ఎన్‌ఆర్‌సీ: వారు భారతీయులు కాదు - కేంద్ర ప్రభుత్వం

ఎన్‌ఆర్‌సీ
    • రచయిత, ప్రియాంకా దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అస్సాం రాష్ట్రంలో నివశిస్తున్న ప్రజల్లో 19 లక్షల మంది భారతీయులు కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) జాబితాను శనివారం ప్రకటించింది.

ఈ జాబితా విడుదలయ్యే వరకూ.. అస్సాంలో దాదాపు 41 లక్షల మంది తమను భారత పౌరులుగా గుర్తిస్తారా? లేదా? తమ భవితవ్యం ఏమవుతుంది? అన్న ఆందోళనతో ఎదురుచూశారు.

మరి అంతమందిని కలవరపెట్టిన ఈ ఎన్‌ఆర్‌సీ జాబితా అంటే ఏంటి?

సింపుల్‌గా చెప్పాలంటే, ఎన్‌ఆర్‌సి అంటే... అస్సాంలో నివసిస్తున్న భారతీయ పౌరుల జాబితా అని అనుకోవచ్చు.

నిజానికి, తమ రాష్ట్రంలోకి బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశించారంటూ అస్సాంలో ఆరేళ్ల పాటు జరిగిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితమే ఈ ప్రక్రియ అని చెప్పవచ్చు. ఆ ఉద్యమం తరువాత, అస్సాం ఒప్పందం జరిగింది. 1986లో పౌరసత్వ చట్టాన్ని సవరించి, అస్సాం కోసం ప్రత్యేక నిబంధనను చేర్చారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఎన్ఆర్‌సీ తుది జాబితా వెల్లడికి సర్వంసిద్ధం.. అసోంలో భద్రత కట్టుదిట్టం

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ ప్రకారం, 1966 జనవరి 1కి ముందు నుంచి అస్సాంలో నివసిస్తున్నవారు భారతీయ పౌరులు. మీరు 1966 జనవరి, 1971 మార్చి 25 మధ్య అస్సాంలో నివాసం ఉండేందుకు వచ్చినట్లయితే, మీరు వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్లకు మీకు భారతీయ పౌరుడిగా గుర్తింపు వస్తుంది. ఓటు హక్కు కూడా పొందుతారు.

ఒకవేళ మీరు 1971 మార్చి 25 తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినట్లయితే (అది బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభమైన తేదీ కూడా) అక్రమ వలసదారుడు అవుతారు. విదేశీయుల ట్రిబ్యునల్ మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఇప్పుడు ఎన్‌ఆర్‌సి జాబితా సిద్ధమవుతోంది.

ఎన్‌ఆర్‌సీ సేవా కేంద్రం

ఫొటో సోర్స్, PTI

అయితే, ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... అస్సాంలో ఎన్‌ఆర్‌సీ జాబితా తయారు చేయడం ఇదే తొలిసారి కాదు. అస్సాంలో మొదటిసారి ఎన్‌ఆర్‌సీ జాబితాను 1951లో రూపొందించారు.

ఆ తరువాత, 2005లో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. అందులో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ)తో పాటు, కేంద్ర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీని నవీకరించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.

ఈ ఏడాది మరో పెద్ద పరిణామం జరిగింది. అక్రమ వలసదారుల నిర్ధారణ చట్టం ప్రామాణికతను న్యాయస్థానం రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిరూపించే బాధ్యతను రాష్ట్రం నుంచి సామాన్య ప్రజలకు మార్చింది.

2009లో మొదటిసారిగా ఈ ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఎన్ఆర్‌సీ నవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అస్సాం ప్రభుత్వాన్ని 2014లో న్యాయస్థానం ఆదేశించింది, ఆ ప్రక్రియ అంతా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే జరగాలని 2015లో సూచించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘మేం భారతీయ పౌరులమని ఎలా నిరూపించుకోవాలి?’

ఇప్పుడు, అత్యంత క్లిష్టమైన ఈ భారీ ప్రక్రియలో, 3 కోట్ల 29 లక్షల మంది తాము అస్సాం పౌరులమే అంటూ దరఖాస్తులు దాఖలు చేశారు. అయితే, 2018 జూలై 30న వెల్లడించిన ఎన్‌ఆర్‌సీ ముసాయిదాలో 40 లక్షల మంది పేర్లు లేవు.

దాని తరువాత, 2019 జూన్ 26న ప్రభుత్వం అదనపు జాబితాను కూడా విడుదల చేసింది. అందులో కొత్తగా మరో లక్ష కొత్త పేర్లు మాయమయ్యాయి. ఆ మొత్తం 41 లక్షల మంది భవిష్యత్తు ఏంటన్నది ఆగస్టు 31న తెలియనుంది.

ఎన్‌ఆర్‌సీలో వీరందరికీ తమను తాము అస్సాం పౌరులుగా నిరూపించుకునే అవకాశం లభించింది. అందుకోసం వారు తాము ఇక్కడివాళ్లమే అన్నట్లుగా నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంది. తమ పేర్లు ఉన్నట్లుగా చూపే 1951 ఎన్‌ఆర్‌సీ జాబితా, 1971 వరకు ఓటర్ల జాబితా, భూముల పత్రాలు, ఇక్కడి పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాలలో చదువుకున్నట్లుగా చూపే పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, ఎల్ఐసీ పాలసీ, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, శరణార్థుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్... లాంటి పత్రాలను సమర్పించాలి. ఈ పత్రాల సేకరణ, ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉంది.

గువాహటిలో ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఆగస్టు 31న ప్రభుత్వం వెల్లడించే జాబితాలో పేర్లు లేని వారి భవిష్యత్తు ఏమిటి? అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న.

ఎన్‌ఆర్‌సీలో పేరు లేనంత మాత్రాన వారిని విదేశీయుడిగా ప్రకటించరు. ఆ జాబితాలో పేర్లు లేనివారు తమ పత్రాలతో విదేశీయుల ట్రిబ్యునల్ ముందు హాజరుకావాలి, అందుకోసం వారికి 120 రోజుల గడువు ఉంటుంది.

దరఖాస్తుదారుడి పౌరసత్వానికి సంబంధించి ఆ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ విదేశీయుల ట్రిబ్యునల్ నిర్ణయంపై దరఖాస్తుదారులు సంతృప్తి చెందకుంటే, హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించే వీలుంటుంది.

విదేశీయులుగా తేలిన వారి భవిష్యత్తు ఏంటన్న విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, వారిని అదుపులోకి తీసుకొని దేశం నుంచి బహిష్కరించేందుకు చట్టంలో ఒక నిబంధన ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)