అమెరికా మాంద్యంలోకి వెళ్తోందా, మార్కెట్లు ఎందుకు వర్రీ అవుతున్నాయి?

అమెరికాలో మాంద్యం భయాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డియర్‌బైల్ జోర్డాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అమెరికా, ఆసియాతో పాటు, కొన్ని యూరప్ మార్కెట్లలో సైతం నష్టాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఎకానమీ నెమ్మదిస్తుందనే వార్తలతో మార్కెట్లలో భయాలు పెరిగాయి.

అమెరికాలో శుక్రవారం విడుదల చేసిన జులై నెల ఎంప్లాయ్‌మెంట్ డేటాలో అంచనాల కంటే తక్కువగా వృద్ధి నమోదైందని నిపుణులు చెప్పారు.

దీంతో, కొందరు దీన్ని ఆర్థిక మందగమనంగా లేదా మాంద్యం అని పేర్కొంటూ ముందస్తు చర్చలు ప్రారంభించారు.

అయితే, అధికారిక గణాంకాలు మనకేం సూచిస్తున్నాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ముందు బ్యాడ్ న్యూస్ ఏంటో చూద్దాం ?

అమెరికా జులై నెలలో 1,14,000 మందికి ఉద్యోగాలను కల్పించింది. ఇవ్వాలనుకున్నది మాత్రం 1,75,000 మందికి.

నిరుద్యోగ రేటు సుమారు మూడేళ్ల గరిష్టంలో 4.3 శాతానికి పెరిగింది. ఇది ‘సామ్ రూల్’ను సూచిస్తోంది.

గడిచిన మూడు నెలల్లో సరాసరి నిరుద్యోగిత రేటు, గడిచిన 12 నెలలలోని కనిష్ట నిరుద్యోగిత రేటు కన్నా అరశాతం ఎక్కువ ఉంటే ఆ దేశంలో మాంద్యం మొదలైనట్లు చెబుతారు. ఈ సిద్ధాంతానికి అమెరికన్ ఆర్ధికవేత్త క్లాడియా సామ్ పేరు పెట్టారు.

అమెరికాలో నిరుద్యోగ రేటు జులై నెలలో పెరిగింది. మూడు నెలల సగటు నిరుద్యోగిత రేటు 4.1 శాతంగా ఉంది. గత 12 నెలల కనిష్ట స్థాయి 3.5 శాతంతో పోలిస్తే ఇది అరశాతంకన్నా ఎక్కువ.

ఈ సంకేతాలు కనిపించిన నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచి ప్రజలపై భారం మోపవద్దని అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్ణయించింది.

మరోవైపు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలోని బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లకు కోత పెట్టాయి.

ఒకవేళ ఆర్థిక వ్యవస్థ ఇలానే కొనసాగితే సెప్టెంబర్‌లో రేట్ల కోత ఉంటుందని ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ అన్నారు.

అయితే, మాంద్యంలోకి చేజారకుండా చర్యలు తీసుకునేందుకు ఫెడ్ చాలా కాలం వేచిచూసిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

వడ్డీ రేట్లకు కోత పెట్టడం అంటే, రుణాలు తక్కువకు దొరుకుతాయని అర్థం. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వొచ్చనే అభిప్రాయాలున్నాయి.

ఒకవేళ ఉద్యోగ గణాంకాలు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలోకి చేజారిందని సూచిస్తే, ఫెడ్ చాలా ఆలస్యంగా చర్యలు తీసుకుంటుందనే భయాలున్నాయి.

వీటన్నింటికీ మించి టెక్నాలజీ కంపెనీలు, వాటి షేర్ల పరిస్థితిని చూడాలి. ఈ కంపెనీల షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణంగా దీర్ఘకాలంగా ర్యాలీ చేశాయి. ప్రస్తుతం మాంద్యం భయంలో ట్రేడవుతున్నాయి.

చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ గత వారం 15 వేల ఉద్యోగాల కోతను ప్రకటించింది. దీని ప్రత్యర్థి ఎన్‌విడియా నుంచి రాబోయే కొత్త ఏఐ చిప్ విడుదల ఆలస్యం కాబోతోందనే రూమర్లు మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పరిణామాలతో అమెరికాలో టెక్నాలజీ హెవీ ఇండెక్స్ అయిన నాస్‌డాక్‌లో పతనం మొదలైంది. కొన్ని వారాల కిందట గరిష్ట స్థాయిలను తాకిన ఈ ఇండెక్స్, శుక్రవారం 10 శాతం పడిపోయింది.

ఇది మార్కెట్లలో భయాలను పెంచి, మరింత ప్రమాదకరంగా మార్చేందుకు కారణమైంది.

ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో ఆందోళనలు ఇలానే కొనసాగి, షేర్లు పడిపోతూ ఉంటే, ఫెడ్ సెప్టెంబర్‌లో జరగబోయే తదుపరి సమావేశానికి ముందే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది.

అమెరికాలో ఉద్యోగాల డేటా

ఫొటో సోర్స్, Getty Images

గుడ్ న్యూస్ ఏంటి?

‘మనం ఇప్పుడు మాంద్యంలో లేము’ అని సామ్ నిబంధనను కనిపెట్టిన సామ్‌నే చెప్పారు.

ఈ మూమెంటం ఆ దిశగా సాగుతుందని మాత్రమే ఆమె సీఎన్‌బీసీకి చెప్పారు.

మాంద్యం అనివార్యం కాదని, వడ్డీ రేట్లను తగ్గించడానికి గణనీయమైన అవకాశం ఉందని సామ్ తెలిపారు.

ఉద్యోగాల గణాంకాలపై ఇతరులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రిపోర్టు మరీ అంత బ్యాడ్ కాదంటూ క్యాపిటల్ ఎకనామిక్స్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ నీల్ షేరింగ్ అన్నారు.

‘‘హరికేన్ బెరిల్ జులై నెల పేరోల్ గణాంకాలపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఇతర డేటాలు లేబర్ మార్కెట్ కాస్త తగ్గిందని, కానీ కుప్పకూలడం లేదని తెలియజేస్తున్నాయి’’ అని అన్నారు.

‘‘పెద్ద సంఖ్యలో ఉద్యోగాల పెరుగుదలను ఇది సూచించలేదు. జులై నెలలో సగటు వారపు గంటలు స్వల్పంగా తగ్గడం మాంద్యం కాదు’’ అని తెలిపారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)