డాలర్ ఎందుకు ఇంతలా బలపడుతోంది, ఇది రూపాయికి ముప్పేనా

డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు అమెరికా డాలర్ బలపడింది. డాలర్ కొనడానికి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఒక్క రూపాయి మాత్రమే కాదు. పౌండ్, యూరో, యెన్ అన్నింటి పరిస్థితీ ఇలానే ఉంది.

డాలర్ నానాటికీ బలపడుతుండటంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు, వ్యాపారాలు ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది.

అమెరికా డాలర్‌ను ప్రపంచంలోని ఆరు కరెన్సీలతో ద డాలర్ ఇండెక్స్ (డీఎక్స్‌వై) పోల్చి చూస్తుంది. ఈ కరెన్సీలలో యూరో, పౌండ్, యెన్ కూడా ఉన్నాయి.

డీఎక్స్‌వై ఇండెక్స్‌లో 2022లో 15 శాతం పెరుగుదల కనిపించింది. గత 20ఏళ్లను పోల్చిచూస్తే ప్రస్తుత డాలర్ విలువే గరిష్ఠం.

డాలర్

డాలర్ బలపడటానికి కారణం ఏమిటి?

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కొన్ని నెలల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది.

దీని వల్ల డాలర్‌ ఆధారిత మదుపు మార్గాల నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ వచ్చింది. అమెరికా ప్రభుత్వ బాండ్లను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వాలు, కంపెనీలు ఈ బాండ్ల సాయంతో నిధులను సమీకరిస్తుంటాయి. భవిష్యత్‌లో వీటిపై వడ్డీతో చెల్లిస్తామని మదుపరులకు ఈ సంస్థలు, దేశాలు హామీలు ఇస్తాయి.

మిగతా మదుపు మార్గాలతో పోల్చినప్పుడు ఈ ప్రభుత్వ బాండ్లు కాస్త సురక్షితమైనవి.

డాలర్

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవల కాలంలో మదుపరులు లక్షల డాలర్లు చెల్లించి అమెరికన్ బాండ్లు కొనడం ఎక్కువైంది. దీంతో మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. డాలర్ విలువ పెరగడానికి ఇదే ప్రధాన కారణం.

ముఖ్యంగా మదుపరులు తమ సొంత దేశాల కరెన్సీలను ఉపయోగించి మొదట డాలర్లు కొనుగోలు చేస్తున్నారు, ఆ తర్వాత ఈ డాలర్లతో అమెరికా బాండ్లు కొంటున్నారు. మొత్తంగా మార్కెట్‌లో ఆయాదేశాల కరెన్సీ చెలామణీ ఎక్కువై అది ఆ కరెన్సీల పతనానికి దారితీస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ, డాలర్లను కొనుగోలుచేసేందుకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా చాలా పెద్దది. పైగా ఈ కరెన్సీ సురక్షితమైనదనే భావన ఉంది. పరోక్షంగా ఇక్కడి వస్తువుల ధర పెరగడానికీ ఇది కారణం అవుతోంది.

మరోవైపు యూరప్, ఆసియాలలోని చాలా ఆర్థిక వ్యవస్థలు చమురు ధరలు పెరగడంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.

అమెరికాలో గత ఆరు నెలల్లో ఈ చమురు ధరల పెరుగుదల అంత ప్రభావాన్ని చూపలేదు.

అయితే, గత మూడు నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కొంతమేర క్షీణించింది. కానీ, ఉద్యోగ సంస్థలు కొత్త నియామకాలు చేపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై సంస్థలకున్న విశ్వాసానికి దీన్ని సూచికగా చెప్పుకోవచ్చు.

డాలర్
లైను

పౌండ్ కంటె మెరుగ్గా డాలర్

లైను

సెప్టెంబరు 26న రికార్డు స్థాయిలో పౌండ్ మారకపు విలువ పడిపోయింది. ఆ రోజు ఒక పౌండ్ విలువ 1.03 డాలర్‌గా ఉండేది. ఆ తర్వాత కాస్త మెరుగుపడుతూ వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తంగా పౌండ్ 20 శాతం పతనమైంది. దీంతో బ్రిటన్ ఆర్థిక శాఖ 45 బిలియన్ పౌండ్ల విలువతో మినీ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. కంపెనీలకు విద్యుత్ సబ్సిడీలను కూడా ప్రకటించింది.

పన్నులను తగ్గిస్తామని.. కంపెనీలు, మదుపరులు పౌండ్‌పై విశ్వాసముంచాలని బ్రిటన్ కోరుతోంది. అయితే, ప్రభుత్వం భారీగా మార్కెట్‌ నుంచి నిధులను సమీకరించొచ్చనే వార్తల నడుమ, చాలా మంది మదుపరులు బ్రిటన్ బాండ్లను విక్రయించేస్తున్నారు. ఫలితంగా పౌండ్ మరింత పతనం అవుతోంది.

లైను
డాలర్
లైను

బలహీన కరెన్సీలపై ప్రభావం ఏమిటి?

లైను

పౌండ్ తరహాలోనే జపనీన్ కరెన్సీ యెన్‌ కూడా 20 శాతం విలువను కోల్పోయింది. యూరో కూడా 15 శాతం పతనమైంది.

అయితే, ఇక్కడ బలహీనమైన కరెన్సీ గల దేశాలకు ‘‘బలమైన డాలర్’’ వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వారు చవగ్గా తమ ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో విక్రయించొచ్చు. ఫలితంగా వారి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే, అదే సమయంలో అమెరికా ఎగుమతులు ప్రియం అవుతాయి. మరోవైపు చమురు ధరలను డాలర్‌తో లెక్కిస్తారు. ఫలితంగా చాలా దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం మొదలైంది.

డాలర్

ఉదాహరణకు బ్రిటన్‌లో ఈ ఏడాది మొదట్లో ఒక లీటరు పెట్రోలు ధర 1.46 పౌండ్లు. ఇప్పుడు ఇది 1.67 పౌండ్లకు పెరిగింది. జులైలో అయితే, ఇది 1.91 పౌండ్లకు కూడా వెళ్లింది.

మరోవైపు చాలా దేశాల్లోని ప్రభుత్వాలు డాలర్లలో అప్పులు తెస్తుంటాయి. ఎందుకంటే తమ సొంత కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ స్థిరంగా ఉంటుంది.

ఇక్కడ డాలర్ విలువ పెరిగే ప్రతిసారీ, వారి అప్పు కూడా పెరుగుతుంది. ఫలితంగా ఆ అప్పును చెల్లించడం వారికి మరింత కష్టం అవుతోంది.

నేడు అర్జెంటీనా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వస్తువుల దిగుమతిపై ఇక్కడ తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విదేశీ మారకపు నిల్వలు పడిపోకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

లైను
వీడియో క్యాప్షన్, నిత్యావసర సరకుల ధరలు ఇంకా పెరుగుతాయా? ఈ ధరల మంట చల్లారేదెప్పుడు?

మిగతా దేశాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి?

చాలా దేశాలు అమెరికా బాటలోనే వడ్డీ రేట్లను పెంచి తమ కరెన్సీ విలువను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్ మొత్తంగా వడ్డీ రేట్లను రెండు శాతం పెంచింది.

మరోవైపు వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశముందని బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ ‘‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’’ సంకేతాలు ఇచ్చింది. మొత్తంగా వడ్డీ రేట్లు ఆరు శాతానికి పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా వడ్డీ రేట్లను 1.25 శాతం పెంచింది. వడ్డీ రేట్లను పెంచడంతో ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు కట్టడిచేయొచ్చు. అయితే, సాధారణ పౌరులు, వ్యాపారులకు రుణాలు మరింత ప్రియం అవుతాయి.

వీడియో క్యాప్షన్, క్రిప్టోలో డబ్బులు సంపాదించాలంటే ఇవి తెలియాల్సిందే

మరోవైపు తమ లాభాలు తగ్గిపోతాయనే ఆందోళనల నడుమ కొన్ని సంస్థలు ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తాయి.

కుటుంబాలు కూడా తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. ఆర్థిక మాంద్యం భయాల నడుమ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుంచించుకుపోయే ముప్పుంటుంది.

ఇటీవల కాలంలో బ్రిటన్ ఆర్థిక మాంద్యంలోకి పోయే ముప్పుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా హెచ్చరికలు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)