భారత్‌లో మైనారిటీల విషయం మేం మాట్లాడం.. భారత్ కూడా మా దేశంలోని మైనారిటీల విషయంలో అలాగే ఉండాలని కోరుకుంటున్నాం: బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్

- రచయిత, ఇషాద్రిత లాహిరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"భారతదేశంలో మైనారిటీలపై జరుగుతున్న వ్యవహారాలపై మేం ఏమీ మాట్లాడం. భారత అధికారులు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా"
"వారు మా పౌరులు. వారు అణచివేతకు గురవుతుంటే, ఎదుర్కొనే వ్యవస్థలు మా దగ్గర ఉన్నాయి. భారతదేశం మా మైనారిటీలపై శ్రద్ధ తీసుకున్నట్టే, ఆ దేశ మైనారిటీలపై కూడా శ్రద్ధ పెడితే మంచిది"
ఇది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్ వ్యక్తం చేసిన అభిప్రాయం.
బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి.
బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
రెండు దేశాల మధ్య ప్రస్తుత సంబంధాలు, మైనారిటీల పరిస్థితి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో జమాత్ ఏ ఇస్లామీ పాత్ర వంటి అంశాలపై తౌహీద్ హుస్సేన్‌తో బీబీసీ ప్రత్యేకంగా మాట్లాడింది.


ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్-బంగ్లా సంబంధాలు, షేక్ హసీనా
భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత సంబంధాలను మీరు ఎలా చూస్తున్నారు, ఈ రోజుల్లో పరస్పర సంబంధాలు దిగజారిపోయాయా? అని తౌహీద్ హుసేన్‌ను ప్రశ్నించింది బీబీసీ.
"ఈ సంబంధాలు దిగజారిపోయాయా లేదా అనే దానిపై నేను మాట్లాడను. బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధం రెండు దేశాలకు ముఖ్యమైందని నేను నమ్ముతున్నా. సంబంధాన్ని బలంగా ఉంచడానికి రెండు దేశాలు సానుకూల చర్యలు తీసుకోవాలి" అని తౌహీద్ హుసేన్ బదులిచ్చారు.
అయితే, ఈ ప్రభుత్వ పదవీకాలంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు ఉండాల్సిన విధంగా లేవని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు.
"మనం ఒకరితో మరొకరం మరింత ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది. పరస్పర అవగాహన పెంచుకోవాల్సింది. భవిష్యత్తులో అలా జరగాలని నేను కోరుకుంటున్నా" అని ఆయన అన్నారు.
"గత 17 నెలలుగా నేను ఈ బాధ్యతలో ఉన్నా. ఎప్పుడూ మంచి సంబంధాలు ఏర్పడేందుకే ప్రయత్నించా, అలాగే బంగ్లాదేశ్‌లో కూడా భారతదేశం నుంచి స్పందన అంత సానుకూలంగా లేదన్న భావన ఉంది దాంతోకూడా కొంతవరకు ఏకీభవిస్తున్నా" అని చెప్పారాయన.
ఈ సందర్భంలో ఆయన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గురించి కూడా ప్రస్తావించారు.
"బంగ్లాదేశ్‌కి సంబంధించిన సున్నిత అంశాల పట్ల భారత్ తగినంత శ్రద్ధ చూపలేదనుకుంటున్నా. షేక్ హసీనా భారత్‌కు వెళ్లారు. అక్కడ ఆమెకు ఆశ్రయం కల్పించారు" అని తౌహీద్ హుసేన్ అన్నారు.
"ఆమె అక్కడ ఉన్నప్పుడు, బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని, రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాలా ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆశించాం" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై అనేక హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లోని వివిధ ప్రాంతాలలో నిరసనలు జరిగాయి.
మైనారిటీలపై దాడులను ఆపడానికి తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడిందనేదానిపై విదేశాంగ సలహాదారు ఏం చెబుతారో అడిగింది బీబీసీ.
"దీన్ని ఆపడానికి మనం తగిన చర్యలు తీసుకున్నామా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది" అని తౌహీద్ హుసేన్ అన్నారు.
"కొన్ని సంఘటనలు జరిగాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఏం చేసిందో మనం లోతుగా పరిశీలిస్తే.. ప్రతి కేసులో తక్షణ చర్యలు తీసుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకున్నారు. అరెస్టులు చేశారు. వారు విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయ విచారణ ఒక రోజులో లేదా ఒక నెలలో పూర్తవదు. దీనికి సమయం పడుతుంది" అని ఆయన చెప్పారు.
భారతదేశం స్పందన గురించి ఆయన మాట్లాడుతూ, "ఈ విషయంపై భారత్ వ్యక్తం చేసిన అధికారిక ఆందోళనను నేను స్వాగతించను. ఇది పూర్తిగా బంగ్లాదేశ్ అంతర్గత విషయం" అని అన్నారు.
"భారతదేశంలో మైనారిటీలపై జరుగుతున్న చర్యలపై మేం ఏమీ మాట్లాడం. అలాగే భారత అధికారులు కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, @BJI_Official
బంగ్లాదేశ్‌లో జమాత్ ఏ ఇస్లామీ రాజకీయ ప్రభావం గురించి భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో చర్చ జరుగుతోంది. వారి అభిప్రాయాలు రాడికల్‌గా ఉన్నాయని.. దీన్ని మీరు ఎలా చూస్తారు అని తౌహీద్ హుసేన్‌ను అడిగింది బీబీసీ.
"జమాత్ చాలా కాలంగా బంగ్లాదేశ్‌లో బహిరంగ రాజకీయ పార్టీగా ఉంది. వారికి మద్దతు ఉంది" అని తౌహీద్ హుసేన్ అన్నారు.
జమాత్‌ను బీజేపీతో పోలుస్తూ, "ఒకప్పుడు బీజేపీకి పార్లమెంటులో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవి. నేను ఆ సమయంలో భారత్‌లో ఉన్నా. చాలా కాలం తర్వాత అదే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదే పార్టీ మెజారిటీ ప్రభుత్వంతో తిరిగి వచ్చింది" అని ఆయన అన్నారు.
"ఇది సాధ్యమైనప్పుడు, జమాత్ ఏ ఇస్లామీ ఉనికి పెరుగుతుందని నమ్మడంలో మాకు ఎటువంటి సమస్య లేదు. వారు రాజకీయాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఎప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి" అని తౌహీద్ అన్నారు.
"మీకు లేదా నాకు వారి అభిప్రాయాలు నచ్చకపోవచ్చు, కానీ వారికి ఒక రాజకీయ పార్టీ ఉంది, సొంత భావజాలం ఉంది" అని ఆయన చెప్పారు.
మహిళలపై కొంతమంది జమాత్ నాయకుల అభిప్రాయాల గురించి తౌహీద్‌ను అడిగింది బీబీసీ.
బీబీసీ కలిసిన కొంతమంది జమాత్ నాయకులు.. మహిళలు ఎప్పుడూ బురఖా ధరించి ఉండాలని నమ్ముతారని, ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు, వారితో పాటు ఒక పురుషుడు ఉండాలని అనుకుంటారని.. ఈ అభిప్రాయాలను ఆమోదిస్తారా? అని తౌహీద్‌ను ప్రశ్నించగా..
"ఇవి ఆమోదయోగ్యమైన ఆలోచనలు కావు, బంగ్లాదేశ్‌లో ఇది జరుగుతుందని నేను అనుకోను" అని ఆయన బదులిచ్చారు.

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
పాకిస్తాన్, బంగ్లా సంబంధాలు
ఒకవైపు భారతదేశంతో బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు పాకిస్తాన్‌తో దాని సంబంధాలు దశాబ్దాలకన్నా మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మధ్య కూడా సమావేశాలు జరిగాయి. గతేడాది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్‌ను సందర్శించారు.
పాకిస్తాన్‌తో కొత్తగా పెరుగుతున్న ఈ సంబంధం వెనుక ఉన్న ఆలోచన ఏమిటో విదేశాంగ సలహాదారుని అడిగింది బీబీసీ.
"నేను మీకు హామీ ఇస్తున్నా.. భారతదేశంతో సంబంధాలను దెబ్బతీసేందుకు మా వైపు నుంచి ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఎందుకు జరిగిందో దిల్లీలోని నా సహచరులను అడగండి" అని తౌహీద్ హుసేన్ అన్నారు.
"పాకిస్తాన్ విషయానికొస్తే, గత పాలన అంతటా సంబంధాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతిన్నాయి. అంతకుముందు మంచి సంబంధమే ఉంది" అని ఆయన తెలిపారు.
"పాకిస్తాన్‌తో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ అంశాలపై పని చేస్తున్నాం. కానీ షేక్ హసీనా ఉద్దేశపూర్వకంగా సంబంధాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకున్నప్పుడు, సంబంధాలు క్షీణించడం మొదలైంది, అది కొనసాగింది" అని తౌహీద్ అన్నారు.

"మీ సంబంధాల గురించి నిర్ణయించుకునే హక్కు మీకు ఉంది, అలాగే బంగ్లాదేశ్ తన సంబంధాల గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు, దాన్ని గౌరవించాలి" అని ఆయన అన్నారు.
"భారత్, పాకిస్తాన్‌లు ఒకదాన్నొకటి శత్రువులుగా భావిస్తాయి. కానీ, మేం ఎవరికీ శత్రువులం కాదు. భారత్, పాకిస్తాన్‌లు రెండింటికీ మేం శత్రువులం కాదు. మా ప్రయోజనాల ఆధారంగా పాకిస్తాన్‌తోనూ సంబంధాలు కొనసాగిస్తాం" అని ఆయన చెప్పారు.
"వీసాలు రాకపోతే ప్రజలు భారత్‌కు వెళ్లలేక పాకిస్తాన్‌కు వెళ్లాలనుకుంటే, మావైపు నుంచి సమస్య ఎందుకు వస్తుంది? దీనికి భారత్ ఎందుకు అభ్యంతరం చెప్పాలి?" అని ఆయన వీసా వ్యవస్థ గురించి ప్రశ్నించారు.
"బంగ్లాదేశ్ ప్రజలు చికిత్స కోసం భారత్‌కు వెళ్లేవారు. వారు భారత ప్రభుత్వం నుంచి లేదా భారత సమాజం నుంచి సహాయం అడగలేదు. డబ్బు చెల్లించే చికిత్స పొందారు. ఇది మాకు, భారత్‌కు కూడా మంచిదే. చాలా ఆసుపత్రులకు బంగ్లాదేశ్ నుంచి గణనీయమైన వ్యాపారం ఉండేది. ఇప్పుడు ఆ వ్యాపారం పోయింది. బంగ్లాదేశ్ రోగులు మాకు వద్దు అని నిర్ణయించుకోవడం మీ ఇష్టం. మా రోగులు ఇప్పుడు చికిత్సకోసం చైనా, థాయిలాండ్, తుర్కియేకి వెళ్తున్నారు" అని తౌహీద్ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














