అసోం - ఎన్‌ఆర్‌సీ: తండ్రీకొడుకు ఇద్దరూ సైనికులే.. కానీ వారి పౌరసత్వంపై ప్రశ్నలు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఫైసల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, గువాహటి నుంచి

''కార్గిల్ యుద్ధ సమయంలో పిలుపు అందగానే సైనిక స్థావరానికి చేరుకొన్న మొదటి సైనికుల్లో నేను ఒకణ్ని. దేశం పట్ల నాకున్న ప్రేమ అలాంటిది'' అన్నారు అసోం వాసి సాదుల్లా అహ్మద్. ఈ విషయం చెప్పేటప్పుడు ఆయన సగర్వంగా తలెత్తుకున్నారు. కానీ 'జాతీయ పౌరసత్వ రిజిస్టర్(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్)'లో ఈ మాజీ సైనికుడి పేరు లేదు.

తాను భారత పౌరుడినేనంటూ, ఇందులో తన పేరు నమోదు కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇలాంటి కేసు ఇదొక్కటే కాదు.

''నాకు తెలిసినంతవరకు కనీసం ఆరుగురు మాజీ సైనికోద్యోగుల పేర్లు ఎన్‌ఆర్‌సీలో గల్లంతయ్యాయి. ప్రస్తుతం సైన్యంలో ఉన్న మరొకరి పేరు కూడా ఇందులో లేదు. విదేశీయులుగా పేర్కొంటూ వీరికి నోటీసులు పంపడమో లేదా వీరిని డీ-ఓటర్‌ (అనుమానిత ఓటర్) జాబితాలో చేర్చడమో చేశారు'' అని 30 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసి అస్సాంలోని గువాహటిలో స్థిరపడ్డ అజ్మల్ హఖ్ చెప్పారు.

కార్గిల్
ఫొటో క్యాప్షన్, అజ్మల్ పాత చిత్రం

తండ్రీ, కుమారుడు, కుమార్తె.. ముగ్గురి పేర్లూ లేవు

''నాకు తెలిసినవారిలోనే ఏడుగురు ఉన్నారు. రాష్ట్రమంతటా చూస్తే, భారత పౌరులమని అధికార యంత్రాంగం నిర్దేశించిన మాజీ సైనికులు, ప్రస్తుత సైనికులు చాలా మందే ఉంటారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

తన కుమారుడిని కూడా సైన్యంలోకే పంపానని అజ్మల్ ఉద్వేగంగా చెప్పారు. తన కుమారుడు ప్రస్తుతం ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో ఉన్న జాతీయ సైనిక కళాశాలలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

ఎన్‌ఆర్‌సీలో ఆయన పేరే కాదు, ఆయన కుమారుడి పేరు, కుమార్తె పేరు కూడా లేవు.

''నా జీవితంలో 30 ఏళ్లు దేశసేవకే ధారపోశాను. కానీ మా కుటుంబానికే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇది చాలా బాధాకరం'' అని ఎన్‌ఆర్‌సీ నోటీసు, ఇతర పత్రాలు చూపుతూ అజ్మల్ విచారం వ్యక్తంచేశారు.

అజ్మల్‌ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ నోటీసు ఇవ్వడం, భారతీయుణ్నేనని నిరూపించుకోవాలని ఆయన్ను నిర్దేశించడం తప్పని స్వయాన అసోం డీజీపీనే వ్యాఖ్యానించారు. వ్యక్తుల గుర్తింపులో పొరపాట్ల వల్ల ఇలా జరిగిందన్నారు.

ఈ అంశంపై విచారణకు అసోం ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అజ్మల్ పేరు గల్లంతవడానికి బాధ్యులెవరో గుర్తిస్తామని చెప్పారు.

అజ్మల్ సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయిలో పనిచేశారు.

ఎన్‌ఆర్‌సీ

ఫొటో సోర్స్, Getty Images

నియామకం సమయంలోనే విచారిస్తారుగా!

నియామకం సమయంలో సైనికులందరి పూర్వాపరాల గురించి సైన్యం లోతుగా విచారిస్తుందని, అలాంటప్పుడు అజ్మల్ పౌరసత్వం గురించి ఇప్పుడు అనుమానం ఎందుకని సైనికులు ప్రశ్నిస్తున్నారు.

''మమ్మల్ని నియమించుకొనే ముందు మా పౌరసత్వ పత్రాలు, ఇతర పత్రాలను సైన్యం తీసుకొంటుంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పంపించి, వివరాలను నిర్ధరించుకొంటుంది. ఈ నేపథ్యంలో, సైనికులు, మాజీ సైనికుల పౌరసత్వం విషయంలో ఇలాంటి ప్రశ్నలు రానే రాకూడదు'' అని కెప్టెన్ హోదాలో పనిచేసిన సనావుల్లా వ్యాఖ్యానించారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రపతికి లేఖ రాసిన సైనికులు

పౌరసత్వం విషయంలో సమస్యను ఎదుర్కొంటున్న సైనికులు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. ఇందులో జోక్యం చేసుకోవాలని వారు ఆయన్ను కోరారు.

పౌరసత్వంపై నోటీసు అందుకున్నవారిలో గువాహటికి 250 కిలోమీటర్ల దూరాన బార్పెట జిల్లాలో బరికులి గ్రామంలో ఉండే నూర్జహాన్ అహ్మద్‌ ఒకరు.

నోటీసుతో సమాజంలో తమ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆమె వాపోయారు. ఆమె మాజీ సైనికుడు షంషుల్ హక్ భార్య.

షంషుల్ అనుమానిత ఓటర్ల జాబితాలో ఉన్నారు. ఆయనేమో తాను రెండుసార్లు ఓటు కూడా వేశానని చెబుతున్నారు.

షంషుల్ కుమారుడు, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు.

భారతే తన మాతృదేశమని, దేశం పట్ల తనకు ప్రేమ ఉందని, తుది శ్వాస వరకు అస్సాంలోనే ఉండాలనుకుంటున్నానని, మరెక్కడికీ వెళ్లబోనని షంషుల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)