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తద్వారా పోలీసుల దాడుల నుంచి తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు పాటిస్తారు. అయితే చివరకు స్థానిక పోలీసులకు కూడా ముందుగా సమాచారం లీకు కాకుండా, ఆఖరి నిమిషంలో వారిని భాగస్వాములను చేయడం ద్వారా కొందరిని పట్టుకోగలిగామని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
టెలీకాలర్ ఉద్యోగాల పేరుతో నియామకం..
విశాఖ పోలీసులు 26 మందిని అరెస్ట్ చేయగా అందులో 23 మంది టెలీకాలర్స్ ఉన్నారు. వారు పూర్తిగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన తర్వాత వచ్చిన కస్టమర్లను తమ మాటలతో మైకంలో ముంచేపనిలో ఉంటారు.
ఆ యువతులందరికీ తాము మోసం చేస్తున్నట్టు అర్థమైనప్పటికీ, ఉపాధి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
వారంతా టెన్త్, ఇంటర్మీడియట్ మాత్రమే చదివినవారిగా గుర్తించారు. వారిని రిక్రూట్ చేసుకునే సమయంలో ఓ ఐటీ కంపెనీలో నియామకాలు చేసినట్టుగా, పత్రికలో ప్రకటన ఇచ్చి వారిని ఎంపిక చేశారని వివరించారు.
పత్రికా ప్రకటనలు కూడా పూర్తి వివరాలు లేకుండా కేవలం ఒక మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఆధారంగానే ఉంటాయి. స్థానిక పత్రికల్లోనే ఎక్కువగా ఇలాంటి ప్రకటనలు వస్తుంటాయి. ఎంపిక చేశాక రూ.15వేల జీతానికి వారిని టెలీకాలర్లుగా నియమించి, వారం పాటు శిక్షణ ఇస్తారు.
కాలర్లతో ఎలా స్పందించాలన్న అంశాలపైనే ఎక్కువగా శిక్షణ ఉంటుంది. వారిని ఆకర్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి పెడతారు.
ఈ శిక్షణ ఇచ్చేందుకు కూడా ఆయా కంపెనీల్లో కొందరు ప్రత్యేకంగా ఉంటారని పోలీసులు చెబుతున్నారు. శిక్షణ తర్వాత ఈ టెలీకాలర్లు ఎక్కువ మందిని వలలోకి లాగితే వారికి అదనంగా ఇన్సెంటివ్‌లు ఇస్తుంటారని తెలిపారు.
మొత్తానికి సుమారు 50,000 నుంచి 70,000 నెలసరి ఆదాయం ఉంటుంది.
వారితో పాటుగా అరెస్ట్ అయిన వారిలో ఒకరు హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి, మరొక వెబ్ డిజైనర్, ఒక ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు.
వారి నుంచి 40 బేసిక్ ఫోన్లు, 15 స్మార్ట్ ఫోన్లతో పాటుగా 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. నీలమ్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
2018లో ఇలాంటి కేసులలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
గత నెల 18 మందిని ఇటువంటి కాల్ సెంటర్ల నుంచి అరెస్ట్ చేశారు. వీరు అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన కస్టమర్ల నుంచి కోట్ల కొద్దీ డబ్బు కాజేశారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిని విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని విశాఖ సైబర్ క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ చెబుతున్నారు.

అరెస్టయిన యువతులు ఏమంటున్నారు..
25 ఏళ్ల నివేదిత (పేరు మార్చాం) తన పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత రెండేళ్లపాటు నిరుద్యోగిగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక స్నేహితురాలు వచ్చి నెలకు రూ.20,000 వచ్చే ఉద్యోగం ఉంది అనగానే ఎంతో ఉత్సాహంగా ఒప్పేసుకుంది. తను అలీపూర్‌లోని ఒక కాల్ సెంటర్‌లో పని చెయ్యాలి అని చెప్పగానే రెండు రోజుల వ్యవధిలో నివేదిత అక్కడ చేరింది.
తాను చేయాల్సిన పని తెలిసిన వెంటనే షాక్ అయ్యానని.. కానీ, ఉపాధి కోసం చేరానని నివేదిత చెప్పారు.
అరెస్ట్ అయిన తర్వాత నివేదిత ఇంట్లో ఈ మొత్తం వ్యవహారం తెలిసింది. నివేదితతో పనిచేసే వారంతా డేటింగ్ పేరు చెప్పి మగవారిని ముగ్గులోకి లాగుతారు. కాలేజీ యువతులను మాత్రమే కాకుండా బెంగాలీ యాక్టర్లను, మోడళ్లను కూడా డేట్ చేసే అవకాశం ఉందని నమ్మిస్తారు.
దేశమంతటా విస్తరించిన ఆన్‌లైన్ మాఫియా, 6 వెబ్‌సైట్లు బ్లాక్
ఆన్‌లైన్‌లో ఇలాంటి హనీట్రాప్ వ్యవహారాలు సాగించే ముఠాలు దేశమంతటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాము సేకరించిన డేటాని విశ్లేషిస్తే అనేక రాష్ట్రాల్లో బాధితులున్నట్టు తెలుస్తోందని విశాఖ పోలీసులు చెప్పారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటుగా మహారాష్ట్రవాసుల వివరాలు కూడా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఆయా రాష్ట్రాల పోలీస్ అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి ముఠాలు కొన్ని బయటకు వచ్చినట్టు తెలిపారు. దేశమంతటా విస్తరించిన ఈ ముఠా వెనుక మూలం ఎవరనేది విచారణ సాగించాల్సి ఉందన్నారు.
తాజా ఆపరేషన్ తర్వాత గోడాడీలో రిజిస్టర్ అయిన డొమైన్లు ఆరు గుర్తించి, వాటిని బ్లాక్ చేయించినట్టు వెల్లడించారు.
లైంగిక కాంక్ష తీర్చడం అనే అంశంలో పలు మోసాలకు ఆస్కారం ఏర్పడుతుందని సైకాలజిస్ట్ కర్రి రామారెడ్డి 'బీబీసీ'తో అన్నారు. వెబ్‌సైట్లలో అయితే ఎవరూ గుర్తించరనే కారణంగా ఇలాంటి ప్రయత్నాలు చేసి మోసపోతున్నారని అన్నారు.
కాగా అరెస్ట్ చేసిన వారిని కోల్‌కతా జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు వారందరూ బెయిల్ మీద బయట ఉన్నారు. విచారణ నిమిత్తం నిందితులందరిని విశాఖపట్నం తరలించడానికి విశాఖ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
(బీబీసీ కోసం కోల్‌కతా పోలీసుల నుంచి సమాచారాన్ని ప్రభాకర్ తివారీ; విశాఖపట్నం నుంచి సమాచారాన్ని విజయ్ గజం అందించారు.)
ఇవి కూడా చదవండి
- ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
- అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు అలెక్సీ లియోనోవ్ కన్నుమూత.. ఆ నడకలో జరిగిన ప్రమాదం ఏంటంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








