ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ చక్రవర్తి
- హోదా, ఆర్థిక రంగ నిపుణుడు
భారత ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజావేదికలపై మాట్లాడుతున్నారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇటీవల మాట్లాడుతూ 70 ఏళ్ల స్వతంత్ర భారతం మునుపెన్నడూ ఇలాంటి ఆర్థిక మందగమనం చూడలేదని వ్యాఖ్యానించారు. నిర్దిష్ట రంగాల్లో తక్షణం విధాన సవరణలు చేపట్టాల్సి ఉందని అన్నారాయన.
ప్రధాన ఆర్థిక సలహాదారు కె.సుబ్రమణియన్ ఈ అభిప్రాయంతో విభేదిస్తూ రంగాలవారీగా ప్రోత్సాహం అవసరం లేదని, భూ, కార్మిక విపణిలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని సూచించారు.
ప్రధాని మోదీ ఆర్థిక సలహా మండలిలోని సభ్యులు సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ఒకరితో ఒకరు విభేదిస్తున్నారు.
వీరంతా అసలు దేశం ఆర్థిక మందగమనంతో సతమతమవుతుందా లేదా అన్న అంశంపై కాకుండా ఈ మందగమనం ఎంత తీవ్రంగా ఉందనే విషయంపైనే అభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. అంటే.. అందరూ ఆర్థిక మందగమనం ఉందని అంగీకరిస్తున్నట్లే.
ఈ ఆర్థికవేత్తలే కొన్ని నెలల కిందట వరకు ఏడాదికి 70 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ భారతదేశం శరవేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థికవ్యవస్థగా అవతరిస్తోందంటూ గొప్పలు చెప్పారు. అలాంటిది ఇప్పుడు వారే తమ వైఖరి మార్చుకుని మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంగా ఓ విషయం గుర్తు చేసుకోవాలి.. 2017 నవంబరులో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత సావరిన్ రేటింగ్‌ను పెంచింది.
అంతకుముందు 14 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా 2017లో రేటింగ్ పెంచడానికి ఆ సంస్థ కారణం చెబుతూ... మోదీ నేతృత్వంలో భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణలతో ముందుకు సాగుతోందంది.
ఆ తరువాత రెండేళ్లలో అదే మూడీస్ భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను మూడుసార్లు తగ్గిస్తూ సవరించింది. తొలుత 2019 నాటికి 7.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన ఆ సంస్థ 7.4 శాతానికి మొదట సవరించి.. అనంతరం 6.8.. మళ్లీ 6.2శాతానికి సవరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారతదేశ ఆర్థిక పరిస్థితి నిజంగానే అంత పటిష్ఠమైనదైతే మళ్లీ ఇంతవేగంగా ఎందుకు క్షీణించింది?
ప్రముఖ పెట్టుబడిదారు, దేశంలోనే అతిపెద్ద కాఫీ చైన్ కేఫ్ కాఫీ డే అధినేత రుణబాధలు, వ్యాపార వృద్ధి లేకపోవడం, పన్ను వసూలు అధికారుల నుంచి ఒత్తిళ్లతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.
వాహనాల అమ్మకాల్లో క్షీణత ఫలితంగా ఆటోమొబైల్ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 లక్షల ఉద్యోగాలు పోతాయని ఒక అంచనా.
ఫెడరల్ రిజర్వ్ మాజీ అధ్యక్షుడు అలన్ గ్రీన్‌స్పాన్ వినియోగానికి కొలమానంగా చెప్పే పురుషుల లోదుస్తుల విక్రయ వృద్ధి కూడా తిరోగమనంలోనే ఉంది.
భారతదేశ జీడీపీలో మూడింట రెండొంతులు ఉండాల్సిన వినియోగ డిమాండ్ కూడా తగ్గుతూవస్తోంది.
ఇవన్నీ చాలవన్నట్లుగా.. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులకు ప్రతిబంధకమయ్యేలా, విదేశీ మదుపరులను భయపెట్టేలాంటి కొన్ని పన్ను ప్రతిపాదనలు చేశారు.
వాటిపై విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని ప్రతిపాదనల నుంచి వెనక్కు తగ్గారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందని, వ్యాపార విశ్వాసాన్ని గణనీయంగా కోల్పోతోందని స్పష్టమవుతోంది.
ఈ ప్రమాదకర పరిస్థితి అంతా కేవలం జీడీపీ వృద్ధి రేటు మందగమనానికి సూచన మాత్రమే కాదు.. వృద్ధిలో జవసత్వాలు లేవనడానికీ సూచన.
ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా సుస్థిర అభివృద్ధికి పునాది లాంటి ప్రైవేటు రంగ పెట్టుబడులు పదిహేనేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి.
ఇంకా చెప్పాలంటే ప్రైవేటు రంగం నుంచి దాదాపుగా కొత్త ప్రాజెక్టులు, కొత్త పెట్టుబడులు లేవనే చెప్పాలి.
చాలామంది పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థిక స్థితి గురించి బాహాటంగానే చెబుతుండడం.. వ్యాపారాల పట్ల ప్రభుత్వంలో అపనమ్మకం, పన్ను అధికారుల వేధింపులపై ఫిర్యాదులు చేస్తుండడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది.
అయితే, ఈ ఆర్థిక మందగమనమంతా హఠాత్తుగా వచ్చిందీ.. అనూహ్యమైనదీ కాదు.
రుణాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల దక్కిన ప్రతిఫలాల ఫలితంగానే గత అయిదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అనే ముసుగులో కనిపించింది.
భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకునేది చమురే.. ఆ చమురు ధరలు 2014-16 మధ్య తక్కువగా ఉండడం వల్ల జీడీపీ వృద్ధి కనిపించింది. ఆ ముసుగులో అసలైన సమస్యలన్నీ మరుగునపడిపోయాయి.
చమురు ధరలు పెరిగిన తరువాత ఆ ముసుగు తొలగిపోయింది.
పరిస్థితిని మరింత దిగజార్చేలా మోదీ రాత్రికిరాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్థిక వ్యవస్థ నుంచి 85 శాతం కరెన్సీ నోట్లను తప్పించారు.
ఈ చర్య సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేస్తూ వ్యవసాయ, నిర్మాణ, ఉత్పత్తి రంగాలపై పెను ప్రభావం చూపించింది. దేశంలోని మూడొంతుల ఉద్యోగాలకు ఆధారమైన ఈ మూడు రంగాలు దెబ్బతినడంతో అంతా తలకిందులైంది.
నోట్ల రద్దు దెబ్బ నుంచి కోలుకోవడానికి ముందే 2017లో జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. దీన్నర్థం చేసుకోలేక ప్రారంభంలో ఎన్నో చిన్న వ్యాపారాలు ఇబ్బందుల్లో పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంత సులభమేమీ కాదు
ముందుకు కదలని దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ఖజానాను గందరగోళంలోకి నెట్టింది. పన్ను రాబడి అంచనాలకు తగ్గట్లు రాలేదు.
ఇలాంటి పరిస్థితిలో సోమవారం ప్రభుత్వానికి ఉపశమనం కలిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1.76 లక్షల కోట్లు ఇచ్చి ఆదుకుంది.
ఈ మొత్తం 2009-14 మధ్య కాంగ్రెస్ పాలనలో అయిదేళ్లలో ప్రభుత్వానికి ఆర్బీఐ చెల్లించిన డివిడెంట్ కంటే ఎక్కువ.
ఇలాంటి పరిష్కారాలతో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం అంత సులభమేమీ కాదు.
దశాబ్దాలుగా ప్రభుత్వ ఆర్థిక దన్నుతో నడుస్తున్న పరిశ్రమల రంగం మరోసారి పన్ను రాయితీలు, ప్రోత్సాహాల కోసం చూస్తోంది.
అయితే ఇలాంటి ప్రయోజనాలు ప్రైవేటు రంగ పెట్టుబడులను, దేశీయ వినియోగాన్ని వెంటనే పునరుద్ధరిస్తాయన్న నమ్మకం లేదు.
మేకిన్ ఇండియాతో దేశం ఉత్పాదక శక్తిగా అవతరిస్తుందని ఇంతకాలం ప్రగల్భాలు పలికినప్పటికీ వస్తువుల కోసం చైనాపై ఆధారపడడమనేది గత అయిదేళ్లలో రెట్టింపైందే కానీ ఏమాత్రం తగ్గలేదు.
భారత్ ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల విలువ తలసరి రూ.6 వేలుగా ఉంది.. 2014లో ఇది రూ.3 వేలు మాత్రమే.
మరోవైపు భారత్ ఎగుమతులు 2011 స్థాయిని దాటి పెరగలేదు.
అంటే భారత్ తన కోసం కానీ, ప్రపంచం కోసం కానీ ఏమీ తయారుచేసుకోవడం లేదనే అనుకోవాలి.
ఆర్నమెంటల్ ట్యాక్స్, కొన్ని పరిశ్రమలకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు ఇప్పుడేమీ భారత్‌ను ఉత్పత్తి రంగంలో పోటీదారుగా నిలిపేలా లేవు.. అంతేకాదు.. చవగ్గా దొరికే చైనా వస్తువుల నుంచి భారత ప్రజల దృష్టినీ మళ్లించలేవు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు లాభపడ్డాయే కానీ భారత్ దాన్ని ఏమాత్రం వినియోగించుకోలేకపోయింది.
కాబట్టి దేశ ప్రజలకు నేరుగా ప్రోత్సాహకాలు అందేలా చేసి కొనుగోలు శక్తి పెంచి వినియోగాన్ని పెంచడమే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక పరిష్కారం.
ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగులేదు.
కాబట్టి దేశ నాయకత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని అందమైన ముసుగులు వేసే ప్రయత్నాలు మానుకుని ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
(ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ ఆర్థికవేత్త)
ఇవి కూడా చదవండి:
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








