కలాం జీవితం: శాస్త్రం, దౌత్యం, మానవత్వాల కలబోత

ఫొటో సోర్స్, PTI
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
'మిసైల్ మ్యాన్'గా పేరు గాంచిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు.
పాకిస్తాన్ జనరల్ ముషారఫ్‌తో అబ్దుల్ కలాం భేటీ సందర్భంగా జరిగిన విశేషాలను, ఆయన ప్రదర్శించిన దౌత్యనీతినీ బీబీసీ ప్రతినిధి రేహాన్ ఫజల్ వివరిస్తున్నారు.
2005లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు, నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కూడా భేటీ అయ్యారు.
ఈ భేటీకి ఒకరోజు ముందు కలాం కార్యదర్శి పీకే నాయర్ బ్రీఫింగ్ కోసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్లారు.
"సార్, రేపు ముషారఫ్ గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు" అని చెప్పారు. "ఔను, నాకు తెలుసు" అని కలాం జవాబిచ్చారు.
"ఆయన కశ్మీర్ అంశాన్ని తప్పక లేవనెత్తుతారు. మీరు దీనికి సిద్ధంగా ఉండాలి" అని నాయర్ అన్నారు.
కలాం క్షణం పాటు కూడా తడబడకుండా ఆయన వైపు చూసి ఇలా అన్నారు, "దాని గురించి మీరేం వర్రీ అవకండి. నేను చూసుకుంటాను."

ముప్పై నిమిషాల భేటీ
మరుసటి రోజు సరిగ్గా ఏడు గంటల ముప్పై నిమిషాలకు పర్వేజ్ ముషారఫ్ తన కాన్వాయ్‌తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనను మొదటి అంతస్తులో ఉన్న నార్త్ డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్లారు.
ఆయనకు కలాం స్వాగతం పలికారు. ఆయన కుర్చీ దగ్గరి దాకా వెళ్లి ఆయన పక్కనే కూర్చున్నారు. ఈ సమావేశం 30 నిమిషాల పాటు జరుగుతుందని ముందే నిర్ణయమైంది.
కలాం మాట్లాడడం ప్రారంభించారు. "అధ్యక్షా, భారత్ లాగానే మీ దేశంలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి కదా. వాటి అభివృద్ధి కోసం మనం వీలైనంత కృషి చేయాల్సిన అవసరం గురించి మీరేమంటారు?"
దీనికి ఔనని తప్ప ముషారఫ్ మరేం జవాబివ్వగలరు?

ఫొటో సోర్స్, AFP
శాస్త్రవేత్తే కాదు, దౌత్యవేత్త కూడా!
కలాం ఇలా కొనసాగించారు. "నేను మీకు 'పూరా' గురించి వివరిస్తాను. పూరా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ టు రూరల్ ఏరియాస్ (గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలను అందజేయడం)."
వెనుకున్న ప్లాజ్మా స్క్రీన్‌పై చిత్రాల కదలిక మొదలైంది. అంతే, మరుసటి 26 నిమిషాల పాటు ముషారఫ్‌కు కలాం క్లాసు కొనసాగింది. పూరా అంటే ఏమిటి? రానున్న 20 ఏళ్లలో ఇరు దేశాలు దీనిని ఏ విధంగా సాధించవచ్చు? వంటి విషయాలపై ఆయన ముషారఫ్‌కు వివరిస్తూ పోయారు.
ముప్పై నిమిషాల తర్వాత ముషారఫ్ ఇలా అన్నారు, "ధన్యవాదాలు రాష్ట్రపతి గారూ. మీలాంటి శాస్త్రవేత్త రాష్ట్రపతిగా లభించడం భారత్ చేసుకున్న అదృష్టం."
ఆ తర్వాత ఆయనతో చేతులు కలిపి సెలవు తీసుకున్నారు. నాయర్ తన డైరీలో ఇలా రాసుకున్నారు, "ఒక శాస్త్రవేత్త కూడా దౌత్యవేత్తగా వ్యవహరించగలడని కలాం ఈరోజు నిరూపించారు."

ఫొటో సోర్స్, PTI
మూడు లక్షల యాభై రెండు వేల రూపాయలు
2006 మేలో రాష్ట్రపతి కలాం కుటుంబ సభ్యులందరూ ఆయనను కలవడానికి దిల్లీ వచ్చారు. 90 ఏళ్ల ఆయన పెద్దన్న గారి నుంచి ఒకటిన్నర ఏళ్ల వయస్సున్న మునిమనవరాలి దాకా అందరూ కలిసి 52 మంది ఉన్నారు.
వాళ్లంతా రాష్ట్రపతి భవన్‌లో ఎనిమిది రోజులున్నారు. మధ్యలో వారు అజ్మీర్ షరీఫ్ కూడా వెళ్లి వచ్చారు. వాళ్లందరూ అక్కడ ఉన్న సమయంలో అయిన ఖర్చులన్నీ కలాం తన జేబు నుంచి తీసిచ్చారు.
ఒక కప్పు చాయ్ ఖర్చు కూడా లెక్కవేశారు. వారంతా తిరిగి వెళ్లిపోయాక కలాం తన అకౌంట్ నుంచి రూ. 3,52,000 చెక్కు రాసి రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు.
ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఈ విషయం ఎవ్వరికీ తెలియకపోవడం మరో విశేషం.
ఆయనకు కార్యదర్శిగా ఉన్న నాయర్ ఆ తర్వాత రాసిన పుస్తకం ద్వారానే ఈ విషయం మొట్టమొదటి సారి అందరికీ తెలిసింది.

ఫొటో సోర్స్, DESHAKALYAN CHOWDHURY/Getty
ఇఫ్తార్ డబ్బు అనాథాశ్రమానికి
2002 నవంబర్‌లో రమ్‌జాన్ నెల సందర్భంగా కలాం తన కార్యదర్శిని పిలిచి ఇలా అడిగారు, "ఒక్క విషయం చెప్పండి. ఇఫ్తార్ విందు నిర్వహణ అసలు మనమెందుకు చేయాలి? ఇక్కడికి వచ్చే వాళ్లెలాగూ కలిగిన కుటుంబాల వాళ్లే కదా? ఇఫ్తార్ కోసం మీరెంత ఖర్చు చేస్తారు?"
వెంటనే రాష్ట్రపతి భవనంలోని ఆతిథ్య విభాగం ఇన్-చార్జికి ఫోన్ చేశారు. ఇఫ్తార్ విందుకోసం దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.
"మనం ఈ డబ్బును అనాథాశ్రమాల కోసం ఎందుకు ఖర్చు చేయగూడదు? మీరు అనాథాశ్రమాలను ఎంపిక చేయండి. ఈ డబ్బు వృథా కాకుండా వాళ్లకు అందజేసే ఏర్పాటు చేయండి" అని కలాం అన్నారు.
ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ఇఫ్తార్ విందు కోసం కేటాయించిన డబ్బుతో గోధుమ పిండి, పప్పు, బ్లాంకెట్లు, స్వెట్టర్లు కొని వాటిని 28 అనాథాశ్రమాలలో పిల్లలకు పంపిణీ చేయించారు.

ఫొటో సోర్స్, STRDEL/getty images
అయితే ఇది ఇక్కడితోనే ముగియ లేదు.
నాయర్‌తో కలాం ఇలా అన్నారు, "మీరు ఈ సామాన్లన్నీ ప్రభుత్వ డబ్బుతోనే కొనుగోలు చేయించారు. ఇందులో నా భాగస్వామ్యం ఏముంది? నేను మీకు లక్ష రూపాయల చెక్కు ఇస్తున్నాను. ఈ డబ్బును కూడా మీరు ఇఫ్తార్ విందుకోసం కేటాయించిన డబ్బుతో కలిపి ఖర్చు చేయండి. అయితే నేనీ డబ్బు ఇచ్చినట్టు మాత్రం మీరెక్కడా చెప్పొద్దు."
మా ఇతర కథనాలు:
- అబ్దుల్ కలాం ఆఖరి రోజు ఏం జరిగింది?
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడలేదు
- ‘మోదీ మాటకారితనం ఏమైపోయింది?’
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








