తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్

తైవాన్‌పై చైనా దాడికి పాల్పడితే, తమ దేశం తైవాన్‌కు అండగా నిలుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.

తైవాన్‌ను అమెరికా సమర్థిస్తుందా అని అడిగినప్పుడు.. "అవును, అలా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన బదులిచ్చారు.

కానీ, బైడెన్‌ వ్యాఖ్యలు అమెరికా పాలసీ మార్పును సూచించేవి కాదని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.

చాలాకాలంగా తైవాన్‌కు రక్షణగా ఉంటారా అనే సంకటమైన ప్రశ్నలు వచ్చినప్పుడల్లా అమెరికా అస్పష్టమైన సమాచారం ఇస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

అంటే తైవాన్‌పై చైనా దాడి చేస్తే తాము ఏం చేస్తామనే దానిపై అమెరికా ఉద్దేశపూర్వకంగానే అస్పష్టంగా వ్యవహరించింది.

వీడియో క్యాప్షన్, ఏమిటీ తైవాన్? ఎందుకీ టెన్షన్

అమెరికాకు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. కానీ, 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్'‌ను అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. అందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా విక్రయిస్తుంది. తైవాన్‌ తనను తాను రక్షించుకోవడానికి అమెరికా సహాయం చేస్తుందనడాన్ని ఇది తెలుపుతుంది.

చైనాతో ఉద్దేశపూర్వక వివాదం గురించి తాను ఆందోళన చెందడం లేదని జో బైడెన్ తెలిపారు. "వారు మరింత శక్తివంతులవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అన్నారు. ఎందుకంటే "ప్రపంచ చరిత్రలోనే అమెరికాది శక్తివంతమైన సైన్యమని చైనా, రష్యా, మిగిలిన దేశాలకు తెలుసు" అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, తైవాన్‌పై చైనా యుద్ధ విమానాలు

చైనా దాడి చేస్తే అమెరికా తైవాన్‌కు అండగా నిలుస్తుందా అని సీఎన్‌ఎన్‌ విలేఖరి ఆండర్సన్ కూపర్ రెండోసారి ప్రశ్నించగా, బైడెన్ మరోసారి అవునని ధృవీకరించారు.

తైవాన్‌ను విడిపోయిన ప్రావిన్సుగా చైనా చూస్తోంది. అవసరమైతే సైనిక చర్య ద్వారా అయినా దాన్ని మళ్లీ తనలో కలుపుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది.

కానీ, తైవాన్ నాయకులు మాత్రం తమది స్వతంత్ర అధికారం గల రాజ్యమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)