పసిఫిక్ దేశాధినేతలంతా బరువు తగ్గాలంటున్న టోంగా ప్రధాని

స్థూలకాయ సమస్యపై పోరాడుతున్న టోంగా ప్రధాని పోహివా (కుడివైపు వ్యక్తి)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్థూలకాయ సమస్యపై పోరాడాలంటున్న టోంగా ప్రధాని పోహివా (కుడివైపు వ్యక్తి)

పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశమైన టోంగో ప్రధానమంత్రి అకిలిసి పోహివా తమలాంటి ఇతర పసిఫిక్ ద్వీపదేశాల ప్రధాన మంత్రులకు ఓ సవాల్ విసిరారు. ఆయా దేశాల ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు గాను ఏడాది పాటు బరువు తగ్గే పని పెట్టుకోవాలంటూ చాలెంజ్ చేశారు.

అంతేకాదు, వచ్చే నెల జరగబోయే ఈ ద్వీప దేశాల ప్రధానుల సమావేశంలోనూ దీనిపై చర్చించి పోటీ పెట్టుకుంటామని పోహివా తెలిపారు.

గత ఏడాది సమోవాలో సమావేశమైన పసిఫిక్ ద్వీపదేశాల ప్రధానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత ఏడాది సమోవాలో సమావేశమైన పసిఫిక్ ద్వీపదేశాల ప్రధానులు

టోంగో ప్రధాని ఇలా బరువు తగ్గే సవాల్ విసరడానికి ఓ కారణముంది. ప్రపంచంలో స్థూలకాయం రేటు అధికంగా ఉన్న దేశాల జాబితాలో పసిఫిక్ ద్వీప దేశాలే మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.

దీంతో తమ దేశాల్లో ప్రధాన సమస్యగా ఉన్న ఈ స్థూలకాయంపై పోరాడాలని సంకల్పించిన ఆయన అందుకు దేశాధినేతలతోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఈ చాలెంజ్ చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం కొన్ని పసిఫిక్ దేశాల్లో 90 శాతం ప్రజలు అధిక బరువు, స్థూలకాయ సమస్యను ఎదుర్కొంటున్నారు.

విరివిగా దొరికే చేపలు, కొన్ని రకాల కూరగాయల వంటి ఇక్కడి సంప్రదాయ ఆహారంతో పాటు ప్రాసెస్డ్‌ ఫుడ్ దిగుమతులు, అధిక కొవ్వు ఉండే మాంసాహారం కారణంగా ఈ దేశాల్లో స్థూలకాయ సమస్య తీవ్రంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక చెబుతోంది.

పసిఫిక్ దేశాల్లో సముద్ర ఉత్పత్తులను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పోహివా.. హృద్రోగాలు, మధుమేహం, పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలపై పోరాడడంలో ఈ ప్రాంతం విఫలమైందంటూ ఆక్షేపించారు.

''ప్రతిదీ మార్చుకోవాలి. ఆహారం, జీవనశైలి అంతా మారాలి. చాలా క్లిష్ట సమస్య ఇది'' అన్నారాయన.

''పసిఫిక్ ప్రాంత నేతలం కలిసి దీనిపై ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ, దీనిపై తీసుకుంటున్న చర్యలేవీ ఫలించడం లేదు. ఇవేమీ పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు'' అని పోహివా విచారం వ్యక్తంచేశారు.

''ఎవరు ఎక్కువ బరువు తగ్గుతారన్నది విషయం కాదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తక్కువ తినడంతో పాటు ఆరోగ్యకర మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి.''

''మొదట నేతలు ఇలాంటి మనస్తత్వాన్ని అలవర్చుకుంటే, అప్పుడు వారు తమ ప్రజలను కూడా అదే దిశగా నడిపించగలుగుతారు'' అని పోహివా చెప్పారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)