న్యూటెల్లా తయారీకి వాడే గింజలను పిల్లలు సేకరిస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిమ్ వేవెల్
- హోదా, బీబీసీ న్యూస్, టర్కీ
ప్రపంచంలో మొత్తం ఉత్పత్తి అయ్యే హజెల్ నట్స్‌లో దాదాపు మూడొంతులు టర్కీ నుంచే వస్తుంది.
న్యూటెల్లా తయారు చేసే ఫెర్రెరో కంపెనీ ఈ హజెల్ నట్స్ కొనుగోలు చేసే అతిపెద్ద సంస్థ. కానీ, ఈ గింజలను ప్రధానంగా సేకరించేది వలస వచ్చిన కూలీలు, పిల్లలు.
చాలా తక్కువ జీతాలకు ఎక్కువ గంటలు వారు పని చేస్తున్నారు. అయితే, ఫెర్రెరో సంస్థ తన ఉత్పత్తుల కోసం బాల కార్మికులపై ఆధారపడకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తోంది?
''హజెల్ నట్స్ పేరు వినగానే నా మనసుకు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా కష్టమైన పని'' అని 35 కేజీల గింజలను ఒక సంచిలో భుజానికి మోసుకుంటూ చెప్పారు మెహ్మెట్ కెలేక్కి.
టర్కిష్ పర్వతసానువుల్లో అతని చుట్టూ తోటి కుర్దిష్ వలస కార్మికుల కుటుంబం హాజెల్ చెట్ల మధ్య నెమ్మదిగా కదులుతోంది.
ఇది చాలా శ్రమతో కూడుకున్నది. రోజుకు సుమారు 10 గంటల పాటు ఏటవాలుగా నడుస్తూ అడుగులు తడబడకుండా గింజలను సేకరించాలి.

ఫొటో సోర్స్, Reyan Tuvi
కుర్దిష్ వలస కార్మికుల కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ముస్తఫా, మొహ్మద్ అక్రమంగా పనిచేస్తున్నారు. వారిలో ఒకరికి 12 ఏళ్లు మరికొకరికి 10 ఏళ్లు ఉంటాయి.
వారిద్దరికి ఆ దేశ కనీస పని వయస్సు కంటే తక్కువ వయసు ఉంది.
టర్కీలోని నల్ల సముద్రం తీరం వెంట ఆగస్టులో పంట చేతికి వస్తుంటుంది. ప్రపంచంలోని హజెల్ నట్ ఉత్పత్తిలో 70శాతం పంట ఇక్కడి నుంచే వస్తుంది.
ఇక్కడ హజెల్ నట్ సేకరించేవారిలో చాలా మంది వలసవచ్చిన కుర్దీలే. వెనకబడిన దక్షిణ, తూర్పు టర్కీ ప్రాంతాల నుంచి వారు వస్తుంటారు.
గింజల సేకరణకు స్థానిక అధికారులు నిర్ణయించిన వేతన రేటు రోజుకు 95 లీరాలు(రూ.1,067). కానీ, టర్కిష్ కనీస వేతనం చట్టం కంటే ఈ మొత్తం చాలా తక్కువ.
కానీ, ఈ ముస్తఫా, మొహ్మద్‌ల కుటుంబం ఇంతకంటే తక్కువ వేతనమే అందుకుంటుంది. రోజుకు గరిష్టంగా 65 నుంచి 50 లీరాలు మాత్రమే వీరి కుటుంబానికి వస్తోంది.
పని ఇచ్చే కాంట్రాక్టర్‌కు 10 శాతం కమీషన్, ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి రవాణా చార్జీలు, మిగిలిన ఖర్చులు తీసేస్తే వీరికి చాలా తక్కువ మొత్తమే మిగులుతోంది.

ఫొటో సోర్స్, Reyan Tuvi
ఇక్కడి పండ్ల తోటల సహయజమాని కాజీమ్ యమన్ మాట్లాడుతూ, తాను పిల్లలతో పనిచేయించడానికి వ్యతిరేకం అని చెప్పారు.
"వారు తమ పిల్లలను యంత్రాల్లా పని చేయిస్తున్నారు. ఎంత మంది పిల్లలుంటే ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు'' అని తల్లిదండ్రుల తీరు గురించి చెప్పుకొచ్చారు.
''ఇక్కడ చాలా మంది పిల్లలను పనిలో పెట్టడాన్ని అంగీకరిస్తున్నారు. దీంతో పిల్లలకు డబ్బులు చెల్లించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలు పని చేయాలని పట్టుబడుతున్నారు'' అని ఆయన తెలిపారు.
టర్కీలో దాదాపు 4 లక్షల మంది యాజమాన్యంలో హజెల్ నట్ తోటలు ఉన్నాయి. ఇందులో కొన్ని చాలా తక్కువ ఎకరాల్లో ఉన్నవి కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reyan Tuvi
ఫెర్రెరో కంపెనీ న్యూటెల్లా, కిండర్ చాక్లెట్లను తయారు చేస్తుంది. ఇది టర్కీలో ఉత్పత్తి అయ్యే మొత్తం హజెల్ నట్స్‌లో మూడో వంతు కొనుగోలు చేస్తుంది.
ఒక ఏడాది ఉత్పత్తి అయ్యే న్యూటెల్లా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బరువుకు (3,65,000 టన్నులు) సమాన స్థాయిలో ఉంటుంది.
హజెల్ నట్స్ సాగు, ఉత్పత్తితో ఎలాంటి సంబంధం లేని ఫెర్రెరో కంపెనీ తన వెబ్‌సైట్‌లో మాత్రం, ''ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను పాటించడం చాలా ముఖ్యం'' అని పేర్కొంది.
నల్ల సముద్ర తీర పట్టణం ఓర్డులో హజెల్ నట్స్ సాగు చేసే రైతులలో ఇంగినే అక్కే ఒకరు. ఫెర్రెరో కంపెనీకి కూడా ఈయన అమ్ముతుంటారు.
అయితే, ఫెర్రెరో కంపెనీ తమను సాగు గురించి, పంట ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం గురించి ఎప్పుడూ అడగలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reyan Tuvi
''బాల కార్మికులతో మాకు సంబంధం లేదు. దీనికి సంబంధించిన నియంత్రణ, పర్యవేక్షణ ప్రభుత్వానికి సంబంధించినది'' అని ఆయన పేర్కొన్నారు.
ఉస్మాన్ కాక్మక్ వంటి మధ్యవర్తులు.. రైతుల నుంచి హజెల్ నట్స్‌ను కొనుగోలు చేసి ఫెర్రెరో లాంటి కంపెనీలకు విక్రయిస్తుంటారు.
''ఏ రైతు పండించిన పొలం నుంచి ఈ గింజలను సేకరించారని ఫెర్రెరో కంపెనీ తమను ఎప్పుడూ అడగలేదు'' అని ఆయన చెప్పారు.
''నేను కొంటాను, అమ్ముతాను. టన్నుల కొద్దీ నా దగ్గరకు వచ్చే హజెల్ నట్స్ గురించి పర్యవేక్షించడం సాధ్యమయ్యే పనికాదు'' అని ఆయన తెలిపారు.
''వారికి సొంత వ్యవసాయ క్షేత్రాలు లేకుంటే, ఏ గింజలు ఏ రైతు నుంచి వస్తున్నాయో వారికి తెలియదు'' అని ఫెర్రెరో గురించి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫెర్రెరో సంస్థ హజెల్ నట్స్ సేకరణకు బాలకార్మికులను ఉపయోగించలేదని ఖచ్చితంగా చెప్పవచ్చా?
టర్కీలోని ఫెర్రెరో హజెల్ నట్ కంపెనీ జనరల్ మేనేజర్ బామ్సీ అకిన్ ఇచ్చిన ఒక అరుదైన ఇంటర్వ్యూలో, ''అనైతిక పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన వాటిని మేం కనీసం తాకను కూడా తాకం.
శిక్షణ ద్వారా సామాజిక పద్ధతులను మెరుగుపరచడానికి మేం మా వంతుపాత్ర పోషిస్తున్నాం. అయితే వ్యవస్థ పూర్తి స్వచ్ఛంగా ఉందా అనేది ఈ సమయంలో ఎవరూ చెప్పలేరని నా అభిప్రాయం'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reyan Tuvi
హజెల్ నట్స్‌ను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారనేది ఫెర్రెరో తమను అడగలేదని వ్యాపారులు, రైతులు చెప్పిన విషయాన్ని బీబీసీ ఆయన వద్ద ప్రస్తావించగా,
అకిన్ స్పందిస్తూ, ''మేం ఎవరని ప్రశ్నలు అడగడం లేదు. కానీ, వేరే కోణం నుంచి పర్యవేక్షించే సాధనాలు మా దగ్గర ఉన్నాయి. సీజన్ ప్రారంభమయ్యే ముందు మేం వారితో (వ్యాపారులతో) మాట్లాడుతాం'' అని పేర్కొన్నారు.
''వ్యాపార రహస్యాలు పక్కన పెడితే హజెల్ నట్స్ అమ్మే మధ్యవర్తుల పేర్లు మా వద్ద ఉన్నాయి. కావాలంటే వారి వివరాలు మీకు అందిస్తాం. అయితే, రైతుల వివరాలకు సంబంధించి గ్యారెంటీ ఇవ్వలేను'' అని పేర్కొన్నారు.
''ఫెర్రెరో తమ వినియోగదారుల విషయంలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటుంది'' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?
- ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం: కులవివక్షను అధిగమించిన ఈ ఆలయంలో 11 తరాలుగా పూజారులంతా దళితులే
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








