అభిప్రాయం: సమస్యల తుట్టెను మళ్లీ కదిపిన ఎన్ఆర్సీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శేషాద్రి చారి
- హోదా, సీనియర్ పాత్రికేయులు
ఓటు బ్యాంకులను పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి, సృష్టించుకోవడానికి అక్రమ వలసల అంశం రాజకీయ పార్టీలకు చాలాకాలంగా ఒక ఆయుధంగా మారిపోయింది. ఇటీవల అసోంలో ప్రచురించిన ఎన్ఆర్‌సీ ముసాయిదా కూడా ఆ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. సామాజిక, ఆర్థిక, మానవీయ, భద్రతా పరమైన అంశాల గురించి పట్టించుకోకుండానే ఆ జాబితాను తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
అసోంలో జులై 30న ప్రచురితమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ) ఆఖరి ముసాయిదా.. 2,89,83,677 మంది ప్రజలను భారతీయ పౌరులుగా గుర్తించింది. కానీ దాదాపు 3,29,91,384 మంది ఆ జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక సమాచారం. అంటే చాలా కాలంగా భారత్‌లో ఉంటోన్న దాదాపు 40లక్షల మందిని భారతీయులుగా గుర్తించడం సాధ్యం కాదని ఆ జాబితా తేల్చింది.
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఎన్‌ఆర్‌సీ జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పూర్తవుతోంది. ఈ అంశంపై 1985, ఆగస్టు 15న నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, అసోం ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న అసోం గణ పరిషత్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులోని నియమాల ప్రకారం 1971కి ముందు నుంచి అసోంలో ఉంటోన్న వారిని పౌరులుగా గుర్తించారు. దాంతో ఆ తరవాత వచ్చి అక్కడ స్థిరపడ్డవారి పరిస్థితి సందిగ్ధంలో పడింది.
జాబితాలో చోటు దక్కని 40లక్షల మందిలో చాలామంది స్థానికులు ఉన్నారు. అలానే జాబితాలో చేరినవాళ్లలో చాలామంది స్థానికేతరులు కూడా ఉన్నారు. దీంతో ఈ జాబితాలోని లోటుపాట్లు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. జాబితాలో లేనివారి భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
సమస్య ఎక్కడ మొదలైంది?
ఈశాన్య భారతంలో అసోంను అత్యంత సారవంతమైన నేల కలిగిన రాష్ట్రంగా చాలామంది భావిస్తారు. దాంతో మొదట్నుంచీ అక్కడ అక్రమ వలసల అంశం పెద్ద సమస్యగానే ఉంది.
ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉన్నాయి. గతంలో ఒక విదేశీయుడి (బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి) పాలనలో ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు స్థానికులే మైనార్టీలుగా మారే వరకూ రాజకీయాల్లో ఎన్నో మలుపులున్నాయి.
దేశ విభజన తరవాత తూర్పు పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. మొదట 1947లో, ఆ తరవాత బంగ్లాదేశ్ నిర్మాణ సమయంలో... అంటే 1970-71మధ్య చాలామంది బెంగాలీ మాట్లాడే హిందువులు భారత్‌లోకి ప్రవేశించారు.
ఆ సమయంలో ప్రభుత్వం హరిత విప్లవాన్ని సాధించే లక్ష్యంతో ఉండేది. దానికోసం ప్రభుత్వానికి చాలామంది వ్యవసాయ కూలీల అవసరం ఏర్పడింది. దాంతో పౌరసత్వాన్ని నిర్ణయించే విషయంలో ప్రభుత్వం కొంత గందరగోళానికి గురైంది.
ఆ పరిణామాలన్నీ అసోంలో ఆందోళనలకు దారితీశాయి. వాటి వల్లే బంగ్లాదేశ్ నుంచి అసోంకు వలస వచ్చిన పేద హిందువులు, శరణార్థులుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకు మధ్య కూడా విభేదాలు తలెత్తాయి.
చూస్తుండగానే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని బయటకు పంపించాలనే ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. చివరికి ఆ అంశం ఎన్నికల మ్యానిఫెస్టోల స్థాయికి చేరిపోయింది. (ముఖ్యంగా బీజేపీకి)

ఫొటో సోర్స్, PTI
2014 సాధారణ ఎన్నికల సందర్భంగా.. ఇతర దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు పౌరసత్వం కల్పిస్తామని, హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
2016లో పౌరసత్వ సవరణ బిల్లును సైతం ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు కారణంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాల గురించి బీజేపీని, అసోం గణ పరిషత్ ముందుగానే హెచ్చరించింది. స్థానికుల సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అస్తిత్వాన్ని తక్కువ చేసేలా, వాళ్ల రాజకీయ పోరాట ప్రాధాన్యాన్ని తగ్గించేలా ఈ బిల్లు ఉందని ఏజీపీ తెలిపింది. కానీ ఆ రాష్ట్ర శాసనసభ మాత్రం ఎన్‌ఆర్‌సీ జాబితాను సిద్ధం చేయడాన్ని తప్పనిసరి చేసింది.
చాలాకాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ సమస్యల తుట్టెను తాజాగా విడుదలైన ఎన్‌ఆర్‌సీ జాబితా మళ్లీ కదిపింది.
వెనక్కు పంపడం కష్టమే
ఎన్‌ఆర్‌సీ అనేది భారత అంతర్గత విషయమనీ, దాంతో తమకు సంబంధం లేదని బంగ్లాదేశ్ తెలిపింది. 1971 తరవాత బంగ్లాదేశ్ నుంచి అసోంకు ఎలాంటి అక్రమ వలసలు జరగలేదని ఆ దేశ సమాచార ప్రచార శాఖ మంత్రి పదేపదే చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
దాన్ని బట్టి చూస్తే, భారత్ వెనక్కు పంపించే ఏ ఒక్క వలసదారుడిని కూడా బంగ్లాదేశ్ స్వీకరించదని తెలుస్తోంది. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేసినా బంగ్లాదేశ్‌తో భారత సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.
అందుకే అక్రమ వలసదారుల్ని వెనక్కు పంపడం అన్నది భారత్ ముందున్న పెద్ద సవాల్.
ఏ దేశం కూడా వీళ్లను ఎప్పటికీ శరణార్థుల శిబిరాల్లోనే పెట్టి పోషించలేదు. మరోపక్క ఇది కూడా రోహింజ్యా ముస్లింల మాదిరి అంతర్జాతీయ సమస్యగా మారుతుందేమోనన్న భయమూ నెలకొంది.
వీళ్లకు వర్క్ పర్మిట్లు ఇచ్చి భారత్‌లో వ్యవసాయ కార్మికులుగా, ఇతర రంగాల్లో పనివాళ్లుగా వాడుకోవాలని, కానీ వీళ్లకు పౌరసత్వం, ఓటు హక్కు, భూమి హక్కుల్లాంటివి కల్పించకూడదని గతంలో సూచనలు అందాయి.
ఏదేమైనా అన్ని పార్టీలు దీన్ని అధికార పీఠమెక్కించే రాజకీయ అంశంగా చూడటం మానేసి శాంతి భద్రత, మానవీయ కోణాల్లో చూసి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
(రచయిత ఆంగ్ల వారపత్రిక ‘ఆర్గనైజర్’ మాజీ ఎడిటర్)
ఇవి కూడా చదవండి
- కరుణానిధి: సీఎంలకు పంద్రాగస్టున జెండా ఎగరేసే హక్కు ఈయన వల్లే దక్కింది
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- యాపిల్: 12 ఏళ్ల పాటు నష్టాలు చూసిన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో నం.1
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










