గ్రౌండ్ రిపోర్ట్: 'ఇది ఎలాంటి జిహాద్' అని ప్రశ్నిస్తున్న ఔరంగజేబ్ తండ్రి

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
- రచయిత, మాజిద్ జహాంగీర్
- హోదా, బీబీసీ కోసం
'మీరు కూడా మా అబ్బాయి మృతికి సానుభూతి వ్యక్తం చేయడానికే వచ్చారా?' అని అడిగారు ఔరంగజేబ్ తల్లి.
''కేవలం సానుభూతి చూపే వాళ్లను ఏ తల్లీ ఇష్టపడదు. ధైర్యవంతులైన పిల్లలు చాలా అరుదుగా పుడుతారు. మా అబ్బాయి నాకు శాశ్వతంగా దూరమై నన్ను పుట్టెడు దుఃఖంలో ముంచేశాడు.''
ఇటీవల కశ్మీర్‌లో ఔరంగజేబ్ అనే సైనిక జవాను మిలిటెంట్ల చేతిలో కిడ్నాపై మరుసటి రోజు సమీపంలోని అడవిలో శవంగా తేలిన విషయం తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా సెలవుపై వెళ్తుండగా ఆయన మిలిటెంట్ల చేతికి చిక్కారు.
భారత పాలిత కశ్మీర్‌లోని మేండర్ సమీపంలో సీరా సైలానీ గ్రామంలో ఔరంగజేబ్ తల్లిదండ్రులుంటారు. నేను రాత్రి పొద్దుపోయాక వారింటికి చేరుకోగలిగాను.

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
అప్పటికే వారింట్లో వాతావరణం గంభీరంగా ఉంది. ఆడవాళ్లు ఒక గదిలో, మగవాళ్లు మరో గదిలో కూర్చొని ఉన్నారు. వాళ్లంతా ఔరంగజేబ్‌ను తలుచుకుంటున్నారు.
భారత్, పాక్ సరిహద్దుకు ఔరంగజేబ్ నివాసం చాలా దగ్గరగా ఉంది.
ఔరంగజేబ్ దూరమయ్యాడన్న బాధ నుంచి వారింకా తేరుకోలేదు. కొడుకును కోల్పోయిన తల్లి మొత్తం కశ్మీర్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
''కశ్మీరీలందరిపైనా నాకు ఫిర్యాదులున్నాయి. ఎందుకంటే ఆ దొంగలను వారే దాచిపెడుతున్నారు. అలాంటి కశ్మీర్ నాశనమై పోనీ. నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు'' అంటూ ఔరంగజేబ్ తల్లి రాజ్ బేగం తన ఆక్రోశం వెలిబుచ్చారు.

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
'కశ్మీర్ తన బిడ్డను తానే పొట్టనపెట్టుకుంది'
''ముస్లింలను సాటి ముస్లింలే చంపితే ఆజాదీ (స్వాంత్రంత్ర్యం) రాదు. వాడు అమాయకుడు. పిల్లాడు. కారులో తీసుకెళ్లి చంపారు''అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
''నా బిడ్డను కారులో అడవికి తీసుకెళ్లి చంపిన ఆ డ్రైవర్ ముఖాన్ని ఒకసారి చూడాలనుంది. అలాగే.. నా కొడుకును ఎక్కడ చంపారో ఆ స్థలాన్ని కూడా చూడాలనుంది'' అని రాజ్ బేగం అన్నారు.
"సొంత కశ్మీరీలే నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. కొడుకు దూరమై నా ఇళ్లు ఎడారిగా మారింది" అంటూ ఆమె బోరుమన్నారు.
''అతణ్ని ఒకటే అడగాలనుకుంటున్నా. అతనికి ఏదైనా కావాలంటే నేను ఇచ్చేదాన్ని. నా బిడ్డ ఖాళీ చేతులతో ఉన్నాడు. ఉత్తి చేతులతో ఉన్నవాడిని చంపెయ్యడం ఆజాదీ కాదు'' అని అన్నారు.
''ఈ రోజు ఇంటికి వస్తున్నా'' అని ఔరంగజేబ్ చెప్పిన రోజును రాజ్ బేగం గుర్తు చేసుకున్నారు.
'బిడ్డ వస్తున్నాడని చాలా సంతోషించాం. సాయంత్రం 4 గంటల వరకు రాకపోవడంతో, ఫోన్ చేశాం. కానీ, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
'ఇదే జిహాద్ అనుకుంటే, మేం సిద్ధమే'
ఔరంగజేబ్ హత్య జరిగిన మరుసటి రోజు కొందరు మిలిటెంట్లు అతడ్ని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
కొన్నాళ్ల కిందటే ఔరంగజేబ్ ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆయన సోదరుడు కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు.
"అతడి శవం ఇంటికి వచ్చిన రోజు నా సోదరుడికి బదులు నా ప్రాణాలు పోయినా బాగుండునని అనుకున్నా" అని ఔరంగజేబ్ సోదరి తాబీనా అంది.
ఆ తర్వాత ఆమె మరేం మాట్లాడలేకపోయింది. ఏడవడం మొదలు పెట్టింది.
ఔరంగజేబ్ తండ్రి మహ్మద్ హనీఫ్(55) మాట్లాడుతూ, ''వాళ్లు నిజంగా ముస్లింలే అయితే, వాళ్లు చేస్తున్నది జిహాద్ అయితే, మేం కూడా చేయడానికి సిద్ధమే. కానీ, ముస్లింలు ఎప్పుడూ ముస్లింలను చంపరు. దొంగతనంగా దాడి చేసి చంపడం పిరికి చర్య'' అని పేర్కొన్నారు.
"ఖురాన్‌లో ఇలా రాసుందా? ముస్లింలు ముస్లింలను చంపడం జిహాదా? నా పిల్లాడిని చంపడం జిహాదా? వాళ్లెందుకు ఇలా చేస్తున్నారు?" అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
'న్యాయం చేయకపోతే ఉరేసుకుంటా'
తమకు న్యాయం కావాలని మహ్మద్ కోరుతున్నారు.
‘నాకు సత్వరం న్యాయం చేయాలని మహబూబా ముఫ్తీ, షేక్ అబ్దుల్లాను కోరుతున్నా. చర్చల కోసం వారికి 72 గంటల సమయం ఇస్తున్నా. వాళ్లు ప్రధాని మోదీతో మాట్లాడి 72 గంటల్లో స్పందించకపోతే నేను నా కుటుంబం ఉరి వేసుకుంటాం’ అని మహ్మద్ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, BBC Majid Jahangir
'పేదరికం వల్లే చేరుతున్నారు'
"ఆర్మీలో పనిచేసేవారికి సెలవుల్లో ఇంటికి రావడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లకు ఆర్మీ అంటే జైలులా అనిపిస్తుంది. ఎవరూ ఆ ఉద్యోగాన్ని సంతోషంగా చేయడం లేదు" అని హనీఫ్ అన్నారు.
‘‘వాళ్లంతా చాలా పేదోళ్లు. ఔరంగజేబ్ కూడా పేదరికంతోనే పోరాడారు. ముందు కడుపును సంతృప్తి పర్చాలి. తర్వాతే దేశం కోసం పోరాడాలి. కడుపులో ఏమీ లేకపోతే ఏవరు మాత్రం దేశం కోసం పోరాడగలరు? ’’ అని ఔరంగజేబ్ మామ షరీఫ్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, BBC/Majid Jahangir
''మహబూబా ముఫ్తీ గానీ, షేక్ సాహెబ్ (ఫారూఖ్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా కుటుంబం) గానీ, ప్రధాని మోదీ గానీ ఇక్కడి పేదవాళ్లకు ఎవ్వరూ ఏమీ చేయలేదు. మహబూబా ముఫ్తీ, షేక్ కుటుంబం ఏమీ చేయలేకపోతే వాళ్లు కశ్మీర్ వదిలివెళ్లి పోవాలి'' అని మహ్మద్ షరీఫ్ అన్నారు.
మాకోసం వాళ్లేమీ చేయనప్పుడు మేం ఎందుకు వారి కోసం చావాలి అని ప్రశ్నించారు.
‘ఈద్’ నాడు ఔరంగజేబ్ కుటుంబమంతా అతడి కోసం ఎదురు చూసింది. ‘ఈద్’ వచ్చింది. కానీ, అతను రాలేదు. ఈద్ రోజు ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








