ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు :ప్రపంచ ఊబకాయ దినం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో ఊబకాయం 1975 నుంచి నేటికి మూడు రెట్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు చెప్తున్నాయి.
2016లో 190 కోట్ల మంది వయోజనులు అధిక బరువుతో ఉన్నారని ఈ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. వీరిలో 65 కోట్ల మందికి పైగా ఊబకాయులు ఉన్నారు.
ఏటా దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలను హరిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెప్తున్న ఈ ఊబకాయం ఒక ''మహమ్మారి'' అని వివిధ రంగాల్లో నిష్ణాతులు ఆందోళన వ్యక్తం చేయటం సరైనదేనని ఈ గణాంకాలు సమర్థిస్తున్నాయి.
అమెరికా మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సంస్థ మెకిన్సే 2014లో వేసిన అంచనా ప్రకారం.. ఈ ఊబకాయం మహమ్మారి వల్ల ఏటా 2 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు 142 లక్షల కోట్ల రూపాయలు) ఆర్థిక నష్టం సంభవిస్తోంది.
ఈ ఊబకాయం సమస్యను పరిష్కరించటానికి చేస్తున్న కృషిని.. పలు అపోహలు, దురభిప్రాయాలు దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు హెచ్చరిస్తున్నారు.
మరి.. 'ఊబకాయం మీద పోరాటం'లో ఈ అపోహలు, దురభిప్రాయాల్లో ఏవి నిజం, ఏవి కాదు అని నిరూపితమైనవి ఏమిటి?
సమాధానాలు ఆశ్చర్యం కలిగించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
''ఊబకాయం వ్యాధి కాదు.. ఐచ్ఛిక అంశం''
ఊబకాయం రుగ్మత ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. దేశ ప్రజల్లో 36 శాతం మందికి పైగా ఊబకాయులని అమెరికన్ ఆరోగ్య అధికారుల అంచనా.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 2013 నుంచీ ఊబకాయాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తోంది.
అయినా కూడా.. మెడ్‌స్కేప్ అనే న్యూస్ పోర్టల్ 2018లో వైద్య వృత్తినిపుణుల మీద నిర్వహించిన ఒక సర్వేలో.. అమెరికాలోని 36 శాతం మంది డాక్టర్లు, 46 శాతం మంది నర్సులు అది వ్యాధి కాదని భావిస్తున్నట్లు వెల్లడైంది.
ఊబకాయానికి ప్రధాన కారణం సదరు వ్యక్తులు ఎంచుకునే జీవన విధానమేనని 80 శాతం మంది డాక్టర్లు జవాబు చెప్పారు.
కానీ.. బ్రిటిష్ సైకలాజికల్ సొసైటీ గత సెప్టెంబర్ చివర్లో విడుదల చేసిన ఒక నివేదిక.. ''ఊబకాయం అనేదిక 'ఐచ్ఛికం' కాదు'' అని బలంగా ప్రకటించింది.
''శారీరక, మానసిక అంశాల సంక్లిష్ట సమ్మేళనంతో పర్యావరణ, సామాజిక ప్రభావాల కలయిక ఫలితంగా జనం అధికంగా బరువు పెరుగుతారు'' అని ఆ నివేదిక వివరించింది.
''కేవలం ఒక వ్యక్తికి సంకల్పబలం లోపించటం ఊబకాయానికి కారణం కాదు'' అని స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
''జన్యువులతో నిమిత్తం లేదు''
ఊబకాయానికి జన్యుపరమైన సంబంధాలు ఉన్నాయని శాస్త్ర పరిశోధనలు 1990ల నుంచే గుర్తిస్తున్నాయి.
జన్యుపరమైన అంశాల వల్ల కొంత మందిలో శరీర బరువు సూచీ (బాడీ మాస్ ఇండెక్స్ - బీఎంఐ) అధికంగా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. ఇటీవలి దశాబ్దాల్లో ఇది ఇంకా పెరుగుతోందని నర్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఓ పరిశోధనా బృందం గత జూలైలో కనుగొనింది.
మన శరీర బరువు ఆరోగ్యవంతంగా ఉందా లేదా అనేది చూడటానికి మన ఎత్తు, బరువును ఉపయోగించి లెక్కించే ప్రమాణాన్ని బీఎంఐగా వ్యవహరిస్తారు.
ఆ బృందం నార్వేలో దాదాపు 1,19,000 మంది బీఎంఐలను అనేకమార్లు లెక్కించి విశ్లేషించింది. నార్వే ప్రజల బీఎంఐ గత దశాబ్దాల్లో గణనీయంగా పెరిగిందని, అయితే కొంతమంది అధికంగా బరువు పెరగటానికి వారి జన్యువులు కారణమయ్యాయని ఈ బృందంలోని పరిశోధకులు గుర్తించారు.
''ప్రస్తుతం.. జన్యుపరమైన సమస్య ఉన్న ఓ 35 సంవత్సరాల నార్వే పురుషుడు.. అదే వయసులో ఉండి జన్యు సమస్య లేని ఇతరులతో పోలిస్తే సగటున 6.8 కిలోలు అధికంగా బరువు ఉంటారు'' అని పరిశోధక బృంద సభ్యురాలు మారియా బ్రాండ్కివిస్ట్ బీబీసీతో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''అధిక బరువు ఎల్లప్పుడూ అనారోగ్య కారకం''
అధిక బరువుకు, ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందీ, నిరూపితమైనది కూడా.
కానీ.. అధిక బరువు లేదా ఊబకాయం అనేది సదరు వ్యక్తి ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రమాదకరమే అనే అంశాన్ని ప్రశ్నిస్తున్న పరిశోధకుల సంఖ్య పెరుగుతోంది.
'ఒబేసిటీ పారడాక్స్' అంటే 'ఊబకాయ వైరుధ్యం' అనే అంశాన్ని బహిర్గతం చేసిన అతిపెద్ద అధ్యయనాన్ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ 2012లో ప్రచురించింది.
కొంత మందికి ఊబకాయం ఉన్నా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండవచ్చునని.. అటువంటి వారికి హృద్రోగాలు, క్యాన్సర్ వంటి వ్యాధులతో చనిపోయే ప్రమాదం సాధారణ బరువు ఉండే వారికన్నా ఎక్కువగా ఏమీ ఉండదని ఆ అధ్యయనంలో గుర్తించారు.
వారికి ఇతర ఊబకాయుల కన్నా ఎక్కువ స్థాయి శారీరక దృఢత్వం ఉంటుందని, అధిక కొవ్వు, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వారికి ఉండవని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ఫ్రాన్సిస్కో ఓర్టెగా పేర్కొన్నారు. ఆయన స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రానడాలో పనిచేస్తున్నారు.
''ఊబకాయం ఉన్న వారందరికీ ఒకే రకమైన రోగనిర్ధారణ ఉండదన్న విషయాన్ని వైద్యులు పరిగణనలోకి తీసుకోవాలి'' అని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
''కేలరీలన్నీ సమానం''
బరువు నిర్వహణ విషయంలో అన్నీ ప్రధాన సూత్రాలు కాబోవు. అయితే.. ఆహారంలో కేలరీల పరిమాణం కన్నా నాణ్యత మీద దృష్టి కేంద్రీకరించవద్దా?
వయోజనులు ఆరోగ్యవంతమైన ఆహారంలో.. రోజుకు 2,000 కేలరీలు స్వీకరించటం ఒక మార్గదర్శకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
అయితే.. మనం తీసుకునే మొత్తం కేలరీల్లో కొవ్వుల నుంచి వచ్చే శక్తి 30 శాతం కన్నా తక్కువ ఉండాలంటూ పలు సూచనలు కూడా చేసింది.
కేలరీ అంటే కేవలం కేలరీ మాత్రమే కాదని.. కొన్ని రకాల ఆహారాలు దీర్ఘకాలంలో బరువు పెరగటానికి దోహదం చేస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ 2011లో ప్రచురించిన ఒక అధ్యయనం చెప్తోంది.
ఆ అధ్యయనం కోసం పరిశోధకులు 1,20,000 మంది స్త్రీ, పురుషులను 20 ఏళ్ల పాటు పరిశీలించింది.
వారిలో ఓ సగటు వ్యక్తి ప్రతి నాలుగేళ్లకు 1.36 కిలోల చొప్పున 20 ఏళ్లలో 7.6 కిలోల బరువు పెరిగారు.
పిండిపదార్థాలు, శుద్ధిచేసిన గింజలు, కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల బరువు పెరగటం కూడా ఎక్కువగా ఉంది. కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ తినటం వల్లనే ప్రతి నాలుగేళ్లకు సుమారు 1.5 కిలోల బరువు పెరిగితే.. కూరగాయలు తినటం వల్ల 0.09 కిలోల బరువు మాత్రమే పెరిగారు.
''ఏవైనా నిర్దిష్ట ఆహారాలు, పానీయాలు తీసుకోవటం తగ్గించటం లేదా పెంచటం చేయాలనుకున్నపుడు.. తక్కువ కేలరీలు తీసుకునేలా సాయపడే వ్యూహాలు మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చు'' అని ఆ అధ్యయనం సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
''బరువు తగ్గే లక్ష్యాలు వాస్తవికంగా ఉండాలి''
అధిక అంచనాలకు దూరంగా ఉండటం జీవితంలో మంచి సూత్రం కావచ్చు.
అయితే.. బరువు తగ్గే విషయంలో అధిక అంచనాలతో లక్ష్యాలు నిర్దేశించుకోవటానికి - తగ్గే బరువుకు మధ్య ప్రతికూల సంబంధమేమీ లేదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్‌లో వివరించిన 2017 నాటి ప్రయోగం ప్రకారం.. తీవ్ర ఊబకాయం ఉన్న 88 మందిలో బరువు తగ్గటం కోసం అధిక లక్ష్యాలు నిర్దేశించుకోవటం మెరుగైన ఫలితాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
''ఊబకాయం సమస్య ధనిక దేశాలకే పరిమితం''
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఊబకాయం రేట్లు నిజంగానే అధికంగా ఉన్నా కూడా.. ఈ విషయంలో ప్రపంచ దేశాల ర్యాంకులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఊబకాయం విస్తృతి పసిఫిక్ దీవుల్లో అత్యధికంగా ఉంది. అమెరికన్ సమోవా దీవుల్లో దాదాపు 75 శాతం మంది జనాభాను ఊబకాయులుగా పరిగణిస్తున్నారు.
ఈ దీవి దేశాల్లో జనాభా చాలా తక్కువ అనేది నిజమే. కానీ.. అధిక జనాభా గల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఊబకాయం సమస్య పెరుగుతోంది - ఈజిప్టు, టర్కీల్లో జనాభాలో 32 శాతం మంది ఊబకాయులని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెప్తున్నాయి.
నిజానికి.. తక్కువ ఆదాయం ఉండే వ్యక్తులే ఎక్కువగా ఊబకాయానికి లోనవుతుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి.
''ఊబకాయం అనేది సామాజిక అసమానతల వల్ల పుట్టే ఉత్పత్తి. అమెరికాలో ఊబకాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం అర్కాన్సాస్.. మొత్తంగా పేద రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. అత్యంత పేద రాష్ట్రమైన మిసిసిపి కూడా అధిక బరువు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది'' అని మార్టిన్ కోహెన్ అనే రచయిత పేర్కొన్నారు. ఆహార సమాజశాస్త్రం మీద 'ఐ థింక్ బిఫోర్ ఐ ఈట్' అనే పుస్తకం రాశారు.
బ్రిటన్‌లో వెనుకబాటు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకన్నా.. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే చిన్నారుల్లో ఊబకాయం రెట్టింపు సంఖ్యలో ఉందని నేషనల్ హెల్త్ సర్వీస్ 2015-16 గణాంకాలు చెప్తున్నాయి.
ఈ తేడాకు ప్రధాన కారణం.. ఆరోగ్యవంతమైన ఆహారం మరింత ఖరీదైనది కావటమేనని నిపుణులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఊబకాయానికి చనుబాలకు సంబంధం లేదు''
ఇటీవలి కొన్ని దశాబ్దాల్లో.. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఫార్ములా పాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కానీ.. పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశాలను చనుబాలు తాగించటం వల్ల తగ్గించవచ్చునని గత ఏప్రిల్‌లో ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ఒకటి చెప్తోంది.
శాస్త్రవేత్తలు 16 యూరప్ దేశాలకు చెందిన 30,000 మంది చిన్నారులను విశ్లేషించి.. చనుబాలు తాగని పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశం 22 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు.
మహిళలు చనుబాలు తాగించే కుటుంబాల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి వంటి అంశాలకు కూడా పిల్లలకు ఊబకాయం నుంచి రక్షణ కల్పించటంలో పాత్ర ఉంటుందని నిపుణులు చెప్తున్నప్పటికీ.. ఊబకాయానికి వ్యతిరేకంగా చనుబాల వల్ల కలిగే ప్రయోజనాలు నిర్ద్వంద్వమని డబ్ల్యూహెచ్ఓ అధ్యయన రచయిత జావో బ్రెడా పేర్కొన్నారు.
''చనుబాలు తాగించటం వల్ల నిజంగా బలమైన రక్షణ లభిస్తుంది. అందుకు ఆధారాలున్నాయి. దానివల్ల ప్రయోజనం అద్భుతమైనది. కాబట్టి ఈ విషయం జనానికి చెప్పాలి'' అని ఆమె ఉద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి:
- జపాన్ ఎందుకంత క్లీన్గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- మోదీ- షీ జిన్పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు
- భర్త, అత్తమామలు సహా ఆరుగురిని ‘విషమిచ్చి చంపిన ఆదర్శ కోడలు’
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కశ్మీర్: నేతలంతా నిర్బంధంలో ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








