బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన దీపు చంద్రదాస్ కుటుంబ సభ్యుల పరిస్థితేంటి? వాళ్లేం కోరుకుంటున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ నివేదికలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)
గోడపై ఉన్న బ్యానర్‌పై ఇలా రాసి ఉంది - దీపు చంద్రదాస్ మరణం మాకు తీవ్రమైన వేదన కలిగించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైమెన్‌సింగ్‌లోని భాలుకాలో ఒక ఫ్యాక్టరీ గోడపై ఈ బ్యానర్ వేలాడదీసి ఉంది. ఇక్కడే 28 ఏళ్ల దీపు చంద్ర దాస్ పనిచేసేవారు.
డిసెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో, ఒక గుంపు దీపును తీసుకెళ్లిన అదే పయనీర్ నైట్‌వేర్ ఫ్యాక్టరీలోనే ఈ బ్యానర్ ఉంది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, కొంతమంది గుంపుగా వచ్చి తమ మతాన్ని అవమానించారని ఆరోపిస్తూ దీపుపై దాడి చేసి, కొట్టి చంపారు.

దీపు మృతదేహాన్ని ఫ్యాక్టరీ నుంచి కొంత దూరం తీసుకెళ్లి, తర్వాత తగులబెట్టారని పోలీసులు మాతో చెప్పారు. ఈ ప్రాంతం ఫ్యాక్టరీ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉంది. రెండు ప్రదేశాలను కలిపే రహదారి ఇళ్లు, మార్కెట్లతో నిండి ఉంది.
ఆ రోజు ఉద్రిక్తతలు పెరగడంపై తమకు సమాచారం అందిందని మైమెన్‌సింగ్‌లోని సీనియర్ పోలీసు అధికారులు బీబీసీ దగ్గర అంగీకరించారు. కానీ, వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దీపు మరణించారు. వారు ఆయన మృతదేహాన్ని మాత్రమే గుర్తించగలిగారు.
తమ పేర్లను వెల్లడించడానికి ఈ పోలీసు అధికారులు నిరాకరించారు.
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ఇదంతా జరిగింది. యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీపై రాజధాని ఢాకాలో కాల్పులు జరిగాయి. కొద్ది రోజుల తర్వాత ఆయన మరణించారు. ఇది బంగ్లాదేశ్‌లో వరుస నిరసనలు, హింసకు దారితీసింది. షరీఫ్ ఉస్మాన్ హాదీ ఈ ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
ప్రశ్నలు చాలానే ఉన్నాయి, కానీ సమాధానాలు లేవు
ఆ గుంపు దీపు వద్దకు ఎలా వచ్చింది? ఆయన పనిచేసే వస్త్ర కర్మాగారంలోని వ్యక్తులు ఏం చేస్తున్నారు? పోలీసులకు ముందస్తు సమాచారం ఉంటే దీపుకు భద్రత ఎందుకు కల్పించలేదు? ఇవి సమాధానం లేని ప్రశ్నలు.
డిసెంబర్ 26 నాటికి ఈ కేసులో 18 మందిని అరెస్టు చేసినట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. వారిలో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.
బీబీసీ బృందం దీపు పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్లింది. మాట్లాడేందుకు లోపల ఎవరూ లేరని అక్కడ ఉన్న గార్డు చెప్పారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
'మాకు న్యాయం కావాలి'
మైమెన్‌సింగ్ నుంచి దాదాపు గంట ప్రయాణం తర్వాత మేం దీపు కుటుంబాన్ని కలిశాం. అది ఒక చిన్న కాలనీ. ఇక్కడ అన్ని రేకులతో పైకప్పు వేసిన ఇళ్లు, అన్నీ దాదాపు ఒకేలా కనిపించాయి. అయినప్పటికీ దీపు ఇంటిని గుర్తించడం కష్టమేమీ కాలేదు. దగ్గరలోని గోడలన్నీ దీపు హత్యకు సంబంధించిన పోస్టర్లతో నిండి ఉన్నాయి.
లోపలికి అడుగు పెట్టగానే విషాదం నిండిన ఇంట్లోకి వెళ్లినట్టు అనిపించింది.
కుటుంబ సభ్యులు సరిగ్గా మాట్లాడలేకపోయారు కూడా.
దీపు భార్య, 21 ఏళ్ల మేఘనా రాణి తీవ్ర షాక్‌లో ఉన్నారు. ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. తండ్రి మరణం గురించి తెలియని వారి ఏడాదిన్నర కుమార్తె అప్పుడప్పుడు నవ్వుతూ దగ్గరలో కూర్చున్న కుటుంబ సభ్యులతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
దీపు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు, ప్రశ్నలకు సమాధానాలపై లేదా ఆ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వారికి అంత ముఖ్యం కాదని మాకు అర్థమైంది.
"మాకు న్యాయం కావాలి. ఇంతకుమించి ఏమీ చెప్పాలనుకోవడం లేదు" అని దీపు తమ్ముడు అప్పూ దాస్ అన్నారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
'నేను ఆ వీడియో చూడలేను'
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ హత్యను ఖండించింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. వారికి ఆర్థిక సహాయం, ఇతర సాయం కూడా అందింది.
దీపు చివరి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
షెఫాలీ రాణి దీపు తల్లి.
"నేను వాడి తల్లిని. ఆ వీడియోను నేను చూడలేను" అని ఆమె అన్నారు.
ఈ మాట చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఆమె స్పృహ కోల్పోయి నేలపై కుప్పకూలిపోయారు. కుటుంబంలోని మిగిలిన వారు ఆమెను స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాసేపటి తర్వాత ఆమెకు స్పృహ వచ్చింది.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
'ఏ మతాన్నీ, ఎప్పుడూ అవమానించలేదు'
"మా ముగ్గురు కుమారులలో దీపు పెద్దోడు. మతాన్ని అగౌరవపరిచాడనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. వారు కుట్ర చేసి నా కొడుకును చంపారు" అని దగ్గరలో కూర్చున్న దీపు తండ్రి రబిలాల్ చంద్ర దాస్ బీబీసీతో చెప్పారు.
"దీపుకు తెలిసిన వారు అక్కడ చాలా మంది ఉన్నారు. కానీ, ఎవరూ కాపాడటానికి ప్రయత్నించలేదు. దీపు హిందువు కాబట్టి ఆ గుంపు చాలా క్రూరంగా ప్రవర్తించింది."
"దీపు స్కూల్, కాలేజీలో చదువుకున్నాడు. దీపు చెడ్డగా ప్రవర్తించచారని అప్పుడెప్పుడూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కరోనా కారణంగా బీఏ ఫైనల్ ఇయర్ పూర్తిచేయలేకపోయాడు. నేను కూలీగా పనిచేస్తున్నాను. ఒంటరిగా ఇంటి బాధ్యత తీసుకోలేను. మా కుటుంబాన్ని దీపు పోషించేవాడు" అని రబిలాల్ చెప్పారు.
ఆ కుటుంబాన్ని ప్రజలు నిరంతరం పరామర్శిస్తున్నారు. చాలామంది సాయం కూడా అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
మైనారిటీ వర్గాలపై ప్రభావం
దీపు హత్యను బంగ్లాదేశ్‌లో తమ హక్కుల అణచివేత, పెరుగుతున్న అసహనానికి కొనసాగింపుగా చూడాలని మైనారిటీ సంస్థలతో సంబంధమున్న చాలామంది పట్టుబడుతున్నారు.
అదే సమయంలో, ఈ హత్యకు మతంతో సంబంధం లేదని కూడా కొంతమంది అంటున్నారు.
ఎవరు ఏ వైపు ఉన్నారనేది వేరే విషయం. కానీ, ఇలాంటి సంఘటనలు సాధారణ మైనారిటీలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో మనం మన కళ్ళతో చూశాం.
మేం ఒక హిందూ వ్యాపారవేత్తతో మాట్లాడటానికి ప్రయత్నించాం. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత 2024లో చెలరేగిన హింసలో ఆయన షోరూమ్‌ను తగులబెట్టారు. ఆయనకు కలిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చిందో లేదో, దాడి చేసిన వారిని పట్టుకున్నారో లేదో మేం తెలుసుకోవాలనుకున్నాం.
"మీరు నాతో మాట్లాడటానికి ప్రయత్నించినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఏమీ చెప్పదలచుకోలేదు. దాని గురించి మాట్లాడటం నాకు ప్రమాదకరం కావొచ్చు" అని ఆయన అన్నారు.
ఆయన ఐడెంటిటీ వెల్లడించబోమని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించినా, ఆయన ముందుకు రాలేదు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
‘2024 ఆగస్ట్ నుంచి దాడులు పెరిగాయి’
బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మైనారిటీలు ఉన్నారు. దేశంలో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గం కాగా, ముస్లిం జనాభా దాదాపు 91 శాతం.
బంగ్లాదేశ్ ఏర్పడటానికి ముందే ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు, అందుకు సంబంధించిన హింస ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య హింస ఎక్కువగా ఉండేది.
ఢాకాలో రద్దీగా ఉండే ప్రెస్ క్లబ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ఆడిటోరియంలో మైనారిటీల హక్కులు, మానవ హక్కుల సంస్థల సమావేశం జరుగుతోంది.
అక్కడే రంజన్ కర్మాకర్‌ను కలిశాం.
"నేను మానవ హక్కుల కార్యకర్తను. నాకు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్‌తో సంబంధముంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.
"2024 ఆగస్ట్ 5 నుంచి, మా కమ్యూనిటీలపై 3,000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని మా లెక్కల్లో తేలింది. గతంలో అంతా బాగానే ఉందని మేం చెప్పడం లేదు గానీ ఇప్పుడు ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తూ ఉన్నట్టు మాత్రం కనిపిస్తోంది. హింసకు పాల్పడేవారికి ఈ మౌనం నిశ్శబ్ద మద్దతుగా మారింది" అని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
'మతపరమైన హింస కాదు'
"మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పినప్పుడల్లా ఇది మతపరమైన హింస కాదు, రాజకీయ హింస అని ప్రభుత్వం చెబుతుంటుంది" అని రంజన్ కర్మాకర్ అన్నారు.
ఈ గణాంకాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అయితే కొన్ని నెలల క్రితం కౌన్సిల్ నివేదించిన 2,400 కంటే ఎక్కువ "దాడులపై" బంగ్లాదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చేసింది.
గత సంవత్సరం జూలైలో ప్రభుత్వం ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది, "మత హింసకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు " అని పేర్కొంది. అనేక సంఘటనలు "వ్యక్తుల వ్యక్తిగత దాడుల"కు సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది.
మైనారిటీ గ్రూపులు, ప్రభుత్వం రెండింటి వాదనల మధ్య ఎందుకు తేడా ఉందో పరిశీలించాలని బంగ్లాదేశ్‌లోని ఐన్-ఓ-షాలిష్ సెంటర్‌లో మానవ హక్కుల కార్యకర్త అబూ అహ్మద్ ఫైజుల్ కబీర్ చెప్పారు.
"షేక్ హసీనా పాలన ముగిసిన దగ్గరి నుంచి మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా స్థానిక స్థాయిలో వేధింపులు, హింస జరుగుతోంది. దీన్ని కాదనలేం. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులను, హింసాత్మక ఘటనలను అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంది..దీనినీ అంగీకరించాలి" అని ఆయన అన్నారు.
"కానీ మరింత జాగ్రత్తతో ఉండడం, ముందస్తు జోక్యం, నమ్మకాన్ని పునర్నిర్మించడం వంటి చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో వ్యవహరించాలని మేం ఆశిస్తున్నాం'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Devashish Kumar/BBC
మైనారిటీల పరిస్థితిపై దేశం వెలుపల ఆందోళన
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ ఇటీవల విడుదల చేసిన మరో ప్రకటనలో, నూతన బంగ్లాదేశ్‌లో ఇలాంటి హింసకు స్థానం లేదని, నేరస్థులను వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం కూడా మొహమ్మద్ యూనస్ మతస్వేచ్ఛను కాపాడడం గురించి మాట్లాడారు.
కానీ, మైనారిటీలకు మెరుగైన రక్షణ కోసం బంగ్లాదేశ్ లోపల, వెలుపల డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.
దీపు హత్య తర్వాత జరిగిన నిరసనలు కూడా ఇలాంటివే.
గత ఏడాది నవంబర్‌లో పోప్ కూడా బంగ్లాదేశ్‌లో మత స్వేచ్ఛ దారుణ స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తరువాత మార్చిలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోపణలు, ప్రత్యారోపణలు
ఈ అంశంపై భారత్ కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
స్వతంత్ర వనరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై బంగ్లాదేశ్‌లో 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు జరిగాయని డిసెంబర్ 26న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన తాజా ప్రకటనలో పేర్కొంది. వీటిలో హత్య, తగలబెట్టడం, భూ కబ్జా వంటి ఘటనలున్నాయి.
ఈ సంఘటనలను అతిశయోక్తిగా చెబుతున్నారని లేదా ఇది కేవలం రాజకీయ హింస అని చెప్పడం ద్వారా విస్మరించలేమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారత్ ప్రకటనను గత ఆదివారం బంగ్లాదేశ్ తిరస్కరించింది.
భారత దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ మైనారిటీలపై ద్వేషపూరిత నేరాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బెల్జియంకు చెందిన ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై ఒక నివేదికను ప్రచురించింది.
"షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై హింస గణనీయంగా పెరిగిందని భారతదేశంలో ఒక అభిప్రాయం ఉందని నేను విశ్వసిస్తున్నా. కానీ 2024లో దాడుల సంఖ్య 2021లో జరిగినట్లే ఉందని డేటా చూపిస్తోంది" అని రిపోర్ట్ తయారీలో పాల్గొన్న థామస్ కీన్ బీబీసీతో చెప్పారు.
'' షేక్ హసీనా పదవీకాలంలో మైనారిటీలపై దాడులు 2021లో చాలా జరిగాయని తెలుసు. అయితే 2021 ,2024లో భారత్ ఎలా స్పందించిందో పరిశీలిస్తే భాష, విధానం చాలా భిన్నంగా ఉన్నాయి."
"ఈ విషయంలో భారత్ కనీస స్థాయిలో మాత్రమే బహిరంగ ప్రకటనలు చేయాలని మేం సూచిస్తున్నాం. మరోవైపు మైనారిటీల కోసం బంగ్లాదేశ్ మంచి సమాజాన్ని నిర్మించి వారి భద్రతను మెరుగుపరచాలి" అని థామస్ కీన్ అంటున్నారు.
బీబీసీ బంగ్లా నివేదిక ప్రకారం, తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మూక దాడులు, హింసాత్మక దాడులు 'భయంకరంగా' పెరిగాయని అనేక మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన నిందితుడు భారత్‌కు పారిపోయారని ఢాకా పోలీసులు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ పోలీసులు, అలాగే సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) వర్గాలు బంగ్లాదేశ్ వాదనలను తోసిపుచ్చాయి .
ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికలపైనే ఉంది. భద్రతను పెంచుతామని, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని తాత్కాలిక ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













