బంగ్లాదేశ్‌లో రాజకీయ పార్టీలు భారత్ గురించి ఏం మాట్లాడాయి?

డిసెంబర్ 4న బంగ్లాదేశ్‌లోని ప్రధాన రాజకీయ పక్షాల సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం, అస్తిత్వం, స్వాతంత్ర్యాలను కాపాడేందుకు నిబద్ధతతో పని చేస్తామని ఈ సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారతదేశం నిర్వహిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తాత్కాలిక ప్రభుత్వ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ సమావేశం తర్వాత వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకమైనదిగా భావిస్తున్నారు. భారత్‌తో ఉద్రిక్త సంబంధాల విషయంలో బంగ్లాదేశ్ తన వైఖరిని ఈ సమావేశం ద్వారా స్పష్టం చేసింది.
త్రిపురలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయంలోకి ఆందోళనకారులు ప్రవేశించడంపై ఈ సమావేశంలో తీవ్ర స్పందన వ్యక్తమైంది.
సోమవారం ఢాకా యూనివర్శిటీ విద్యార్థులు భారత్‌కు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించి, తమ దేశంలో భారతదేశ వ్యూహాలు పని చేయవని హెచ్చరించారు.
బుధవారం నాటి సమావేశంలో కూడా బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నేతలు భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లోని ఫారిన్ సర్వీస్ అకాడమీలో జరిగిన ఈ సమావేశం వివరాలను న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వివరించారు. దేశ ఐక్యతను కాపాడుకోవడంలో అన్ని వర్గాలూ కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నారు. కొందరు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా దేశంలోని అన్ని వర్గాలూ తమ ఐక్యతను కాపాడుకున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి దుష్ప్రచారాలను, రెచ్చగొట్టే చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ నిస్సహాయమైన దేశం కాదని, ఎవరికీ తల వంచదని, భారతదేశపు దుష్ప్రచారాన్ని ఐక్యంగా అడ్డుకోవాలని ఈ సమావేశంలో అన్ని పార్టీలూ అభిప్రాయపడినట్లు ఆసిఫ్ నజ్రుల్ వెల్లడించారు.


ఫొటో సోర్స్, ANI
ఉద్రిక్తతలు ఎందుకు?
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. గతవారం బంగ్లాదేశ్‌లోని సనాతన్ జాగరణ్ మంచ్, ఇస్కాన్‌లతో అనుబంధం ఉన్న మహంత్ చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణల కింద బంగ్లా ప్రభుత్వం అరెస్టు చేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను విమర్శిస్తూ చిన్మయ్ కృష్ణ దాస్ అనేకసార్లు ప్రకటనలు చేశారు. చిన్మయ్ అరెస్టుపై భారత్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు బంగ్లా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల సమయంలోనే కొంతమంది నిరసనకారులు త్రిపురలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్‌లోకి ప్రవేశించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, తమదేశంలోని భారత హైకమిషనర్‌ను పిలిపించింది.
"ఇది దురదృష్టకరం. దీన్ని అస్సలు అంగీకరించలేం. హిందూ అతివాదులు డిప్యూటీ హైకమిషన్ ఆఫీసులోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారు. మా అధికారులు, ఉద్యోగులు చాలా భయపడుతున్నారు’’ అని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హసన్ బీబీసీతో అన్నారు.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులతోపాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి కొన్ని భారతీయ మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రసారం చేస్తున్నాయని బంగ్లాదేశ్ అధికారులు అంటున్నారు.
"దురదృష్టవశాత్తు భారతీయ మీడియాకు ఈ అంశంపై నియంత్రణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్ గురించి ప్రతికూల ప్రచారం చేయడంలో భారతీయ మీడియా చాలా బిజీగా ఉంది. ఇలా ఎందుకు చేస్తున్నారో, దీని వల్ల భారత్‌కుగానీ, బంగ్లాదేశ్‌కుగానీ ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని తౌహిద్ హసన్ అన్నారు.

ఫొటో సోర్స్, CA PRESS WING
నిపుణులు ఏమంటున్నారు?
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా, దౌత్యపరమైన అంశాలపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో పరిణామాలు పొరుగు దేశంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు.
బంగ్లాదేశ్‌లోని భారత మాజీ హైకమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. "బంగ్లాదేశ్‌లో ఘటనలతో భారతదేశంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్ ముందుగా తమ దేశంలో విస్తరిస్తున్న అరాచకాలను నియంత్రించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మైనారిటీలపై దాడుల నియంత్రణపై దృష్టి సారించాలి’’ అని పినాక్ రంజన్ అన్నారు.
భారతదేశానికి బంగ్లాదేశ్ కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామి కూడా. సరిహద్దులో మెరుగైన భద్రత కోసం బంగ్లాదేశ్ సహకారం కూడా అవసరం. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఎక్కువ భాగం భారతదేశ సరిహద్దుకు ఆనుకుని ఉంది. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, భాషా సాన్నిహిత్యం కూడా ఉంది.
బంగ్లాదేశ్‌లోని దాదాపు 17 కోట్ల జనాభాలో హిందువుల జనాభా 10 శాతం కంటే తక్కువ. ఆ దేశంలోని హిందూ సమాజంపై వివక్ష, దౌర్జన్యాలు సాగుతున్నాయని దానికి నాయకత్వం వహిస్తున్న వారు తరచూ ఆరోపిస్తున్నారు.
ఇస్లామిక్ శక్తులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, TV GRAB/ YAMUNA TV
బంగ్లాదేశ్ నేతల దూకుడు మాటలు
ఈ ఏడాది ఆగస్టులో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పీఠాన్ని కోల్పోయి, భారత్‌కు వచ్చినప్పుడు బంగ్లాదేశ్‌లో ఆమె మద్దతుదారులపై దాడి జరిగింది. వీరిలో చాలా మంది మైనారిటీ వర్గాలకు చెందినవారే.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ దాడులు కాస్త తగ్గుముఖం పట్టడంతో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయితే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత పరిస్థితి మళ్లీ దిగజారింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ నేతలు భారత్‌పై కటువైన ప్రకటనలు చేస్తున్నారు.
‘‘బంగ్లాదేశ్‌పై భారతదేశపు 'దూకుడు వైఖరి' ఇలాగే కొనసాగితే, మీ ఉద్దేశాలు చెడుగా ఉంటే, మేం కూడా ఒకప్పుడు మా భూభాగాలైన బెంగాల్, బిహార్, ఒడిశాలు మాకివ్వాలని డిమాండ్ చేస్తాం.’’ అని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి రుహుల్ కబీర్ రిజ్వీ బుధవారం అన్నారు.
జులై తిరుగుబాటు సమయంలో బంగ్లాదేశ్ యువకుల బలిదానాలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుండగా, షేక్ హసీనాను కాపాడేందుకు బంగ్లాదేశ్ ప్రజలపై భారత్ దుష్ప్రచారం నిర్వహించిందని రిజ్వీ ఆరోపించారు.
‘‘మీకు మీ దూకుడు వైఖరి సమర్థనీయమని అనిపిస్తే, మేం కూడా మా స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాం.’’ అని అన్నారాయన.
ఇదిలా ఉండగా, జులైలో షేక్ హసీనాపై తిరుగుబాటును భారతదేశం గుర్తించాలని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్ఫూజ్ ఆలం అన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు ఇది తొలి అడుగని ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు.
జులై తిరుగుబాటును విస్మరించి, కొత్త బంగ్లాదేశ్‌కు పునాది వేయడానికి ప్రయత్నించడం రెండు దేశాల మధ్య సంబంధాలకు హానికరమని ఆయన స్పష్టం చేశారు.
"భారత ప్రభుత్వం ఈ తిరుగుబాటును అతివాద, హిందూ వ్యతిరేక, ఇస్లామిక్ ఆధిపత్య ధోరణిగా చిత్రీకరిస్తోంది. కానీ వారి ప్రచారం, రెచ్చగొట్టే చర్యలు విఫలమవుతున్నాయి.’’ అని మహ్ఫూజ్ ఆలం అన్నారు.
మైనారిటీల సమస్యలను పరిష్కరించేందుకు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం 24 గంటలూ పనిచేస్తోందని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ మహమూద్ బీబీసీతో అన్నారు. అయితే ఎవరైనా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, రాజకీయ కారణాలు ఇరుదేశాల వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపవని తాత్కాలిక ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ అన్నారు. భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు మరింత క్షీణిస్తే దాని ఎగుమతులు ప్రభావితం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణ ఆసియాలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, ఆసియాలో బంగ్లాదేశ్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్.
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ భారతదేశం నుండి వచ్చే ముడి పదార్థాలపై ఆధారపడి ఉంది. బంగ్లా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోవిడ్‌కు ముందున్న పరిస్థితులకు చేరుకోలేదు. ఈలోగానే భారత్‌తో సత్సంబంధాలు ఎక్కువగా నెరిపే షేక్ హసీనా అధికారం కోల్పోయారు.
భారత్‌తో దిగజారుతున్న సంబంధాల కారణంగా ఆర్థిక రంగంలో బంగ్లాదేశ్‌కు మరో దెబ్బ తగలవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














