అస్సాం తేయాకు తోటలో దాడి: "రక్తమిచ్చి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌నే చంపేశారు".. ఎందుకు?

అపరాజిత దత్తా
    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

"నా భర్త మరణంతో నేను అంతా కోల్పోయాను. ప్రాణాలు కాపాడేవారిని అంత క్రూరంగా చంపేందుకు చేతులెలా వస్తాయి? ఈ తేయాకు తోటలో నా భర్త ఒక కార్మికుడి ప్రాణాలను తన రక్తం ఇచ్చి కాపాడారు. ఇది 1984లో జరిగింది. ఈ మాట నిజమో, కాదో వాళ్లనే (తేయాకు కార్మికులను) అడగండి. అంత చేసిన నా భర్తను వాళ్లు ఎందుకు చంపేశారు?"- 61 ఏళ్ల అపరాజిత దత్తా గద్గద స్వరంతో అడిగిన ప్రశ్న ఇది.

తన భర్త డాక్టర్ దేవేన్ దత్తా ఫొటోను చూపిస్తూ ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు.

అస్సాంలోని జోర్హాట్ జిల్లా ‘టియోక్ టీ గార్డెన్‌'లో ఆగస్టు 31న తేయాకు కార్మికులు ఆయన్ను కొట్టి చంపారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే తేయాకు తోటలో 30 ఏళ్లుగా ఆయన వైద్యసేవలు అందిస్తున్నారు.

ఒక కార్మికుడి ప్రాణాలు కాపాడలేకపోయారంటూ ఆయనపై ఇతర కార్మికులు దాడికి పాల్పడ్డారు.

దేవేన్ దత్తా వయసు 73 సంవత్సరాలు. ఆయన మృతి తర్వాత ఆస్పత్రిని మూసేశారు.

అపరాజిత దత్తా

ఇందులో మగవారికి, ఆడవారికి రెండు గదుల్లో వేర్వేరు వార్డులు ఉన్నాయి. మొత్తం 12 పడకలు ఉన్నాయి.

రెండు వార్డులకు మధ్యలో వైద్యుల చాంబర్ ఉంది. ఆగస్టు 31 ఘటన జరిగినప్పటి నుంచి దీనిని మూసేశారు.

చాంబర్ కిటీకి అద్దం పగిలిపోయి ఉంది. అందులోంచి చూస్తే డాక్టర్ దత్తా కూర్చునే ప్రదేశం, అక్కడున్న టేబుల్‌పై రక్తసిక్తమైన నీలి రంగు వస్త్రం కనిపించాయి.

కర్టెన్లపై పడిన రక్తపు మరకలు దాడి తీవ్రతను చెబుతున్నాయి.

పగిలిన అద్దం

ఈ తేయాకు తోటలోనే దేవేన్ తన వైద్యవృత్తిని ప్రారంభించారని, ఇక్కడే పదవీ విరమణ చేశారని, ఆయన అంకితభావాన్ని గుర్తించి కంపెనీ తిరిగి తీసుకొందని అపరాజిత వివరించారు.

"ఈ తోటలో లెక్కలేనంత మంది కార్మికుల ప్రాణాలను ఆయన కాపాడారు. వాళ్లే ఆయన్ను చంపేశారు" అంటూ ఆమె భోరుమన్నారు.

దేవేన్ కుమార్తె సుమీ మాట్లాడుతూ- తన తండ్రి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.

"వైద్యులు ప్రాణం పోస్తారు, వాళ్ల ప్రాణాలనే తీస్తే ఏమనాలి? ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలి. నా తండ్రిని చంపినవారిని ఉరితీయాలి" అని ఆమె చెప్పారు.

టియోక్ టీ ఎస్టేట్

దేవేన్‌పై దాడి ప్రత్యక్ష సాక్షి అయిన 27 ఏళ్ల మనోజ్ మాఝీ బీబీసీతో మాట్లాడుతూ- ఆగస్టు 31న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఈ దాడి జరిగిందన్నారు. తేయాకు తోటలోని మాజ్ లైన్ ప్రాంతంలో నివసించే 33 ఏళ్ల సామ్రా మాఝీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తోటలోని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు.

"అప్పటికే దేవేన్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. సామ్రాను ఆస్పత్రికి తీసుకెళ్లిన విషయం తెలియగానే నేను కూడా వెళ్లాను. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తోటకు చెందిన అంబులెన్సు సామ్రా నివాసం వద్దకు వెళ్లకపోవడంతో బంధువులు కోపంగా ఉన్నారు. సామ్రాను తీసుకొచ్చాక కొద్దిసేపటికి దేవేన్ ఆస్పత్రికి చేరుకున్నారు. నర్సులు కూడా వచ్చారు. అనంతరం సామ్రాకు సెలైన్ పెట్టారు. ఒక ఇంజక్షన్ కూడా ఇచ్చారు. కానీ ఇంతలోనే సామ్రా చనిపోయారు" అని మనోజ్ చెప్పారు.

మనోజ్
ఫొటో క్యాప్షన్, మనోజ్

అప్పటికే ఆస్పత్రి వద్ద కార్మికులు గుమికూడారని ఆయన తెలిపారు. "డాక్టర్ చేయగలిగిందంతా చేశారు. కానీ ఆయన డ్యూటీ మూడు గంటలకే మొదలైనా ఆయన ఆలస్యంగా వచ్చారని వారు అప్పుడు కోపంగా ఉన్నారు" అని ఆయన తెలిపారు.

వైద్యులు, వైద్యసిబ్బంది సమయానికి ఆస్పత్రికి వచ్చి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని మనోజ్ అభిప్రాయపడ్డారు.

దేవేన్‌పై దాడి కేసులో సెప్టెంబరు మూడో తేదీ రాత్రి మనోజ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారని 'అస్సాం టీ ట్రైబ్ అసోసియేషన్' జోర్హాపుట్ విభాగ నాయకుడైన టంకేశ్వర్ రాజ్‌పుత్ తెలిపారు.

డాక్టర్ దేవేన్ కుమారుడు, కుమార్తె
ఫొటో క్యాప్షన్, డాక్టర్ దేవేన్ కుమారుడు, కుమార్తె

దాడి ఎలా జరిగింది?

కార్మికుడు మరణించారని తెలియగానే ఇతర కార్మికులు ఆస్పత్రి వద్ద గుమికూడటం మొదలైందని మనోజ్ చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలో నిలబడి ఉన్న కొందరు వైద్యుడిని దుర్భాషలాడారని తెలిపారు. అప్పటికే ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారని, వీరిలో కొందరు వైద్యుడి చాంబర్‌లోకి ప్రవేశించారని చెప్పారు. వారిని అడ్డుకొనేందుకు ఇతరులు ప్రయత్నించారని, పోలీసులూ చేరుకున్నారని, కానీ ఏమీ చేయలేకపోయారని వివరించారు.

పోలీసుల సమక్షంలోనే కార్మికులు దేవేన్‌ను కొట్టడం మొదలుపెట్టారు. కొందరు తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలు ధ్వంసం చేశారు. దీనివల్ల వైద్యుడి కాలిలో రక్తనాళం తెగి విపరీతంగా రక్తస్రావం జరిగింది. గాయపడ్డ వైద్యుడిని తరలించేందుకు వచ్చిన అంబులెన్స్‌ను కార్మికులు వెనక్కు పంపించారు" అని ఆయన మనోజ్ తెలిపారు.

ఏడాది క్రితం కూడా ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే జరిగిందని ఆయన వివరించారు. దేవేన్ ప్రవర్తన బాగోలేదని కొందరు రోగులు ఆరోపించారు. వాళ్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారని, అప్పట్లో హింసాత్మక ఘటనలేవీ జరగలేదని చెప్పారు.

ఈ ఆస్పత్రికి దగ్గర్లో నివసించే ఒక వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ- దేవేన్‌లో ఎన్నడూ దుష్ప్రవర్తన కనిపించలేదన్నారు.

అస్సాం

ఇది కొత్త కాదు

అస్సాం తేయాకు తోటల్లో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. 2012లో తీన్సుకియా జిల్లాలోని బోర్డుమ్సా తేయాకు తోట యజమాని మృదుల్ కుమార్ భట్టాచార్యను, ఆయన భార్యను వారి బంగళాలోనే కార్మికులు సజీవ దహనం చేశారు.

ఈ ఏడాది మేలో డికోమ్ టీ ఎస్టేట్‌లో డాక్టర్ ప్రవీణ్ ఠాకూర్‌ను కార్మికుల గుంపు తీవ్రంగా కొట్టింది. నాటి దాడి ఠాకూర్‌ను నేటికీ వెంటాడుతోంది. దానిని తలచుకొంటే ఆయనకు భయం కలుగుతుంది.

దేవేన్‌ మాదిరే తననూ క్రూరంగా కొట్టారని, నాడు ప్రాణాలతో బయటపడ్డందుకు దేవుడికి కృతజ్ఞుడనని ఆయన తెలిపారు.

"ఆ రోజు కొందరు ఒక మహిళా రోగిని తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. తుపాను వల్ల ఆమెపై చెట్టు కూలింది. ఆస్పత్రికి వచ్చేలోపే ఆమె చనిపోయారు. ఈ విషయం చెబితే కార్మికులు అర్థం చేసుకోలేకపోయారు. నన్ను కొట్టడం మొదలుపెట్టారు. నా ఎముక విరిగింది. నేను చనిపోయాననుకొన్నారు. ఆస్పత్రిలోని ఇద్దరు సిబ్బంది నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి, బయటి నుంచి తాళం వేశారు. అలా నేను ప్రాణాలతో బయటపడ్డా" అని ఆయన వివరించారు.

ఆస్పత్రి

కార్మికుల ఆగ్రహానికి కారణం ఏమిటి?

తేయాకు తోటల్లో తాను 40 ఏళ్లుగా సేవలందిస్తున్నానని డాక్టర్ ఠాకూర్ తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు తక్కువగా ఉండేవన్నారు. కార్మికుల్లో సహనం తగ్గిపోతోందని, కుటంబ ఘర్షణలతో ఆత్మహత్యలు కూడా చేసుకొంటుంటారని చెప్పారు. భార్యను, పిల్లలను ముక్కలుగా నరికి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు.

1860లు, 1890ల్లో ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి దశల వారీగా కార్మికులను తేయాకు తోటల్లో పని కోసం అస్సాంకు తీసుకొచ్చారు. వారు ఇక్కడే స్థిరపడిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా వారి జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు.

అస్సాం తేయాకు తోటల్లో ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తుంటారు. చాలా తోట్లో కార్మికుల నివాసలు శిథాలావస్థలో ఉంటాయి. మరుగుదొడ్లు అధ్వానంగా, అపరిశుభ్రంగా ఉంటాయి.

వారికి తాగడానికి నీళ్లు కూడా తగినన్ని ఉండవు. తేయాకు తోటల్లోని ఆస్పత్రుల్లో సదుపాయాలు కొరవడ్డాయి.

లాక్ ఔట్ నోటీసు
ఫొటో క్యాప్షన్, లాక్ ఔట్ నోటీసు

టాటా సంస్థ

'టియోక్ టీ గార్డెన్' యజమాని అయిన 'అమాల్గమేటెడ్ ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్' టాటా గ్రూప్‌కు చెందిన కంపెనీ. 19వ శతాబ్దంలో తేయాకు పరిశ్రమ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఈ కంపెనీని ప్రారంభించినట్లు, భారత తేయాకు పరిశ్రమలో ఇది కీలక పాత్ర పోషించినట్లు కంపెనీ వెబ్‌సైట్ చెబుతోంది.

తాము సాధించిన కొన్ని గొప్ప విజయాలను కూడా కంపెనీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

అయితే టియోక్ టీ గార్డెన్‌లో కార్మికుల కాలనీల వారి జీవితం ఎంత దుర్భరంగా ఉందో చెబుతున్నాయి.

కార్మికుల కుటుంబాలు

'ఒక్క కేజీ తగ్గినా వేతనంలో సగం కోత'

తోటలోని నం.1 మాజ్ లైన్లో నివసించే 42 ఏళ్ల సంగీతా రాజ్వర్ గత 24 సంవత్సరాలుగా ఈ తోటలోనే పనిచేస్తున్నారు. ఆమె శాశ్వత కార్మికులు. ఆమెకు వేతనం కింద నెలకు కేవలం నాలుగు వేల రూపాయలే వస్తోంది.

ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తామని, తేయాకు తెంపే ఇతర కార్మకులను పర్యవేక్షించడం తన బాధ్యతని ఆమె చెప్పారు.

ఒక్క కార్మికుడు రోజుకు కనీసం 24 కేజీల తేయాకు తెంచాలని, అలాగైతేనే రోజుకు రూ.167 వేతనం ఇస్తారని సంగీత వివరించారు. 24 కేజీలకు ఒక్క కేజీ తగ్గినా వేతనంలో సగం తగ్గిస్తారని తెలిపారు.

తేయాకు కార్మికులు

వేసవిలో తేయాకు తోటల్లో పని చాలా కష్టంగా ఉంటుందని, చాలా మంది కార్మికులు అనారోగ్యం బారిన పడుతుంటారని ఆమె వెల్లడించారు. విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయని చెప్పారు.

తేయాకు తోటల్లో తాగునీటి సదుపాయం లేదని, అందువల్లే తాము తరచూ అనారోగ్యం బారిన పడుతుంటామని సంగీత తెలిపారు. ఆస్పత్రిలో మందులు ఉండవని, తమ ఆరోగ్య సమస్యలను నిర్ధరించేందుకు వైద్యులు తగిన పరీక్షలు చేయరని ఆరోపించారు. గత నెల్లో తమ కాలనీలో 15 మంది చనిపోయారని, వారు ఏ వ్యాధితో చనిపోయారో కుటుంబ సభ్యులకు తెలియదని వివరించారు.

సంగీత ఇంటికి ఎదురుకాగానే సామ్రా మాఝి ఇల్లు ఉంది.

కార్మికుల కుటుంబాలు

డాక్టర్ 4 గంటలకు వచ్చారు: సామ్రా తమ్ముడు

సామ్రా మాఝి తమ్ముడు పుతుకోన్ మాట్లాడుతూ- తన అన్న స్నానాల గదిలో పడిపోయారని చెప్పారు.

"అన్న తలకు గాయమైంది. కంపెనీ అంబులెన్స్‌కు ఫోన్ చేశాం. కానీ అంబులెన్స్ రాలేదు. మిగతా కార్మికులే అన్నను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకొనే సరికి దాదాపు మూడు(మధ్యాహ్నం) అయ్యింది. కానీ డాక్టర్ దాదాపు నాలుగు గంటలకు వచ్చారు" అని చెప్పారు.

పోలీసుల పాత్రపై విమర్శలు

ఈ మొత్తం ఉదంతంలో పోలీసుల పాత్రపై విమర్శలు వస్తున్నాయి. దాడి జరిగిన ఆస్పత్రి పోలీసు స్టేషన్‌కు కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే ఉంది. పోలీసులు సమయానికి ఆస్పత్రికి చేరుకున్నప్పటికీ డాక్టర్ దేవేన్‌ను కాపాడలేకపోయారు.

36 మంది అరెస్టు

జోర్హాట్ జిల్లా ఎస్‌పీ ఎన్‌వీ చంద్రకాంత్ మాట్లాడుతూ- గుంపును నియంత్రించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.

"అప్పుడు ఆస్పత్రి బయట దాదాపు 300 మంది గుంపు ఉంది. అదే రోజు జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా వెలువడింది. పోలీసులు వేర్వేరు చోట్ల విధుల్లో ఉన్నారు. దాడి సమాచారం అందిన వెంటనే ఒక పోలీసు బృందం ఆస్పత్రికి చేరుకుంది. కార్మికులు వైద్యుడిని గదిలోపల బంధించి, తాళం వేశారు. బయటి నుంచి ఎవరినీ లోపలకు పోనివ్వలేదు. దీంతో అదనపు బలగాలను అక్కడికి తరలించాం. అతికష్టమ్మీద డాక్టర్‌ను బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించాం" అని ఆయన వివరించారు.

ఈ కేసులో పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. వీరిలో 22 మందిని జైల్లో పెట్టారు. మిగతా 14 మందిని పోలీసులు విచారిస్తున్నారు.

లాక్‌ఔట్ నోటీసు

మరోవైపు తేయాకు తోట యాజమాన్యం ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి, లాక్‌ఔట్ నోటీసును వేలాడదీసింది.

దేవేన్‌పై దాడి, 'లాక్‌ఔట్'పై మేనేజర్ మనోజ్ గొగోయ్‌ను ఫోన్లో సంప్రదించేందుకు బీబీసీ చాలాసార్లు ప్రయత్నించింది. కాల్స్‌కు ఆయన స్పందించలేదు. మెసేజ్‌లకు బదులు ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)