‘‘నేను ఎన్నటికీ దిల్లీలో అడుగుపెట్టను’’ బంగ్లాదేశీ పేరుతో బహిష్కరణకు గురై, తిరిగి భార‌‌త్‌కు వచ్చిన సునాలీ ఖాతున్ కథ

సునాలీ ఖతూన్, డిపోర్టేషన్
ఫొటో క్యాప్షన్, సునాలీ ఖాతున్, ఆమె కుటుంబాన్ని బంగ్లాదేశీయులు అనే పేరుతో భారత్ నుంచి పంపించి వేశారు.
    • రచయిత, ఇల్మా హసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సునాలీ ఖాతున్ ప్రసవానికి దగ్గరలో ఉన్నారు. ఆమె వయసు 25 ఏళ్లు. ‘‘నా బిడ్డ బంగ్లాదేశ్‌లో జన్మిస్తే తన పౌరసత్వం మారిపోతుందేమోనని భయపడ్డాను’’ అంటారు సునాలీ.

ఈ ఏడాది జూన్‌లో ఆమెను బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేశారు. ఈ నెల ప్రారంభంలోనే ఆమె తిరిగి భారత్‌కు వచ్చారు.

దిల్లీలో బతుకుదెరువుకోసం ఇళ్లలో పనిచేసుకుంటున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన సునాలీ ఆమె భర్త డానిష్ షేక్, వారి 8 ఏళ్ల కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

వీరు అక్రమవలసదారులనే అనుమానంతో బంగ్లాదేశ్‌ పంపించారు. అక్కడ బంగ్లాదేశ్ అధికారులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై వీరిని జైలులో పెట్టారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సునాలీ ఖాతూన్ బహిష్కరణ జాతీయస్థాయిలో హెడ్‌లైన్‌గా మారింది. ఎటువంటి కారణాలు లేకుండా వారిని బంగ్లాదేశ్‌కు పంపారంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది.

గడిచిన కొన్నినెలల్లో అక్రమవలసదారులనే అనుమానంతో నిర్బంధంలోకి తీసుకుని బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేసిన వందలమందిలో సునాలీ ఒకరు.

దిల్లీ ప్రభుత్వం ఈ బహిష్కరణలపై అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం, ఒక్క మే నెలలో మాత్రమే 1,200 మందికి పైగా ప్రజలను "అక్రమంగా సరిహద్దువైపు నెట్టేశారు’’ అని చెప్పారు.

అదే నెలలో ఆకాశవాణి కూడా దిల్లీ నుంచి సుమారు 700 మందిని బంగ్లాదేశ్‌కు తిరిగి పంపినట్టు రిపోర్ట్ చేసింది.

సునాలీ ఖతూన్, డిపోర్టేషనవ్
ఫొటో క్యాప్షన్, సునాలీ ఖాతున్, మరో మూడు ముస్లిం కుటుంబాలు భారత్‌లోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్టుగానీ, లేదంటే ఇక్కడ నివసిస్తున్నట్టుగానీ ఎటువంటి పత్రాలు అందించలేకపోయారని ఎఫ్ఆర్ఆర్ఓ తెలిపింది.

దిల్లీలో పట్టుకుని బంగ్లాదేశ్‌‌కు...

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపడం భారత్‌లో కొత్తేమీ కాదు. రెండు దేశాల మధ్య 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఐదు భారత రాష్ట్రాల గుండా వెళ్తుంది. సాంస్కృతిక, భాష, సామాజిక బంధాలు బలంగా ఉండటంతో, దశాబ్దాలుగా ప్రజలు ఉపాధి కోసం భారత్‌కు వలస వచ్చారు. కొందరు మతపరమైన వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కూడా వచ్చారు.

కానీ ఇటీవల దాడులు బెంగాలీ మాట్లాడే ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నవని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. వీరు అటు బెంగాలీలోనూ ఇటు బంగ్లాలోనూ మాట్లాడతారు. వీరి విషయంలో సరైన న్యాయ ప్రక్రియ పాటించడం లేదని చెబుతున్నారు.

దిల్లీ ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్ఆర్ఓ) అందించిన సమాచారం ప్రకారం, సునాలీ ఖాతున్ కుటుంబం, అలాగే వారి పక్కింట్లో నివసించే మరో ముగ్గురు బెంగాలీ మాట్లాడే ముస్లింలు భారత్‌లో తమ నివాసానికి సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు అందించడంలో విఫలమయ్యారు.

నిబంధనల ప్రకారం, అక్రమ వలసదారులని అనుమానించిన వారి పౌరసత్వం గురించి వారి సొంత రాష్ట్రంతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది . కానీ ఈ ప్రక్రియ సునాలీ విషయంలో పాటించలేదని పశ్చిమ బెంగాల్ మైగ్రెంట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ సమీరుల్ ఇస్లాం బీబీసీకి తెలిపారు.

ఈ విషయంపై దిల్లీ హోం శాఖను బీబీసీ సంప్రదించింది. అయితే ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.

సుప్రీంకోర్టు జోక్యంతో భారత్‌కు తిరుగు ప్రయాణం

సునాలీ ఖతీన్ డిపోర్టేషన్, భారత్ బంగ్లాదేష్
ఫొటో క్యాప్షన్, సరిహద్దు భద్రతా దళం తనను బలవంతంగా బంగ్లాదేశ్‌వైపు పంపించిందని సునాలీ ఆరోపించారు

డిసెంబర్‌లో భారత సుప్రీంకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంది. పౌరసత్వ విచారణ పూర్తయ్యే వరకు "మానవతా దృక్పథంతో" సునాలీని, ఆమె కుమారుడిని భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అప్పటి నుంచి సునాలీ పశ్చిమ బెంగాల్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె భర్త డానిష్ షేక్‌కు బంగ్లాదేశ్‌లో బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన అక్కడ బంధువుల వద్ద ఉంటున్నారు.

భారత్‌కు తిరిగి వచ్చినందుకు సునాలీలో సంతోషం, బాధ కలగలసిన భావన కనిపించింది. వచ్చే జనవరిలో పుట్టబోయే తన బిడ్డ భారత పౌరసత్వాన్ని పొందుతుందని ఆమె సంతోషపడుతున్నా, తన భర్త గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలుగా ఆమె ఆయనను నేరుగా చూడలేదు. బంగ్లాదేశ్‌లో వారిని వేర్వేరు జైళ్లలో ఉంచారు.

"వీడియో కాల్‌లో మాట్లాడినప్పుడు అతను భావోద్వేగానికి గురవుతుంటాడు. ఇంటికి రావాలని ఉందని అంటుంటాడు" అని సునాలీ చెప్పారు.

"మేం బంగ్లాదేశ్ వాళ్లం కాదు. మేం భారతీయులమే. మరి మాకెందుకు ఇలా చేశారు?" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

సునాలీ మరికొన్ని ఆరోపణలు కూడా చేశారు. దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారం రోజుల తర్వాత, తన కుటుంబాన్ని, పొరుగువారిని విమానంలో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుకు తీసుకెళ్లారని ఆమె చెబుతున్నారు.

అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది తమను బంగ్లాదేశ్ వైపు ‘‘బలవంతంగా పంపించారు" అని ఆమె ఆరోపిస్తున్నారు.

"అదో దట్టమైన అటవీ ప్రాంతం. చుట్టూ నదులు, వాగులు ఉన్నాయి. అక్కడే మమ్మల్ని వదిలేశారు" అని ఆమె అన్నారు.

స్థానికులు చెప్పిన దారిలో తిరిగి భారత్‌కు రావడానికి ప్రయత్నించినప్పుడు, బీఎస్ఎఫ్ సిబ్బంది తన భర్తతో సహా తమ బృందంలోని కొందరిని కొట్టారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత మళ్లీ అదే అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారని సునాలీ చెప్పారు.

ఈ ఆరోపణలపై స్పందన కోరుతూ బీఎస్‌ఎఫ్‌కు బీబీసీ ప్రశ్నలు పంపింది.

‘‘దిల్లీకి తిరిగివెళ్లను’’

సునాలీ బంగ్లాదేష్ ప్రభుత్వం
ఫొటో క్యాప్షన్, వీడియో కాల్ చేసినప్పుడల్లా సునాలీ భర్త భావోద్వేగానికి గురవుతుంటారు

స్థానికుల సహాయంతో ఈ బృందం చివరకు ఢాకా చేరుకుంది. అక్కడ రోజుల తరబడి సరైన ఆహారం, నీరు లేక తిరిగారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

గర్భిణి అయిన తనకు జైలు ఆహారం ఏమాత్రం సరిపోలేదని సునాలీ చెప్పారు. తమ సెల్‌లో మరుగుదొడ్డి కూడా లేదని ఆమె అన్నారు.

అక్కడ నేను, నా కొడుకు తప్ప మరెవ్వరూ లేరు. మేము రోజంతా ఏడుస్తూనే ఉండేవాళ్లం. నాకు చాలా భయం వేసేది" అని సునాలీ అన్నారు.

ఈ ఆరోపణలపై బంగ్లాదేశ్ హోం శాఖ, జైలు శాఖలను కూడా బీబీసీ సంప్రదించింది. అక్కడి నుంచి కూడా స్పందన కోసం ఎదురుచూస్తోంది.

భారత్‌లో సునాలీ కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూ, దానిష్ షేక్ భారత పౌరుడేనని నిరూపించే ప్రయత్నాల్లో ఉంది. ఆయన్ను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని తన తల్లిదండ్రులకు చెందిన ఒకే గది ఉన్న గుడిసెలో, ఇద్దరు చిన్న పిల్లలతోపాటు ఉంటోంది సునాలీ. "నా కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది" అని ఆమె అన్నారు.

తన పిల్లలందరిని ఎలా పోషించాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఇక్కడ ఉంటే మాకు మూడు పూటలా భోజనం దొరకకపోవచ్చు. కానీ నేను మళ్లీ ఎన్నటికీ దిల్లీ వెళ్లను" అని సునాలీ ఖాతూన్ స్పష్టంగా చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)