శ్రీశైలం ప్రాజెక్ట్: పూడికతో నిండుతున్నా పంపకాలపైనే తెలుగు రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి?

శ్రీశైలం ప్రాజెక్ట్
ఫొటో క్యాప్షన్, శ్రీశైలం ప్రాజెక్ట్
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం...

ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య నీటి వనరుల విషయంపై పెద్ద వివాదం నడిచింది. ముఖ్యంగా కృష్ణా జలాల వినియోగం మీద తగాదా వచ్చింది. పోటీపోటీగా ఫిర్యాదుల వరకూ వెళ్లింది. కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

చివరకు కృష్ణా నదితో పాటుగా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రెండు నదుల యాజమాన్యాల బోర్డులకు అప్పగించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వరకూ వెళ్లింది.

శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ అవసరాలకు వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తే, రాయలసీమకు తాగు, సాగు నీటి అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబట్టడంతోనే ఈ సమస్య వచ్చింది.

శ్రీశైలం ప్రాజెక్టులు అసలు లక్ష్యాలకు దూరమై సుమారు వంద టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. కానీ 20,30 టీఎంసీల నీటి కోసం ఇరు ప్రభుత్వాలు పంతాలకు పోయాయి. చివరకు ప్రాజెక్టుల మీద పెత్తనం కేంద్రానికి అప్పగించే స్థితిని తెచ్చుకున్నాయి.

పూర్తి నిల్వ సామర్థ్యం మీద దృష్టి పెట్టకుండా ఉన్న నీటిని వినియోగం మీద వివాదాలకు ఎందుకు దిగుతున్నారు? 37 ఏళ్ల నాటి ప్రాజెక్టులో ఇప్పటికే 40 శాతం వరకూ నీటి నిల్వలు తగ్గిపోతుంటే ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటీ అనే ఆందోళన మొదలవుతోంది.

బహుళార్థక సాధక ప్రాజెక్టుగా...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన నదుల్లో కృష్ణానది కీలకమైనది. అటు రాయలసీమ నుంచి దిగువన కృష్ణా డెల్టా వరకూ ఈ నదీ జలాలే మూలం. తెలంగాణాలో కూడా నాలుగు జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలకు కృష్ణా నీటినే వినియోగిస్తారు.

1963లో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1984 నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాదే పూర్తి స్థాయి నీటిమట్టం నిల్వ చేసే అవకాశం వచ్చింది. 892 అడుగుల గరిష్ట నీటిమట్టం, 308.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోసం సిద్ధం చేశారు.

కానీ, రానురాను ఈ ప్రాజెక్టు పూర్వ వైభవం కోల్పోతోంది. అనేక సాంకేతిక కారణాలతో పాటుగా నిర్వహణ విషయంలో తగిన శ్రద్ధ చూపకపోవడం కూడా దానికి మూలం అనే అభిప్రాయం సాగునీటి పరిశీలకుల్లో ఉంది.

తొలుత ఈ ప్రాజెక్టుని విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా భావించినా, ఆ తర్వాత బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నీలం సంజీవరెడ్డి సాగర్ పేరుతో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త యాజమాన్యంలో ఉంది.

ఎడమ గట్టు మీద 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో తెలంగాణా జెన్‌కో ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ ఉంది. కుడి గట్టు మీద 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల ప్లాంట్ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది.

రాయలసీమకు నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏర్పాట్లు చేశారు. దాంతో పాటుగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పేరుతో మరో నిర్మాణానికి పూనుకున్నారు. తెలంగాణా ప్రభుత్వం కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

చెన్నై కి సాగునీటి కోసం నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టు కూడా శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిల్వల మీద ఆధారపడి ఉంటుంది.

కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్, కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి.

ప్రాధాన్యాలు వేరుకావడంతో ఫిర్యాదులు

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు ప్రాధాన్యాలతో శ్రీశైలం ప్రాజెక్టుని చూస్తున్నాయి. జల విద్యుత్ కీలకమని తెలంగాణ భావిస్తోంది. దానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పాదనకు అవకాశం వచ్చిన మరుక్షణమే అందుకోసం ప్రయత్నాలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ప్రాజెక్టులో కనీసంగా 834 అడుగుల నీటి మట్టం చేరేవరకూ విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నించకూడదని చెబుతోంది. దానికి భిన్నంగా సాగితే రాయలసీమ ప్రజలకు సాగు, తాగు నీటి కష్టాలు వస్తాయని వాదిస్తోంది.

భిన్న ప్రాధాన్యాలుండడంతో ఇరు ప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో వివాదాలకు దిగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచే ఇన్‌ఫ్లోస్ రావడంతో ఆ నీటిని వినియోగించే విషయంలో తగాదా పడ్డాయి. కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్నాయి.

చివరకు ఎన్జీటీలో కూడా రాయలసీమ లిఫ్ట్ మీద తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం పెడితే, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ మీద ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఎన్జీటీ ఆదేశాలతో ఇప్పుడు ఈ రెండు లిఫ్ట్ స్కీముల పనులు నిలిచిపోయాయి.

మూలాలు వదిలేసి తగాదాలెందుకు?

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోందని ఇప్పటికే నిపుణులు నిర్ధారించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే 2010లో ఏపీ ఇంజనీర్స్ లేబోరేటరీ ఆధ్వర్యంలో సర్వే చేశారు. అప్పట్లో శాటిలైట్ ద్వారా ఈ పరిశీలన చేశారు.

ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం కేవలం 215 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలుగుతున్నట్టు నిర్ధారించారు. సుమారుగా 100 టీఎంసీల వరకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని ధృవీకరించారు.

నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణం పూడిక అని తేల్చారు. ప్రతీ ప్రాజెక్టులోనూ సహజంగానే నీటి ప్రవాహం కారణంగా పూడిక అనివార్యంగా ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.

అయితే పూడిక విషయంలో తగిన విధంగా నిర్వహణ చేస్తే పేరుకుపోకుండా అడ్డుకునే అవకాశాలుంటాయని ఇరిగేషన్ శాఖలో రిటైర్డ్ ఎస్‌ఈ ఎం.రాఘవేంద్ర రావు బీబీసీతో అన్నారు.

‘‘శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో క్యాచ్ మెంట్ ఏరియాలో చాలా జాగ్రత్తలు పాటించారు. స్ట్రెంచుల ఏర్పాటు వంటివి జరిగాయి. పూడిక నివారణకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి కొనసాగలేదు.’’ అని రాఘవేంద్రరావు అన్నారు.

ఎగువన జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా, దిగువకు నీరు వస్తే చాలు అన్న ధోరణి కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వాటిని వినియోగించుకోవడం మీద ఉండే ఆసక్తి ఆ తర్వాత వచ్చే సమస్యల మీద ఉండదని, ఫలితంగా అది పేరుకుపోతూ వస్తోందని ఆయన చెప్పారు.

‘‘100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కరెండు వాడకంలో అందులో అయిదో వంతు నీటి వాడకం మీదే వివాదాలు వస్తున్నాయి. అయినా నీటి నిల్వ పెంచుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి రావడం లేదు. దానికి చిత్తశుద్ధి చాలా అవసరం’’ అని ఆయన అన్నారు.

పూడిక పెరుగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతోంది
ఫొటో క్యాప్షన్, పూడిక పెరుగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతోంది

ఇప్పడింకా తగ్గిపోయింది

పదేళ్ల నాటితో పోలిస్తే ఇటీవలి కాలంలో వచ్చిన వరదలతో పూడిక మరింత పెరిగింది. ప్రస్తుతం నీటి నిల్వ 180 నుంచి 190 టీఎంసీల వరకే ఉంటుంది. సుమారు 120 టీఎంసీల వరకూ నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ఉంటుంది.

డ్రెడ్జింగ్ విషయంలో గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. కానీ డ్యామ్ కి సంబంధించిన భద్రత సహా పలు కారణాలతో ముందుకు సాగలేదు.

డ్యామ్ నిర్వహణ విషయంలో తాత్కాలిక అవసరాల మేరకు సమస్య రావడం లేదు కాబట్టి సాగిపోతోంది. ఉన్న వనరుల మీద ఇరు రాష్ట్రాలు పోటీలు పడుతున్నాయి. కానీ వనరులు పెంచుకోకుండా ఇదే పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. ముఖ్యంగా వర్షాలు సజావుగా కురిసిన కాలంలో వేరు.

ఒకసారి వర్షాభావ పరిస్థితులు ఎదురయితే మరింత సమస్య అవుతుంది.

''ఈ విషయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు అత్యవసరం. నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ సహా అన్నిచోట్లా పూడిక సమస్య ఉంది. పూడికతీత విషయంలో శ్రద్ధ పెడితేనే మళ్లీ శ్రీశైలం జలకళతో లక్ష్యాలకు చేరువవుతుంది'' అని సాగునీటి పరిశీలకుడు శివ రాచర్ల అభిప్రాయపడ్డారు.

శ్రీశైలం లో పూడిక తీత చాలా భారమని, 1999 లో కూడాప్రతిపాదనలు వచ్చాయని శివ గుర్తు చేశారు.

''రిజర్వాయర్ల పూడిక మీద జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు కూడా ఉన్నాయి. కాబట్టి పూడిక నివారించాలి. సిద్దేశ్వరం అలుగు నిర్మించాలి. ఎగువ నుంచి వరద సమయాల్లో వచ్చే పూడికను అడ్డుకుని శ్రీశైలం నీటి నిల్వ సామర్ధ్యాన్ని కాపాడగలం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. లేదంటే ఇప్పటికే అన్ని ప్రధాన జలాశయాలు మాదిరిగా శ్రీశైలం డ్యామ్ కూడా అవసరాలు తీర్చలేని స్థితికి చేరుతుంది'' అని శివ హెచ్చరించారు.

ఏటా పూడిక వల్ల 2 నుంచి 3 టీఎంసీల వరకూ నీటి నిల్వ సామర్థ్యం పడిపోతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయని ఆయన వివరించారు. జలాశయంలో పేరుకుపోయిన మట్టిని 10 శాతం తగ్గించగలిగినా దాని ద్వారా ప్రాజెక్టు భవిష్యత్తు పొడిగించవచ్చని నిపుణుల బృందం ఇప్పటికే నిర్ధారించిందని బీబీసీతో అన్నారు.

పూడిక తీతపై దశాబ్దాల కిందటే ప్రతిపాదనలు వచ్చాయి.
ఫొటో క్యాప్షన్, పూడిక తీతపై దశాబ్దాల కిందటే ప్రతిపాదనలు వచ్చాయి.

కారణాలు అనేకం

కృష్ణా నదిని ఆనుకుని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన అడవులు నరికేస్తుండటంతో మట్టి ఎక్కువగా కొట్టుకువచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా వరదల సమయంలో ఇది భారీగా ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు 2009లోనే అతి పెద్ద వరదలను ఎదుర్కొంది.

గడిచిన రెండేళ్లలో కూడా ఆశాజనకంగా ఇన్ ఫ్లోస్ వచ్చాయి. గత ఏడాది 10 సార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ఈసారి కూడా ఎక్కువ సార్లు జలాశయం నిండిపోవడంతో స్పిల్ వే నుంచి మిగులు జలాలు తరలించాల్సి వచ్చింది.

''దేశంలో అన్ని రిజర్వాయర్లకు ఈ పూడిక సమస్య ఉంది. దానిని పరిష్కరించేందుకు ప్రయత్నించిన చోట ఫలితాలు కూడా వచ్చాయి. పూడిక సహజంగా వస్తుంది. ఎగువన కొంత ప్రయత్నం చేసి అడ్డుకునేందుకు అనువుగా చర్యలుండాలి. రిజర్వాయర్ పరిసరాల్లో కూడా మట్టి పేరుకు పోతున్న తరుణంలో డ్యామ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా నష్టం వస్తుంది. కాబట్టి దానికి తగిన సాంకేతికత ఉపయోగించి పూడిక తగ్గించేందుకు ప్రయత్నించాలి'' అంటూ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిపుణుడు జి.వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.

శ్రీశైలంలో పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తీసి, ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం వల్ల ఉపయోగం ఉండదని ఆయన అంచనా వేస్తున్నారు. దానికి ప్రపంచంలోని ఇతర దేశాల అనుభవాలను పరిశీలించాల్సి ఉంటుందని బీబీసీతో అన్నారు.

తాజా సర్వేలో ఏం తేలుతుంది?

''2009 వరదల తర్వాత సర్వే చేశాము. నీటి నిల్వ పడిపోయిందని తేల్చారు. ఇటీవల ముంబైకి చెందిన 12 మంది నిపుణుల బృందం సర్వే చేసింది. రిపోర్ట్ రావాల్సి ఉంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిగింది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. పూడిక సమస్య ఉంది. దానిని అధిగమించేందుకు నిధులు అవసరం. వాటి లభ్యతను బట్టి ఏం చేయాలన్నది ఆలోచిస్తాం'' అని ఏపీ ఇరిగేషన్ శాఖకు చెందిన శ్రీశైలం డ్యామ్ ఎస్‌ఈ ఎస్.వెంకట రామయ్య బీబీసీకి తెలిపారు.

ఇటీవల శ్రీశైలం వద్ద సర్వే చేసిన బృందం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్వహణను కేంద్ర జలశక్తి శాఖ కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ విడుదల చేసింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తేనే ఫలితాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదం కారణంగా కృష్ణానదీ యాజమాన్యం కేంద్రం చేతులలోకి వెళ్లింది
ఫొటో క్యాప్షన్, రెండు రాష్ట్రాల మధ్య వివాదం కారణంగా కృష్ణానదీ యాజమాన్యం కేంద్రం చేతులలోకి వెళ్లింది

గతంలో ప్రతిపాదించినా ముందుకు సాగలేదు

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతున్న తరుణంలో ప్రాజెక్టులో డ్రెడ్జింగ్ విషయంపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. ఇరిగేషన్ నిపుణుల్లోనే అనేక అభిప్రాయాలున్నాయి.

2011లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రెడ్జింగ్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన కూడా చేస్తామని ప్రకటించింది. కానీ అవి ఆచరణలో ముందుకు సాగలేదు. దాంతో ఈ కాలంలో పూడిక సమస్య మరింత పెరిగింది.

''పూడిక పెరిగిపోతూ ఉంటే ఈ ప్రాజెక్టు మీద ఆధారపడిన ప్రాంతాలకు నీటి సమస్యలు తప్పవు. వర్షాలు తక్కువగా కురిసే సందర్భాల్లో సమస్య తెలుస్తుంది. సహజంగా మూడు నాలుగేళ్ల పాటు వరుసగా వర్షాలు బాగా పడితే ఆ తర్వాత వర్షాభావం అనివార్యమవుతుంది. కాబట్టి రాబోయే రెండు మూడేళ్లలో సమస్య తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది'' అని శ్రీశైలం స్థానికుడు గుజ్జుల సురేశ్ రెడ్డి అన్నారు.

బాగు చర్యలు చేపట్టకపోతే కర్నూలు జిల్లాతో పాటుగా రాయలసీమ వాసులకు పెద్ద సమస్య తప్పదని, విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతే ఉభయ రాష్ట్రాల ప్రజలందరికీ ఇబ్బంది వస్తుందని సురేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

పూడిక తీత ప్రతిపాదనలకు కూడా కేంద్రం ప్రాధాన్యతనిస్తే ఫలితాలు ఉంటాయని ఆయన బీబీసీతో అన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా చెన్నైవాసుల దాహార్తి తీర్చడం, విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలుగు నేల మీద వెలుగులు పంచడానికి ఆధారంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో శ్రద్ధ అవసరమని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.

తాత్కాలికంగా గడిచిపోతున్నప్పటికీ భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలకు సమస్య రాకుండా ఉండాలంటే దానికి అనుగుణంగా ఇప్పటి నుంచైనా అడుగులు వేయాలని ఇరిగేషన్ నిపుణులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)