ప్రత్యేక ఇంటర్వ్యూ: అసోం పౌరుల జాబితా రూపకల్పనలో మత వివక్ష లేదు - ఎన్ఆర్‌సీ చీఫ్

ప్రతీక్ హజేలా
ఫొటో క్యాప్షన్, ప్రతీక్ హజేలా
    • రచయిత, షకీల్ అఖ్తర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అసోంలో వాస్తవమైన పౌరుల జాబితా రూపకల్ప ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా పారదర్శకంగా జరిగిందని జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అసోం చీఫ్ ప్రతీక్ హజేలా అన్నారు. ఈ ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారు తమ పౌరసత్వం నిరూపించుకోవటం కోసం అదనపు లేదా తాజా పత్రాలు సమర్పించటానికి అనుమతిస్తామని చెప్పారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ జాబితాను ఖరారు చేయటంలో మత వివక్ష ఉందన్న ఆందోళనలను కొట్టివేశారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని 40 లక్షల మంది దరఖాస్తుదారుల్లో అన్ని మతాలు, రకాల ప్రజలు ఉన్నారని.. ఏ ఒక్క వర్గానికో నిర్దిష్ట మతానికో పరిమితం కాలేదని చెప్పారు.

‘‘ఈ ప్రక్రియ మతానికో కులానికో జాతికో సంబంధించినది కాదు. ఇది ఒక తేదీకి సంబంధించినది. ఆ తేదీ 1971 మార్చి 24. ఈ తేదీకి ముందు నుంచి ఇక్కడ నివసించిన వారు ఎవరైనా సరే, వారు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినా కూడా పౌరసత్వానికి అర్హులు’’ అని ఆయన అంటున్నారు.

అసోం ఎన్‌ఆర్‌సీ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌ఆర్‌సీ జాబితాలో 40 లక్షల మంది దరఖాస్తులకు చోటు కల్పించలేదు. అయితే.. ఇలా తిరస్కరించటానికి కారణమేమిటో తెలుసుకోవటానికి, దానికి సమాధానం ఇవ్వటానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ సమయం ఇచ్చింది.

ఇంతకుముందు తమ పత్రాలను తిరస్కరించిన అదే అధికారులకు తాము మళ్లీ సమాధానం సమర్పించాల్సి వస్తుందంటూ కొందరు దరఖాస్తుదారుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాల గురించి ప్రశ్నించగా.. ‘‘వివిధ కేంద్రాల్లో అధికారులను మార్చటానికి అనుమతి కోరతాం. ఇంకా ఉన్నతస్థాయి అధికారులను కూడా నియమించవచ్చు’’ అని ఆయన బదులిచ్చారు.

ఈ ప్రక్రియను ప్రారంభించటానికి ప్రామాణిక నిర్వహణా విధానాన్ని తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘‘కోర్టు దీనిని ఆమోదించిన తర్వాత మేం అమలు చేస్తాం’’ అని ప్రతీక్ హజేలా చెప్పారు.

పౌరుల జాబితాలో చోటు దొరకని వారు నలభై లక్షల మంది అంటే అది పెద్ద సంఖ్యేనని ఆయన అంగీకరించారు. ‘‘అయితే, ఇది తుది సంఖ్య కాదు. వారిని ఏదో ఒక రకంగా వర్గీకరించడం ఉండదు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. మాకు సమర్పించిన లక్షలాది పత్రాల ద్వారా ప్రతి ఒక్క వ్యక్తినీ మేం పరిశీలిస్తున్నాం. ఇతర సంస్థలు వేటి అధ్యయనాలనూ మేం అంగీకరించటం లేదు. ప్రతి ఒక్కరికి 1971కి ముందు గల సంబంధాన్ని మేం స్వయంగా తనిఖీ చేస్తున్నాం’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, అసోంలో 40 లక్షల మంది భారత పౌరసత్వం కోల్పోయే అవకాశముంది.. ఎందుకు?

ఇంతకుముందు తాము పరిశీలించిన 3.30 కోట్ల మంది దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించటం కన్నా.. ఇప్పుడు 40 లక్షల మంది దరఖాస్తుదారుల పత్రాలను తనిఖీ చేయటం సులభమని ఆయన తెలిపారు. ‘‘ఇప్పుడీ పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తాం. దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించటానికి ఎక్కువ మంది అధికారులు అందుబాటులో ఉంటారు. కనుక పొరపాట్లకు అవకాశాలు తక్కువగా ఉంటాయి’’ అని చెప్పారు.

అసోం ఎన్‌ఆర్‌సీ

ఫొటో సోర్స్, BBC/SHIB SHANKAR CHATTERJEE

ఈ జాబితాలో తుదిగా ఎంత మందికి చోటు దక్కకపోవచ్చునని అడిగినపుడు.. ఇంత మంది అని ఊహించటం తప్పవుతుందని ఆయన బదులిచ్చారు. ఎంత మంది తమ పౌరసత్వానికి సంబంధించిన ధ్రువీకరణలు సమర్పిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.

పౌరసత్వం కోరటానికి, సమాధానం ఇవ్వటానికి గడువు సెప్టెంబర్ 28వ తేదీతో ముగుస్తుంది. అయితే తుది జాబితాను ఎప్పుడు ప్రచురిస్తారన్న విషయాన్ని ప్రతీక్ హజేలా వెల్లడించలేదు. ‘‘సుప్రీంకోర్టు నిర్ణయించేవరకూ ఈ జాబితాను మేం ప్రచురించలేం’’ అని చెప్పారు.

అక్రమ బంగ్లాదేశీ వలసలను గుర్తించటానికి ఎన్‌ఆర్‌సీ ఒక జాబితాను తయారు చేస్తోంది. అయితే.. అసోంలో బెంగాలీ మాట్లాడే జాతిపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా దీనిని ప్రయోగిస్తారన్న భయాలను రాజేసింది.

వీడియో క్యాప్షన్, కశ్మీర్ విలీనంపై చరిత్రకారులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)