NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్

ఫొటో సోర్స్, BBC/Beeple
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఈ కింది స్క్రీన్ షాట్‍లో ఉన్నది, ట్విటర్ అధినేత జాక్ డార్సీ చేసిన తొలి ట్వీట్. ఇప్పుడా ట్వీట్‌ను అచ్చంగా మూడు మిలియన్ డాలర్లకు ఒకరు కొనుక్కున్నారు. ఇప్పుడా ట్వీట్ యజమాని @sinaEstavi.

ఫొటో సోర్స్, Twitter
"అదేంటి? ట్విటర్ ఓపెన్ చేసి ఆయన అకౌంట్‍కి వెళ్తే నాకా ట్వీట్ కనిపిస్తుంది. నేను స్క్రీన్‍షాట్ తీసుకోగలుగుతాను. ఆ లింక్ ఇంకెక్కడైనా ఎంబెడ్ చేయగలుగుతాను. అందరికీ అందుబాటులో ఉన్న ఆ ట్వీట్‍ని అమ్మడమేమిటి? ఇంకొకరు కొనడమేమిటి?" అని మీరు అయోమయపడవచ్చు.
ఇంటర్నెట్‌లో మాటైనా, పాటైనా, మీమ్ అయినా, జిఫ్ అయినా.. అది మూకుమ్మడి ఆస్తి, ఎవరన్నా ఎప్పుడన్నా చూడవచ్చు, ప్లే చేసుకోవచ్చన్న మన అనుభవాన్ని సవాలు చేస్తూ, డిజిటిల్ అయినంత మాత్రాన అసెట్స్ (ఆస్తులు) కాకుండా పోవనీ, వాటినీ నిజజీవితపు వస్తువుల్లానే అమ్మవచ్చు, కొనవచ్చుననీ జాక్ ట్వీట్ కొనుగోలు ఉదంతం చెప్తోంది.
ఇలా డిజిటిల్ అసెట్స్ ట్రేడింగ్ చేయడాన్ని సాధ్యపరిచే టెక్నాలజీ, NFT (non-fungible token) గురించి ఇవాళ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Purnima. T
ఫంజిబుల్ vs నాన్-ఫంజిబుల్
పోయినవారం మన డిజిహబ్‍లో బ్లాక్‍చెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. దాన్ని క్రిప్టోకరెన్సీకే కాక మరికొన్ని వాటికి కూడా వాడవచ్చునని చూశాం.
వాటిల్లో NFT కూడా ఒకటి. క్రిప్టోకరెన్సీ, NFT రెండూ బ్లాక్‍చెయిన్ అనే టెక్నాలజీతోనే డెవలప్ చేసినా, అవి పనిజేసే తీరు వేరు, వాటిని వాడే తీరు వేరు.
క్రిప్టోకరెన్సీ అంటే డాలర్లకు, రూపాయలకు ప్రత్యామ్నాయం. ఒక సెంట్రల్ బ్యాంక్ మీద ఆధారపడనవసరం లేకుండా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఒక డిజిటిల్ కరెన్సీని పంపించే విధానం.
ప్రస్తుతం, ప్రపంచంలో వేలకొలదీ క్రిప్టోకరెన్సీలున్నాయి. వాటిల్లో ప్రముఖమైనది బిట్‍కాయిన్. డాలర్లలా, రూపాయల్లా బిట్‍కాయిన్‍కి భౌతిక రూపం లేకపోయినా, లక్షణాలు అలానే ఉంటాయి.
అంటే, ఒక బిట్‍కాయిన్ నా దగ్గర ఎంత విలువచేస్తుందో, మీ దగ్గరున్నా అంతే చేస్తుంది. అందుకే అది ఫంజిబుల్.
మీ దగ్గరున్న ఓ రెండొందల రూపాయల పుస్తకం పోతే, మళ్ళీ అచ్చంగా అలాంటిదే ఇంకోటి దొరికే అవకాశాలు పుష్కలం. అందుకనే అదీ ఫంజిబుల్.
అయితే, ఒకవేళ ఆ పుస్తకం మీద ఆ రచయిత బతికున్నప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకించి ఇచ్చిన ఆటోగ్రాఫ్ ఉన్నా, లేక రచయిత ఆ రచన చేతిరాత హస్తప్రతి (handwritten manuscript) మీకిచ్చినా, అలాంటి కాపీ ప్రపంచంలో మరోటి ఉండదు కనుక, అది నాన్-ఫంజిబుల్.
నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే ఒక డిజిటల్ వస్తువును (పాట, కార్టూన్, జిఫ్, మీమ్, ట్వీట్, వ్యాసం ఏదైనా) ఒక ప్రత్యేకమైన టోకెన్‍తో గుర్తించడం.
ఆ వస్తువుకు తప్పించి ఆ టోకెన్ ఇంకే వస్తువుకూ ఉండకపోవడం వల్ల ఆ వస్తువును ప్రత్యేకంగా గుర్తించచ్చు.
దాన్ని ఎవరు సృష్టించారు, ప్రస్తుత యజమాని ఎవరు, ఎంత పెట్టి కొన్నారు, మధ్యలో ఎందరి చేతులు మారింది ఇవన్నీ రికార్డుల్లో ఉండడం వల్ల, ఆ రికార్డులను ఎవరూ ఎప్పుడూ మార్చే అవకాశం లేకపోవడం వల్ల డిజిటిల్ అసెట్స్ ట్రేడింగ్‍కి మార్గం సుగమం అవుతోంది.

ఫొటో సోర్స్, BEEPLE / CHRISTIE'S
నాన్-ఫంజిబల్ టోకెన్ లక్షణాలు
నాన్-ఫంజిబల్ టోకెన్‍కి సాధారణంగా కొన్ని లక్షణాలు ఇలా ఉంటాయి:
- Unique: అవి ప్రత్యేకమైనవి. వాటి ప్రాపర్టీస్ విలక్షణంగా ఉంటాయి. వాటిని మెటాడేటాలో స్టోర్ చేస్తుంటారు.
- Proven scarcity: ఒకటే కాపీ, లేదా చాలా తక్కువ కాపీలో ఉంటాయి. విరివిగా లభించే అవకాశాలు ఉండవు. ఎన్ని కాపీలు ఉన్నాయో బ్లాక్‍చెయిన్ ద్వారా వెరిఫై చేయవచ్చు.
- Indivisibility: ఒకటే ఎన్.ఎఫ్.టిని ముక్కలుగా, చిల్లరగా చేసి వాడడం కుదరదు. అంటే వంద రూపాయలకు రెండు యాభై రూపాయల నోట్లుగా మార్చినట్టు ఎన్.ఎఫ్.టితో కుదరదు.
- Guaranteed ownership: ఫలనా ఎన్.ఎఫ్.టికి ఎవరు యజమాని అనేది ఖచ్చితంగా చెప్పగలరు.
- Transferable: ఒకరి నుంచి ఒకరు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు.
- Fraud-proof: బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఇంప్లిమెంట్ చేస్తారు కనుక వివరాలను తారుమారు చేసే అవకాశాలు ఉండవు. దాని వల్ల నమ్మకం పెరుగుతుంది.
బ్లాక్‍చెయిన్ టెక్నాలజీ ద్వారా ఫంజిబుల్, నాన్-ఫంజిబుల్ రెండూ ఎలా సాధ్యం?
బ్లాక్‍చెయిన్ కథనంలో చెప్పుకున్నట్టు, ప్రతీ లావాదేవీకి ఒక బ్లాక్ (block) క్రియేట్ అయి, ఒక peer-to-peer (P2P) నెట్‍వర్క్ దాన్ని ఆమోదయోగ్యం అనుకుంటే ఆ బ్లాక్‍ని కూడా తక్కిన బ్లాక్‍చెయిన్‌తో కలుపుతుంది.
క్రిప్టోకరెన్సీ, NFT దీని ఆధారంగానే సృష్టించబడతాయి, కాకపోతే కొద్ది పాటి తేడాలుంటాయి.
ఉదాహరణగా, బ్లాక్‍చెయిన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాడే ఈథరియమ్ (Ethereum)ని తీసుకుంటే, ఒకేలాంటి అనేక ఫంజిబల్ టోకెన్‍లని క్రియేట్ చేయడానికి ERC-20 లాంటి స్టాండర్డ్స్ వాడితే, NFTలో ప్రతీ టోకెన్ ప్రత్యేకంగా, కేవలం ఒక్కరికే చెందేట్టు క్రియేట్ చేయడానికి ERC-721 వాడతారు.
ఒకే బ్లాక్‍చెయిన్ నెట్‍వర్క్‌తో అటు ఫంజిబల్ టోకెన్లు, ఇటు నాన్-ఫంజిబల్ టోకెన్లు క్రియేట్ చేయాలసిన అవసరం పడితే ERC-1155 లాంటి స్టాండర్డ్స్ ఉంటాయి.

ఫొటో సోర్స్, BENYAMIN AHMED
అసలు NFTలు ఎందుకు? వాటితో ఏం చేసుకోవచ్చు?
ప్రస్తుత ఇంటర్నెట్లో డిజిటల్ అసెట్స్ లావాదేవీలలో కొన్ని తిరకాసులు ఉన్నాయి.
ఉదాహరణకి, మీరు ఐట్యూన్స్ నుంచి ఒక పాటనో, అమెజాన్ నుంచి ఒక కిండిల్ బుక్‍నో కొన్నారనుకుందాం. వాటిని మీరు ఐట్యూన్స్, కిండిల్ మార్కెట్‌లోనే కొనాలి.
వాటితో పని అయిపోయాక వేరొకరికి అమ్మలేరు. ఆ పాటను సృష్టించవారు, పుస్తకాన్ని రాసినవారు ఎవరనే విషయంలో ఐట్యూన్స్, అమెజాన్ ఏది చెప్తే అదే నమ్మాల్సి ఉంటుంది.
కిండిల్ పుస్తకాలు బాగా కొన్నందుకు కొన్ని లాయల్టీ పాయింట్స్ వస్తే వాటితో ఐట్యూన్స్‌లో పాటలు కొనలేరు.
అలానే మీరు కంటెంట్ క్రియేటర్ అయితే (రీల్స్, మీమ్స్, పోస్టర్స్, మ్యూజిక్ లాంటివి చేసి సోషల్ మీడియాలో పంచుకుంటుంటే) వాటర్‍మార్క్స్ తప్పించి అది మీ కంటెంట్ అని చెప్పడానికి ఉండదు. ఆ వాటర్‍మార్క్స్ తొలిగించి వేరే వారు దాన్ని వాడుకోవచ్చు.
ఇలాంటి సమస్యలు తీర్చడానికే NFT తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఒక పాట, పుస్తకం, మీమ్ ఫైల్ రూపంలో మీ దగ్గర ఉన్నా ఒకటే, నా దగ్గర ఉన్నా ఒకటే.
అంటే, ఫంజిబుల్ అన్నమాట. దాన్ని నాన్-ఫంజిబుల్ చేయాలి. ఎలా?
బ్లాక్‍చెయిన్ వాడి ఆ డిజిటిల్ అసెట్‍కు ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వగలిగితే, ఆ గుర్తింపుతో దాన్ని తేలిగ్గా సెర్చ్ చేయగలిగితే అప్పుడు మీ దగ్గర ఉన్న మీమ్ ఒరిజినల్ అని, మీరు దాని హక్కుదారులని చెప్పడం కుదరుతుంది.
అలా చెప్పగలిగినప్పుడు దాని కాపీ నా దగ్గర ఉంటే, అది కేవలం కాపీయే అని ఖరాఖండీగా చెప్పే వీలవుతుంది.
ఆ వీలు వల్ల కంటెంట్ క్రియేటర్లకి తమ పనితో వ్యాపారం చేసే అవకాశం వస్తుంది.

ఇదెందుకంత ముఖ్యం?
మీమ్‍లకు, ట్వీట్‍లకు ఎవరు డబ్బు పోస్తారు? డబ్బు పోయవచ్చు. డబ్బు పోయక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఇప్పుడు ప్రతీదీ డిజిటల్‌మయం అయిపోతున్నప్పుడు, నిజజీవితంలో ఆస్తులకు, వస్తువులకు ఒక ఒప్పందం ఉన్నట్టే, లావాదేవీలు జరిగినట్టే, డిజిటల్ అసెట్స్‌కీ అవన్నీ అవసరం పడతాయి.
మెటావర్స్ లాంటిది ఒకటి సాధ్యమవ్వాలంటే, వర్చువల్ కాన్సర్ట్స్‌కు వర్చువల్ టికెటింగ్ కొనుక్కోవాలంటే NFTలు తప్పనిసరి అయ్యే రోజులు రాబోతున్నాయి.
NFTలను తయారుచేయడం, అమ్మడం ఎలా?
మన డిజిటిల్ అసెట్స్‌ను NFTలుగా మార్చడానికి మెటామాస్క్ లాంటి వాలెట్స్ అవసరం పడతాయి. మార్చాక వాటిని అమ్మకానికి పెట్టడానికి కొన్ని మార్కెట్ ప్లేసెస్ మొదలయ్యాయి.
ఉదా: rarible.com, nft.wazirx.org. వీటిల్లోంచే కొనుగోలుదారులు NFTలను కొనుక్కోవచ్చు.
NFT మార్కెట్ ప్లేస్‌లో ఒక అసెట్ ఎలా NFTగా మారుతుంది, దాన్ని ఎలా కొనుగోలు చేస్తారు అన్న వివరాలకు ఈ కింది బొమ్మ చూడండి.
గమనించాల్సిన కొన్ని విషయాలు:
1. NFT వల్ల అసెట్ ఎవరెవరి చేతులు మారుతుందని తెలుసుకోవడం తేలిక. అందుకని అమ్మేవారు రాయల్టీలు కావాలన్న సెట్టింగ్ పెట్టుకోవచ్చు. లేదా, ఒకే ధరకి అమ్మేయవచ్చు.
2. ఎవరి నుంచి ఎవరు కొనుక్కున్నారు అన్న వివరాలుంటాయి కాబట్టి, మొదట క్రియేట్ చేసినవారిని యజమానిగా గుర్తించడం తేలికవుతుంది. ఫ్రాడ్, డుప్లికేట్ కాపీలకు ఆస్కారముండదు.
3. మధ్యవర్తులుగా ఎవరూ ఉండనవసరం లేదు. టెక్నాలజీయే కావాల్సిన ప్రూఫులు అందించగలదు.

NFT వేటికి వాడవచ్చు?
డిజిటల్ అసెట్స్: ఫైల్ రూపంలో ఉన్న దేనినైనా ఇకపై NFT వాడి మధ్యవర్తుల బెడద లేకుండా బేరసారాలు చేయవచ్చు.
గేమింగ్‍లో వాడే ఐటెమ్స్: గేమ్స్ లో ఏవో కొన్ని ఐటెమ్స్ గెల్చుకోవడం జరుగుతుంటుంది. ఆట ముగిశాక అవీ మాయమవుతాయి. అదే NFT వాడితే మీరు గెల్చుకున్నవి వేరొకరికి అమ్మే అవకాశం కలుగుతుంది.
డొమేన్ పేర్లు: ఈథరియమ్‍కి కూడా ఒక అడ్రెస్ ఉంటుంది. నా వాలెట్‍కి లావాదేవీ చేయాలి అంటే దాని అడ్రస్ చెప్పాలి. ఆ అడ్రస్ 0x123456789..... అని ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. NFT వాడి దానికి mywallet.eth లాంటి పేరు ఇవ్వవచ్చు.
ఫిజికల్ ఐటెమ్స్: దీని మీద ఇంకా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్‍లో సేల్ డీడ్, అరుదుగా దొరికే వస్తువుల అమ్మకం లాంటి వాటికి NFT వాడవచ్చు.
సవాళ్ళూ-సమస్యలూ
ఇది కొత్త టెక్నాలజీ, ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. హైప్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఒక ట్వీట్‍కి అన్నేసి NFTలను పోసి ఎందుకు కొంటున్నారో, ఇది ధనవంతుల్లో ధనవంతులకి మాత్రమే పనికొచ్చే టెక్నాలజీయా అని కొందరు వాపోతున్నారు.
ఆర్ట్ కలెక్షన్‍లా డిజిటిల్ ఆర్ట్ కలెక్షన్ కూడా మొదలవుతోంది, కాకపోతే, ఇంటర్నెట్లో అందరికీ అందుబాటులో ఉన్నవే మళ్ళీ ఎవరు కొంటారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
టెక్నాలజీ తొలి దశల్లో ఉంది కాబట్టి ఇలాంటి అపోహలు, అనుమానాలూ తప్పవు.
కానీ, NFT చాలా ప్రామిసింగ్ టెక్నాలజీ. దీనివల్ల ఇంటర్నెట్‍లో కంటెంట్ క్రియేషన్ స్వభావ స్వరూపాలే మారిపోయే అవకాశం ఉంది.
అంతే కాక, ఒక వ్యక్తికి ఒకటే టికెట్ ఉండాలి, ఆ వ్యక్తి తప్ప మరెవ్వరూ దాని వాడకూడదు, ఫ్రాడ్/ఫేక్ టికెట్లకి తావివ్వకూడదు అన్న నియమాలుండే టికెటింగ్ ఇండస్ట్రీ లాంటి రంగాల్లో ఈ టెక్నాలజీ విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నాయి.
అయితే, NFT వాడేది blockchain కాబట్టి ఒక టోకెన్ క్రియేట్ చేయడానికి ఎంతో ఎనర్జీ ఖర్చు అవుతుంది. అది పర్యావరణానికి అసలు మంచిది కాదు.
అలా పర్యావరణానికి హాని చేయకుండా పనిచేసేలా ఈథరియమ్‍ని అప్‍గ్రేడ్ చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే NFTలు త్వరలోనే సర్వసాధరణం అయిపోవచ్చు. మనం అవగాహన పెంచుకుని, ఆచితూచి వాడుకుంటే ఏ టెక్నాలజీని అయినా మంచి పరిణామాలకు ఉపయోగించవచ్చు.
(గమనిక: NFTలు కొనడం, అమ్మడం డబ్బుతో కూడిన వ్యవహారం. లాభనష్టాలకి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాసం టెక్నాలజీ పరంగా అవగాహన పెంచడానికే కానీ, NFTలు కొనమని ప్రోత్సహించడం లేదని గమనించగలరు.)
ఇవి కూడా చదవండి:
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- 'సిరివెన్నెల సీతారామ రెడ్డి’కి ‘గురవయ్య శాస్త్రి’ నివాళి
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- MSP: కనీస మద్దతు ధర అంటే ఏమిటి, రైతులు దీనికోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
- తెలంగాణలో కరెంట్ బిల్లుల షాక్ తప్పదా? - ప్రెస్‌రివ్యూ
- 'కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం'
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు..
- భారత్-పాక్ యుద్ధం-1971: రణరంగంలో భారత కమాండర్ రాసిన లేఖకు పాకిస్తాన్ అధికారి ఎలా బదులిచ్చారంటే...
- కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు 'ఒమిక్రాన్', ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
- ఈ చిన్న అట్టపెట్టె లాంటి ఉపగ్రహాలు ప్రపంచాన్ని ఎలా మార్చేయబోతున్నాయి?
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











