షేక్ హసీనా: రక్షణగా రఫేల్ యుద్ధ విమానాలు, అప్రమత్తంగా రాడార్‌లు, బంగ్లా మాజీ ప్రధాని భారత ఎంట్రీలో నాటకీయ పరిణామాలు

షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌లో తన ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా సోమవారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు.

భారత్ వైపు ఆమె విమానం రావడాన్ని గుర్తించిన భారత వైమానిక దళం, షేక్ హసీనాను గట్టి భద్రతతో దిల్లీకి తీసుకొచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

సోమవారం అక్కడి పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చడంతో భారత్ అప్రమత్తమైంది.

ఎలాంటి ఆకస్మిక పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు కథనంలో ఏఎన్‌ఐ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
బంగ్లాదేశ్

గగనతలంపై భారత్ నిఘా

భారత వైమానిక దళం రాడార్లు, బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ భారత్‌ వైపు వస్తున్నట్లు భారత వైమానిక దళం గుర్తించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

అందులో ఎవరున్నారో వాయుసేన సిబ్బందికి సమాచారం ఉండటంతో దాన్ని భారత్‌లోకి అనుమతించినట్లు ఏఎన్‌ఐ తన కథనంలో రాసింది.

షేక్ హసీనా

ఫొటో సోర్స్, EPA

రఫేల్ యుద్ధ విమానాల భద్రత నడుమ

ఏఎన్‌ఐ వార్తా కథనం ప్రకారం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ ఎయిర్ క్రాఫ్ట్‌కు పశ్చిమ బెంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరానికి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.

అది బిహార్, ఝార్ఖండ్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో రక్షణగా వెంట వచ్చాయి.

ఆ ఎయిర్ క్రాఫ్ట్ విమానం గమనాన్ని కింద నుంచి భద్రతా ఏజెన్సీలు నిరంతరం పర్యవేక్షించాయి. ఎప్పటికప్పుడు భారత భద్రతా దళానికి చెందిన ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపారు.

భారత వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిస్థితిని నిశితంగా పరిశీలించారు.

తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విభాగాధిపతులు, జనరల్ ద్వివేది, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో నిరసనకారులు

షేక్ హసీనా గమ్య స్థానంపై సందిగ్ధత

బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన తర్వాత షేక్ హసీనా గమ్యస్థానంపై ఇంకా స్పష్టత లేదు.

హసీనా భారత్‌లోకి వచ్చినప్పటికీ ఆమె ఇక్కడ ఉండటం లేదని దిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ, బీబీసీ బెంగాల్‌కు చెందిన శుభజ్యోతి ఘోష్‌కు చెప్పారు.

షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానా ఇద్దరూ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు భారతదేశంలోకి (లేదా భారత గగనతలంలోకి) ప్రవేశించారని బీబీసీకి ఒక భారతీయ అధికారి ధ్రువీకరించారు.

బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సీజే-130 విమానం, భారత్‌లోని ధన్‌బాద్ మీదుగా ఎగురుతున్నట్లు, మధ్యాహ్నం 3:30 గంటలకు ఉత్తర భారతదేశం వైపు వెళుతున్నట్లు అంతర్జాతీయ విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ చూపించింది.

అయితే, విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది? ఎక్కడికి వెళ్తుందనే దానిపై ఫ్లైట్‌రాడార్‌కు ఎలాంటి సమాచారం లేదు. అది షెడ్యూల్ చేయని ఎయిర్‌క్రాఫ్ట్ అని అర్థమైంది.

బంగ్లాదేశ్
ఫొటో క్యాప్షన్, ఢాకాలో షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని నేలకూల్చే ప్రయత్నం

షేక్ హసీనాను కలిసిన అజిత్ దోభాల్

సాయంత్రం 5:45 గంటలకు దిల్లీ సమీపంలోని హిందాన్ మిలిటరీ ఎయిర్‌బేస్‌లో సీజే-130 విమానం ల్యాండ్ అయినట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

దిల్లీ సమీపంలోని సైనిక విమానాశ్రయంలో దిగిన తర్వాత షేక్ హసీనాను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కలిశారని భారత భద్రతా వర్గాలు తెలిపాయి.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి, తదుపరి ఆమె కార్యాచరణ గురించి గంటపాటు ఆమెతో సమావేశం అయ్యారు.

తర్వాత, ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి ఆయన పరిస్థితిని వివరించారు.

అయితే, షేక్ హసీనా చివరి గమ్యస్థానం దిల్లీ కాదని, ఇది కేవలం స్టాప్ ఓవర్ అని దిల్లీలోని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఆమె బ్రిటన్ లేదా యూకేకు వెళ్తారని వారు సూచిస్తున్నారు.

భారత్‌లో ఆమె ‘‘స్టాప్ ఓవర్’’ వ్యవధి కాలం గురించి ఇంకా స్పష్టత లేదు.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సి-130 విమానం షేక్ హసీనా లేకుండానే వెనుదిరిగిందని, ఆ విమానంలో ఏడుగురు బంగ్లా మిలిటరీ అధికారులు మాత్రమే ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)