వెజిటేరియన్లకు.. పక్షవాతం ప్రమాదం ఎక్కువా?

ఫొటో సోర్స్, Getty Images
వీగన్, వెజిటేరియన్ ఆహారం తీసుకునే వారికి హృద్రోగ ప్రమాదాలు తక్కువగా ఉంటాయని.. కానీ స్ట్రోక్ (పక్షవాతం) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఓ ప్రధాన అధ్యయనం సూచిస్తోంది.
మాంసాహారులతో పోలిస్తే.. ప్రతి వేయి మంది వీగన్లు, శాఖాహారుల్లో 10 హృద్రోగ ఉదంతాలు తక్కువగా ఉంటే.. స్ట్రోక్ ఉదంతాలు మూడు ఎక్కువగా ఉన్నాయి.
ఈ అధ్యయనంలో భాగంగా 48,000 మందిని దాదాపు 18 ఏళ్ల పాటు పరిశీలించారు. ఈ పరిశోధన ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించింది.
అయితే.. ఈ ప్రభావాలకు కారణం వారి ఆహారమేనా లేక వారి జీవనశైలిలోని ఇతర అంశాలేవైనానా అనేది ఆ అధ్యయనం నిరూపించలేదు.
ప్రజల ఆహార ప్రాధాన్యతలు ఏవైనా కానీ.. విస్తృత రకాల ఆహారాలు తీసుకోవటం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనంలో తెలిసిందేమిటి?
ఆహారం - ఆరోగ్యాల మీద దీర్ఘకాలంగా నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టు ఇపిక్-ఆక్స్‌ఫర్డ్‌లో గుర్తించిన సమాచారాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు.
ఆ పరిశోధన కోసం 1993 - 2001 మధ్య ఎంపిక చేసిన వారిలో సగం మంది మాంసాహారులు ఉంటే.. సుమారు 16,000 మంది శాఖాహారులు కానీ వీగన్లు కానీ ఉన్నారు. మరో 7,500 మంది తాము చేపలను ఆహారంగా తీసుకుంటామని చెప్పారు.
వారు తొలుత ఈ అధ్యయనంలో చేరినపుడు వారి ఆహారాల గురించి అడిగారు. మళ్లీ 2010లోనూ అవే వివరాలు సేకరించారు. వారి ఆరోగ్య చరిత్ర, ధూమపానం అలవాట్లు, శారీరక కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
మొత్తం సుమారు 48,000 మందిలో హృద్రోగ వ్యాధులు నమోదైతే.. 1,072 స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. ఈ స్ట్రోక్ కేసుల్లో మెదడులో రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగిన ఉదంతాలు 300 ఉన్నాయి.
మాంసాహారులతో పోలిస్తే చేపలు తినే వారిలో హృద్రోగాల ప్రమాదం 13 శాతం తక్కువగా ఉంది. అదే వెజిటేరియన్లు, వీగన్లలో ఈ ప్రమాదం 22 శాతం తక్కువగా ఉంది.
కానీ.. శాఖాహారుల్లో స్ట్రోక్ ప్రమాదం 20 శాతం అధికంగా ఉంది. దీనికి కారణం బీ12 విటమిన్ తక్కువగా ఉండటం కావచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే దీనిపై మరింతగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.
ఈ అనారోగ్యాల ప్రమాదం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటానికి వారు తీసుకునే ఆహారాలతో సంబంధం లేకపోవచ్చు కూడా. మాంసాహారం తినని వారి జీవితాల్లో ఇతర తేడాలు కూడా ఈ ప్రమాద శాతాల్లో తేడాలకు కారణం కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
శాఖాహారం, వీగన్ ఆహారాలు ఆరోగ్యకరం కాదని ఈ అధ్యయనం చెప్తోందా?
అలా చెప్పటం లేదని బ్రిటిష్ డయటిటిక్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ ఫ్రాంకీ ఫిలిప్స్ పేర్కొన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక పరిశీలనా అధ్యయనం మాత్రమే.
''ఈ అధ్యయనం కోసం జనం ఏం తింటున్నారు అనేది గమనిస్తూ వారిని కొన్నేళ్ల పాటు పరిశీలించారు. కాబట్టి ఈ రెండిటికి సంబంధం ఉండవచ్చు అనే అంచనా మాత్రమే ఇది. కారణం - ప్రభావం పరిశోధన కాదు'' అని ఆమె చెప్పారు.
ఈ అధ్యయనం అందరికీ ఇచ్చే సందేశం ఏమిటంటే.. మంచి ప్రణాళికతో ఆహారం తీసుకోవటం మేలు.. అనేక రకాల ఆహారాలను తినాలి.
''మాంసాహారులు అనేక రకాల ఆహారాలు తీసుకుంటారనేమీ లేదు. ఎందుకంటే వాళ్లు ప్రతి రోజూ రాత్రి భోజనంలో మాంసం, బంగాళా దుంపలనే ఉపయోగిస్తుండవచ్చు. కూరగాయలేమీ తింటుండకపోవచ్చు'' అని డాక్టర్ ఫ్రాంకీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనం మొదలైన తర్వాత జనం తింటున్న ఆహారం మారిందా?
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి ఆహార అలవాట్ల గురించి మొదట తెలుసుకున్న పరిశోధకులు మళ్లీ 2010లో వారి ఆహార వివరాలను అడిగారు.
అయితే.. వేగన్, శాఖాహారాలు మారిపోయాయి ఉంటాయని డాక్టర్ ఫ్రాంకీ పేర్కొన్నారు.
''ఇది రెండు దశాబ్దాల కిందట సేకరించిన సమాచారం. ఓ 20, 30 ఏళ్ల కిందటి శాఖాహారం, వేగన్ ఆహారం కన్నా నేటి వేగన్, శాఖాహారాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి'' అని చెప్పారు.
శాఖాహారం, వేగన్ ఆహారాల విస్తృతి భారీగా పెరిగిందని చాలా వరకూ ప్రధాన స్రవంతిలో ఉందని తెలిపారు.
శుద్ధిచేసిన ఎర్రటి మాంసం తినటంతో సంబంధం ఉండే ఆరోగ్య ప్రమాదాల గురించి మనకు మరిన్ని విషయాలు తెలుసు. దానివల్ల పేగు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి మన ఆహారంలో ఏమేం ఉండాలి?
- మనం ఆహార ప్రాధాన్యత ఏ తరహాదైనా కానీ.. మనకు అవసరమైన ఆహారాలు సమతుల్యంగా ఉండాలని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సేవ ఈట్‌వెల్ గైడ్ చెప్తోంది.
- రోజుకు కనీసం ఐదు భాగాలు పండ్లు, కూరగాయలు తినాలి
- భోజనంలో పీచు పదార్థాలు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే అన్నం, రొట్టె, ఆలుగడ్డలు, పాస్టా వంటివి తినాలి
- మాంసకృత్తులను విస్మరించకూడదు - తేలికపాటి మాంసం, చేపలు, సముద్ర ఆహారం, పప్పులు, ఉప్పువేయని గింజలు, టోఫు వంటివి తీసుకోవాలి
- పాల ఉత్పత్తులు లేదా వాటి ప్రత్యామ్నాయాలను ఆహారంలో తీసుకోవాలి
- కొవ్వు, చక్కెరలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువ మోతాదులో తక్కువ సార్లు తీసుకోవాలి
అయితే.. వీగన్లు, శాఖాహారులు కొన్ని నిర్దిష్ట పోషకాలు తగినంతగా అందటం కోసం.. ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఉదాహరణకు మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు తినేవారిలో సాధారణంగా.. ఆరోగ్యవంతమైన రక్త, నాడీ వ్యవస్థలకు అవసరమైన విటమిన్ బీ12 తగినంత ఉంటుంది.
అయితే వీగన్లు విటమిన్ బీ12తో లభించే అల్పాహార సెరియల్స్ వంటి కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటున్నప్పటికీ.. వారికి ఇది తగినంతగా అందకపోవచ్చు.
ఐరన్‌ను కూడా మన శరీరం శాఖాహారాల ద్వారా శోషించుకోవటం కొంచెం కష్టం. కాబట్టి మాంసాహారం తినని వారు.. పూర్ణధాన్యాలతో చేసిన రొట్టెలు, ఎండు పండ్లు, పప్పులు వంటి ఆహారాలను తీసుకోవాలి.
అలాగే.. మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైన ఖోలైన్ అనే పోషకం కూడా తగినంతగా లభించేలా వేగన్లు శ్రద్ధ పెట్టాలని గత నెలలో నిపుణులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- అస్సాం: "రక్తమిచ్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్నే చంపేశారు".. ఎందుకు?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- చంద్రయాన్-2పై పాకిస్తాన్ అక్కసు.. ‘అభినందన్ ఇడియట్’ అంటూ పాక్ మంత్రి ట్వీట్లు
- ఇస్రో చైర్మన్ శివన్ కన్నీటి పర్యంతం.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది
- చంద్రయాన్-2 సామాన్య ప్రజలకు కూడా ఎందుకంత కీలకం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








