చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చైనా ఓ కొత్త సరిహద్దు చట్టాన్ని గత శనివారం ప్రకటించింది.
ఈ చట్టంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, కొత్త చట్టం వల్ల ఇప్పటికే అమలులో ఉన్న సరిహద్దు ఒప్పందాలకు ఎలాంటి భంగం కలగదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తమ దేశీయ చట్టాల గురించి ఇతర దేశాలు ఊహాగానాలు చేయడం మానుకోవాలని భారతదేశం పేరెత్తకుండా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.
అక్టోబర్ 23న చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది.
"ఈ చట్టం లక్ష్యం భూ సరిహద్దుల రక్షణ, వినియోగమేనని" చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే, ఇది భారత సరిహద్దులకు సంబంధించిన చట్టం అని అందులో పేర్కొనలేదు.
భారత్‌తో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశం, చైనాల మధ్య 3,488 కిలో మీటర్ల భూసరిహద్దు ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ అభ్యంతరాలు
గత 17 నెలలుగా భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న వివాదాలు ఈ కొత్త చట్టం వల్ల మరింత జటిలం కాగలవని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, చట్టం అనేది అనేది ఒక మాట లాంటిదని.. సరిహద్దుల్లో చైనా చేపట్టే కార్యకలాపాల వల్ల ఆ దేశానికి భారత్‌తో సంబంధాలు క్షీణించాయి కానీ వారి చట్టాల వల్ల కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
భారత్ సహా 14 దేశాలతో చైనాకు 22,457 కి.మీ.ల భూ సరిహద్దు ఉంది.
మంగోలియా, రష్యాల తరువాత చైనాకు భారత్‌తోనే అతి పొడవైన సరిహద్దు ఉంది.
అయితే, ఆ రెండు దేశాలతో చైనాకు ఎలాంటి సరిహద్దు వివాదాలూ లేవు.
భారతదేశం కాకుండా భూటన్‌తో చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి. చైనా, భూటాన్‌ల మధ్య 477 కి.మీ. సరిహద్దు ఉంది.
చైనా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది.
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యథాస్థితిని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సమర్థింపుగా చైనా ఈ కొత్త చట్టాన్ని వాడుకోకుండా ఉంటే మంచిదని భారత్ పేర్కొంది.
ఈ చట్టం ఏకపక్ష నిర్ణయమని భారత ప్రభుత్వం ఆక్షేపించింది.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఇంకా పరిష్కారం కానందున, ఇలాంటి కొత్త చట్టాలను రూపొందించడం ద్వారా రెండు పక్షాల మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థను మార్చలేరని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా జవాబు
చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో కొత్త సరిహద్దు చట్టాన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలను వివరించారు.
"అక్టోబర్ 23న ఈ చట్టాన్ని చైనా స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. అదే రోజు దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ దీనిపై సంతకం చేశారు. జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఇందులో మొత్తం ఏడు అధ్యాయాలు, 62 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే, ఇందులో లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించారు. జాతీయ భూ సరిహద్దు రక్షణ, నిర్వహణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. చైనాకు 14 దేశాలతో దాదాపు 22,000 కి.మీ భూ సరిహద్దు ఉంది. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడం, సంబంధిత ప్రాంతాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. ఇది సాధారణ దేశీయ చట్టసంబంధ ప్రక్రియ.
సరిహద్దు దేశాలతో ఇప్పటికే ఉన్న ఒప్పందాల ద్వారా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చట్టం తోడ్పడుతుంది. సరిహద్దు నిర్వహణపై చైనా, ఇతర దేశాలతో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు ఈ చట్టం వలన ఎలాంటి హానీ ఉండదు. సరిహద్దు అంశాలపై చైనా వైఖరిలో మార్పు ఉండదు" అని వాంగ్ వెన్బిన్ వివరించారు.
భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై స్పందిస్తూ.. "మేం మా వైఖరిని స్పష్టం చేశాం. అంతర్జాతీయ నిబంధనలకు లోబడి, చైనా దేశీయ చట్టాలపై ఇతర దేశాలు ఊహాగానాలు చేయవని ఆశిస్తున్నాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, WWW.FMPRC.GOV.CN
భారత్, చైనాల సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గత 17 నెలలుగా భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది.
2020 జూన్ 15న గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 20 మంది భారతీయ సైనికులు మరణించారు.
తమ సైనికులు నలుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా తెలిపింది.
1975 తరువాత సరిహద్దులో చైనా, భారత్‌ల మధ్య ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి.
"చైనా తీసుకొచ్చిన కొత్త చట్టం, సరిహద్దులో ద్వైపాక్షిక ఒప్పందాలు, నిర్వహణలను ప్రభావితం చేయవచ్చు. ఇది మాకు ఆందోళన కలిగించే విషయం" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సోమవారం వెల్లడించారు.
చైనా 2020 ఏప్రిల్ నుంచి ఎల్ఏసీ వద్ద యథాస్థితిని మార్చివేసింది.
వివాదాస్పద ప్రాంతాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఉపస్థితిని కొత్త సరిహద్దు చట్టం సహాయంతో చైనా సమర్థించుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
"ఈ కొత్త సరిహద్దు చట్టాన్ని ప్రవేశపెట్టడంతో, చైనా సైన్యం లద్దాఖ్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ చట్టం, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలను మరింత క్లిష్టతరం చేసింది. సరిహద్దుల్లో ప్రతిష్టంభన ఉన్నప్పుడు కొత్త చట్టాన్ని తీసుకురావసలసిన అవసరమేమీ కనిపించడం లేదు. దీని ద్వారా తన మొండి వైఖరిని విడిచిపెట్టేది లేదని చైనా సందేశం ఇచ్చింది. ఇప్పుడు సరిహద్దు వివాదంపై ఈ చట్ట ప్రకారం మాత్రమే చర్చలు జరుపుతామని చైనా చెప్పే అవకాశం ఉంది" అని గతంలో నార్తర్న్ కమాండ్ బాధ్యతలను చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్ – చైనా: గల్వాన్ లోయ ఘర్షణలకు ఏడాది.. సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది
- హిమాలయాల్లో ఈ మంటలు ఎందుకు.. ప్రపంచ శాస్త్రవేత్తల ఆందోళన ఏమిటి
- భారత్-చైనా సరిహద్దు వివాదం: గల్వాన్ లోయలో ఘర్షణ వీడియోను విడుదల చేసిన చైనా
- చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకువచ్చి ఓ గ్రామం నిర్మించిందా?
- లద్ధాఖ్ సెక్టార్లో కొడవళ్లు బిగించిన కర్రలతో మోహరించిన చైనా సైనికులు’
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: చైనా మైక్రోవేవ్ ఆయుధాలను ఉపయోగించిందా? అసలీ మైక్రోవేవ్ ఆయుధాలేమిటి?
- అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉప రాష్ట్రపతి పర్యటనపై చైనా అభ్యంతరం, ధీటుగా బదులిచ్చిన భారత్
- టిబెట్ పంచెన్ లామా: ఆరేళ్ల బాలుడిని చైనా ఎందుకు మాయం చేసింది.. ఆ బాలుడంటే ఎందుకంత భయం
- దలైలామా ఇంటర్వ్యూ: 'మహిళా దలైలామా అయితే ఆకర్షణీయంగా ఉండాలి'
- చైనా ఒత్తిడికి తలొగ్గేది లేదన్న తైవాన్ అధ్యక్షురాలు త్సై ఇంగ్ వెన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











