కేంద్రం గుప్పిట్లో పౌరుల సమాచారం- ప్రెస్‌రివ్యూ

పౌరుల సమాచారం

ఫొటో సోర్స్, Getty Images

వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న పౌరుల సమాచారం సేకరించి.. దాని ఆధారంగా లబ్ధిదారుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పౌర సరఫరాలు, రవాణా లాంటి శాఖల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వీటి పరిధిలో రేషన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులను రాష్ట్రమే అందజేస్తుంది.

ఓటరు జాబితా వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ శాఖలు సేకరించిన పౌరుల వివరాలను భద్రపరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ సమాచారం తమ వద్ద కూడా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ కొత్త ఆలోచన తెరపైకి తెచ్చింది.

జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను ఇకనుంచి పూర్తిగా తామే నిర్వహిస్తామంటూ జనన, మరణాల రిజిస్ట్రేషన్‌ చట్టం-1969కి సవరణకు సిద్ధమైంది.

ఈ చట్టంలో సవరణలు జరగటం ఇదే తొలిసారి కాదు. 2012లో యూపీఏ-2 ప్రభుత్వంలోనూ సవరణలు జరిగినా.. అవి చిన్నచిన్నవే. ఈసారి మొత్తం వ్యవస్థనే కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోనుంది.

దీని ప్రకారం జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాల పర్యవేక్షణ కేంద్ర హోంశాఖ ఆధీనంలోకి వెళ్తుంది. అమలుకు జాతీయ స్థాయిలో రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఉంటారు. ఈయన పర్యవేక్షణలో రాష్ట్రాల్లో రిజిస్ట్రార్లు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

జనన ధ్రువీకరణపత్రం పొందాలంటే చిన్నారి తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలనూ సమర్పించాలి. ఇక రాష్ట్రాల వద్ద ఉన్న పౌరుల జనన, మరణ రిజిస్ట్రేషన్‌ వివరాలతో పాటు కొత్తగా సేకరించే సమాచారాన్ని కేంద్రానికీ అందించాలి.

జనన, మరణ వివరాలను డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డులు, ఓటరు జాబితా, పాస్‌పోర్టు, ఆధార్‌ వివరాలతో అనుసంధానిస్తామని కేంద్ర హోం శాఖ సవరణల్లో స్పష్టం చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఉన్న పౌరుల సమాచారాన్నీ కేంద్రంతో పంచుకోవాల్సి ఉంటుందని'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

టీఎస్‌ఆర్టీసీ

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT

శబరిమలకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఐదుగురికి ఫ్రీ

ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్ల ప్రకటిస్తోంది. ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండానే శుభకార్యాలకు బస్సులు కిరాయికి ఇస్తుండగా తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించినట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.

''తక్కువ చార్జీలకు స్పెషల్‌ బస్సులను కిరాయికి ఇవ్వడంతోపాటు ప్రతీ బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు తెలిపింది.

36 సీట్ల సూపర్‌ లగ్జరీ బస్సుకు కిలో మీటర్‌కు రూ. 48.96, 40 సీట్ల డీలక్స్‌ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్‌ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు కిలో మీటర్‌కు రూ. 52.43 చార్జీ నిర్ణయించింది.

బస్సులు కావాల్సిన భక్తులు దగ్గరలోని బస్‌స్టేషన్లలో సంప్రదించాలని సూచించినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.

శ్రీశైలం

సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

కృష్ణా నదిలో ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ఉదయం ప్రారంభమైనట్లు 'ఈనాడు' తెలిపింది.

''సాగర్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న 10మందితో బయలుదేరిన లాంచీ సాయంత్రం 4:30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంది.

మంగళవారం శ్రీశైలం నుంచి సాగర్‌కు 50 మంది పర్యాటకులు టికెట్ బుక్ చేసుకున్నారు.

లాంచీ అటవీప్రాంతం నుంచి వెళ్తుండటంతో ప్రతీ టికెట్ ధరపై 30 శాతం తమ శాఖకు చెల్లించాలంటూ అటవీ అధికారులు ప్రయాణాన్ని అడ్డుకున్నారు.

లాంచీ తిరిగి సాగర్‌కు చేరుకున్నాక చెల్లిస్తామని పర్యాటక అధికారులు చెప్పడంతో వారు సమ్మతించినట్లు'' ఈనాడు రాసుకొచ్చింది.

వైఎస్ వివేకానంద రెడ్డి

వివేకా హత్యపై తప్పుడు వాంగ్మూలం ఇమ్మంటున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారని 'సాక్షి' పేర్కొంది.

''వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్‌ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్‌ సీఐ శ్రీరామ్, వైఎస్‌ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.

'నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్‌ మర్డర్‌ కేసులో ముద్దాయిని.'

'వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్‌ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్‌ నాపై ఒత్తిడి తెచ్చారు'

'కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్‌ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ వాట్సాప్‌ కాల్‌ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు' అని గంగాధర రెడ్డి చెప్పినట్లు సాక్షి కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)