భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు

ఫొటో సోర్స్, Getty Images
‘వర్క్ ఫ్రం హోం’ చేస్తున్న తన భార్య అధికారిక ఫోన్ కాల్స్ విని భర్త భారీ లాభాలు ఆర్జించారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది.
టైలర్ లోడాన్ అనే వ్యక్తి భార్య బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె ఇంట్లో నుంచే పనిచేసేవారు.
అయితే భార్యకు తెలియకుండా భర్త లోడాన్ ఆమె ఫోన్ కాల్స్ విని ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని, రూ. 14.5 కోట్లు (1.76 మిలియన్ డాలర్లు) ఆర్జించారని ఎస్ఈసీ తెలిపింది.
ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికాను చమురు దిగ్గజమైన బీపీ కంపెనీ స్వాధీనం చేసుకోవడం, ఆ సంస్థలో వాటాల కొనుగోలు సంభాషణలు లోడాన్ విని, ఈ ట్రేడింగ్ చేశారని రెగ్యులేటర్ పేర్కొంది.
దీనిపై స్పందించడానికి బీపీ కంపెనీ నిరాకరించింది.
‘రిమోట్ వర్కింగ్, భార్య నమ్మకాన్ని ఉపయోగించుకొని లోడాన్ ఆమె దగ్గరి గోప్యమైన సమాచారాన్ని సంపాదించి.. దాని నుంచి లాభం పొందారు" అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది.
లోడాన్ భార్య బీపీ కంపెనీలో మెర్జర్స్ అండ్ ఎక్విజేషన్స్ మేనేజర్. ట్రావెల్ సెంటర్స్‌ను బీపీ కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఆమె భాగమయ్యారు.
గత ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్ పబ్లిక్‌గా మారకముందే లోడాన్ తన భార్యకు తెలియకుండా ట్రావెల్ సెంటర్స్ స్టాక్‌లోని 46,450 షేర్లను కొనుగోలు చేసినట్లు ఎస్ఈసీ తెలిపింది.
స్వాధీన ప్రకటన తర్వాత ట్రావెల్‌సెంటర్స్ షేర్ ధర దాదాపు 71 శాతం పెరిగింది. ఆ తర్వాత కొనుగోలు చేసిన అన్ని షేర్లను లోడాన్ లాభం కోసం విక్రయించినట్లు కమిషన్ తెలిపింది.

ఫొటో సోర్స్, BLUEBAY2014
భార్య ఎక్కువసేపు పనిచేయకూడదని..
రెగ్యులేటర్ ఫిర్యాదులో.. ''2022లో ట్రావెల్ సెంటర్స్, బీపీ కంపెనీల మధ్య డీల్ గురించి చర్చలు జరిగాయి. ఆ సమయంలో టెక్సస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన లోడాన్, ఆయన భార్య వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేశారు. భార్యాభర్తలు ఒకరికొకరు పనికి సంబంధించిన సంభాషణలు, వీడియో కాన్ఫరెన్స్‌లను విన్నారు, చూశారు. ఈ జంట రోమ్‌లోని "స్మాల్ ఎయిర్ బీఎన్‌బీ"లో ఉన్నప్పుడు కూడా ఆమె పని చేశారు'' అని పేర్కొంది.
బీపీ డీల్ గురించి, ట్రావెల్ సెంటర్స్ షేర్ల కొనుగోలుపై 'ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ' ప్రశ్నించడంతో లోడాన్ తన తప్పును ఒప్పుకున్నారు.
తన భార్య ఎక్కువసేపు పని చేయకూడదంటే తగినంత డబ్బు సంపాదించాలనుకున్నానని, అందుకే స్టాక్స్ కొనుగోలు చేశానని విచారణలో చెప్పారు లోడాన్.
కాగా, లోడాన్ చర్యతో ఆయన భార్య దిగ్భ్రాంతి చెందారు. ఆమె ఈమెయిల్, సందేశాలను బీపీ కంపెనీ పరిశీలించింది.
భర్తకు డీల్ సమాచారాన్ని లీక్ చేసినట్లుగా లేదా భర్త షేర్లను కొనుగోలు చేసిన విషయం తెలిసినట్లుగా ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ బీపీ కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.
లోడాన్‌ను ఆయన భార్య వదిలేశారని, విడాకులకు అప్లై చేశారని రెగ్యులేటర్ ఫిర్యాదులో తెలిపింది.
ముందుగానే హెచ్చరిక
లోడాన్‌పై మోపిన ఆరోపణలను ఆయన ఖండించలేదని, పెనాల్టీ చెల్లించడానికి అంగీకరించారని ఎస్ఈసీ తెలిపింది. ఆయన దోషిగా తేలితే, జైలు శిక్ష కూడా పడొచ్చు.
కరోనా సమయంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేశారు. ఆ విధానంలో తలెత్తే ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రమాదాల గురించి యూకే రెగ్యులేటర్ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్‌సీఏ) హెచ్చరించింది.
అయితే, ఇంటి నుంచి పని చేయడం ఇప్పుడు అనేక సంస్థల పని విధానాలుగా మారినందున, అన్ని సమయాల్లో సమర్థమైన నిఘాఉంచడం చాలా క్లిష్టమైనదని ఎఫ్‌సీఏ అంటోంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్‌తో ఏలియన్స్ ఉనికి తెలిసిపోనుందా
- రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














